Tuesday, June 3, 2008
మూతపడ్డ సిటీకేబుల్
గత కొద్ది వారాలుగా రాష్ట్ర రాజధానిలో జరిగే కార్యక్రమాలు, ప్రెస్ మీట్లలో సిటీకేబుల్ మైక్ లోగోలు కనబడటం లేదేమిటా అని ఆలోచిస్తున్నారా?ఆంధ్ర ప్రదేశ్ లో ఎలక్ట్రానిక్ మీడియా(ప్రైవేట్)కు శ్రీకారం చుట్టిన సిటీకేబుల్ ఇక లేదు. నడపడం చేత కాక 'జీటీవీ' యాజమాన్యం ' సిటీకేబుల్ 'కు పాతరేసింది. 1995-96లలో విజయవాడలో రామకృష్ణ ప్రారంభించిన మాస్టర్ కేబుల్ ను టేకోవర్ చేసిన జీటీవీ సుభాష్ చంద్ర సిటీకేబుల్ పేరిట విస్తరించారు. ఆ తర్వాతి కాలంలో హైదరాబాద్ లో ప్రారంభమైన సిటీకేబుల్ ఎంతో పాపులారిటీ తెచ్చుకుంది. ఏలక్ట్రానిక్ మీడియాలో రవి ప్రకాశ్ (ప్రస్థుత టీవీ9 సీఈవో) కెరీర్ మొదలైంది సిటీకేబుల్ నుండే. రాజకీయనేతలు, అధికారులు, ప్రజలు సిటీకేబుల్ వార్తల కోసం ఆసక్తిగా చూసే వారు. సిటీకేబుల్ సిబ్బంది రానిదే ప్రెస్ మీట్లు కూడా ప్రారంభమయ్యేవి కాదు. క్రమంగా శాటిలైట్ చానెళ్ళు జెమిని, ఈటీవీ, ఇతర కేబుల్ నెట్ వర్క్ లు ఇన్ కేబుల్, సీ చానెల్ వచ్చాక సిటీకేబుల్ ప్రాభవానికి గ్రహణం ప్రారంభమైంది. 'జీ'యాజమాన్యం సిటీకేబుల్ ను టెక్నాలజీ పరంగా అభివృద్ది చేయడంపై సరయిన దృష్టి పెట్టక పొవడం, దివంగత రామకృష్ణ లాంటి సమర్ధిలైన మేనీజింగ్ డైరెక్టర్లు, బాస్లు లేక పొవడం ఇందుకు కారణం. జీ యాజ్మాన్యం సిటీకేబుల్ కు నియమించిన బాస్లంతా అసమర్ధంగా వ్యవహరించడం, తోటి కేబుల్ నెట్ వర్క్ లకు కోవర్టులుగా మారటం కూడా మరో కారణం అని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. సిటీకేబుల్ మూత పడ్డా, అక్కడి న్యూస్ సిబ్బందిని జీన్యూస్ లోకి తీసుకోవడం గుడ్డిలో మెల్ల.