Sunday, October 12, 2008

బాధ్యత లేని ఛానెళ్ళు

సమాజ సంక్షేమంపై తమకే గుత్తాధిపత్యం ఉన్నట్లు గొప్పలు చెప్పుకునే కొన్ని ఛానెళ్ళు బాధ్యతా రహితంగా వ్యవహరిస్తూ ఏవగింపు కలిగిస్తున్నాయి. వ్యవస్థలు కుప్పకూలేలా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. రేటింగుల్లో అగ్రస్థానం కోసం నీచానికి దిగజారుతున్నాయి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం అవాస్థవాలను ప్రసారం చేస్తున్నాయి. ఇక్కడ ఆ ఛానెళ్ళ పేర్లను మేం ప్రస్థావించడం లేదు. అయినా కొన్ని ఉదాహరణలను ఇస్తున్నాం. వారెవరో మీకే అర్థం అవుతుంది.
ఇటీవల ప్రముఖ బ్యాంక్ కష్టాల్లో ఉన్నట్లు వచ్చిన నిరాధార వార్త ఖాతాదారుల్ని భయ పెట్టింది. ఆ బ్యాంక్ ఏటీఎంల ముందు పెద్ద సంఖ్యలో ఖాతా దారులు బారులు తీరడంతో నిమిషాల్లో డబ్బు ఖాళీ అయింది. ప్రజలు దాడులు జరిపి బ్యాంక్ ఆస్థులకు నష్టం కలిగించారు.

ఎక్కడో బర్డ్ ఫ్లూ వస్తే దాన్ని ఆంధ్ర రాష్ట్రానికి ఆపాదించడంతో ఫౌల్ట్రీ పరిశ్రమ కుప్పకూలింది. ఆ తర్వాత ముడుపులు తీసుకొని పాజిటివ్ వార్తలు ఇచ్చారట.

ఒంగోలులో ఒక వ్యక్తి కలేక్టరేట్లో విషం తాగి ఆత్మ హత్య చేసుకుంటుంటే అతడు చచ్చే దాక చిత్రీకరించిన ఛానెళ్ళ ప్రతినిధులు కనీసం ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయలేదు.

ఒక మాజీ శాసన సభ్యుడు హైదరాబాద్ వచ్చి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కునుకు తీస్తే అతడు మరణించాడనే వార్త ప్రసారం చేసి ఖంగారు పెట్టారు.

వ్యక్తిగత విషయాలను కూడా సంచలన వార్తలుగా ప్రసారం చేస్తున్న కొన్ని ఛానెళ్ళు మున్ముందు శోభనాల్నీ వదవలవేమో. ఇలాంటి వార్తకు ఆగ్రహించిన ఒక సినీ నటుడు ఓ ఛానెల్ ఆఫీసుకు వెళ్ళి అక్కడి ఉన్నత ఉద్యోగిని ఒక్కటి పీకి వచ్చాడట.

భార్య కూరలో ఉప్పు ఎక్కువేసిందని అలిగి టవరెక్కే వెధవాయిలకు కూడ లైవ్ కవరేజి ఇచ్చే రోజులు రాబోతున్నాయి.