Thursday, November 13, 2008

జెమినిలో ఏం జరుగుతోంది?

బలవంతపు రాజీనామాలు చేయిస్తున్నరనే వార్తలు జెమిని న్యూస్ ఉద్యోగుల్లో కల కలాన్ని సృష్టిస్తున్నాయి. ఇది నిజమా.. వదంతా అర్ధంకాక అక్కడి జర్నలిస్టులు భయపడుతున్నారు. స్థానిక యాజమాన్యం సైతం అక్కడి ఉద్యోగులకు వాస్తవాలు చెప్పకుండా దాతోంది. జీతాలు పెంచుతామనే బూటకపు హామీలతో ఇతర ఛనెళ్ళలో ఆఫర్లు వదులుకొని అక్కడే కొనసాగుతున్న జర్నలిస్టులకు కంటినిండా నిద్ర కూడా కరువైంది. పాతవారికి జీతాలు పెంచకపోగా కొత్తవారిని వారికన్న ఎక్కువ జీతాలకు తీసుకోవడం పుండు మీద కారం చల్లినట్లుగా ఉంది. జెమిని న్యూస్ ను ఔట్ సోర్సింగ్ కి ఇవ్వడలో భాగం గానే ప్రస్తుత ఉద్యోగుల వద్ద రాజీనామా లేఖలు తీకుంటున్నరని, వీరందరిని వేరే సంస్థ ఉద్యోగులుగా చూపించి ఇంక్రిమెంట్లు, బోనస్లు ఎగ్గొట్టాలన్నదే సన్ యాజమాన్య ఎత్తుగడ అని భావిస్తున్నారు. ఇటీవల ఛానెల్ను ఔట్ సోర్సింగ్ తీసుకునే ప్రయత్నం చేసిన ఒక వ్యక్తి భంగ పడ్డ తర్వాత ప్రస్తుతానికి ఎలాంటి ముప్పు లేదని సంతోషించిన జెమిని ఉద్యోగులు తాజా పరిణామాలను జీర్ణించుకోలేక పోతున్నారు.

బ్యూరో చీఫ్ పీఠం అధిష్టించిన మోనార్క్

అతనో మోనార్క్.. తానేదో గ్రహం నుండి ఊడి పడ్డ మానవాతీతుడినని భావిస్తుంటాడు.. ఇతరుల్ని అల్పులుగా భావిస్తాడు.. మార్క్స్ తర్వాత అంతటి గొప్ప వీర కమ్యూనిస్టుగా గొప్పలు చెప్పుకుంటాడు.. కానీ అణువణువునా బూర్జువా లక్షణాలు, వల్లంతా కుల గజ్జి.. ఒక వామపక్ష పత్రికలో పని చేసి ఎలక్ట్రానిక్ మీడియాకు వచ్చాడు. కానీ ఒక్క వాక్యం కూడా సక్రమంగా రాయలేడు. అవసరమైన చోటల్లా కులం కార్డ్ ఉపయోగించుకునే ఈ వీర మార్క్సిస్ట్, తాను పని చేసే ఛానెల్లో నిర్వహించిన చర్చా వేదికలకు ఆహ్వానించే నాయకుల వద్ద చేతివాటం ప్రకటించే సరికి యాజమాన్యం ఇతగాడిని కొంత కాల పక్కన పెట్టింది. పైరవీలకు తోడు, తోటి జర్నలిస్టులకు డబ్బు తీసుకొని ఉద్యోగాలు కూడా ఇప్పిస్తాడని వినికిడి. అన్ని బీట్లు తనకే కావాలని అత్యాశపడే ఇతగాడితో సదరు ఛానెల్లోనే కాకుండా బయటి జర్నలిస్టులతో కూడా సత్సంబంధాలు లేవు. కులం చలవతో తోటి రిపోర్టర్లపై, కెమెరామెన్లపై యాజమాన్యానికి పితూరీలు చెప్పడం ఇతగాడి హాబీ. తాజాగా ఈ వీర కమ్యూనిస్టు కొత్తగా వస్తున్న ఊరవతలి చానెల్లో బ్యూరో చీఫ్ గా చేరినట్లు వినికిడి. ఇందు కోసం కులం కార్డును బలంగా ఉపయోగించుకున్నడని అంతా చెవులు కొరుక్కుంటున్నారు. ఇతగాడు అక్కడ చేరాడని తెలిసి ఇతర సీనియర్ జర్నలిస్టులు అక్కడ చేరేందుకు వెనుకాడుతున్నరనేది తాజా వార్త. ఇతగాడిని చేర్చుకునే ముందు సదరు ఛానెల్ ఫీల్డ్ లో విచారించి, రాత పరీక్ష కూడా జరిపి ఉంటే టాలెంట్ ఏపాటిదో తెలిసేది.

Monday, November 3, 2008

స్వకుచ మర్దనం

ఇంద్రుడూ, చంద్రుడూ అంటూ ఇతరులు పొగిడితే పరవాలేదు. కానీ తమని తాము పొగుడుకునే వారిని ఏమనాలి. తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాకు తానే ఆధ్యున్ని అని చెప్పుకునే ఒక వ్యక్తి తన పేరిట ఒక వెబ్ సైట్ ప్రారంభించుకున్నాడు. ( అఫ్ కోర్స్ విదేశాల్లో ఉండే ఫ్రెండ్స్ పేరిట ) అందులో అన్నీ స్వ స్తోత్ర పాఠాలే. అతిశయోక్తులూ ఉన్నాయి. ఆయన గత చరిత్రను దగ్గర నుండి చూసిన వారు ఈయనకు ఇంత సీన్ ఉందా అని గొనుక్కుంటున్నారు. మరీ ఇంత స్వకుచ మర్దనం అవసరమా?..

దిన పత్రికలా?.. కర పత్రలా?..

తెలుగు దిన పత్రికల్లో మునుపెన్నడూ లేని కొత్త సాంప్రదాయం గత కొద్ది నెలలుగా కనిపిస్తోంది. అదే జాకెట్ ఆడ్స్. గతంలో ప్రకటనల విష్యంలో మన దిన పత్రికలు కొన్ని విలువలను, నియంత్రణల్ని పాటించేవి. తొలి పేజీలో ఇయర్ పానల్స్ తో పాటు కుడి వైపు దిగువ ప్రాంతంలో పావు పేజీకి మించి ప్రకటనలు స్వీకరించేవి కాదు (ముఖ్యంగా ఈనాడు). ఆ తర్వాత తొలి పేజీలో అర పేజీ ప్రకటనలు ప్రారంభం అయ్యాయి. అనంతర కాలంలో మార్కెట్ వర్గాల వత్తిడి కారణంగా ఇంటర్నేషనల్ ఫార్మెట్ పేరిట దిన పత్రికల సైజు తగ్గినంది. తొలి పుట నిండా ఒకే ప్రకటన ఇచ్చే ధోరణి మొదలైంది. దీన్నే జాకెట్ యాడ్ అంటున్నారు. మన దేశంలో ఈ సాంప్రదాయానికి బహుషా టైంస్ ఆఫ్ ఇండియా ఈ దుష్ట సాంప్రదాయాన్ని ప్రారంభించిందని చెబుతారు. తేరగా డబ్బు వస్తుంటే ఎవరు మాత్రం మడిగట్టుకు కూర్చుంటారు?. ప్రస్తుతం మరో కొత్త ధోరణి తెలుగు దిన పత్రికల్లో ప్రారంభమైంది. ప్రభుత్వం తొలి పేజీలో బ్యానర్ వార్త స్థానంలో అచ్చం వార్త లాగే ప్రకటనలు ఇవ్వడం ప్రారంభించింది. ఫలితంగా ఏది వార్తో, ఏది ప్రకటనో పాఠకులు పోల్చుకోలేక పోతున్నారు. చంద్రబాబో, చిరంజీవో ఒక భారీ సభ పెడితే తొలి పుటలో హెడ్ లైన్ వార్తగా రావడం సహజం. అయితే ప్రభుత్వం పత్రికలకు జాకెట్ ఆడ్స్ ఇవ్వడంతో అసలు వార్తలు పక్కకు పోయి ముఖ్యమంత్రి ఘన కార్యాలు తొలి పేజీలో చోటు చేసుకుంటున్నాయి. జాకెట్ యాడ్స్ వికృతానికి పరాకాష్ట నవంబర్ ఒకటో తేది నాటి తెలుగు దిన పత్రికలు. ఈ దుష్ట సాంప్రదాయానికి అంతం లేదా? ఆదాయం కోసం పత్రికలు ఇంతగా దిగజారటం అవసరమా?

Sunday, October 26, 2008

ఆయన బిజినెస్ మూడు పూవులు.. ఆరు కాయలు..

అనగనగా ఒక న్యూస్ ఛానెల్.. దానికో బిజినెస్ రిపోర్టర్.. ఛానెల్ సంగతి ఎలా ఉన్నా చాలా ఏళ్ళుగా సదరు రిపోర్టర్ ఫీల్డ్ లో హవా నడిపిస్తున్నాడు. ఈయన గారి స్టైలే వేరు . ఈ పొట్టి రిపోర్టర్ వెంట ఒక పొడుగాటి కెమెరామెన్ గన్ మెన్ లా ఎల్లవేళలా కనిపిస్తుంటాడు. బిజినెస్ రిపోర్టింగ్లో సీనియర్ అయిన ఈయన పేరు చెబితే ఈవెంట్ మేనేజర్లకు హడల్ అట. నిజాయితీని చూసి కాదు సుమా.. గిఫ్టులు, డబ్బు కొసం తెగ సతాయిస్తాడట. ఇతగాడు మైక్ పెట్టి బైట్ తీస్కొని పక్కకు వెళ్ళగానే లంబు కెమెరామెన్ అయ్యగారి పేరు చెప్పి ఎంతో కొంత లాగుతాడట. పొట్టాయన-పొడుగాయన ప్రెస్ మీట్లకు పోయారంటే అక్కడ ఉండే చాక్లెట్లు, పెన్నులు, పెన్సిళ్ళ దగ్గర నుంచీ అంతా ఊడ్చుకు వచ్చేస్తారట. సదరు బిజినెస్ రిపోర్టర్ ప్రెస్ మీట్లకు తన కుటుంబ సభ్యులను కూడా తరచూ తీసుకెళతాడట. వారికి గిఫ్టులు అదనం అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదనుకుంటా. ఈ సీనియర్ బిజినెస్ రిపోర్టర్ జీతం తక్కువే అయినా గీతం ఎంతలేదన్నా రోజుకి రూ.10,000/- పై మాటే అని తోటి బిజినెస్ రిపోర్టర్లు అంటున్నారు. అందుకే మన వాడు ఇతర చానెళ్ళకు వెళ్ళకుండా అక్కడే కొనసాగుతున్నాడట. నగరంలో జరిగే స్పెషల్ ఈవెంట్లు, న్యూ ఇయర్ పార్టీలకు వచ్చే కాంప్లిమెంటరీ పాసులను సైతం సదరు లంబు కెమెరామెన్ తో అమ్మించి సొమ్ము చేసుకుంటాడట. బిజినెస్ తో పాటు సిటీ ఈవెంట్స్ ప్రోగ్రాంకి కూడా ఇతడే ఇంచార్జ్. ఈయన ఏది ఇచ్చినా సదరు చానెల్లో ఎడిటింగ్ లేకుండా నేరుగా ప్రసారం అవుతాయి. తన బంధు మిత్రుల ఫంక్షన్లను సైతం ఏదో ఒక రూపంలో ప్రసారం చేసుకుంతాడు. అడిగే దైర్యం ఎవరికీ లేదు. సదరు చానెల్ పెద్దల ఐటీ వ్యవహారాలను చక్కపెడతాడు కాబట్టే ఇంత హవా అట. దీపావళి, న్యూ ఇయర్ వచ్చాయంటే మనోడికి గిఫ్టులే గిఫ్టులు. గత సంవత్సరం సదరు చానెల్ ఆఫీసుకు భారీగా వచ్చిన స్వీట్లు, డ్రైఫ్రూట్ బాక్సులు, కానుకల్ని ఇంటికి తీసుకెళ్ళేందుకు ఆటో ట్రాలీ మాట్లాడుకున్నాడని అక్కడి డ్రైవర్లు చెవులు కొరుక్కుంటున్నారు. మరి ఈ దీపావళికి?.. ఈ రిపోర్టర్, కెమెరామెన్ తమకు వచ్చే గిఫ్ట్లులను సదరు చానెల్ ఆఫీసు సమీపంలోని బత్తాయి బండివాడి దగ్గర దాచుకుంటారట. మార్కెట్ సెన్సెక్స్ సూచీ రోజు రోజుకీ పడిపోతుంటే, మనోడి ఆదాయ సూచీ దిన దిన ప్రవర్తమానంగా పైకి పోతోందిట.

Thursday, October 23, 2008

మీడియా గురవిందలు

సమాజానికి నీతులు చెప్పే జర్నలిస్టులు తమ నగ్న స్వరూపాలను నిసిగ్గుగా చాటుకుంటున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాలో చోటు చేసుకుంటున్న ఈ పెడ ధోరణులు జర్నలిస్ట్ ప్రపంచానికే తలవంపులు కలిస్తున్నాయి. ఇటీవల ఒక ఛానెల్లో పని చేస్తున్న జర్నలిస్ట్ పైన అతని మొదటి భార్య బంధువులు దాడి చేసిన సంఘటన సంచలనం సృష్టించింది. ఇతగాడి అనైతిక సంబంధాలు, మతం ముసుగులో చేసే అరాచకాల కారణంగా ఒక్క జర్నలిస్ట్ కూడా అతనిపై సానుభూతి చూపించలేదు. ఇలాంటి అసహ్యమైన జర్నలిస్టులు ఎందరో ఉన్నారు. మహిళల గౌరవాన్ని కాపాడే నైతిక బాధ్యత వల్ల మేము వారి పేర్లు వేడించడంలేదు. కానీ వారి లీలలు ఆలకించండి..
ఇటీవల దాడికి గురైన జర్నలిస్ట్ ఛానెల్లోనే పని చేసే మరో సీనియర్ జర్నలిస్టుదీ ఇదే కథ. ఇతగాడు కట్టుకున్న భార్యను వంచించి ఒక అగ్ర సినీ దర్శకుని కార్యాలయంలో పని చేసే మహిళను పెళ్ళాడాడు(?) సదరు పుణ్య పురుషుడు గతంలో తాను పని చేసిన చానెల్ నుండి బోగస్ సర్టిఫికెట్ సృష్టించి తన ప్రియురాలికి ఇంటి జాగా కోసం దరఖాస్తు చేయించి పట్టు బడ్డాడు.
కర్మగా పేరొందిన ఒక శాడిస్ట్ జర్నలిస్టు రెండో ఇల్లు నడుపుతూ ధర్మపత్నికి అన్యాయం చేస్తున్నాడు. ఈ నెం.2 కూడా ఇతగాడి శాడిజాన్ని భరించలేక పోతోందిట.
ప్రతిక్షణం .. అంటూ వార్తల కోసం తహ తహ లాడే ఒక ఛానెల్లో పని చేసే ప్రబుద్దుడు తోటి (వివాహిత) మహిళా జర్నలిస్టుతో పెళ్ళి చేసుకోకుండానే కాపురం పెట్టాడు. వీరిద్దరూ గతంలో ప్రముఖ ఛానెల్లో కలిసి పని చేసిన వారేనట. ఈ ప్రబుద్దుడు సదరు మహిళా జర్నలిస్టుకు ఒక ఫ్లాట్ కూడా కొని పెట్టాడట.
టీవీ/పత్రిక నడిపే జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్ పై కూడా పుకార్లు వినిపిస్తున్నాయి.
తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాకు తానే ఆధ్యున్నని చెప్పుకొనే ఓ ప్రముఖునిపై కూడా ఇదే తరహా ఆరోపణలు ఉన్నాయి.
గురవింద జర్నలిస్టులారా(ముఖ్యంగా ఎలక్ట్రానిక్).. సమాజానికి నీతులు చేప్పే ముందు మీ కింద ఒకసారి చూసుకోండి.

Sunday, October 12, 2008

ఓ యాంకర్ రాజీనామా..

క్రిమినల్ ఔట్ సోర్సింగ్ కింద నడిచే న్యూస్ ఛానెల్లో పని చేయనని ప్రకటించి ఒక యాంకర్ రాజీనామా చేసింది. తమిళ యాజమాన్యం కింద నడిచే సదరు ఛానెల్ సిబ్బంది తీవ్ర ఆందోళన పడుతున్నారు. తమ ఉద్యోగాల విషయంలో స్థానిక యాజమాన్యం పెదవి విప్పక పోవడంతో రాజీనామాలకు సిద్దం అవుతున్నారు. ఔత్ సోర్సింగ్ అనేది గాలి వార్తే అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ తీసుకుంటున్న ఆ ప్రముఖుడు కీలక ఉద్యోగాలను తన అనుచరులతో నింపేయడంతో తమ పరిస్థితి ఏమిటని సీనియర్లు ఆవేదనలో పడ్డారు. ప్రస్తుతం జిల్లాల్లో ఉన్న రిపోర్టర్ల స్థానంలో తమ వారిని భర్తీ చేసే ప్రక్రియ కూడా పూర్తి అయింది. ఈ ఔట్ సోర్సింగ్ తతంగంలో చెన్నై చినబాబు, మూత పడ్డ బ్యాటరీ కంపనీ యజమాని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

బాధ్యత లేని ఛానెళ్ళు

సమాజ సంక్షేమంపై తమకే గుత్తాధిపత్యం ఉన్నట్లు గొప్పలు చెప్పుకునే కొన్ని ఛానెళ్ళు బాధ్యతా రహితంగా వ్యవహరిస్తూ ఏవగింపు కలిగిస్తున్నాయి. వ్యవస్థలు కుప్పకూలేలా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. రేటింగుల్లో అగ్రస్థానం కోసం నీచానికి దిగజారుతున్నాయి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం అవాస్థవాలను ప్రసారం చేస్తున్నాయి. ఇక్కడ ఆ ఛానెళ్ళ పేర్లను మేం ప్రస్థావించడం లేదు. అయినా కొన్ని ఉదాహరణలను ఇస్తున్నాం. వారెవరో మీకే అర్థం అవుతుంది.
ఇటీవల ప్రముఖ బ్యాంక్ కష్టాల్లో ఉన్నట్లు వచ్చిన నిరాధార వార్త ఖాతాదారుల్ని భయ పెట్టింది. ఆ బ్యాంక్ ఏటీఎంల ముందు పెద్ద సంఖ్యలో ఖాతా దారులు బారులు తీరడంతో నిమిషాల్లో డబ్బు ఖాళీ అయింది. ప్రజలు దాడులు జరిపి బ్యాంక్ ఆస్థులకు నష్టం కలిగించారు.

ఎక్కడో బర్డ్ ఫ్లూ వస్తే దాన్ని ఆంధ్ర రాష్ట్రానికి ఆపాదించడంతో ఫౌల్ట్రీ పరిశ్రమ కుప్పకూలింది. ఆ తర్వాత ముడుపులు తీసుకొని పాజిటివ్ వార్తలు ఇచ్చారట.

ఒంగోలులో ఒక వ్యక్తి కలేక్టరేట్లో విషం తాగి ఆత్మ హత్య చేసుకుంటుంటే అతడు చచ్చే దాక చిత్రీకరించిన ఛానెళ్ళ ప్రతినిధులు కనీసం ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయలేదు.

ఒక మాజీ శాసన సభ్యుడు హైదరాబాద్ వచ్చి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కునుకు తీస్తే అతడు మరణించాడనే వార్త ప్రసారం చేసి ఖంగారు పెట్టారు.

వ్యక్తిగత విషయాలను కూడా సంచలన వార్తలుగా ప్రసారం చేస్తున్న కొన్ని ఛానెళ్ళు మున్ముందు శోభనాల్నీ వదవలవేమో. ఇలాంటి వార్తకు ఆగ్రహించిన ఒక సినీ నటుడు ఓ ఛానెల్ ఆఫీసుకు వెళ్ళి అక్కడి ఉన్నత ఉద్యోగిని ఒక్కటి పీకి వచ్చాడట.

భార్య కూరలో ఉప్పు ఎక్కువేసిందని అలిగి టవరెక్కే వెధవాయిలకు కూడ లైవ్ కవరేజి ఇచ్చే రోజులు రాబోతున్నాయి.

Wednesday, October 1, 2008

క్రిమినల్ చేతిలో న్యూస్ ఛానెల్

ఉద్యోగులకు సరైన జీతాలు ఇవ్వక పోవడంతో తమిళ యాజమాన్యం కింద పని చేస్తున్న ఒక తెలుగు ఛానెల్ దాదాపుగా ఖాళీ అయింది. అత్తెసరు జీతాలతో ఆ ఛానెల్ లో పని చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. పని నేర్చుకొని మరేదైనా ఛానెళ్ళో జాబ్ చూస్కోవచ్చనే ఆశతో కొత్తగా ఎవరైనా ఉద్యోగంలో చేరడానికి వస్తే కొద్ది నెలలు జీతం ఇవ్వకుండానే ఊడిగం చేయించుకోవడం, ఇదేం అన్యాయమని ప్రశ్నించిన వారిని గెంటివేయించడంలో ఆ ఛానెల్ వారు నిశ్నాతులు. తప్పు ఎక్కడుందో తెలుసుకొని సరి దిద్దు కోవాల్సిన ఆ ఛానెల్ యాజమాన్యం చేతులెత్తేసి తమ వైఫల్యాన్ని అంగీకరించేసింది. న్యూస్ నిర్వహణ తమకు చేత కాదని తెలుసుకున్న యాజమాన్యం ఔట్-సోర్సింగ్ మార్గాన్ని ఎంచుకున్నారు. ఏకంగా ఛానెల్ ను ఒక క్రిమినల్, బ్లాక్ మెయిలర్ చేతిలో పెట్టారు. ఇతగాడు గతంలో ఎంతో మందిని ముంచాడు. ఒక క్రైం మాగజైన్, ఛానెల్లలో క్రైం ప్రొగ్రాంలు నిర్వహించడమే ఇతగాడి అర్హత. డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారే ఈ వ్యక్తి ఒక కిడ్నాప్ కేసులో కూడా ఉన్న విషయం బహిరంగ రహస్యమే. ప్రెస్ క్లబ్లో తోటి జర్నలిస్టుల చేతిలో చావు దెబ్బలు తిన్న చరిత్ర కూడా ఉంది. ప్రైవేట్ గన్ మెన్లతో తిరిగే ఇతగాడిని చూసి ఆ ఛానెల్ సిబ్బంది జడుసు కుంటున్నారు. న్యూస్ ను ఔట్ సోర్సింగ్ కు ఇవ్వడంతో ప్రస్తుత సిబ్బంది భవిష్యత్తు అంధకారంలో మునిగి పోయింది. ఇతగాడు క్రమంగా తన సిబ్బందిని రంగంలో దింపుతున్నాడు. వీరికి, పాత సిబ్బందికి జీతాలు ఎవరు ఇస్తారు?.. అరవ యాజమాన్యమా?.. ఇతగాడా?.. న్యూస్ నిర్వహణకు గాను ఇతగాడే ఛానెల్ యాజమాన్యానికి ఎదురివ్వాలని ఒప్పందం కుదరడంతో వసూల్ రాజాలను రంగంలోకి దింపే అవకాషం ఉంది. డబ్బులు తీసుకొని వార్తలు ఇవ్వడంలో, వార్త రాస్తానని బెదిరించి వసూలు చేయడంలో ఇతగాడు ఘనాపాటి. ఫ్రాడ్ తో ఒప్పందం కుదుర్చుకున్న సదరు ఛానెల్నుఇక ఆ దేవుడే రక్షించాలి.

ఈ ఛానెళ్ళు ఎంత కాలం ఉంటాయి?

తెలుగులో వినోద, న్యూస్ ఛానెళ్ళు పుట్ట గొడుగుల్లా పుట్టు కొస్తున్నాయి. ఈటీవీ, ఈటీవి-2, టీవీ-9, ఎన్-టీవీ, టీవీ-5, జెమిని, జెమిని న్యూస్, తేజా, డీడీ, మాటీవీ లకు తోడు త్వరలో సాక్షి, సితార, హెచ్.ఎం .టీవీ, హై టీవీ, జీ 24 గంటలు, ఇ-న్యూస్, ఎన్ స్టూడియో, లోకల్ టీవీ, ఆర్ టీవీ..(ఈ జాబితాకు అంతం లేదు, ఇందులో భక్తి, కామెడి, మ్యూజిక్ చానెళ్ళను మినహాయించం) ఛానళ్ళు రావడంతో జర్నలిస్టులకు గిరాకీ పెరిగి వేల కొలది రూపాయల జీతాలు దొరుకు తున్నాయి. ప్రస్తుతానికి అంతా హాపీయే.. కాని భవిష్యత్తు గురించి ఎవరూ అలోవించడం లేదు. ఈ పోటీ ప్రపంచంలో ఒకటి రెండు ఛానళ్ళే నిలుస్తాయని మీడియా ప్రముఖులు అంచనా వేస్తున్నారు. ఛానెల్ ప్రారంభించేందుకు అవసరమైన టెక్నాలజీ ఖర్చు తగ్గడంతో సౌండ్ పార్టీలన్నీ తమ వ్యాపార, రాజకీయ ప్రయోజనం కోసం పోటా పోటీగా గోదాలోకి దిగుతున్నారు. ప్రస్తుతం ఐటీ రంగంలో కనిపిస్తున్న గడ్డు పరిస్తితే రేపు మీడియాకూ రాక తప్పని పరిస్తితులు కనిపిస్తున్నాయి. తగిన మార్కెట్ లేక, జీతాల బిల్లులు భారమై కొన్ని ఛానెళ్ళు మూత పడక తప్పని పరిస్తితి కనిపిస్తోంది. చివరికి మిగిలేదెవరో, మునిగేదెవరో చెప్పడం కష్టమే. ఎన్నికలు అయ్యేంత వరకైతే ఎవరికీ డోకా లేదు ఆ తర్వాత జర్నలిస్టులు ఎవరి దారి వారు చూసుకోవటానికి ఎప్పటి నుండే జాగ్రత్త పడటం అవసరం.

Tuesday, September 9, 2008

పైరవీ కొద్దీ ఉద్యోగం..

తెలుగులో ఎన్నడూ లేని విధంగా కొత్త కొత్త చానళ్ళు రాబోతున్నాయి. జర్నలిస్టులకు ఉద్యోగ అవకాశాలకు కొదవ లేదు. ఇది బాగానే ఉంది. కానీ కొత్తగా వచ్చే చానెళ్ళన్నీ ప్రతిభను చూసి ఉద్యోగాలు ఇస్తున్నాయా? కొత్త చానెళ్ళు పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలు చూసి చాలా మంది ప్రస్తుత జర్నలిస్టులు, కొత్తవారు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరిలో చాలా మందికి పిలుపు రావడం లేదు. కారణం.. పైరవీలే. కొత్త చానెళ్ళలో చెరిన పెద్ద తలకాయలు కీలక ఉద్యోగాల్లో తమ వారినే పెట్టుకుంటూ వర్గ ప్రాభల్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంటర్వ్యూలు నామ మాత్రంగానే జరుగుతున్నాయి. కొన్ని చానెళ్ళలో పైరవీ లేనిదే ఉద్యోగం దొరకడం దుర్లభం. భారీ పెట్టుబడులతో వస్తున్న ఒక చానెల్లో ఉద్యోగాలన్నీ పైరవీలతోనే భర్తీ అయ్యాయని స్పష్టంగా తెలుస్తోంది. విషయం తెలియక ఉద్యోగం కోసం వెల్లే సీనియర్ జర్నలిస్టులకు సైతం నో వేకెన్సీ అని మొహం పైనే చెప్పి పంపీస్తున్నారు. లేదా ఉత్తుత్తి ఇంటర్వ్యూ జరిపి మళ్ళీ పిలుస్తాం అని పంపిస్తున్నారు. సదరు చానెల్లో అక్రమార్కులు, రాయటం చేత కాని వారు సైతం చేరి పోయారనే విమర్షలున్నాయి. సో.. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీకు పెన్ పవర్ ఒక్కటే ఉంటే సరిపోదు. పైవవీ శక్తి కూడా ఉండాలి. దరఖాస్తు చేసి పిలుపు కోసం ఎదురు చూస్తు ఉంటే అవతల ఎవడో పైరవీ జర్నలిస్టు ఉద్యోగం తన్ను పోయే ప్రమాదం ఉంది తస్మాత్ జాగ్రత్త!

సిబిసి, ఆర్ టీవీ ఇక రావా?

అదిగో వస్తుంది.. అంటూఅ చెప్పుకున్న సిబిసి చానెల్ ఇక రాదని రూడీ అయింది. కొద్ది నెలలుగా ప్రెస్ మీట్లు, ప్రోగ్రాం లకు మైకులు పట్టుకొని వచ్చి హంగామా చేసిన సిబిసి జర్నలిస్టులకు ఇక తమ చానెల్ వచ్చే అవకాశం లేదని తెలిసి ఇతర చానెళ్ళలో ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. తెలుగుగులో పెద్ద ఎత్తున పెట్టుబడులతో రానున్న న్యూస్ చానెళ్ళ ముందు పోటీ పడలేమని తెలిసే సదరు యాజమాన్యం చానెల్ ప్రతిపాదన విరమించుకున్నాట్లు బోగట్టా. ఇక రాయుడు టెలివిజన్(ఆర్టీవీ)దీ ఇదే పరిస్థితి. ఉప్పల్ లో అత్యాధునిక స్టూడియోలు నిర్మించుకున్న ఆర్టీవీ ఇంతవరకూ పూర్తి స్థాయిలో జర్నలిస్టులను నియమించుకోలేదు. ఆర్ టీవీ చీఫ్ ఎడిటర్ బాల గంగాధర్ చానెల్ ప్రారంభంలో జరుగుతున్న జాప్యాన్ని భరించలేక రాజీనామా చేయటంతో ఆయన స్థానంలో జర్నలిస్ట్ యూనియన్ నేత ఆంజనేయులును నియమించారు. ఖర్చుకు వెనుకాడుతున్న ఆర్ టీవీ యాజమాన్యం తక్కువ జీతాలు ఆఫర్ చేస్తున్నందువల్లే జర్నలిస్టులేవరూ అక్కడ చేరటానికి ఆసక్తి చూపడం లేదని వినికిడి. ఆర్ టీవీలో న్యూస్ కో ఆర్డినేటర్ గా పని చేస్తున్న పాత కాలం జర్నలిస్టు బసవేశ్వర రావు సదరు రాయుడు గారిని తప్పు దోవ పట్టిస్తున్నారట.

Saturday, August 23, 2008

ఏసియా నెట్ ' శివ ' లీలలు

ఏసియా నెట్ తెలుగు చానెల్ ' సితార ' లో జరుగుతున్న బాగోతాలను మీడియా సోదరులు కతలు కతలుగా చెప్పుకుంటున్నారు. ఇక్కడ డబ్బు పెడితే చాలు ఉద్యోగాలు లభిస్తాయట. ఏసియానెట్ సితార చీఫ్ న్యూస్ ఎడిటర్ సతీష్ బాబు, శివ అనే నమ్మిన బంటును పెట్టుకున్నారు. ఇక్కడ శివ మాటే వేద వాక్కట. సతీష్ బాబు దగ్గరకు ఎవరు ఉయోగాల కోసం వెళ్ళినా ఆయన శివను కలవమని చెబుతారు. సదరు శివాజీ, వారి దగ్గర అందినకాడికి దండుకొని ఉద్యోగమిప్పిస్తాడట. పితూరీలు చెప్పడంలో ప్రసిద్దుడైన శివ వ్యవహారశైలి ఎవరికీ మింగుడు పడటం లేదు. ఏసియానెట్ వెళ్ళిన వారు శివ దర్శనం లేకుండా నేరుగా సతీష్ బాబును కలవలేరు. శివది మొదటి నుండీ వివాదాస్పద చరిత్ర. ఈటీవీలో అక్రమాలకు పాల్పడి గెంటివేయబడ్డ శివ, జెమినిలో చేరాక సతీష్ బాబుకు దగ్గరయ్యాడు. జెమినిలో శివ చాడీలు విని ఎందరో జర్నలిస్టుల్ని సతీష్ బాబు దూరం చేసుకున్నాడు. సితార రాయలసీమ, తెలంగాణా కో ఆర్డినేటర్లు హుస్సేన్, లెనిన్ లదీ ఇదే ధోరణి. వీరు జిల్లాల్లో రిపోర్టర్, స్ట్రింగర్ ఉద్యోగల్ని బహిరంగంగానే వేలం వేస్తున్నారట. ఏసియా నెట్ లో జరుగుతున్నా వ్యవహారాలు తెలిశాక ఉద్యోగాలు ఇస్తామన్నా సీనియర్లు ఎవరూ వెల్లటం లేదట. సతీష్ బాబు గారు ఇవన్నీ మీకు తెలియకుండానే జరుగుతున్నాయా? తాజా సమాచార ప్రకారం ఏసియానెట్ ను స్టార్ టేకోవర్ చేస్తోంది. ఈ పరిస్తుతుల్లో సితార న్యూస్ ఏమౌతుంది?

Thursday, July 3, 2008

వేతనాలు పెంచి సాక్షికి పోటీగా నిలిచిన టీవీ-9

టీవీ-9 తన సిబ్బందికి భారీగా వేతనాలు పెంచింది. అంతా ఇంతా కాదు.. 100 నుండి 300 శాతం దాకా. నిజానికి టీవీ-9 మొదటి నుండీ వేతనాల విషయంలో అందరికీ ఆదర్శంగా నిలిచింది. 2003లో టీవీ-9 రాకముందు తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు చాలా అధ్వానమైన జీతాలు ఉండేవి. తెలుగు జర్నలిస్టులకు అమ్మాయిలను ఇవ్వడానికి వెనుకాడేవారు. టీవీ-9 ప్రారంభంలోనే ఐ.టి., కార్పోరేట్ స్థాయి వేతనాలు ఇచ్చి తెలుగు జర్నలిస్టుల విలువ పెంచింది. ఇతర చానెళ్ళు, పత్రికలు ఇదే బాటలో నడవక తప్పలేదు. ఆ తర్వాత సాక్షి దిన పత్రిక ప్రింట్ జర్నలిస్టులకు ఇదే రీతిలో భారీ జీతాలు ఆఫర్ చేసింది. ఎలక్ట్రానిక్ మీడియాలోకి కూడా అడుగిడిన సాక్షి అనూహ్య జీతాలు ఇవ్వడానికి ముందుకు రావడంతో ఇతర చానెళ్ళు ఉలిక్కి పడ్డాయి. తన జర్నలిస్టుల వలసల్ని నివారించడంలో భాగంగా టీవీ-9 కూడా అదే బాటను ఎంచుకొని సాక్షికి ఎదురు సవాల్ విసిరింది. ఇతర ఛానెళ్ళు కూడా ఈ సవాల్ని స్వీకరిస్తాయేమో చూడాలి మరి. పెరుగుడ విరుగుట కొరకే అన్న నానుడి తెలుగు జర్నలిస్టుల విషయంలో నిజం కావద్దని ఆశిద్దాం. ఎందుకంటే ఆర్ధిక మాద్యం - ద్రవ్యోల్బనం ఊబిలో చిక్కిన అమెరికాలో పత్రికలు, చానెళ్ళు తమ సిబ్బందిని తగ్గించుకోవడమే కాక వేతనాలకు కోత పెడుతున్నాయట.

Tuesday, July 1, 2008

' ధనార్జన ' రాజకీయాలు

ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ సంఘంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు వెగటు కలిగిస్తున్నాయి. చందూ జనార్ధన్ తనకు తాను గౌరవ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు టీవీల్లో స్క్రోలింగ్లు, పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకునే సరికి జర్నలిస్టు సోదరులంతా అవాక్కయ్యారు. అసలు ఎన్నిక ఎప్పుడు జరుగింది? ఎన్నుకున్నది ఎవరు? ఇదే విషయంలో ఎలక్ట్రానిక్ మీడియా సంఘ సభ్యులు నిలదీసే సరికి జనార్ధన్ క్షమాపణలు చెప్పుకున్నడట. అసలు జరిగిన విషయం ఏమిటంటే.. ఆంధ్రజ్యోతి ఎపిసోడ్లో భవిష్యత్తు పోరాటంపై చర్చించేందుకు ఎలక్ట్రానిక్ మీడియా సంఘం సమావేషమైంది. ఆ సమావేశానికి వచ్చిన జనార్ధనుడు అసలు ఈ సంఘానికి తానే అధ్యక్షున్నని, తాను ఉద్యోగ రీత్యా ఢిల్లీ పోయినప్పుడు తనకు తెలియకుండా హరిప్రసాద్ ఎన్నుకున్నారని గొడవ పడ్డాడు. తనను కనీసం గౌరవ అధ్యక్షునిగానైనా నియమించాలని వేడుకునే సరికి మిగతా సభ్యులు చూద్దంలే అన్నరట. అంతే జనార్ధనుడు రెచ్చి పోయాడు.. భంగపడ్డాడు.. జనార్ధనుని ధోరని మొదటి నుండీ వివాదాస్పదంగానే ఉంది. సీ-ఛానెల్ బ్యూరో చీఫ్ గా ఎన్నో అవకతవకలకు పాల్పడిన ఇతగాడు ఉద్యోగంలో నుండి తొలగింపబడ్డాడు. ఆ తర్వాత ఎప్పటికీ రాని సత్యాలో కొంత కాలం పని చేశాడు. మరి కొంతకాలం జెమిని టీవీకి ఢిల్లీ రిపోర్టర్ గా పని చేశాడు. ఇదే సమయంలో జెమినికి రాజీనామా చేయకుండానీ ఆంధ్రప్రభ హైదరాబాద్ బ్యూరో ఛీఫ్ గా చేరాడు. సదరు పత్రిక ఎడిటర్ ఒక స్టోరీ రాయమని చెబితే అదిరాయడం చేతకాక చెప్ప చేయకుండా ఉద్యోగం మానేశాడు. ప్రస్తుతం విసా న్యూస్ బ్యూరో చీఫ్ గా వెలగబెడుతున్నాడు. పెన్ను పట్టి వార్తలు రాయడం చేతగాని జనార్ధన్ పైరవీలు చేయడంలో దిట్ట. ఎలక్ట్రానిక్ మీడియా సంఘాన్ని చీల్చి పోటీ సంఘాన్ని పెట్టిన ఇతగాడు ఎన్నో అక్రమార్జనలకు పాల్పడి ' ధనార్జన్ ' గా ప్రసిద్దికెక్కాడు. ఎన్నికలు వస్తున్న తరుణలో మళ్ళీ ఎలక్ట్రానిక్ మీడియా సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికై డబ్బులు దండుకోవాలని ధనార్జన్ కలలు కంటున్నాడు. జర్నలిస్ట్ సోదరులారా.. జర జాగ్రత్త..
ఎలక్ట్రానిక్ మీడియా సంఘానికి ఎన్నికలు జరగవా?
ప్రస్తుతం హరిప్రసాద్ అధ్యక్షతన కొనసాగుతున్న సంఘం కేవలం హడ్ హక్ కమిటీ మాత్రమే. ఈ కమిటీ ఏర్పడి సంవత్సరం అయినా ఇప్పటిదాకా సభ్యత్వ కార్యక్రమం, ఎన్నికలు జరగలేదు. తాజాగా ఆగస్టులోగా ఎన్నికలు జరుపుకోవాలని ఎలక్ట్రానిక్ మీడియా సంఘం కార్యవర్గం నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణలో అనుకున్న షెడ్యూల్డ్ ప్రకారం ఎలక్ట్రానికి మీడియా సంఘానికి ఎన్నికలు జరగడం సందేహమే..

వైట్ల రమేశ్ పై దాడి సంగతేంటి?

ఆంధ్రజ్యోతి జర్నలిస్టు అరెస్టు ఎపిసోడ్లో మంద కృష్ణ మాదిగపై ఒంటికాలితో లేచిన మీడియా సోదరులు, జర్నలిస్టు సంఘాలు ఎన్-టీవీ రిపోర్టర్ వైట్ల రమేష్ పై చిరంజీవి అభిమానులు చేసిన దాడిపై అంతగా ఎందుకు స్పందించడం లేదు?.. నామమాత్రపు నిరసనతో ఎందుకు ఆగిపోయినట్లు? ధర్నాలు, రాస్తారోకోలు ఎందుకు చేయలేదు? ఇవి కేవల మంద కృష్ణ వేసున్న ప్రశ్నలు కాదు? ప్రతీ జర్నలిస్టు మదిలో ఉదయిస్తున్న సందేహాలు. వైట్ల సుందరయ్య హాలు వద్ద రమేష్ పై దాడి చేసిన చిరంజీవి అబిమానులను పోలీసులు ఇంతవరకూ అరెస్టు చేయలేదు. చిరంజీవి వైట్ల రమేష్ కు ఫోన్ చేసి సారీ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఫోన్ చేసి సారే చెబితే సరిపోతుందా? బహిరంగంగా క్షమాపణలు చెప్పల్సిన అవసరం లేదా? హీరో రాజశేఖర్ పై దాడి విషయంలో చిరంజీవి మీడియా సమక్షంలో సారీ చెప్పడం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. ఈ విషయం చిరంజీవికి సంబందించినది కావడంతో ఎన్-టీవీ యాజమాన్యం రాజీ పడ్డస్తు వస్తున్న వార్తల్ని నమ్మక్ తప్పడం లేదు. ఆంధ్రజ్యోతికి ఒక న్యాయం, వైట్ల రమేష్ కు మరో న్యాయమా? జర్నలిస్టు సోదరులే చెప్పాలి.

ఆంధ్రజ్యోతి ఎపిసోడ్.. కొన్ని సందేహాలు..

పత్రికా స్వేచ్చను చావు దెబ్బ తీసిన ఆంధ్రజ్యోతి ఎడిటర్, రిపోర్టర్ల అరెస్టును ప్రతీ జర్నలిస్ట్ ఖండించాల్సిందే.. ఈ ఎపిసోడ్ తర్వాత ముఖ్యమంత్రికి తెలిసి జరిగిందా?. చట్టం తన పని తాను చేసుకుపోయిందా?.. ఆంధ్రజ్యోతి అతిగా వ్యవహరించి చట్టనికి చిక్కిందా?.. మంద కృష్ణ ఎందుకిలా వ్యవహరిసున్నారు?.. తదితర ప్రశ్నలు వినిపించాయి. వీటన్నింటినీ పక్కన పెడితే ఒక విషయం మాత్రం స్పష్టం అయింది. అదే జర్నలిస్టులు, పత్రికా యాజమాన్యాల మధ్య చీలిక.. ఆంధ్రజ్యోతి ఎడిటర్, రిపోర్టర్ల అరెస్టు, తదనంతర పరిణామాల వార్తలకు అన్ని పత్రికలు ప్రాధాన్యతను ఇచ్చాయి. సాక్షి, సూర్య తప్ప. ఎందుకో అర్థం చేసుకోవచ్చు. ఈ ఎపిసోడ్లో మంచి చెడుల విషయానికి పోదలచుకోలేదు. కానీ పత్రికా స్వేచ్చ ప్రమాదంలో పడినప్పుడు ఐక్యంగా ఉద్యమించాల్సిన జర్నలిస్టులు ఎవరికి వారుగా మొక్కుబడి నిరసనలు తెలపడం బాధాకరం. అంతో, ఇంతో ఎలక్ట్రానిక్ మీడియా నిరసనలు ఐక్యంగానే జరిగాయి. కాని ఎపీయూడబ్ల్యుజె, ఎపీడబ్ల్యుజేఎఫ్ లు మాత్రం ఐక్యతను ప్రదర్శించ లేదు. ఇక ఎడిటర్, విలేఖరుల విడుదల తర్వాత ప్రెస్ క్లబ్ లో జరిగిన విజయోత్సవంలో అంతా ఆంధ్రజ్యోతి సిబ్బందే కనిపించారు. ఇక్కడ మరో అంశాన్ని గమనించాలి. అరెస్టు మరునాటి ఆంధ్రజ్యోతి పత్రిక నొడా కేవలం ఎడిటర్ శ్రీనివాస్, ఎండీ రాధాకృష్ణ ఫోటోలే ప్రముఖంగా కనిపించాయి. కానీ రిపోర్టర్లు శ్రీనివాస్, వంశీల ఫోటోలు లేవు. ఎందుకు? కంట్రిబ్యూటర్లనే చిన్న చూపా? జరిగిన తప్పును ఆంధ్రజ్యోతి జాజమాన్యం మరునాటికి సవరించుకుంది లెండి.

Sunday, June 22, 2008

పుట్టుకొస్తున్న కొత్త ఛానెళ్ళు.. జర్నలిస్టుల కొరత..

కొద్ది వారాల్లో మరి కొన్ని కొత్త న్యూస్ ఛానెళ్ళు వస్తున్నాయి. ఇప్పటికే ఉన్న ఈటీవీ(ఈటీవీ2), టీవీ9, జెమిని(జెమిని న్యూస్), టీవీ5, ఎన్-టీవీ, జీ తెలుగు, మా టీవీ, విస్సా లకు తోడుగా ఆసియానెట్ సితార, మా24, జీ తెలుగు24, సాక్షి టీవీ, టి-టీవీ, ఐ-టీవీ, సి.బి.సి., ఆర్ టీవీ త్వరలోనే రాబూతున్నాయి. అసలు ఇన్ని ఛానెళ్ళు మనగలవా అనే విషయాన్ని పక్కన పెడితే అసలు తెలుగు మీడియాలో వీటన్నింటికీ జర్నలిస్టులు (నాణ్యమైన) దొరుకుతారా అనే అనుమానం కలుగుతోంది. ఈ కొరతను అదిగమించడానికి కొన్ని ఛానెళ్ళు కొత్త వారిని చేర్చుకొని శిక్షణ ఇస్తున్నాయి. సో తెలుగు జర్నలిజానికి మంచి రోజులు వచ్చాయి. బోలెడన్ని ఉపాధి అవకాశాలు, మంచి మంచి జీతాలు లభిస్తున్నాయి. కానీ.. ఈ ఛానెళ్ళలో ఎన్నికల తర్వాత ఎన్ని ఉంటాయన్నదే ప్రశ్న.

స్టింగు రంగడి ఛానెల్..

రాజశేఖర్.. ఈ పేరు గుర్తుందా?.. టీవీ-9లో కో ఆర్డినేటర్ గా పని చేసిన ఈ వ్యక్తిని అవినీతిపరుడిగా ఆధారాలతో సహా నిరూపించి ఇంటికి పంపారు. స్టింగర్లు, రిపోర్టర్ల నుండే కాకుండా రాజకీయ నాయకులు, వ్యాపార, విద్యా సంస్థలు.. ఒకరేమిటి ఎవర్నీ వదలకుండా మామూళ్లు వసూలు చేసేవాడని రాజశేఖర్ కు పేరుండేది. ఒకానొక విద్యాసంస్థ అక్రమాలపై టీవీ-9 విలేఖరి ఒకరు స్టోరీ చేయడానికి వెల్లితే సదరు కాలేజీవారు అతన్ని బంధించి దేహశుద్ది చేశారు. జర్నలిస్ట్ సంఘాల నిరసన, పోలీసు, టీవీ-9 సిబ్బంది విచారణ అనంతరం సదరు కాలేజీకి, రాజశేఖర్ కు ఉన్న రుణానుబంధం బయట పడింది. ఆ తర్వాత రాజశేఖర్ వ్యవహారాలపై నిఘా పెట్టిన టీవీ-9 సిబ్బంది, ఇతగాడు ఓ నాయకుని దగ్గర లంచం తీసుకుంటుండగా స్పై కెమరాతో స్టింగ్ ఆపరేషన్ జరిపి మరీ పట్టుకున్నారు. ఇలా తొలగించబడ్డ రాజశేఖరుడు సి.ఇ.ఓ.గా సరికొత్త న్యూస్ చానెల్ రాబోతుంది. మనం పైన చెప్పుకున్న విద్యా సంస్థే ఈ చానెల్ను స్పాన్సర్ చేస్తొందిట. రాజశేఖరుని చానెల్లో స్టింగ్ ఆపరేషన్లు ఉంటాయా?..

సుమన్ కొత్త ఛానెల్ పెడతారా?


Tuesday, June 3, 2008

మూతపడ్డ సిటీకేబుల్

గత కొద్ది వారాలుగా రాష్ట్ర రాజధానిలో జరిగే కార్యక్రమాలు, ప్రెస్ మీట్లలో సిటీకేబుల్ మైక్ లోగోలు కనబడటం లేదేమిటా అని ఆలోచిస్తున్నారా?ఆంధ్ర ప్రదేశ్ లో ఎలక్ట్రానిక్ మీడియా(ప్రైవేట్)కు శ్రీకారం చుట్టిన సిటీకేబుల్ ఇక లేదు. నడపడం చేత కాక 'జీటీవీ' యాజమాన్యం ' సిటీకేబుల్ 'కు పాతరేసింది. 1995-96లలో విజయవాడలో రామకృష్ణ ప్రారంభించిన మాస్టర్ కేబుల్ ను టేకోవర్ చేసిన జీటీవీ సుభాష్ చంద్ర సిటీకేబుల్ పేరిట విస్తరించారు. ఆ తర్వాతి కాలంలో హైదరాబాద్ లో ప్రారంభమైన సిటీకేబుల్ ఎంతో పాపులారిటీ తెచ్చుకుంది. ఏలక్ట్రానిక్ మీడియాలో రవి ప్రకాశ్ (ప్రస్థుత టీవీ9 సీఈవో) కెరీర్ మొదలైంది సిటీకేబుల్ నుండే. రాజకీయనేతలు, అధికారులు, ప్రజలు సిటీకేబుల్ వార్తల కోసం ఆసక్తిగా చూసే వారు. సిటీకేబుల్ సిబ్బంది రానిదే ప్రెస్ మీట్లు కూడా ప్రారంభమయ్యేవి కాదు. క్రమంగా శాటిలైట్ చానెళ్ళు జెమిని, ఈటీవీ, ఇతర కేబుల్ నెట్ వర్క్ లు ఇన్ కేబుల్, సీ చానెల్ వచ్చాక సిటీకేబుల్ ప్రాభవానికి గ్రహణం ప్రారంభమైంది. 'జీ'యాజమాన్యం సిటీకేబుల్ ను టెక్నాలజీ పరంగా అభివృద్ది చేయడంపై సరయిన దృష్టి పెట్టక పొవడం, దివంగత రామకృష్ణ లాంటి సమర్ధిలైన మేనీజింగ్ డైరెక్టర్లు, బాస్లు లేక పొవడం ఇందుకు కారణం. జీ యాజ్మాన్యం సిటీకేబుల్ కు నియమించిన బాస్లంతా అసమర్ధంగా వ్యవహరించడం, తోటి కేబుల్ నెట్ వర్క్ లకు కోవర్టులుగా మారటం కూడా మరో కారణం అని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. సిటీకేబుల్ మూత పడ్డా, అక్కడి న్యూస్ సిబ్బందిని జీన్యూస్ లోకి తీసుకోవడం గుడ్డిలో మెల్ల.

పుత్రోత్సాహము తండ్రికి..






ఎవరా బాడుగ నేతలు?

ఆంధ్రజ్యోతి దినపత్రిక కార్యాలయంపై జరిగిన దాడి, పత్రికా స్వేచ్చపై దాడి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ పత్రిక ప్రచురించిన బాడుగ నేతల స్టొరీ కారణంగానే ఈ దాడి జరిగిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే బాడుగ నేతల స్టోరీ కొంత డొంకతిరుగుడుగా ఉంది. ఈ స్టోరీలో నాయకుల పేర్లు ఎందుకు నేరుగా చెప్పలేదు? ఆ పేర్లేవో చెప్పక పోవడం వల్ల బడుగు వర్గాల నేతలంతా ఇంతే అన్న అర్థం రాదా? మంద కృష్ణ జరిపిన దాడిని ఖండించాల్సిందే .. అదే సమయంలో ఆయన మీడియాపై చేస్తున్న ఆరోపణలు కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది.

బాడుగ జర్నలిజం (ఆంధ్రభూమి దినపత్రిక 31-05-2008)


Friday, May 23, 2008

శివ రామ ప్రసాద్ రాజీనామా.. టీవీ-5లో సంక్షొభం..

టీవీ-5 యాజమాన్య వైఖరికి విసిగిపోయిన శివ రామ ప్రసాద్ ఆ చానెల్ కు రాజీనామా చేశారు. గత కొద్ది నెలలుగా బి.ఆర్.నాయుడు, శివ రామ ప్రసాద్ ల నడుమ కోల్డ్ వార్ నడుస్తోంది. నాయుడు కొద్ది రోజులుగా శివ రామ ప్రసాద్ మాటకు విలువ ఇవ్వక పోగా క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డ ఉద్యోగులను వెనుకేసుకు రావడం, ఎడిటోరియల్ విషయాల్లో అతిగా జోక్యం చేసుకోవడం శివ రామ ప్రసాద్ కు ఇబ్బందిగా మారిందని టీవీ-5 వర్గాలు చెబుతున్నాయి. బిజినెస్ బ్యూరో చీఫ్ వసంత్ విషయంలో తాజాగా జరిగిన గొడవే శివ రామ ప్రసాద్ రాజీనామాకు దారి తీసింది. నాయుడు పెత్తందారి ధోరణి పట్ల టీవీ-5లోని చాలా మంది జర్నలిస్టులు ఆగ్రహంతో ఉన్నారట. వారంతా ఇతర చానెల్లలో ఉద్యోగా కోసం ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ఏ చానెల్ అయినా సింగిల్ స్టీరింగ్ తో నడవటం మంచిదని ఇందుమూలంగా తెలిసిన నీతి..

తెలుగు చానళ్ల తెగులు


తెలుగు చానళ్ల తెగులు చానళ్లలో చోటు చేసుకున్న విష పరిణామాలపై ఆంధ్రజ్యోతి దిన పత్రిక చక్కని స్టోరీని ప్రచురించింది .

'సీటీవీ'లో ఆకలి కేకలు

హైదరాబాద్ లో కేబుల్ టీవీ ప్రసారాలు అందించే ప్రముఖ చానెల్ సీటీవీ (గతంలో ఇన్ కేబుల్) గత మూడు నెలలుగా తమ జర్నలిస్టులకు జీతాలు ఇవ్వడంలేదు. రెండు నెలలకో సారి జీతాలు.. అదీ అర కొరా ఇవ్వడం సీటీవీలో మామూలే. కానీ ఏకంగా మూడు నెలల నుండి జీతాలు ఇవ్వకపోవడం సీటీవీ జర్నలిస్టులకు ఇబ్బంది కరంగా మారింది. జీతాలు ఇవ్వకపోవడంతో ఇంటి అద్దెలు చెల్లించలేక, ఇంట్లోకి అవసరమైన వెచ్చాలు కొనలేక నానా ఇబ్బందులు పడుతున్నామని సీటీవీ సిబ్బంది వాపోతున్నారు. అసలు ఈ దుస్థితి ఏమిటి? సీటీవీ యజమాని చౌదరి ఏమైనా నష్టాల్లో ఉన్నడా? నమ్మడం కష్టమే.. సీటీవీ సంస్థ మంచి లాభల్లోనే ఉంది. పైగా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్న పనులు చేసుకోవడంలో చౌదరి దిట్ట. తమ ఉద్యోగుల కష్ట సుఖాల్లో భూరి విరాళాలు ఇచ్చి ఆదుకుంటారని చౌదరి గారికి మంచి పేరుంది. చౌదరి గారు వెంటనే జీతాలు చెల్లించాలని, ఆకలి కేకల నుండి తమని రక్షించాలని సీటీవీ జర్నలిస్టులు కోరుతున్నారు.

Wednesday, May 14, 2008

ఆంధ్రభూమి దినపత్రిక 13-05-2008




Monday, May 12, 2008

జెమినిలో సమ్మె?

వేతనాల పెంపు విషయంలో తీవ్రంగా భంగపడ్డ జెమిని సిబ్బంది సమ్మెకు సిద్దమవుతున్నారు. జీతలు పెరుగుతాయని ఎంతగానో ఆశ పడ్డ జెమిని సిబ్బందికి సన్ యాజమాన్యం మొండి చేయి చూపింది. 100 శాతం.. కాదు 50 శాతం.. కాదు కాదు 30 శాతం అని వదంతులు సృష్టించి సిబ్బంది బయటకు వెళ్ళకుండా చేసిన జెమిని-సన్ యాజమాన్యం చివరకు 5 శాతమే జీతం పెంచాలని ప్రయత్నించగా ప్రతిఘటన ప్రారంభమైంది. దీనికి భయపడ్డ యాజమాన్యం జీతాల పెంపును తాత్కాలికంగా వాయిదా వేసుకుంది. సన్ గ్రూపులోని అన్ని ఛానెళ్ళదీ ఇదే సమస్యట. ఇక జీతాలు పెరగవు.. పెరిగినా పెద్ద మార్పు ఉండదని గ్రహించిన సన్ గ్రూపులోని అన్ని ఛానెళ్ల సిబ్బంది సమ్మెకు దిగే ప్రయత్నం చేస్తున్నారు. మన రాష్ట్రానికి చెందిన జెమిని, జెమిని న్యూస్, తేజ సిబ్బంది కూడా సమ్మెకు సిద్ద మవుతున్నారు. సిబ్బంది మూకుమ్మడి సెలవు పెట్టడమో, లేదా ధర్నాకు దిగడమో, నల్ల బ్యడ్జీలు ధరించి విధులకు హాజరు కావడమో.. ఏ రూపంలో అయినా ఈ సమ్మె జరిగే అవకాశం ఉంది. అవసరమైతే కార్మిక సంఘాల మద్దతు తీసుకొని లేబర్ కోర్టును ఆశ్రయించాలని కొదరు సిబ్బంది ప్రణాలికలు తయారు చేస్తున్నారట.
అయినవారికి కంచాల్లో..
తన ఉద్యోగుల జీతాల పెంపు విషయంలో సన్ వర్గాలను ఒప్పించడంలో విఫలమైన జెమిని ఎం.డి. కిరణ్ తన వారు అనుకున్న వారికి మాత్రం వ్యక్తిగతంగా నగదు ఇస్తున్నారని వినికిడి. ఇలా కొందరు ఉద్యోగులకు మాత్రమే ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఈ ధోరణి ఉద్యోగుల మధ్య మనస్పర్ధలకు దారి తీస్తోంది. కొందరికి మాత్రమే ఇలా చెల్లించడంలోని ఆంతర్యం ఏమిటి? మిగతావారేం పాపం చేశారు? విభజించి పాలించడం అంటే ఇదేనా?

maaరింది.. బాగుంది..

ఇటీవలే మారిన మాటీవీ లోగో విషయంలో సర్వత్రా చర్చ జరుగుతోంది. నాగార్జున, చిరంజీవిల నిర్వహణలో మాటీవీ కొత్త పుంతలు తొక్కగలదని మీడియా వర్గాలు భావిస్తున్నాయి. లోగో మార్చుకున్న మాటీవీ ఇప్పుడు వినూత్న కార్యక్రమాలు అందించటంపై దృష్టి పెట్టింది. మాటీవి త్వరలోనే జెమిని, ఈటీవీ ఛానెళ్ళకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. మారిన మాటీవీ లోగొ బానే ఉంది కానీ రంగులే మబ్బుగా ఉన్నాయి. వార్తా సేకరణకు వచ్చే రిపోర్టర్లు పట్టుకునే మైకుల లోగోలు మరీ పెద్దగా ఉండి ఎబ్బెట్టుగా ఉన్నాయి. ఇవి చిన్నగా మారిస్తే బాగుంటుంది.

ఆంధ్రభూమి దినపత్రిక 06-05-2008


Saturday, May 3, 2008

జెమిని జీతాల పెరుగుదల 5 శాతమేనా?..

ఊహించినట్లే జెమిని సిబ్బంది వేతనాల పెరుగుదల విషయంలో మరోసారి దారుణంగా మోసపోయారు. సంవత్సర కాలంగా జీతాలు పెంచుతామంటూ ఊరించిన యాజమాన్యం తమ సిబ్బందిని ఘోరంగా అవమానించింది. జెమిని నుండి ఇతర ఛానెళ్ళకు భారీగా వలసలు ప్రారంభం కావడంతో జీతాలు 50 నుండి 100 శాతం దాకా పెరుగుతాయని యాజమాన్యంలోని ప్రముఖులు ప్రచారం చేసారు. ఈ ప్రచారాన్ని నమ్మిన సిబ్బంది ఇతర ఛానెళ్ళలో వచ్చిన అవకాశాలను కూడా వదులుకున్నారు. చెన్నై నుండి వచ్చిన తాజా సమాచారం ప్రకారం జెమిని సిబ్బందికి కేవలం 5 శాతం జీతమే పెంచాలని సన్ యాజమాన్యం నిర్ణయించింది. ఈ సమాచారం లీక్ కావడంతో జెమిని సిబ్బందిలో చాలా మంది రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు. ఇతర తెలుగు ఛానెళ్ళతో పోలిస్తే జెమిని ఛానెళ్ళలో సిబ్బంది జీతాలు అడేఅనంగా ఉన్న విషయం తెలిందే. పెరిగిన నిత్యావసర వస్తువల ధరలు, గ్రేటర్ హైదరాబాద్లో రెండు, మూడింతలు అయిన ఇళ్ళ అద్దేలు చెల్లించలేక జెమిని సిబ్బంది నరకం అనుభవిస్తున్నారు. ఇవన్నీ జెమిని-సన్ యాజమాన్యాలకు తెలియవా? నిద్ర పోయే వారిని లేపవచ్చు, కాని నిద్ర నటించే వారిని ఏమీ చేయలేం.. జెమినిలో లక్షల్లో జీతాలు తీసుకుంటున్న ఎం.డి కిరణ్, జి.ఎం. బాలకృష్ణన్ తినడాని తిండైనా లభించని దుస్థితిలో ఉన్న తమ సిబ్బందికి న్యాయమైన జీతాలు ఇప్పించడంలో విఫలమయ్యారు. మీరు బరిస్టా కాఫీ తాగగానే సరిపోదు.. మీ సిబ్బంది కనీసం కామత్ హోటల్లో అయినా కాఫీ తాగేలా జీతాలు ఇప్పించండి.
జీ-తెలుగు సిబ్బందికి భారీ ఇన్సెంటివ్స్

జీ నెట్ వర్క్ ' జీ-తెలుగు ' సిబ్బందికి భారీ ఇన్సెంటివ్స్ ఇచ్చింది. సగటున ఒక్కో ఉద్యోగికి రూ.50,000ల నుండి లక్ష దాకా లబ్ది చేకూరింది. అలాగే జీతాలు కూడా భారీగా పెరిగాయి. మాటీవీ కూడా తమ సిబ్బందికి 25 శాతం దాకా జీతాలు పెంచింది. ఈటీవీ, టీవీ-9, టీవీ-5, ఎన్-టీవీ ఛానెళ్ళు కూడా జీతాలు భారీగానే పెంచాయి.. పెంచుతున్నాయి.. ఇవన్నీ విన్నారా జెమిని యాజమాన్యం వారూ..

ఆంధ్రభూమి దినపత్రిక 03-05-2008


Friday, May 2, 2008

వార్త చీఫ్ ఎడిటర్ కొమ్మినేని?

సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు ' వార్త ' దినపత్రిక చీఫ్ ఎడిటర్ గా చేరబోతున్నారనే వార్త మీడియావర్గాల్లో వినిపిస్తోంది. కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ పత్ల గుర్రుగా ఉన్న గిరీష్ సంఘీ తన దినపత్రికను ఇతర పత్రికలకు ధీటుగా తీర్చి దిద్దటానికి కొమ్మినేనిని ఎడిటర్ గా రప్పించుకునే ఆలోచనలో ఉంది. ఈ మేరకు ప్రాధమిక చర్చలు కూడా జరిగాయట. ఈనాడు, ఆంధ్రజ్యోతి పతికల్లో ఒక వెలుగు వెలిగిన కొమ్మినేని అనవసరంగా ఎలక్ట్రానిక్ మీడియాకు వచ్చి చేతులు కాల్చుకున్నానే అని చాలా కాలంగా బాధ పడుతున్నారట. ప్రింట్ మీడియాలోకి తిరిగి రావాలని భావిస్తున్న కొమ్మినేనికి వార్త రూపంలో మంచి అవకాశం అభించనుంది. కొమ్మినేని ఒక దశలో చంద్రబాబు నాయుడు తేవాలని భవించిన ' అక్షర ' దిన పత్రిక ఎడిటర్ గా వెల్లుతున్నారనే ఊహాగానాలు వచ్చాయి. చివరకు బాబు గారు అక్షర యోచన విరమించుకున్నారుట(?) వార్త దిన పత్రికను అభివృద్ది పరచడానికి గిరీష్ సంఘీ కొత్త వియ్యంకుడు (అగ్రశ్రేణి హిందీ దినపత్రిక దైనిక్ జాగరణ్ యజమాని) ఆసక్తిగా ఉన్నారట.

ఈటీవీలో ముగిసిన వెంకటకృష్ణ ఎపిసోడ్

ఈటీవీ-2 హైదరాబాద్ బ్యూరో ఛీఫ్ వెంకటకృష్ణ కథ క్లైమాక్స్ కి చేరింది. వెంకటకృష్ణ ఆగడాలపై దర్యాప్తు జరిపిన ఈటీవీ యాజమాన్యం ఆయన్ని బ్యూరో ఛీఫ్ పదవి నుండి తొలగించి ముంబైకి బదిలీ చేసింది. అంటే తమరి సేవలిక చాలు దయచేయండి అని అర్థం. వెంకటకృష్ణ కంట్రిబ్యూటర్ల దగ్గర డబ్బులు తీసుకున్నట్లు నిరూపితమైంది. తన ప్రియురాలికి ఇళ్ళ స్థలం ఇప్పించడానికి పోర్జరీ లెటర్ సృష్టించిన బాగోతంపై రామోజీరావు సీరియసైనారట. ఇంతకాలం వెంకటకృష్ణను వెనుకేసుకు వచ్చిన మేనేజర్ ఇటీవలే రిజైన్ చేయటంతో ఆదుకునేవారే కరువయ్యారు పాపం. ఉసురు తగలటం అంటే ఇదే కాబోలు. వెంకటకృష్ణ లీలల్ని ఇటీవలే 'ఎబౌట్ తెలుగు మీడియా' బయట పెట్టడం అందరికీ తెలుసు. ఈటీవీ లోని వెంకటకృష్ణ బాధితులంతా ఈ వార్తను రామోజీరావు దృష్టికి తీసుకెళ్ళారు.ప్రస్తుతం వెంకటకృష్ణ ఈటీవీకి రాజీనామా ఇచ్చే యోచనలో ఉన్నాడు. ఇతగాడికి టీవీ-5 యాజమాన్యం ఇన్ పుట్ ఎడిటర్ లేదా బ్యూరో చీఫ్ పోస్ట్ ఇవ్వలని ఉవ్విల్లూరుతోందిట. ఈటీవీ-2 బ్యూరో చీఫ్ పోస్టు సీనియర్ రిపోర్టర్ మురలికి ఇచ్చారు. అలాగే ఓవరాల్ మానిటరింగ్ బాధ్యతల్ని రఘుబాబుకి ఇచ్చారు. వెంకటకృష్ణ రాజీనామా తర్వాత ఈటీవీలోని అతని ప్రియ మిత్రుడు, గోడమీది పిల్లి లాంటి నారాయణ పరిస్థితి ఏంటి అని అంతా చర్చించుకుంటున్నారు అతనిపై కూడా అవినీతి ఆరోపణలు లెస్సగా ఉన్నాయి మరి. టీడీపీ బీట్ చూసే ఇతగాడు కులాన్ని అడ్డు పెట్టుకొని భారీగా పైరవీలు చేస్తాడు.

ఆంధ్రభూమి దినపత్రిక 29-04-2008


Sunday, April 27, 2008

పత్రికల అంతర్యుద్దం


సాక్షి రంగప్రవేశంతో తెలుగు దిన పత్రికల మధ్య పోరాటం ప్రారంభమైంది. అది సర్క్యులేషన్లోనో, వార్తల కవరేజీలోనో కాదు. పరస్పరం దుమ్మెత్తిపోసుకోవడంలోనే ఈ పోరాటం.. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు పోటీగా అత్యాధునిక టెక్నాలజీ, అన్ని పేజీలు రంగుల్లో, ఒకేసారి 23 ఎడిషన్లతో వచ్చిన సాక్షి సరికొత్త చరిత్ర సృష్టించిందనడంలో అనుమానం లేదు. అయితే ఈనాడులో వచ్చిన స్టోరీ(జడ్చర్ల ఎస్.ఇ.జడ్)ని సాక్షి సమీక్షించడం, సాక్షిపై ఈనాడు ఎదురు తిరగడం పాఠకులను ఆశ్చర్యపరిచింది. ఈనాడులో వచ్చిన స్టోరీ అసత్యమైతే వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ సాక్షి ఎందుకు జోక్యం చేసుకున్నట్లు? అలాగే తాను అమ్ముతున్నట్లుగానే ఇతర తెలుగు దిన పత్రికలు కూడా రూ.2/-కే అమ్మాలని సాక్షి డిమాండ్ చేయడం ఎంతవరకూ సబబు. ఎవరి సరుకుకు వారు ధర నిర్ణయించుకునే హక్కు కలిగి ఉంటారు. తాను అమ్మే ధరకే ఇతరులూ అమ్మాలని ఏ వ్యాపారి కూడా శాసించజాలడు. ఏ ధరకు ఏ సరుకు కొనాలో నిర్ణయించుకునేది వినియోగదారుడే. ఈ సూత్రం పత్రికలకూ, పాఠకులకూ వర్తిస్తుంది. అంతర్జాతీయ టెక్నాలజీతో, అన్ని పేజీలు రంగుల్లో కేవల రూ.2/- కే ఇస్తున్న సాక్షితో ఈనాడు, ఆంధ్రజ్యోతి పోటీపడలేవని అర్థమైపోయింది. ఈ విషయాన్ని ఆ రెండు దిన పత్రికలే అంగీకరించాయి. ఎలాగు సాక్షి సర్క్యులేషన్ 13 లక్షలు దాటింది. యుద్దమొలో గెలిసిన తర్వాత కూడా శత్రువుని హింసించాలా?.. క్షమించి వదిలేయవచ్చుకదా?..

Tuesday, April 22, 2008

కొంప ముంచిన మురళీకృష్ణ

ఇళ్ళ స్థలాల కేటాయింపుపై హైకోర్టు ఇచ్చిన స్టే జర్నలిస్టులందరినీ నిరాశ పరచింది. ఈ స్టే కు ప్రధాన కారకుడైన రావు చెలికాని ప్రధానంగా జర్నలిస్టులనే ఎందుకు టార్గెట్ చేసుకున్నట్లు? పరిశోధిస్తే ఆశ్చర్యకర విషయాలు బయట పడ్డాయి. చెలికాని రావును ఉసి గొలిపి కేస్ పెట్టించింది ఈనాడు పత్రిక స్టాఫ్ రిపోర్టర్ మురళీకృష్ణ. నిబంధనల ప్రకారం ఐదేళ్ళ సర్వీస్ కూడా లేని మురళీకృష్ణ రాజమండ్రికి చెందిన కొన్ని చిన్న పత్రికల నుండి బోగస్ సర్వీస్ సర్టిఫికెట్లు దాఖలు చేసి దొరికి పోయాడు. అతని అప్లికేషన్ తిరస్కరణకు గురికావడం జీర్ణించుకోలేక మొత్తం ఇళ్ళ స్థలాల కేటాయింపు ప్రక్రియకే విఘాతం కలిగించాలని నిర్ణయించుకున్నాడు. బ్లాగుల్లో 'పెద్దలా? గద్దలా?' కరపత్రం అతడు రాసిందేనట(?) మురళీకృష్ణ కొద్ది నెల క్రితం ఇదే బ్యానర్ తో ఈనాడులో భూ కుంభకోణం వార్తలు రాశాడట(?) చెలికాని రావు కోర్టుకు ఇచ్చిన పిర్యాదులో కొందరు జర్నలిస్టులకు సొంత ఇళ్ళు ఉన్నా, ప్రభుత్వం ఇచ్చే ఇళ్ళ స్థలాల కొసం దరఖాస్తు చేశారని పేర్కొన్నారు. ఇందులోఅ చాలా వరకు ఈనాడు, ఈటీవీ ఉద్యోగులవి. ఈ ఫ్లాట్ల ఫోటోలన్నీ చెలికాని రావుకు మురళీకృష్ణ ఇచ్చాడట. అది సరే మరి చెలికాని రావు జర్నలిస్టులపై ఎందుకు పగబట్టాడు? మున్ముందు ఈ విషయాలన్నీ బయట పడతాయి..

ఎలక్ట్రానిక్ మీడియా పుట్టి నాలుగేళ్లే అయిందా?

ఇళ్ళ స్థలాల కోసం ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన కొoదరు ప్రింట్ సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా పుట్టి నాలుగేళ్ళే అవుతోంది కదా.. అప్పుడే మీకు ఇళ్ళ స్థలాలు కావాలా అని ప్రశ్నించారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన అజ్ణానం. నిజానికి తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా 1995-96లో ప్రారంభమైంది(దూరదర్శన్ తెలుగు వార్తల్ని మినహాయిస్తే. దూరదర్శన్ ను కలుపుకుంటే మూడు దశాబ్దాల చరిత్ర అవుతుంది). 1995-96లో సిటీకేబుల్ వార్తలు ప్రారంభమయ్యాయి. దీని క్రెడిట్ ఆనాటి సిటీకేబుల్ న్యూస్ డైరెక్టర్, ప్రస్తుత టీవీ-9 సి.ఇ.వో. రవిప్రకాశ్ కు దక్కుతుంది. ఆ తర్వాత జెమిని, ఈటీవీలు శాటిలైట్ ఛానెళ్ళుగా వచ్చాయి. జెమిని, ఈటీవీల్లో వార్తలు ప్రారంభం కాని రోజుల్లో సిటీకేబుల్ వార్తలకు ఎంతో ప్రాముఖ్యం ఉండేది. సిటీకేబుల్ టీం వచ్చే వరకు ప్రెస్ మీట్లు ప్రారంభమయ్యేవి కాదు. ఈ చరిత్ర టీవీ-9, ఈటీవీ-2 చానెళ్ళలో పనిచేసే పిల్ల కాకులకు తెలిసినట్లు లేదు. తమ ఛానెళ్ళ పుట్టుకతోనే తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా పుట్టిందని వారు వాదిస్తారు. నూతిలోని కప్పలారా వాస్తవాలు తెలుసుకోండి.

bv 9

సి.పి.ఎం. రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు సాదా సీదా భోళా మనిషి. రాష్ట్ర రాజకీయాల్లో ఇంత నిరాడంబరంగా ఉండే నాయకుడు ఏ పార్టీలోనూ కనిపించడు. ఏ విషయంలో అయినా తనదైన రీతిలో స్పందించే రాఘవులు బైట్స్ కోసం టీవీ జర్నలిస్టులు ఉవ్విళ్ళూరుతుంటారు. అడిగిన ప్రతివారికీ కాదన లేక ఉదారంగా బైట్స్ ఇచ్చేస్తుంటారు ఆయన. రాఘవులు అధికార పక్షాన్ని తనదైన శైలిలో చెండాడుతుంటారు. ఇందుకు మండిపడ్డ కాంగ్రెస్ నేతలు బి.వి.రాఘవులును టి.వి.రాఘవులుగా అభివర్ణిస్తుంటున్నారు. టీవీ చానెళ్ళలో రాజశేఖర రెడ్డి తర్వాత ఎక్కువగా కనిపించేది రాఘవులేనట. ముఖ్యంగా టీవీ-9లో.. బి.వి.రాఘవులును టి.వి.రాఘవులు అనాలా? బివి-9 అనాలా? మీరే చెప్పండి.

Tuesday, April 15, 2008

'ఏసియానెట్'లో చేరిన సతీష్ బాబు

జెమిని న్యూస్ చీఫ్ ఎడిటర్ పదవికి సతీష్ బాబు రాజీనామా ఇచ్చేశారు. ఇప్పుడాయన కొత్తగా రాబోయే ఏసియానెట్ వారి తెలుగు ఛానెల్ ' సితార ' లో చేరిపోయారు. సతీష్ బాబు జెమినిలో చేరెప్పుడే అక్కడ ఎక్కువ కాలం ఉండే అవకాశం లేదని మీడియా మిత్రులంతా ఊహించారు. అనుకున్నట్లే ఆయన పట్టుమని 6 నెలలు కూడా జెమినిలో ఇమడలేక పోయారు. ఇందుకు సతీష్ బాబును తప్పు పట్టలేం. జెమిని యాజమాన్యం విపరీత ధోరణులను ఆయన తట్టుకోలేక పోయారు. చాలీ చాలని జీతాలతో జెమిని నుండి వలస పోతున్న సిబ్బంది స్థానంలో కొత్తవారిని నియమించడంలో యాజమాన్య నిర్లక్ష్యం సతీష్ బాబును ఇబ్బందికి గురిచేసిందని చెప్పుకుంటున్నారు. సిబ్బందిని, పరికరాలను ఇవ్వకుండా టార్గెట్లు పెట్టడం జెమినివారి ప్రత్యేకత. గత కొంత కాలంగా జెమిని యాజమాన్యానికి, సతీష్ బాబుకు మధ్య దూరం పెరిగింది. ఇందుకు సతీష్ బాబు వ్యవహారశైలి కూడా కారణం. ప్రతి విషయానికి తొందరపడి సిబ్బందిపై అరవడం, నచ్చనివారిని శంకరగిరి మాన్యాలను పంపడం సతీష్ బాబుకు అలవాటైన విద్య. బెస్టాప్ లక్ సతీష్ బాబు గారు.. ఏసియానెట్ లో అయినా కుదురుగా ఉండే వాతావరణం ఉండాలని కోరుకుంటున్నాం..
కొత్త ఎడిటర్ ఎవరు?
సతీష్ బాబు తర్వాత ఎవరొస్తారన్నది జెమిని ముందున్న ప్రశ్న. జెమిని టీవీ ఎడిటర్, బ్యూరో చీఫ్, కోఆర్డినేటర్ పోస్టుల్లో పని చేయాలంటే జర్నలిస్టులకు భయం. ఈ పదవుల్లో ఉన్నవారందరినీ వేధించి సాగనంపడం జెమిని యాజమాన్యానికి వెన్నతో పెట్టిన విద్య. సాక్షాలు కావాలంటే రవిప్రకాష్, కందుల రమేష్, భావనారాయణ, మధు, మాధవ్, మునిరాజు లను అడిగి చూడండి.

పాపం 'ఈవారం'

రాజమండ్రి ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ గారి 'ఈవారం' పత్రిక ఈ మధ్య బుక్ స్టాళ్ళలో కనబడుటలేదు. కారణం.. కమిషన్ చెల్లింపు విషయంలో కక్కుర్తి. ఫలితం.. ఈవారం పత్రిక అమ్మొద్దని బుక్ స్టాళ్ళ నిర్ణయం. కేవలం కాంగ్రెస్ అనుకూల వార్తలు, అందునా పార్టీలో ప్రత్యర్థులపై వ్యతిరేక వార్తలు.. ఇదీ ఈవారం ధోరణి. పి.జె.ఆర్. మరణించాక ఆయనకు నివాళిగా వ్యాసాన్ని కూడా ప్రచురించలేదు. చాలీ చాలని జీతాలు.. ఎవరికి అనుకూలంగా రాయాలో, ఎవరికి వ్యతిరేకంగా రాయాలో అర్థంకాక ఈవారంలో మొదటి నుండి ఉన్న జర్నలిస్టుల్లో దాదాపుగా అంతా మానేశారు. పత్రిక అడ్రస్సూ మారింది. పాపం ఈవారం .. వచ్చే వారానికైనా కోలుకుంటుందో లేదో?..

ఇళ్ళ స్థలాల కోసం ఇంత రచ్చా?

ఊహించినట్లుగానే జర్నలిస్టు సోదరులు ఇళ్ళ స్థలాలకోసం వీధిన పడ్డారు. కొట్టుకోవడం ఒకటే తక్కువ. జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచివల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ లో సభ్యత్వం రాని జర్నలిస్ట్ లు ప్రెస్ క్లబ్ ముందు ధర్నా చేశారు, అరెస్ట్ అయ్యారు. ఎందుకీ రచ్చ.. కొత్తగా ఏర్పడ్డ జవహర్లాల్ సొసైటీ సరైన మార్గంలోనే పోతున్నప్పుడు సభ్యత్వానికి ఎంపికైన సభ్యుల పేర్ల జాబితా రహస్యంగా దాయటం ఎందుకు? రహస్యంగా రెండువేల రూపాయల సభ్యత్వ రుసుము, లక్ష రూపాయల డీడీ కట్టించుకొవటంలోని ఆంతర్యం ఏమిటి? ఎవరైనా కోర్టుకు వెళ్ళతారనే భయమా? మరి కోర్టు ఫీజుల డబ్బు కూడా వసూలు చేశారు కదా? ఐదేళ్ళ పైబడి సర్వీస్ ఉన్న వారందరికీ సభ్యత్వం ఇచ్చినా.. పైగా సర్వీస్ ఉన్న వారి దగ్గరే లక్ష రూపాయల డీడీ హడావిడిగా ఎందుకు కట్టించు కుంటున్నారు? ప్రభుత్వం సొసైటీకి భూమి బదిలీ చేయడాని కట్టాల్సిన డబ్బు కొసమే ఈ డబ్బు తతంగం అనేది బహిరంగ రహస్యమే అనుకోండి. ఇన్ని దాగుడు మూతలు అవతలి వారిలో లేని పోని అనుమానాలు రేకెత్తించవా? కోర్తుకు పోతామన్న ప్రతివాడికే భయపడాల్సిన అవసరం ఏమిటి?
జూనియర్లూ.. ఎందుకీ తొందర?

ఇళ్ళ స్థలాలు రాకపోతే జీవితమే వృధా అన్నంతగా హడావిడి పడుతూ ఆందోళనకు దిగారు జూనియర్లు (ఐదేళ్ళ లోపు సర్వీసు గలవారు) ఇళ్ళ స్థలాల కేటాయింపు ప్రక్రియలో కొన్ని నియమ నిబంధనలు ఉండటం సహజం. ఇందులో భాగంగానే చిన్న పత్రికలు, నాన్ స్టార్టర్ ఛానెళ్ళలొ పనిచేసిన అనుభవాన్ని, కంట్రిబ్యూటర్ సర్వీసును లెక్కలోకి తీసుకోలేదు (ఇప్పుడు సభ్యత్వం దొరికిన వారంతా పతివ్రతలే అని మేము అనటం లేదు.. దొరకని వరకే దొరలు). ఏళ్ళ తరబడి జర్నలిస్టులుగా బతుకులు వెళ్ళ దీస్తున్న సీనియర్లకు ముందుగా ప్లాట్లు దక్కాలని కొరుకుందాం. జూనియర్లు వయసు రీత్యా ఈ వృత్తి కాకపోతే మరో ఉద్యోగం చూసుకోవచ్చు. కాని సీనియర్లకు అలాంటి అవకాశాలు దొరకవు. భవిష్యత్తులో ప్రభుత్వం ఇక ఇళ్ళ స్థలాలు ఇవ్వదన్నదే జూనియర్ల ఆవేదన. ఇదే నిజమని ఎందుకనుకోవాలి? పోరాడే శక్తి కొరవడిందా? ముందు మన పోరాటం అనర్హులకు ప్లాట్లు దక్కకుండా చూడటమే..

కొసమెరుపు: ఈ బ్లాగ్ రచయిత కూడా జూనియరే.. ప్లాట్ రావడం లేదు అని తెలిసినా బాధ లేదు..

పెద్దలా?.. గద్దలా?...



జూనియర్ల ఆగ్రహానికి అద్దం పట్టే బ్లాగ్ కరపత్రం ఇది. జూనియర్లది కొంత వరకూ ధర్మాగ్రహమే. కాని పరిస్థితిని వాస్తవ కోణంలోంచి కూడా చూడాలని మనవి.



Sunday, March 30, 2008

వెంకట ' కృష్ణ లీలలు '

దురదృష్ట వశాత్తు ప్రతిభ ఉన్న మీడియాలో గుర్తింపు రాక మరుగున పడ్డ జర్నలిస్టులెందరో ఉన్నారు. గుర్తింపు రావాలంటే ప్రతిభ ఒక్కటే చాలదు. కులం, కాకా పట్టే విద్య కూడా కావాలి. ఆ లక్షణాలన్నీ ఉండబట్టే పర్వతనేని వెంకటకృష్ణ ఈటీవీలో ఒక వెలుగు వెలుగున్నాడు. లేకపోతె వరంగల్ జిలా పర్వతగిరి కాంట్రబ్యూటర్ గానే కొనసాగే వాడేమొ? ' పట్టు ' కళలో ఆరితేరిన వెంకటకృష్ణ ఈటీవీలో సీనియర్లందరిని సాగనంపాడు. కొందరు సీనియర్లు ' ఫిలింసిటీ ' దాటి బయటకు రాకుండా కట్టడి చేయగలిగాడు. ప్రస్తుతం వెంకటకృష్ణను ఫోర్జరీ కేసు వెంటాడుతోంది. ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ళ స్థలాల కోసం రామోజీ ఫిలింసిటీలో ఉండే చాలా మంది సీనియర్ జర్నలిస్టులకు అప్లికేషన్లు అందకుండా వెంకటకృష్ణ అడ్డుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. దరఖస్తు చేసుకున్నా వారిలో 15కు పైగా అనర్హులు ఉన్నారని తెలుస్తోంది. ఈటీవీ నుండి దరఖాస్తు చేసుకున్న కొందరు సీనియర్ జర్నలిస్టుల పేర్లు జాబితాలో చోటు చేసుకోలేదు. తనకు గిట్టని వారి పేర్లు అర్హుల జాబితాలో చోటు చేసుకోకుండా వెంకటకృష్ణ సాయశక్తులా ప్రయత్నించాడు. ఎలక్ట్రానిక్ మీడియా హౌసింగ్ సొసైటీ స్క్రూటినీ కమిటీ సమావేశంలో ఈటీవీ నుండి ఒక పేరు కచ్చితంగా ఉండాలని వెంకటకృష్ణ గట్టిగా పట్టు పట్టదు. ఆ పేరు వెంకటకృష్ణ ప్రియురాలిది. ఈటీవీలో చాలా కాలంగా పని చేస్తున్నట్లు ఒక ఫోర్జరీ లేఖను ఈ దరఖాస్తు వెంట దాఖలు చేశాడు. అసలు ఈమె ఎవరా అని విచారిస్తే ఆవిడకి ఈటీవీతో ఎలాంటి సంబందం లేదని బయట పడింది. ఆమె ఒక అగ్ర దర్శకుడి పీ.ఆర్.ఓ. వెంకటకృష్ణ ఫొర్జరీ వ్యవహారం ఈటీవీ యాజమాన్యం దృష్టికి వెళ్ళి oది. పాపం వెంకటకృష్ణకు కష్ట కాలం మొదలైంది. అదృష్టవశాత్తు ఎలక్ట్రానిక్ మీడియా హౌసింగ్ సొసైటీ జాబితాను జవహర్ లాల్ నెహ్రు హౌసింగ్ సొసైటీ పక్కన పెట్టింది.

సాక్షి విశ్వ రూపం

మార్చి 24న, 23 ఎడిషన్లతో ప్రారంభమైన ' సాక్షి ' దిన పత్రిక తెలుగు మీడియా చరిత్రను తిరగ రాసింది. అంతే కాదు ఒకేసారి అత్యధిక ఎడిషన్లతో ప్రారంభమైన దిన పత్రికగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కబోతోంది. తక్కువ ధరతో, అన్ని పేజీలు రంగులతో, అత్యాధునిక అంతర్జాతీయ పేజీ లేఔట్ తో, సరికొత్త శీర్షికలతో వెలువడుతున్న సాక్షిని చూసి తోటి దిన పత్రికలు దిమ్మ తిరిగిపోయాయి. సాక్షి రాకకు కారణాలు ఏమున్నా సరి కొత్త రూపంలో తెలుగు వారి ముందుకు వచ్చిన ఈ పత్రికను ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిందే. సాక్షి రాకతో ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త దిన పత్రికలు తమ రూపాన్ని సమూలంగా మార్చుకోక తప్పదు. కాగా సాక్షిలో రంగులు ఎక్కువై విషయానికి ప్రాధాన్యత తగ్గుతోందనే విమర్షలు ఉన్నాయి. పొలిటికల్ రిపోర్టింగ్ వీక్ అని విశ్లేషకులు అంటున్నారు. ఇవన్నీ గాలిబుడగల్లాంటివే. కొత్తదనానికి పాఠకులు క్రమంగా అలవాటు పడటం ఖాయం. మరో వైపు సాక్షి కొన్ని చోట్ల మార్కెట్లోకి ఆలస్యంగా వస్తొంది. పత్రికను బుక్ చేసుకున్న పాఠకుల ఇళ్ళకు చేరటం లేదు. ఈ బాలారిష్టాల నుడి బయట పడాలని కొరుకుందాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ సాక్షి

మీడియా కామాంధుడు

సైకిల్ దొంగగా నేరమయ జీవితాన్ని ఆరంభించిన ఓ ఒంగోలు చిన్నోడు కెమెరా అసిస్టెంట్ గా ఎలక్ట్రానిక్ మీడియాలోకి అడుగు పెట్టాడు. పుష్కర కాలంలోనే ఔట్ పుట్ ఎడిటర్ అయిపోయాడు. కోట్లాది రూపాయల విలువైన ఆస్తుల్ని కూడబెట్టాడు. ఈ కథ ఇంతటితో అయిపోలేదు. హిచ్ కాక్ సినిమాను మించిన సస్పెన్స్ తో కొనసాగుతోంది. కామం ప్రకోపించిన ఈ చిన్నోడు ఆడవాళ్ళ జీవితాలతో ఆటలు మొదలెట్టాడు. మతాన్ని అడ్డు పెట్టుకొని కట్టుకున్న ధర్మపత్నికి ద్రోహం చేశాడు. విచ్చలవిడి లైంగిక సంబంధాలు కొనసాగించాడు(కొనసాగిస్తున్నాడు) కొందరిని పెళ్ళాడాడు. కొందరితో కలిసి జీవిస్తున్నాడు. ఏక కాలంలో తల్లీ కూతుర్లతో సంబంధం పెట్టు కున్నాడట(?) చిన్నోడి అకృత్యాలను, వేదింపులను భరించలేని భార్య పోలీసుల్ని, న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. లక్షలాది రూపాలు వెదజల్లి చట్టం దృష్టినుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు చిన్నోడు. తాజాగా ప్రేమ పేరిట మరో న్యూస్ యాంకర్ని వలలో వేసుకొని పెళ్ళాడు. పాపం చిన్నోడి గత చరిత్ర ఆవిడకు తెలియదేమో.. చిన్నోడి లీలలు ఒక్కొకటి బయటకు రావడంతో ఇతగాడు పనిచేస్తున్న ఛానెల్ ఊద్యోగంలోంచి తీసేసింది. (ఇతగాడి గురించి ఎబౌట్ తెలుగు మీడియా ముందుగానే హెచ్చరించినా సదరు ఛానెల్ కళ్ళు మూసుకొని ఉద్యోగం ఇచ్చింది. అది వేరె కత లెండి) ప్రస్తుతం కనబడకుండా పోయిన చిన్నోడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈతడి గత చరిత్రను పోలీసులు ఆరా తీస్తున్నారు. చిన్నోడి మీద ఎన్నో కేసులు నమోదయ్యాయట. దురదృష్టవశాత్తు మన మీడియా అన్ని రకాల నేరగాళ్ళ అడ్డాగా మారిపోయిందనటానికి చిన్నోడి కథే సాక్షం. మెరుగైన సమాజ పూర్వ విద్యార్థి చిన్నోడు ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదనుకుంటాం..

Sunday, March 2, 2008

జెమినిలో ఏం జరుగుతోంది?

జెమిని టీవీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు అక్కడ పని చేస్తున్న ఉద్యోగులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. శ్రమ దోపిడీకి మారు పేరైన జెమినిలో జీతాలు ' గొర్రె తోక బెత్తెడు ' లాంటివని అందరికి తెలుసు. ఇతర తెలుగు ఛానెళ్ళతో పొలిస్తే జెమిని సిబ్బంది జీతాలు నాలుగో వంతు మాత్రమే. కొత్తగా వస్తున్న ఛానెళ్ళు భారీగా వేతనాలు ఆఫర్ చేస్తుండటంతో జెమిని నుండి వలసలు నిత్యకృత్యంగా మారాయి. జరుగుతున్నా జెమిని గ్రూప్ ఛానెళ్ళను నిర్వహిస్తున్న ' సన్ ' యాజమాన్యంలో కనీస స్పందన లేదు. అసలు హైదరాబాద్ లో జరుగుతున్న పరిణామాలు చెన్నై లోని సన్ యాజమాన్యానికి తెలుసా? ఆంధ్ర ప్రదేశ్ లో ఛానళ్ళరూపంలొ వందలాది కోట్లు ఆర్జించే సన్ యాజమాన్యం జెమిని ఉద్యోగులకు మెరుగైన జీతాలు ఇవ్వక పోవడానికి కారణం ఏమిటి? గ్రేటర్ హైదరాబాద్ లో పెరిగిన ఇళ్ళ అద్దెలు, నిత్యావసర వస్తువుల ధరలు తట్టుకోలేక ఆప్పుల ఊబిలో కూరుకు పోతున్న ఉద్యోగులపై యాజమాన్యానికి కనికరం లేదా? ఉద్యోగులు వలస పోతున్న ప్రతిసారీ జీతాలు 50-100-200 రెట్లు పెరుగుతాయని జెమిని స్థానిక యాజమాన్యం పుకార్లు లేవదీస్తోంది. నిజమని నమ్మిన జెమిని ఉద్యోగులు ఇతర ఛానళ్ళలో వచ్చిన అవకాశాల్ని వదులుకొని, చివరకు అంతా మోసమని తెలుసుకొని విచారించటం సర్వ సాధారణమైంది. తాజాగా ఏప్రిల్,మేల్లో జీతాలు డబుల్ అవుతాయని నమ్మ బలుకుతున్నారు. స్థానిక యాజమాన్య వైఫల్యం వల్లే జెమిని సిబ్బందికి జీతాలు పెరగటం లేదని తెలుస్తోంది. పైరవీలకే పరిమితమైన జెమిని స్థానిక యాజమాన్యం ఉద్యోగుల ఆకలి కేకల్ని ' చెన్నై ' దృష్టికి తీసుక పోవటంలో విఫలమవుతున్నారు. వీరికి సన్ సీ.ఎం.డి. కళానిధి మారన్ అపాయింట్మెంట్ దొరకదని జెమిని వర్గాలు చెబుతున్నాయి. లక్షలాది జీతాలు తీసునే స్థానిక జెమిని ఎం.డి., జి.ఎం.లు తమ సిబ్బంది వేతనాల వెతల్ని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు?
దీని అర్థమేమి తిరుమలేశా?

జెమిని నుండి మరో వారం రోజుల్లో 30కి పైగా ఉద్యోగులు ఏసియానెట్ తెలుగు ఛానెళ్ళో చేరి పోతున్నారు. ముంచుకొస్తున్న ముప్పును చూస్తూ కూడా హైదరాబాద్/చెన్నై యాజమాన్యాలు ఎందుకు పట్టించుకోవటం లేదు. స్థానిక యాజమాన్యమే పనిగట్టుకోని వారిని పంపుతోదని అందరికీ తెలుసు. ఎందుకిలా?.. సమాధానానికై చూస్తూనే ఉండండి ఎబౌట్ తెలుగు మీడియా..

ఆ ఒక్క సొసైటీకే ఎందుకు ఇవ్వాలి?

ఇళ్ళ స్థలాల కోసం జర్నలిస్టులు చేస్తున్న ప్రయత్నాల్లో సరి కొత్త నాటకం మొదలైంది. ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న సొసైటీలను కాదని జవహర్ లాల్ నెహ్రు పేరిట వెలిసిన కొందరు పైరవీ కారుల సొసైటీకి స్థలాన్ని ఇస్తుందట. అసలు ఈ సొసైటీకి మాత్రమే ఉన్న ప్రత్యేక అర్హత ఏమిటి? జర్నలిస్టుల నేతలుగా చెలామని అవుతున్న కొందరు పైరవీకారులు ముఖ్యమంత్రిని ప్రభావితం చేసి తాము ఏర్పాటు చేసిన సంకర సొసైటీకి మాత్రమే ఇళ్ళ స్థలాలు దక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఉనికిలో ఉన్న జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీల్లోని సభ్యులంతా తమ సొసైటీల సభ్యత్వాలకు రాజీనామా ఇచ్చి ఈ సంకర సొసైటీలో చేరాలట. దరఖాస్తు ఫారాలు కూడా కొందరికే లిమిటెడ్ గా ఇస్తారట. ఎవరీ వంశీ? ఎవరీ భాస్కర్? ఈ సంకర సొసైటీలో ఎలక్ట్రానిక్ మీడియా హౌసింగ్ సొసైటీ సభ్యుల్ని చేర్పించేందుకు ఇండియా టీవీ శ్రీనివాస్ రెడ్డి , సాబేర్ ఎందుకు తాపత్రయ పడుతున్నారు? కేవలం జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అక్రమార్కులపై కోపంతో మొత్తం జర్నలిస్టుల ప్రయోజనాలకే ఎందుకు ముప్పు తల పెడుతున్నారు? అసలు ముక్యమంత్రిగారు ఈ గోముఖ వ్యాఘ్రాల్ని ఎలా నమ్మారు? ఇప్పటికే ఉన్న జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలను కాదని ఈ సంకర సొసైటీకి ప్రభుత్వం ఏ ప్రాతిపదికన ఇళ్ళ స్తలాలు ఇస్తోంది? రేపు ఎవరినా న్యాయస్థానంలో సవాలు చేస్తే జరగబోయే పరిణామాలకు ఎవరిది బాధ్యత?
తెలంగాణా కోణం
ఇళ్ళ స్థలాల కేటాయింపులో తమకు జరగబోతున్న అన్యాయాన్ని పసిగట్టిన తెలంగాణా జర్నలిస్టులు పోరాటానికి సిద్దం అవుతున్నారు. వీరికి టి.ఆర్.ఎస్. అభయ హస్థం కూడా లభించిందట. హైదరాబాద్లో చాలా ఏళ్ళుగా పని చేస్తున్న తమకు వలస జర్నలిస్టుల కారణంగా పొంచి ఉన్న ముప్పును వీరు పసిగట్టి ఇప్పుడే అప్రమత్తం అయ్యారు.

Friday, February 22, 2008

పారిపోయిన డెస్క్ ఇన్ ఛార్జ్

కనబడుటలేదు
పేరు: జె.రామక్రిష్ణ
వయసు: 55+
ఉద్యోగం: ఇటీవలి దాకా జెమినిలో డెస్క్ ఇన్ ఛార్జ్
ఆనవాలు: జుట్టుకి, మీసాలకి నల్ల రంగు, సోడాబుడ్డి కళ్ళద్దాలు. + లిక్కర్ కంపు
సదరు వ్యక్తి జీతం, అక్రిడేషన్ వచ్చినప్పటి నుండీ గత రెండు నెలలుగా కనబడుట లేదు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తచ్చాడుతుంటాడు. ఆచూకీ తెలిపిన వారికి తగిన బహుమతి ఇవ్వబడును.
అయ్యా రామక్రిష్ణా! మీరు కనబడక మీ ఆప్త మిత్రుడు సతీష్ బాబు బెంగ పెట్టుకున్నా, మేము మాత్రం సంతోషంగా ఉన్నాము. ఇక్కడి పని వత్తిడి, ఛీవాట్లు తట్టుకోలేక ఉద్యోగం వదిలేసి పారిపోయావని మాకు తెలుసు. మీరు ఎక్కడ ఉన్నా తిరిగి రానక్కరలేదు. కానీ మా దగ్గర తీసుకున్న అప్పులు తిప్పి పంపితే అదే పది వేలు. 24 గంటలు మత్తులో ఉండే నీవు 24 గంటల టీవీ ఛానెళ్ళో పని చేయలేవని మాకు తెలుసు. నీవు ఎలాగూ తాగుడు అలవాటు మానలేవని మాకు తెలుసు. ఎక్కడైనా ఉద్యోగం వస్తే ఇకనైనా బుద్దిగా పని చేయి. తోటి ఉద్యోగుల పైన పితూరీలు చెప్పే అలవాటు వదులుకో.
ఇట్లు..
జెమిని జర్నలిస్టులు

Sunday, February 3, 2008

ఇ-మీడియా హౌసింగ్ సొసైటీలో బయటపడుతున్న అక్రమాలు

అందరు ఊహించినట్లే ఎలక్ట్రానిక్ మీడియా హౌసింగ్ సొసైటీలో అక్రమాలు బయటపడ్డాయి. కమిటీ సభ్యులందరి సమక్షంలో పకడ్బందీంగా స్క్రూటినీ జరిపిన తర్వాత జాబితా బయట పెట్టాక పోవడంపై వ్యక్తమైన అనుమానాలను ఎబౌట్ తెలుగు మీడియా గతంలోనే వెలుగులోకి తెచ్చింది. సొసైటీ డైరెక్టర్లు గట్టిగా నిలదీసి తిరుగుబాటు చేసేసరికి విధిలేక శ్రీనివాస్ రెడ్డి, సాబేర్ సమావేశం పెట్టాల్సి వచ్చింది. వీరిద్దరూ ఏకపక్షంగా ముఖ్యమంత్రికి సమర్పించిన జాబితాలో అధనంగా స్క్రూటినీ జరగని కొన్ని పేర్లు ఉండటం గమనించి సభ్యులంతా ఆశ్చర్యపోయారు. స్క్రూటినీలో కేటాయించిన పాయింట్లు, సీనియారిటీని పక్కనపెట్టి జాబితా తయారు చేయటంతో చాలా మంది జర్నలిస్టులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. సభ్యులకు చెప్పకుండా ముఖ్యమంత్రికి జాబితా ఎలా ఇచ్చారు? కో ఆర్డినేషన్ కమిటీతో ఏకపక్షంగా ఎలా ఒప్పందాలను కుదుర్చుకున్నారని అడిగితే శ్రీనివాస్ రెడ్డి, సాబేర్ కుంటిసాకులు చెప్పారట. జరిగిందేదో జరిగిపోయింది, కొత్త జాబితా తయారు చేద్దామని చెప్పిన వీరిద్దరు పెద్దమనుషులు ఇప్పటిదాకా ఆ పని చేయకపోవటంతో అనుమానాలు మరింత తీవ్రమైనాయి. ముఖ్యమంత్రికి ఇచ్చిన జాబితాలో జరిగిన అక్రమాలపై నిలదీసే సభ్యులను బెదిరిస్తున్నారని సమాచారం. సొసైటీలో జరుగుతున్న పరిణామాలను సభ్యులెవరికీ చెప్పకపోవటానికి కారణం ఏమిటి? ఇంతకీ జరిగిన అక్రమాలకు భాధ్యత ఎవరిది? శ్రీనివాస్ రెడ్డిదా? సాబేర్ దా?
జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాల సాధన కోసం వివిధ హౌసింగ్ సొసైటీలతో ఏర్పాటైన కో ఆర్డినేషన్ కమిటీ అసలు ఏ దిశగా పోతోంది. ఇన్ని సంఘాలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడం కష్టం, అందరూ ఒకే సొసైటీగా ఏర్పడి రండి అని ముఖ్యమంత్రి చెప్పగానే గుడ్డిగా తల ఊపి వచ్చారట. ఇప్పటికే ఉన్న సొసైటీలను కాదని కొత్తగా ఏర్పడే సొసైటీకి ఇళ్ళ స్థలాలు ఇవ్వడం ఏలా సాధ్యం? ప్లాటు రాని వాడెవరైనా కోర్టుకెళ్ళితే ఏమవుతుంది ఆలోచించారా?

Sunday, January 27, 2008

ఏమిటీ రాతలు?..

ఇటీవల 'ఎబౌట్ తెలుగు మీడియా' లోని కామెంట్ బాక్సుల్లో వస్తున్న రాతలు ఆశ్చర్యాన్నీ, ఇబ్బందినీ కలిగిస్తున్నాయి. మేమేదో ఎవరికో వత్తాసు పలుకుతున్నట్లు, వారు అందించే సమాచారాన్ని ప్రచురించటం లేదని రాస్తున్నారు? మాకు వస్తున్న సమాచారాన్ని నిర్ధారించుకోకుండా ఎలా ప్రచురించగలం? 'ఎబౌట్ తెలుగు మీడియా' ఎవరికీ వత్తాసు పలకదు. మేం అనవసరంగా ఎవరిపైనా బురద చల్లబోం, అవినీతిపరుల్ని, తోటి జర్నలిటులకు ఇబ్బంది కలిగించే వారిని మాత్రమే ఉతికి ఆరేస్తాం అని గతంలోనే స్పష్టంగా ప్రకటించిన విషయాన్ని ఒకసారి గుర్తుతెచ్చుకోండి. మా వైఖరి అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ మారబోదు. మరో విషయం.. 'ఎబౌట్ తెలుగు మీడియా' కామెంట్ బాక్సుల్లో స్వేచ్చా భావ ప్రకటన ఉండాలని మేం కోరుకుంటున్నాం. అందుకే సాధ్యమైనంత వరకు మేం వాటిని ఎడిట్ చేయటం లేదు. ఈ సదుపాయాన్ని ఆసరాగా తీసుకొని కొందరు అశ్లీల రాతలు, మహిళలను కించపరిచే రాతలు చొప్పిస్తున్నారు. ఈ రాతలకు మేం ఎంతమాత్రం బాధ్యులం కాదు, కామెంట్ బాక్సుల్లో వచ్చేవి వారి వ్యక్తిగతం. 'ఎబౌట్ తెలుగు మీడియా' వాటితో ఏకీభవించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నాం.