Sunday, October 26, 2008

ఆయన బిజినెస్ మూడు పూవులు.. ఆరు కాయలు..

అనగనగా ఒక న్యూస్ ఛానెల్.. దానికో బిజినెస్ రిపోర్టర్.. ఛానెల్ సంగతి ఎలా ఉన్నా చాలా ఏళ్ళుగా సదరు రిపోర్టర్ ఫీల్డ్ లో హవా నడిపిస్తున్నాడు. ఈయన గారి స్టైలే వేరు . ఈ పొట్టి రిపోర్టర్ వెంట ఒక పొడుగాటి కెమెరామెన్ గన్ మెన్ లా ఎల్లవేళలా కనిపిస్తుంటాడు. బిజినెస్ రిపోర్టింగ్లో సీనియర్ అయిన ఈయన పేరు చెబితే ఈవెంట్ మేనేజర్లకు హడల్ అట. నిజాయితీని చూసి కాదు సుమా.. గిఫ్టులు, డబ్బు కొసం తెగ సతాయిస్తాడట. ఇతగాడు మైక్ పెట్టి బైట్ తీస్కొని పక్కకు వెళ్ళగానే లంబు కెమెరామెన్ అయ్యగారి పేరు చెప్పి ఎంతో కొంత లాగుతాడట. పొట్టాయన-పొడుగాయన ప్రెస్ మీట్లకు పోయారంటే అక్కడ ఉండే చాక్లెట్లు, పెన్నులు, పెన్సిళ్ళ దగ్గర నుంచీ అంతా ఊడ్చుకు వచ్చేస్తారట. సదరు బిజినెస్ రిపోర్టర్ ప్రెస్ మీట్లకు తన కుటుంబ సభ్యులను కూడా తరచూ తీసుకెళతాడట. వారికి గిఫ్టులు అదనం అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదనుకుంటా. ఈ సీనియర్ బిజినెస్ రిపోర్టర్ జీతం తక్కువే అయినా గీతం ఎంతలేదన్నా రోజుకి రూ.10,000/- పై మాటే అని తోటి బిజినెస్ రిపోర్టర్లు అంటున్నారు. అందుకే మన వాడు ఇతర చానెళ్ళకు వెళ్ళకుండా అక్కడే కొనసాగుతున్నాడట. నగరంలో జరిగే స్పెషల్ ఈవెంట్లు, న్యూ ఇయర్ పార్టీలకు వచ్చే కాంప్లిమెంటరీ పాసులను సైతం సదరు లంబు కెమెరామెన్ తో అమ్మించి సొమ్ము చేసుకుంటాడట. బిజినెస్ తో పాటు సిటీ ఈవెంట్స్ ప్రోగ్రాంకి కూడా ఇతడే ఇంచార్జ్. ఈయన ఏది ఇచ్చినా సదరు చానెల్లో ఎడిటింగ్ లేకుండా నేరుగా ప్రసారం అవుతాయి. తన బంధు మిత్రుల ఫంక్షన్లను సైతం ఏదో ఒక రూపంలో ప్రసారం చేసుకుంతాడు. అడిగే దైర్యం ఎవరికీ లేదు. సదరు చానెల్ పెద్దల ఐటీ వ్యవహారాలను చక్కపెడతాడు కాబట్టే ఇంత హవా అట. దీపావళి, న్యూ ఇయర్ వచ్చాయంటే మనోడికి గిఫ్టులే గిఫ్టులు. గత సంవత్సరం సదరు చానెల్ ఆఫీసుకు భారీగా వచ్చిన స్వీట్లు, డ్రైఫ్రూట్ బాక్సులు, కానుకల్ని ఇంటికి తీసుకెళ్ళేందుకు ఆటో ట్రాలీ మాట్లాడుకున్నాడని అక్కడి డ్రైవర్లు చెవులు కొరుక్కుంటున్నారు. మరి ఈ దీపావళికి?.. ఈ రిపోర్టర్, కెమెరామెన్ తమకు వచ్చే గిఫ్ట్లులను సదరు చానెల్ ఆఫీసు సమీపంలోని బత్తాయి బండివాడి దగ్గర దాచుకుంటారట. మార్కెట్ సెన్సెక్స్ సూచీ రోజు రోజుకీ పడిపోతుంటే, మనోడి ఆదాయ సూచీ దిన దిన ప్రవర్తమానంగా పైకి పోతోందిట.