Thursday, July 3, 2008

వేతనాలు పెంచి సాక్షికి పోటీగా నిలిచిన టీవీ-9

టీవీ-9 తన సిబ్బందికి భారీగా వేతనాలు పెంచింది. అంతా ఇంతా కాదు.. 100 నుండి 300 శాతం దాకా. నిజానికి టీవీ-9 మొదటి నుండీ వేతనాల విషయంలో అందరికీ ఆదర్శంగా నిలిచింది. 2003లో టీవీ-9 రాకముందు తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు చాలా అధ్వానమైన జీతాలు ఉండేవి. తెలుగు జర్నలిస్టులకు అమ్మాయిలను ఇవ్వడానికి వెనుకాడేవారు. టీవీ-9 ప్రారంభంలోనే ఐ.టి., కార్పోరేట్ స్థాయి వేతనాలు ఇచ్చి తెలుగు జర్నలిస్టుల విలువ పెంచింది. ఇతర చానెళ్ళు, పత్రికలు ఇదే బాటలో నడవక తప్పలేదు. ఆ తర్వాత సాక్షి దిన పత్రిక ప్రింట్ జర్నలిస్టులకు ఇదే రీతిలో భారీ జీతాలు ఆఫర్ చేసింది. ఎలక్ట్రానిక్ మీడియాలోకి కూడా అడుగిడిన సాక్షి అనూహ్య జీతాలు ఇవ్వడానికి ముందుకు రావడంతో ఇతర చానెళ్ళు ఉలిక్కి పడ్డాయి. తన జర్నలిస్టుల వలసల్ని నివారించడంలో భాగంగా టీవీ-9 కూడా అదే బాటను ఎంచుకొని సాక్షికి ఎదురు సవాల్ విసిరింది. ఇతర ఛానెళ్ళు కూడా ఈ సవాల్ని స్వీకరిస్తాయేమో చూడాలి మరి. పెరుగుడ విరుగుట కొరకే అన్న నానుడి తెలుగు జర్నలిస్టుల విషయంలో నిజం కావద్దని ఆశిద్దాం. ఎందుకంటే ఆర్ధిక మాద్యం - ద్రవ్యోల్బనం ఊబిలో చిక్కిన అమెరికాలో పత్రికలు, చానెళ్ళు తమ సిబ్బందిని తగ్గించుకోవడమే కాక వేతనాలకు కోత పెడుతున్నాయట.