Monday, November 3, 2008

దిన పత్రికలా?.. కర పత్రలా?..

తెలుగు దిన పత్రికల్లో మునుపెన్నడూ లేని కొత్త సాంప్రదాయం గత కొద్ది నెలలుగా కనిపిస్తోంది. అదే జాకెట్ ఆడ్స్. గతంలో ప్రకటనల విష్యంలో మన దిన పత్రికలు కొన్ని విలువలను, నియంత్రణల్ని పాటించేవి. తొలి పేజీలో ఇయర్ పానల్స్ తో పాటు కుడి వైపు దిగువ ప్రాంతంలో పావు పేజీకి మించి ప్రకటనలు స్వీకరించేవి కాదు (ముఖ్యంగా ఈనాడు). ఆ తర్వాత తొలి పేజీలో అర పేజీ ప్రకటనలు ప్రారంభం అయ్యాయి. అనంతర కాలంలో మార్కెట్ వర్గాల వత్తిడి కారణంగా ఇంటర్నేషనల్ ఫార్మెట్ పేరిట దిన పత్రికల సైజు తగ్గినంది. తొలి పుట నిండా ఒకే ప్రకటన ఇచ్చే ధోరణి మొదలైంది. దీన్నే జాకెట్ యాడ్ అంటున్నారు. మన దేశంలో ఈ సాంప్రదాయానికి బహుషా టైంస్ ఆఫ్ ఇండియా ఈ దుష్ట సాంప్రదాయాన్ని ప్రారంభించిందని చెబుతారు. తేరగా డబ్బు వస్తుంటే ఎవరు మాత్రం మడిగట్టుకు కూర్చుంటారు?. ప్రస్తుతం మరో కొత్త ధోరణి తెలుగు దిన పత్రికల్లో ప్రారంభమైంది. ప్రభుత్వం తొలి పేజీలో బ్యానర్ వార్త స్థానంలో అచ్చం వార్త లాగే ప్రకటనలు ఇవ్వడం ప్రారంభించింది. ఫలితంగా ఏది వార్తో, ఏది ప్రకటనో పాఠకులు పోల్చుకోలేక పోతున్నారు. చంద్రబాబో, చిరంజీవో ఒక భారీ సభ పెడితే తొలి పుటలో హెడ్ లైన్ వార్తగా రావడం సహజం. అయితే ప్రభుత్వం పత్రికలకు జాకెట్ ఆడ్స్ ఇవ్వడంతో అసలు వార్తలు పక్కకు పోయి ముఖ్యమంత్రి ఘన కార్యాలు తొలి పేజీలో చోటు చేసుకుంటున్నాయి. జాకెట్ యాడ్స్ వికృతానికి పరాకాష్ట నవంబర్ ఒకటో తేది నాటి తెలుగు దిన పత్రికలు. ఈ దుష్ట సాంప్రదాయానికి అంతం లేదా? ఆదాయం కోసం పత్రికలు ఇంతగా దిగజారటం అవసరమా?