అందరు ఊహించినట్లే ఎలక్ట్రానిక్ మీడియా హౌసింగ్ సొసైటీలో అక్రమాలు బయటపడ్డాయి. కమిటీ సభ్యులందరి సమక్షంలో పకడ్బందీంగా స్క్రూటినీ జరిపిన తర్వాత జాబితా బయట పెట్టాక పోవడంపై వ్యక్తమైన అనుమానాలను ఎబౌట్ తెలుగు మీడియా గతంలోనే వెలుగులోకి తెచ్చింది. సొసైటీ డైరెక్టర్లు గట్టిగా నిలదీసి తిరుగుబాటు చేసేసరికి విధిలేక శ్రీనివాస్ రెడ్డి, సాబేర్ సమావేశం పెట్టాల్సి వచ్చింది. వీరిద్దరూ ఏకపక్షంగా ముఖ్యమంత్రికి సమర్పించిన జాబితాలో అధనంగా స్క్రూటినీ జరగని కొన్ని పేర్లు ఉండటం గమనించి సభ్యులంతా ఆశ్చర్యపోయారు. స్క్రూటినీలో కేటాయించిన పాయింట్లు, సీనియారిటీని పక్కనపెట్టి జాబితా తయారు చేయటంతో చాలా మంది జర్నలిస్టులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. సభ్యులకు చెప్పకుండా ముఖ్యమంత్రికి జాబితా ఎలా ఇచ్చారు? కో ఆర్డినేషన్ కమిటీతో ఏకపక్షంగా ఎలా ఒప్పందాలను కుదుర్చుకున్నారని అడిగితే శ్రీనివాస్ రెడ్డి, సాబేర్ కుంటిసాకులు చెప్పారట. జరిగిందేదో జరిగిపోయింది, కొత్త జాబితా తయారు చేద్దామని చెప్పిన వీరిద్దరు పెద్దమనుషులు ఇప్పటిదాకా ఆ పని చేయకపోవటంతో అనుమానాలు మరింత తీవ్రమైనాయి. ముఖ్యమంత్రికి ఇచ్చిన జాబితాలో జరిగిన అక్రమాలపై నిలదీసే సభ్యులను బెదిరిస్తున్నారని సమాచారం. సొసైటీలో జరుగుతున్న పరిణామాలను సభ్యులెవరికీ చెప్పకపోవటానికి కారణం ఏమిటి? ఇంతకీ జరిగిన అక్రమాలకు భాధ్యత ఎవరిది? శ్రీనివాస్ రెడ్డిదా? సాబేర్ దా?
జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాల సాధన కోసం వివిధ హౌసింగ్ సొసైటీలతో ఏర్పాటైన కో ఆర్డినేషన్ కమిటీ అసలు ఏ దిశగా పోతోంది. ఇన్ని సంఘాలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడం కష్టం, అందరూ ఒకే సొసైటీగా ఏర్పడి రండి అని ముఖ్యమంత్రి చెప్పగానే గుడ్డిగా తల ఊపి వచ్చారట. ఇప్పటికే ఉన్న సొసైటీలను కాదని కొత్తగా ఏర్పడే సొసైటీకి ఇళ్ళ స్థలాలు ఇవ్వడం ఏలా సాధ్యం? ప్లాటు రాని వాడెవరైనా కోర్టుకెళ్ళితే ఏమవుతుంది ఆలోచించారా?