Wednesday, June 17, 2009

మా న్యూస్ మూత.. అదే దారిలో లోకల్..

న్యూస్ చానెళ్లకు కష్ట కాలం వచ్చిందని భావిస్తున్న తరుణంలో ఎంటర్టైన్మెంట్ ఛానెళ్ళు కూడా న్యూస్ ను వదిలించుకోవడం జర్నలిస్టులకు ఇబ్బందికరంగా మారింది. ఏసియానెట్ సితార ఛానెల్ న్యూస్ ప్రారంభించకుండానే నమ్మి చేరిన జర్నలిస్టులను సాగనంపిన ఉదంతం మరువకముందే మా టీవీ ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 తేదీ నుండి మాటీవీ న్యూస్ బులిటిన్లను నిలిపేస్తోంది. తమ జర్నలిస్టులందరికీ రెండు నెలల అడ్వాన్స్ జీతాలిచ్చి వదిలించుకుంది. ఫలితంగా మా టీవీ జర్నలిస్టులంతా రోడ్డు పాలయ్యారు. మా టీవీ యజమానులైన చిరంజీవి, నాగార్జున, మురళీకృష్ణం రాజు భిన్న రాజకీయ వైఖరులతో పరస్పరం ఘర్షణ పడుతూ, చివరకు ' న్యూస్ ' కు మంగళం పాడారని తెలుస్తోంది. ఇకపై మా టీవీ కేవలం వినోద ప్రధనమైన చానెల్ గానే కొన సాగుతుంది. న్యూస్ సిబ్బందిని పంపడం ఇష్టం లేక విధిలేని వరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్న మురళీకృష్ణం రాజు కంట తడి పెట్టారని ' మా ' సిబ్బంది చెబుతున్నారు. మరో వైపు లోకల్ టీవీ కూడా వార్తా ప్రసారాలను నిలిపి వేయాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఫలితంగా అక్కడి జర్నలిస్ట్ మిత్రులుకూడా రోడ్డు పాలయ్యే దుస్థితి ఏర్పడింది. స్టూడియో-ఎన్ చానెల్లో జర్నలిస్టుల జీతాలు తగ్గించడం మరో షాక్..

తగ్గిన ఈనాడు,ఆంధ్రజ్యోతి

రోజులు మనవికానప్పుడు అనుకువగా ఒదిగి ఉండడమే మేలని మన పెద్దలు చెబుతుంటారు. ప్రస్తుతం ఈనాడు, ఆంధ్రజ్యోతి దీన్ని చక్కగా ఆచరిస్తున్నట్లు కనిపిస్తోంది. మహాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని, చంద్రబాబు ముఖ్యమంత్రికావదం తధ్యమని గంపెడాశలు పెట్టుకున్న ఈ రెండు పత్రికలకి ప్రస్తుతం రోజులు బాగా లేవు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై గతంలో మాదిరి దూకుడుగా బ్యానర్లు పెట్టి రాయకుండా సమ్యమణం పాటించడమే మేలని ఈనాడు, ఆంధ్రజ్యోతి భావిస్తున్నాయట. వీలైతే ప్రభుత్వాన్ని అవసరైనప్పుడల్లా పొగడ్తలతో ముంచెత్తడానికైనా వెనుకాడరాదని నిర్ణయించాయట. తెలుగుదేశంతో ఉన్న సంబంధ బాంధవ్యాల కారణంగా ఇప్పడికే ఉండవల్లి భారిన పడి మూడు చెరువుల నీరు తాగిన రామోజీరావు ఇక పోరాడే స్థితిలో లేరట?.. ఇక తన వంతేమోనని రాధాకృష్ణ హడలిపోతున్నారట?..

' సాక్షి ' అధికార దర్పం

ముఖ్యమంత్రిగా రెండోసారి రాజశేఖర రెడ్డి అధికారం చేపట్టాక ఆయన కుటుంబానికి చెందిన సక్షి టీవీ, దిన పత్రికలకు ప్రభుత్వంలో రాచ మర్యాదలు లభిస్తున్నాయి. ఇతర మీడియా ప్రతినిధులకు ఇది కంటగింపుగా మారిది. అధికారులు సాక్షి సిబ్బందికి ప్రాధాన్యత ఇస్తూఅ మిగతా మీడియా సిబ్బందిని చిన్న చూపు చూస్తున్నారు. సచివాలయంలోని ముఖ్యమంత్రి చాంబర్లోకి సాక్షికి తప్ప ఇతర మీడియాకు ప్రవేశం లేదు. అలాగే ముఖ్యమంత్రి కాన్వాయిలో నిబంధనలకు సాక్షి కెమెరామెన్ ను ప్రత్యేకంగా తీసుకెళ్ళుతున్నారు. ఇటీవల అసెంబ్లీలోని సమావేశమందిరంలోకి స్పీకర్ ఎన్నిక సందర్భంగా సాక్షి కెమెరామెన్ ను తప్ప ఇతరులను అనుమతించ లేదు. ఏమిటీ వివక్ష అని ఇతర మీడియా సిబ్బంది గొంతు చించుకుంటున్నా ఫలితం కనిపించడంలేదు.

అసెంబ్లీలో టీవీ ఛానెళ్ళపై ఆంక్షలు

రాష్ట్రంలో తిరిగి అధికారానికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెట్టించిన ఉత్సాహంతో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంతోంది. అసెంబ్లీలో మీడియాకి ముక్కుతాడు వేయాలన్నది ఇందులో ఒక నిర్ణయం. ముఖ్యంగా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన టీవీ చానెళ్ళ హడావుడి అసెంబ్లీకి ఇబ్బంది కరంగా మారింది. ఉలక్ట్రానిక్ మీడియా వారు స్వీయ క్రమ శిక్షణ పాటించకుండా ఎక్కడ పడితే అక్కడ మైకులు పెట్టి, గుంపుగా కెమరాలతో మీద పడుతూ చిరాకు కలిగిస్తున్నారట. మీడియాలు నియంత్రించడమే ఇందుకు ఏకైక పరిష్కారమని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా మీడియా పాసులకు కోత పెట్టడంతో పాటు, వీరందరినీ పబ్లిక్ గార్డెన్ కు పరిమితం చేయాలని నిర్ణయించారని ప్రచారం జరుగుతోంది. ఈ నిర్ణయం జర్నలిస్టులకే కాకుండా నేతాజీలకు కూడా ఇబ్బందికరమే.. గొట్టాల ముందు వాగందే వారికి పూఅట గడవదు కదా?..

పాపం రజనీ

ఎలక్ట్రానిక్ మీడియాలో 'సాలరీ బూం' రివర్స్ కావడతో జర్నలిస్టులకు తిరికి కష్టకాలం మొదలైంది. పెద్ద జీతగాళ్ళకు యాజమాన్యాలు కోత పెడుతున్నాయి. చిన్నజీతగాళ్ళని తరిమేస్తున్నాయి. సాలరీ ఎక్కువ ఇస్తున్నారనే ఆశతో 'మహా టీవీ'లో చేరిన రజనీ కాంత్ మున్నాళ్ళ మురిపెం పూర్తి చేసుకొని సొంత గూటికి రాక తప్ప లేదు. మహా టీవీ వారు జీతం తగ్గించటంతో చిన్నబుచ్చుకున్న రజని ఆ చానెల్ కి గుడ్ బై చెప్పేశారు. టీవీ9లో తిరిగి చేరిపోయారు. బుల్లి తెరపై రవిప్రకాష్ తర్వాత అంతటివాడిగా రజనీకాంత్ పేరు తెచ్చుకున్నాడు కాబట్టి టీవీ9కైనా మరెక్కడికైనా పోగలడు. కానీ మురళీ కృష్ణ, జకీర్ లకు టీవీ9 తప్ప వేరే గత్యంతరం లేదు. రజనీ తిరిగి రాక వీరికి రుచించడం లేదట. పాపం

Monday, June 1, 2009

ఉద్యోగాలు ఊడుతున్నా పట్టని ఎలక్ట్రానిక్ మీడియా సంఘం

మార్కెట్లో నెలకొన్న సంక్షోభం సాకుతో ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యాలు తమ సిబ్బందిలో కోత పెడుతున్నాయి. ఫలితంగా ఇప్పటికే చాలా మంది జర్నలిస్టులు రోడ్డు పాలయ్యాయి. జర్నలిస్టుల ఉద్యోగాలు ఊడుతున్నా తనకేమి పట్టనట్లు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం వ్యవహరిస్తోంది. ఈ సంఘం నేతాశ్రీలు ఎవరైనా జర్నలిస్టును కొట్టినప్పుడు నామమాత్రపు ఆందోళనలు జరిపి మీడియాలో తమ ముఖాలు, పేర్లు చూసుకోవడం తప్ప మిగతా సమయంలో కుంభకర్ణ నిద్ర నటిస్తున్నారు. వీరి దృష్టిలో జర్నలిస్టుల సంక్షేమం అంటే ఇంత వరకే. అన్యాయంగా ఉద్యోగాలు ఊడగొడుతున్న యాజమాన్యాలను ప్రశ్నించే ధైర్యం ఈ జర్నలిస్ట్ నేతలకు లేదు. పైరవీలకు మాత్రం ముందుంటారు. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘానికి ఏళ్ళ తరబడి ఎన్నికలు జరగనే లేదు. ఇంత వరకూ సభ్యత్వమే పూర్తికాలేదు. సభ్యులు లేకున్న కొనసాగుతున్న ఈ సంఘం కొద్ది మంది జర్నలిస్ట్ ప్రముఖుల కనుసన్నల్లో మెలుగుతోంది. ఇప్పటికైనా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘాన్ని క్రియాశీలకం చేయాల్సిన అవసరం ఉంది. తక్షణం సంఘానికి ఎన్నికలు జరపాలి

జెమినిని అడ్డు పెట్టుకొని ఎన్నికల్లో దండుకున్న ఆర్కె

జెమిని న్యూస్ కు పట్టిన ఆర్.జె.ప్రొడక్షన్స్ చీడ ఇప్పట్లో తొలిగేలా లేదు. ప్రతి నెల ' ఆర్కె ' కాంట్రాక్ట్ కాల పరిమితి పెంచుతూ పోవడం జెమిని ఉద్యోగులకు అసంతృప్తిని కలిగిస్తోంది. ఆర్.కె. ప్రొడక్షన్స్ వారు ' జెమిని న్యూస్ 'లో కొన్ని బులిటన్లు స్లాట్ల రూపంలో తీసుకున్నాక ఆ చానెల్ ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయింది. ఆలస్యంగా వచ్చే నాసిరకం వార్తలు, మొరటు యాంకర్లతో వచ్చే ఆర్కె బులటిన్ల కారణంగా జెమిని న్యూస్ ను చూసే వీక్షకులు మరింతగా తగ్గిపోయారు. ఇటీవలి ఎన్నికల్లో జెమిని పేరు చెప్పుకొని ' ఆర్కే ప్రొడక్షన్స్ ' చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. వార్తల సంగతి దేవుడెరుగు ఒక్కో అభ్యర్థి దగ్గర లక్షలాది రూపాయలను వసూలు చేశారట. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే తరహా పిర్యాదులు. ' సూర్యుడి గుర్తు ' లోగో మైకులు పట్టుకొని జెమిని పేరు చెప్పుకొని తిరిగే ' ఆర్కె ' సిబ్బంది అడ్డగోలు వసూల్లతో రాజకీయ నాయకులు, వ్యాపారులు హడలిపోతున్నారు. ఇంత జరుగుతున్నా ' సన్ నెట్ వర్క్ ' యాజమాన్యం తమకేమీ పట్టనట్లు కుంభకర్ణుడి నిద్ర నటిస్తోంది. ఆర్కె ప్రొడక్షన్స్ వారు వారు ఇచ్చే ముడుపులు లెక్కించుకోవడంలో బిజీగా ఉన్న చెన్నై లోని సన్ గ్రూప్ ఉన్నతాధికారులకు హైదరాబాద్ లో ఏమి జరుగుతోందో తెలుసుకునే తీరిక దొరకడంలేదు. జెమిని ప్రతిష్ట ఏమైతె వారికేం.. తమ జేబులు నిండితే చాలు.. ఈ విషయాలేవీ ' సన్ గ్రూప్ ' అధిపతులైన మారన్ సోదరులకు తెలుస్తున్నట్లు లేదు..

'ఎ టీవీ'.. ఇదేం టీవీ..

టీవీ తెరలపై ఎక్కడా కనిపించకున్నా ఫీల్డులో 'ఎ టీవీ' పేరిట లోగో మైకులు కనిపిస్తున్నాయి. సాప్ట్ వేర్, పార్మా, రియాలిటీ, గ్రానైట్, సినీ వ్యాపారాలు చేసే అడ్వాన్సాఫ్ట్ అనే అమెరికన్ కంపెనీ 'ఎ టీవీ' పేరిట ఈ చానెల్ పెట్టిందట. ఈ చనెల్ వార్తల విభాగానికి చందు జనార్ధన్ (ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉందా.. మన పాత ధనార్జనుడే లెండి) బాస్ అట. ఆయనకు తగట్టే ఇక్కడ మిడిమిడి నాలెడ్జ్ జర్నలిస్టులు ఇక్కడ చేరారు. తెలివైన వారిని చేర్చుకుంటే తన పదవికి ఎసరు పెడతారని జనార్ధన్ భయమట. 'ఎ టీవీ' జర్నలిస్టుల జీతా సైతం అత్తెసరుగా ఉన్నాయి. ఇక జిల్లా రిపోర్టర్లకు జీతాలు ఇవ్వరట వారే యాడ్స్ తెచ్చి కంపనీకి డబ్బు జమ చేయాలట. మీడియాలో ఎక్కడా నిలకడ ఉండని అసమర్ధ ధనార్జన్ని ఎ టీవీ ఎలా నమ్మి తీసుకుందో మరి. పిండి కొద్దీ రొట్టె అన్నట్లు, 'ఎ టీవీ' వార్తల్లో క్వాలిటీ ఆశించడం హాస్యాస్పదమే కదా..

సాక్షి జర్నలిస్టుల పంట పండింది

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు తమ చైర్మన్ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కడప పార్లమెంట్ సభుడిగా భారీ మెజారిటీతో గెలవడం సాక్షి పత్రిక, సాక్షి టీవీ జర్నలిస్టులకు నూతనోత్సాహాన్ని ఇచ్చింది. తెలుగుదేశం గెలిస్తే తమ మీడియాకు ఇబ్బందులు తప్పవని భయపడ్డ సాక్షి జర్నలిస్టులంతా త భవిష్యత్తుపై ఇప్పుడు ధీమాతో ఉన్నారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆనందంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి సాక్షి సిబ్బందికి జీతాలు పెంచే ఉద్దేశ్యంతో ఉన్నారని చెబుతున్నారు. అలాగే సీనియర్లందరికీ కార్లు, టూ వీలర్లు ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎన్నిక తర్వాత సిబ్బందిని తగ్గించే ప్రణాళిక తయారు చేసిన సాక్షి యాజమాన్యం ఆ ప్రతిపాదనను అటకెక్కించిందట. పాపం ఇతర పత్రికలు, టీవీల జర్నలిస్టులు. వీరెవరికి ఈసారి జీతాలు పెరగక పోగా, కొందరికి కోత పడిందట. ఎంతైనా సాక్షి జర్నలిస్టులది పూర్వజన్మ సుకృతం..

ఎన్నికల ఫలితాలపై మీడియా హాపీ

ఈమధ్యే ముగిసిన ఎన్నికల ఫలితాలు మీడియా సోదరులకు ఆనందాన్ని కలిగించాయి. మేనేజిమెంట్ల వైఖరి ఎలా ఉన్నా కాంగ్రెస్ గెలుపుపై జర్నలిస్టులంతా దాదాపుగా ఆనందంగానే ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, సెక్రెటేరియట్ బీట రిపోర్టర్లకు ఇంకా హాపీ. గత ఎన్నికల్లో అధికారం చేపట్టిన వెంటనే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జర్నలిస్టులకు హెల్త్ ఇన్స్యూరెన్స్, ఆరోగ్య శ్రీ ఫథకాలు అమలు చేయటమే కాకుండా ఇండ్ల స్థలాలను ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మరోసారి అధికారం చేపట్టిన వైఎస్ మరిన్ని మేళ్ళు చేస్తాడని జర్నలిస్టులు భావిస్తున్నారు. చంద్రబాబు మీడియా మేనేజిమెంట్లకు మాత్రమే లబ్ది చేకూరిస్తే, వైఎస్ జర్నలిస్టుల పక్షపాతి అని అంటారు. విచిత్రంగా తెలుగుదేశం బీట్ జర్నలిస్టులు సైతం మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ గెలవడం పై ఆనందంగా ఉన్నారు. తాను అధికారానికి వస్తే ఇళ్ళస్థలాలు ఇస్తానని ఆయన చెప్పిన మాటల్ని వెవరూ నమ్మలేదు. టిడిపి ఓటమి మీడియాలో ఒక వర్గానికి మాత్రమే విచారాన్ని కలిగించింది.