Friday, January 23, 2009

అక్రిడిటేషన్ కార్డులు లాక్కున్న జెమిని

అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు.. ఇలా ఉందండీ జెమిని టీవీ యాజమాన్యం వైఖరి. 2009 సంవత్సరానికి గాను తమ రిపోర్టర్లకు, కెమెరామెన్లకు జారీ అయిన అక్రిడిటేషన్ కార్డుల్ని యాజమాన్యం లాగేసుకుంది. తమ సిబ్బంది అక్రిడిటేషన్లు తీసుకొని చానెల్ వదిలిపోతారని భయమట.. ( అవునులెండి చెత్త జీతాలకు అక్కడ ఎవరు పని చేస్తారు?) యాజమాన్య షాడిస్ట్ వైఖరి కెమెరామెన్లకు ఇబ్బందిగా మారింది. జెమినిలో పని చేసే కెమెరామెన్లకు వచ్చే జీతంలో సగానికి పైగా బస్ చార్జీలకే సరిపోతుంది. తక్కువ జీతాలకు సిటీలో ఇళ్ళు దొరకక దూర గ్రామాలనుండి వచ్చే వారికి బస్ చార్జీలకు మరీ ఇబ్బందిగా ఉంది. అక్రిడిటేషన్లు మేనేజిమెంట్ లాగేసుకోవడంతో ఆర్టీసీ జారీ ఉచిత బస్ పాస్ సౌకర్యానికి నోచుకోలేక పోతున్నారు. సమాచార శాఖ మీడియా సిబ్బందికి జారీ చేసే అక్రిడిటేషన్లు యాజమాన్యం లాగేసుకోవడమేమిటి? పోనీ కనీసం బస్ ఛార్జీలైనా వారికి ఇప్పించండి. ఈ పరిస్థితికి నగేష్ అనే ప్రొడ్యూసర్ కారణమట. ప్రస్తుతం మన ATM జెమినిలో నగేష్ గారు చేస్తున్న ఘన కార్యాల్ని వెలికి తీసే పనిలో ఉంది. చూస్తూనే ఉండండి ఎబౌట్ తెలుగు మీడియా..

Sunday, January 11, 2009

' స్టూడియో-ఎన్ ' లో దళారీలు (updated)

భారీ ఎత్తున దూసుకు వస్తున్నట్లుగా ప్రచారం జరుగుతున్న ' స్టూడియో-ఎన్ ' న్యూస్ చానెల్లో అసలేం జరుగుతోందని మీడియా సోదరులందరూ ప్రశ్నించుకుంటున్నారు. ఈ ఛానెల్ న్యూస్ హెడ్ శివరామ ప్రసాద్ అధికారాలకు యాజమాన్యం కత్తెర పెట్టినట్లు తెలుస్తోంది. బహుషా ఆయన బయటకు వెళ్ళ వచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. సీటీవీకి చెందిన అంజయ్య, జయప్రసాద్ ల బ్యాచ్ స్టూడియో-ఎన్ లో చేరారని తెలియగానే ఇక ఈ చానెల్ పని అయిపోయిన్నట్లే అనే వ్యాఖ్యానాలు మీడియాలో వినిపిస్తున్నాయి. దళారీ పనుల్లో నిష్ణాతులైన సీటీవీ బ్యాచ్ ను నార్నె యాజమాన్యం ఎలా నమ్మినట్లు? అసలు వీరి గురించి సరిగ్గా విచారించే తీసుకున్నారా? అంజయ్య దళం స్టూడియో-ఎన్లో చేరటంతో ఇప్పటి వరకూ ఈ చానెల్లో చేరదామని ప్రయత్నించిన సీనియర్ జర్నలిస్టులు తమ ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పెట్టుకున్నారు. నగరానికి దూరంగా మనికొండలో ఉన్న ఈ చానెల్లో చేరితే ప్రయాణానికే రోజంతా పడితుంది. పైగా జీతాలు కూడా అతి తక్కువగా ఆఫర్ చేస్తునారు. ఈ గొడ్డు చాకిరి ఎవరు పడతారని సీనియర్లు స్టూడియో-ఎన్ కు దూరంగా ఉంటున్నారు. అంజయ్య దళం సీటీవీలోని ఉన్న సాబేర్ తదితర అనుయాయుల్ని, ఎలక్టానిక్ మీడియా ఓనమాలు తెలియని ప్రింట్ మిత్రుల్ని స్టూడియో-ఎన్ లో దింపే ప్రయత్నాల్లో ఉంది.

సాక్షి రావడం ఖాయం!

సాక్షి చానెల్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, జరుగుతున్న ప్రచారం చూసిన వారు అసలు ఈ ఛానెల్ ఇప్పట్లో వస్తుందా అని అనుమానం వ్యక్తం చేశారు. ఛానెల్ పెద్ద తలలైన శాస్త్రి, శ్రీనివాస్ రెడ్డి ల రాజీనామాలు పెద్ద దుమారాన్నే రేపాయి. తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి రెండో వారంలో సాక్షి చానెల్ ప్రసారాలకు ముహూర్తం ఖరారైంది. దిన పత్రిక తరహాలోనే ప్రస్తుత పెద్ద చానెళ్ళకు సాక్షి టీవీ గట్టి సవాలే విసరటం ఖాయం. అయితే సాక్షిలో పైరవీలతో చేరిన జర్నలిస్టులకే పెద్ద పీట వేశారన్నది కాదనలేని నిజం. దీని వల్ల ప్రతిభ ఉన్న జర్నలిస్టులకు చాలా అన్యాయం జరిగిపోయింది. ఈ లోపాన్ని సాక్షి యాజమాన్యం సవరించుకుంటుందా?.. చూద్దాం..

'ఆర్కె 'తో మరింత దెబ్బతిన్న జెమిని న్యూస్

జెమిని న్యూస్ లో కొన్ని బులిటిన్లు లీజుకు తీసుకున్న ఆర్.కె. ప్రొడక్షన్స్ దారుణంగా చతికిల పడింది. వీరు ప్రసారం చేస్తున్న నాసిరకం బులిటిన్లు చూసి జెమిని-సన్ మేనేజిమెంట్ తల పట్టుకుంతోంది. లీజు వల్ల సంస్థకు ఆదాయం సంగతేంటో కానే జెమిని న్యూస్ మరింత అద్వాన్నంగా తయారైంది. లేజుకు తీసుకున్న బులిటిన్లు కూడా సక్రమంగా ప్రసారం చేయడంలో ఆర్.కె. ప్రొడక్షన్స్ విఫలమైందని జెమిని వర్గాలు చెబుతున్నాయి. ఆర్.కె.వారు రోజుకి 16 బులిటిన్లు ఇవాల్సి ఉండగా 6,7కి మించి ఇవ్వడం లేదు( అవీ కూడా చాలా లేటుగా. మరో వైపు జెమిని న్యూస్ మొత్తాన్ని తాము కొనేసినట్లు ఆర్.కె.ప్రొడక్షన్స్ తప్పుడు ప్రచారం చేసుకుంటోంది. ఆర్.కె.తో జెమిని యాజమాన్యానికి కుదిరిన ఒప్పందం గడువు 3 నెలలకే. ఎన్నికల్లోపు అందినంత దండుకొని ఆర్.కె. ప్రొడక్షన్స్ బయట పడొచ్చేమో కానీ పోయిన ప్రతిష్టను జెమిని ఎవరు తెచ్చివ్వగలరూ?. ఇప్పటికే ఆర్.కె.వారు చేస్తున్న అరాచకాలు కథలు కథలుగా వినిపిస్తున్నాయి.

ఆర్-టీవీ ఎక్కడ?

సైలెంట్ గా ప్రారంభమైన ఆర్-టీవీ ఎక్కడా కనిపించడం లేదు. బస్సులపై ఆర్-టీవీ ప్రకటనలు చూసిన ప్రేక్షకులు తమ టీవీల రిమోట్లకు ఎంత పని చెప్పినా ఈ చానెల్ దొరకడం లేదు. మార్కెటిం ప్రమోషన్లో ఆర్-టీవీ విఫలమైంది. ఎం.ఎస్.ఓ.లు అడిగిన క్యారింగ్ చార్జీలు కట్టలేక పోవడంతో వారు ఈ చానెల్ను ప్రసారం చేయడం లేదు. ఆర్-టీవీ వర్గాల కథనం ప్రకారం ఈ చానెల్లో సరైన ప్రొఫెష్నల్స్ లేరు. తక్కువ జీతాలు, ఎక్కువ పని వేళల కారణంగా నైపుణ్యం ఉన్న సిబ్బంది ఎవరూ ఇందులో చేరటానికి రాలేదు. తక్కువ ఖర్చు, సిబ్బందితో బండి లాగించాలన్న రాయుడిగారి ఫిలాసఫీ దెబ్బతిన్నది. ఈ చానెల్లో ప్రసారం అవుతున్న ప్రోగ్రాంస్ కూడా నాసిరకంగా ఉన్నాయట.

నిరాశ పరచిన హెచ్.ఎం.టి.వి., ఐ-న్యూస్

చిరకాలంగా ఇప్పుడూ.. అప్పుడూ.. అంటూ ఊరిస్తూ వచ్చిన హెచ్.ఎం.టి.వి., ఐ-న్యూస్ చానెళ్ళు జనవరి ఒకటో తేదీన ప్రారంభం అయ్యాయి. ( టెస్ట్ సిగ్నల్ పేరిట) ఎక్కడా ప్రకటన కూడా ఇవ్వనందున ప్రేక్షకులకు తెలియలేదు. ఈ రెండు చానెళ్ళూ బహుషా జెమిని న్యూస్ కి పోటీ ఇవ్వ వచ్చేమో కానీ ఈటీవీ2, టీవీ9, టీవీ5, ఎన్-టీవీ న్యూస్ చానెళ్ళకు ఏ మాత్రం పోటీ కాదని తేలిపోయింది. హెచ్.ఎం.టి.వి. గ్రాఫిక్స్ అయితే మరీ పేలవంగా ఉన్నాయి. డాక్యుమెంటరీ చిత్రాన్ని చూస్తున్నట్లుగా ఉంది. ఐ-న్యూస్ ప్రోమో బాగుంది. మరికొంత కృషి పెడితే ఈ చానెల్ ప్రధాన చానెళ్ళకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.