Tuesday, July 1, 2008

ఆంధ్రజ్యోతి ఎపిసోడ్.. కొన్ని సందేహాలు..

పత్రికా స్వేచ్చను చావు దెబ్బ తీసిన ఆంధ్రజ్యోతి ఎడిటర్, రిపోర్టర్ల అరెస్టును ప్రతీ జర్నలిస్ట్ ఖండించాల్సిందే.. ఈ ఎపిసోడ్ తర్వాత ముఖ్యమంత్రికి తెలిసి జరిగిందా?. చట్టం తన పని తాను చేసుకుపోయిందా?.. ఆంధ్రజ్యోతి అతిగా వ్యవహరించి చట్టనికి చిక్కిందా?.. మంద కృష్ణ ఎందుకిలా వ్యవహరిసున్నారు?.. తదితర ప్రశ్నలు వినిపించాయి. వీటన్నింటినీ పక్కన పెడితే ఒక విషయం మాత్రం స్పష్టం అయింది. అదే జర్నలిస్టులు, పత్రికా యాజమాన్యాల మధ్య చీలిక.. ఆంధ్రజ్యోతి ఎడిటర్, రిపోర్టర్ల అరెస్టు, తదనంతర పరిణామాల వార్తలకు అన్ని పత్రికలు ప్రాధాన్యతను ఇచ్చాయి. సాక్షి, సూర్య తప్ప. ఎందుకో అర్థం చేసుకోవచ్చు. ఈ ఎపిసోడ్లో మంచి చెడుల విషయానికి పోదలచుకోలేదు. కానీ పత్రికా స్వేచ్చ ప్రమాదంలో పడినప్పుడు ఐక్యంగా ఉద్యమించాల్సిన జర్నలిస్టులు ఎవరికి వారుగా మొక్కుబడి నిరసనలు తెలపడం బాధాకరం. అంతో, ఇంతో ఎలక్ట్రానిక్ మీడియా నిరసనలు ఐక్యంగానే జరిగాయి. కాని ఎపీయూడబ్ల్యుజె, ఎపీడబ్ల్యుజేఎఫ్ లు మాత్రం ఐక్యతను ప్రదర్శించ లేదు. ఇక ఎడిటర్, విలేఖరుల విడుదల తర్వాత ప్రెస్ క్లబ్ లో జరిగిన విజయోత్సవంలో అంతా ఆంధ్రజ్యోతి సిబ్బందే కనిపించారు. ఇక్కడ మరో అంశాన్ని గమనించాలి. అరెస్టు మరునాటి ఆంధ్రజ్యోతి పత్రిక నొడా కేవలం ఎడిటర్ శ్రీనివాస్, ఎండీ రాధాకృష్ణ ఫోటోలే ప్రముఖంగా కనిపించాయి. కానీ రిపోర్టర్లు శ్రీనివాస్, వంశీల ఫోటోలు లేవు. ఎందుకు? కంట్రిబ్యూటర్లనే చిన్న చూపా? జరిగిన తప్పును ఆంధ్రజ్యోతి జాజమాన్యం మరునాటికి సవరించుకుంది లెండి.