ఊహించినట్లుగానే జర్నలిస్టు సోదరులు ఇళ్ళ స్థలాలకోసం వీధిన పడ్డారు. కొట్టుకోవడం ఒకటే తక్కువ. జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచివల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ లో సభ్యత్వం రాని జర్నలిస్ట్ లు ప్రెస్ క్లబ్ ముందు ధర్నా చేశారు, అరెస్ట్ అయ్యారు. ఎందుకీ రచ్చ.. కొత్తగా ఏర్పడ్డ జవహర్లాల్ సొసైటీ సరైన మార్గంలోనే పోతున్నప్పుడు సభ్యత్వానికి ఎంపికైన సభ్యుల పేర్ల జాబితా రహస్యంగా దాయటం ఎందుకు? రహస్యంగా రెండువేల రూపాయల సభ్యత్వ రుసుము, లక్ష రూపాయల డీడీ కట్టించుకొవటంలోని ఆంతర్యం ఏమిటి? ఎవరైనా కోర్టుకు వెళ్ళతారనే భయమా? మరి కోర్టు ఫీజుల డబ్బు కూడా వసూలు చేశారు కదా? ఐదేళ్ళ పైబడి సర్వీస్ ఉన్న వారందరికీ సభ్యత్వం ఇచ్చినా.. పైగా సర్వీస్ ఉన్న వారి దగ్గరే లక్ష రూపాయల డీడీ హడావిడిగా ఎందుకు కట్టించు కుంటున్నారు? ప్రభుత్వం సొసైటీకి భూమి బదిలీ చేయడాని కట్టాల్సిన డబ్బు కొసమే ఈ డబ్బు తతంగం అనేది బహిరంగ రహస్యమే అనుకోండి. ఇన్ని దాగుడు మూతలు అవతలి వారిలో లేని పోని అనుమానాలు రేకెత్తించవా? కోర్తుకు పోతామన్న ప్రతివాడికే భయపడాల్సిన అవసరం ఏమిటి?
జూనియర్లూ.. ఎందుకీ తొందర?
ఇళ్ళ స్థలాలు రాకపోతే జీవితమే వృధా అన్నంతగా హడావిడి పడుతూ ఆందోళనకు దిగారు జూనియర్లు (ఐదేళ్ళ లోపు సర్వీసు గలవారు) ఇళ్ళ స్థలాల కేటాయింపు ప్రక్రియలో కొన్ని నియమ నిబంధనలు ఉండటం సహజం. ఇందులో భాగంగానే చిన్న పత్రికలు, నాన్ స్టార్టర్ ఛానెళ్ళలొ పనిచేసిన అనుభవాన్ని, కంట్రిబ్యూటర్ సర్వీసును లెక్కలోకి తీసుకోలేదు (ఇప్పుడు సభ్యత్వం దొరికిన వారంతా పతివ్రతలే అని మేము అనటం లేదు.. దొరకని వరకే దొరలు). ఏళ్ళ తరబడి జర్నలిస్టులుగా బతుకులు వెళ్ళ దీస్తున్న సీనియర్లకు ముందుగా ప్లాట్లు దక్కాలని కొరుకుందాం. జూనియర్లు వయసు రీత్యా ఈ వృత్తి కాకపోతే మరో ఉద్యోగం చూసుకోవచ్చు. కాని సీనియర్లకు అలాంటి అవకాశాలు దొరకవు. భవిష్యత్తులో ప్రభుత్వం ఇక ఇళ్ళ స్థలాలు ఇవ్వదన్నదే జూనియర్ల ఆవేదన. ఇదే నిజమని ఎందుకనుకోవాలి? పోరాడే శక్తి కొరవడిందా? ముందు మన పోరాటం అనర్హులకు ప్లాట్లు దక్కకుండా చూడటమే..
కొసమెరుపు: ఈ బ్లాగ్ రచయిత కూడా జూనియరే.. ప్లాట్ రావడం లేదు అని తెలిసినా బాధ లేదు..