Monday, October 12, 2009

వరదలో చానళ్ళ బురద..

ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని కర్నూలు, మహబూబ్ నగర్, క్రిష్ణా, గుంటూరు జిల్లాలు వరదల్లో మునగడం మన టీవీ చానళ్ళ దాహాన్ని తీర్చింది. అందరికన్నా తామే ముందు వరద వార్తలు ఇచ్చామని ప్రతీ చానల్ గొప్పలు చెబుకుంది. కొన్ని చానళ్ళయితే శ్రీశైలం డాం కొట్టుకు పోతోందంటూ తప్పుడు వార్తలు ప్రసారం చేసి, తర్వాత నాళిక కర్చుకొని తమ వార్తలకు స్పందించే అధికారులు తక్షణ సహాయక చర్యలకు దిగారని సమర్ధించుకున్నాయి. కొందరు రిపోర్టలైతే పలానా ప్రాంతానికి అధికారుల కన్నా తామే ముందెళ్ళి ప్రజల్ని రక్షించామని వగలు పోయారు. మరికొందరైతే చేతుల్లో గొట్టాలు పట్టుకొని ప్రజల్ని రక్షించారట. రక్షించేటప్పుడు మధ్యలో ఈ గొట్టం ఎందుకని ఎవరూ అడగలేదేమో? కొన్ని టీవీ చానళ్ళు వరద బాధితులకోసం విరాళాలు, వస్తువులు, బట్టలు సేకరించాయి. భేష్.. మంచిదే. కాని అవన్నీ సక్రమంగా బాధితులకు చేరాల్సిన అవసరం ఉంది. మరికొన్ని చానళ్ళు వరద బాధితుల సహాయం కోసం నిధులు సేకరించి తమ కరువు.. అదేనండి అప్పులు తీర్చుకునే ప్రయత్నంలో ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జెమిని సంగతేంటి?..
రాష్ట్రంలో అన్ని మీడియా యాజమాన్యాలు తమకు తోచిన రీతిలో వరద బాధితులను ఆదుకునే ప్రయత్నాలు చేస్తుంటే జెమిని టీవీ యజమానులు ఇది తమకు సంబంధించిన విషయం కాదని మిన్నకున్నారు. తమిళనాడులో సునామి వస్తే గ్రూప్ లోని అన్ని చానళ్ళ ఉద్యోగుల ఒకరోజు వేతనాలు కోసి విరాళం ఇచ్చిన సన్ యాజమాన్యం ఆంధ్రప్రదేశ్ వరధ బాధితులను పట్టించుకోదా? భేష్.. జయహో..సారీ తమిళహో..

జర్నలిస్టులకు ఇక ఇళ్ళ స్థలాలు రానట్టే..

కోర్టు అనుకూలంగా ఎప్పుడు తీర్పు చెబుతుందా. ఇళ్ళ స్థలాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్న జర్నలిస్టులకు చేదు వార్త వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజశేఖర రెడ్డి దుర్మరణం తరువాత ఈ అంశాన్ని పట్టించుకునే నాధుడే కనిపించడం లేదు. కోర్ట్రు అనుకూలంగా తీర్పు ఇచ్చినా ప్రస్తుత ప్రభుత్వం ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందా అనే అనుమానాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి హయాంలో జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ స్థాపించిన సీఎం బీట్ రిపోర్టర్లు ఇప్పుడు అంత ఉత్సాహంగా ఉన్నట్లు కనిపించడం లేదు. మరో వైపు సొసైటీ నాయకులు తమను ఇళ్ళ స్థలా గురించి వాకబు చేసే జర్నలిస్టులకు సరైన సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నారు. తాము అప్పు చేసి వడ్డీలు కట్టుకుంటూ ఇచ్చిన డిపాజిట్ సంగతి ఏమిటని చాలా మంది జర్నలిస్టులు ఆందోళనతో ఉన్నారు. అడిగినవారికి డిపాజిట్లో కొత కట్ చేసుకొని ఇవ్వలనే అల్లోచనలో సొసైటీ నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది.

' జెమినిన్యూస్ ' కొత్త బాస్ ఎవరు?

జెమినిన్యూస్ చాలా కాలంగా తలకాయ లేకుండానే నడుస్తోంది.. అదేనండీ హెడ్ అంటే బాస్ లేకుండా అనమాట. మధు వెళ్ళిపోయిన రెండేళ్ళకు సతీష్ బాబు జెమినిన్యూస్ ఎడిటర్ అయ్యారు. సతీష్ బాబు కూడా రిజైన్ చేసి ఒకటిన్నర సంవత్సరం అవుతున్నా ఇంతవరకూ కొత్త ఎడిటర్ నియామక జరగలేదు. బహుషా తక్కువ జీతం తీసుకుంటూ ఎండీ కిరణ్ తిట్లు తినేవారెవరూ దొరికి ఉండరు. తాజాగా సన్ గ్రూప్ ఎపీ సీఓఓ గా వచ్చిన సంజీవ రెడ్డి ఈ విషయంలో దృష్టి పెట్టారు. జీ టీవీలో తనకు పైరవీలు చేసి పెట్టిన క్రైం రిపోర్టర్ మహ్మద్ గౌసుద్దీన్ ను జెమిని న్యూస్ హెడ్ గా తీసుకు రావాలని సంజీవ రెడ్డి తహ తహ లాడుతున్నారట. ఇతడు ప్రవర్తణలో కరీం స్కూల్ విధ్యార్థే. అమ్మాయిల జీవితాలతో ఆటలాడే ఇతగాడిని తోటి రిపోర్టర్లు ముద్దుగా సెక్సుద్దీన్ అని పిలుస్తారట. కాగా సతీష్ బాబు కూడా మళ్ళీ జెమిని ఎడిటర్ గా వచ్చే అవకాశం ఉందని తెలిసింది.

Sunday, September 6, 2009

మీడియా మిత్రుడికి జోహార్!
ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి అస్తమయం తెలుగు ప్రజలందరికీ విచారాన్ని కలిగించింది. రాజశేఖర రెడ్డి జర్నలిస్టుల సంక్షేమం కోసం విశేషంగా పని చేశారు. జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇప్పించేందుకు ప్రయత్నించారు. కోర్టు కేసు కారణంగా ఇది కార్యరూపం దాల్చక వై.ఎస్.ను కోల్పోవడం బాధారం. జర్నలిస్టులకు మెడిక్లైం, ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి పుణ్యమే.. డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డికి ఎబౌట్ తెలుగు మీడియా ఘనంగా నివాళులర్పిస్తోంది.

APEMJUను కబలించేందుకు APUWJకుట్ర

ఆంధ్ర ప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ అస్థిత్వం ప్రమాదంలో పడింది. ఈ సంఘాన్ని విలీనం చేసుకునేందుకు ' ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ' పావులు కదిపింది. ఈ మేరకు APEMJU ముందు ప్రతిపాదన కూడా పెట్టిందిభావిస్తోంది. తాము APUWJలో విలీనం అయితే స్వతంత్ర ప్రతిపత్తి కోల్పోతామని ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఆందోళన పడుపున్నారు. తన దాయాది APWJFపై ఆదిక్యత సాధించేందుకే APEMJUను విలీనం చేసుకోవాలని APUWJభావిస్తోంది. ఈ కుట్ర లోని ఆంతర్యం తెలియని ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు గుడ్డిగా విలీనాని పచ్చ జెండా ఊపాలని ప్రయత్నిస్తున్నారు.
' ధనార్జన ' రాజకీయం
ఆంధ్ర ప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ యూనియన్ లో ముసలం మొదలైంది. సంఘం అధ్యక్షునిగా ఉన్న హరి ప్రసాద్ కు తెలియకుండానే తాను కొత్తగా అధ్యక్షునిగా ఎన్నికైనట్లు చందు జనార్ధన్ ఐ అండ్ పీఅర్ కు ఒక లేఖ రాయడం ద్వారా ప్రకటించుకున్నాడు. ఈయన గారి కార్యవర్గంలో సాబేర్ ఉపాధ్యక్షునిగా, క్రాంతి కిరణ్ కార్యదర్శిగా ఉన్నారు. జనార్ధన్, సాబేర్, క్రాంతిల కుట్ర వెనుక APUWJహస్తం ఉందని భావిస్తున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల అనైక్యతను సాకుగా చూపి తమలో విలీనం చేసుకోవాలన్నదే APUWJఎత్తుగడ. ఈ విషయమై ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు చందు జనార్ధన్ ని నిలదీద్దామని ప్రయత్నించగా మొహం చాటేసి పారిపోగా, సాబేర్ మీటింగ్ ఏ డుమ్మా కొట్టాడు. గతంలో కూడా ఈ మహానుభావుల కారణంగానే ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం నిలువునా చీలిపోయింది. ఇప్పటికే ధనార్జన్.. సారీ జనార్ధన్, యూనియన్ అధ్యక్షున్నంటూ చందాలు పోగేస్తున్నాడట.

జెమినిలో మూడు స్థంబాలాట

సన్ నెట్ వర్క్ లోని తెలుగు టీవీ చానెళ్ళకు సీవోవో గా సంజీవ రెడ్డి జాయిన్ అయ్యారు. గతంలో జీ తెలుగు సీఈవోగా పని చేసిన సంజీవ రెడ్డి ఆ చానల్లో ఎన్నో వినూత్న ప్రోగ్రాంలు ప్రవేశ పెట్టి జెమినికి గట్టి పోటీ ఇచ్చారు. ఆయన పని తీరును మెచ్చిన సన్ యాజమాన్యం తన గ్రూప్ లోని తెలుగు చానళ్ళకు సీవోవో పోస్టును ఆఫర్ చేసింది. ఇంత వరకు బాగానే ఉన్నా ఇప్పుడు జెమినిలో మూడు స్థంబాలాట మొదలైంది. ఇప్పటికే మేనేజింగ్ డైరెటర్, జనరల్ మేనేజర్ ఆధిక్యతా పోరులో నలిగిపోతున్న జెమిని సిబ్బందికి తాజాగా వచ్చిన చీఫ్ ఆపరేషనల్ ఆఫీసర్ అధనపు భారంగా మారారట. ఈయన జీతం నెలకు ఐదు లక్షలేనట. తమ గొర్రె తోకంత జీతాలు పెంచరు కానీ లక్షలాది జీతాలకు కొత్త కొత్త అధికారులను తెచ్చి తమ నెత్తిన పెడతారని జెమిని ఉద్యోగులు సన్ యాజమాన్యంపై రుసరుస లాడుతున్నారు.

Saturday, August 22, 2009

కరీం రాకతో స్టూడియో-ఎన్ లో కలకలం

కామాంధుడూ, షాడిస్టు కరీం చేరికతో స్టూడియో-ఎన్ చానెల్లో సంక్షోభం నెలకొంది. నిత్య పెళ్ళి కొడుకుగా మహిళల జీవితాలతో ఆడుకొని చివరి(?) భార్య బంధువుల చేతిలో ఆసిడ్ దాడికి గురైన కరీం గత చరిత్ర ఎంతో వివాదాస్పదంగా ఉన్నా స్టూడియో-ఎన్ యాజమాన్యం కరీం ను ఎందుకు తీసుకుందో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఒక పార్టీ అధినేత సిఫార్సుతో కరీం స్టూడియో-ఎన్ లో చేరాడని ప్రచారం జరుగుతోంది. కరీం చేరుతున్న వార్త తెలియగానే అంజయ్య, జయప్రసాద్ తదితర సీనియర్ స్థాయి జర్నలిస్టులు స్టుడియో-ఎన్ కు రాజీనామా ఇచ్చేశారు. స్టుడియో-ఎన్ ఎంటర్టైన్మెంట్ చానెల్ గా మారుతోంది.. న్యూస్ బులిటిన్లు తగ్గిస్తున్నారని మరో వార్త. ఇలాంటి పరిస్థితిలో కరీం ఏంచేయబోతాడో మరి. కరీంపై పొలీసు కేసులూ, నిఘా ఇంకా కొనసాగుతోందని తెలిసింది.

ఎన్-టీవీలో కొమ్మినేని

సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావు టీవీ-5కి గుడ్ బై చెప్పి 'ఎన్-టీవీలో' చేరిపోయారు. ఇది టీవీ-5కి కొంత ఎదురు దెబే. ఎన్-టీవీ యాజమాన్యం శాస్త్రి కి ఉద్వాసన పలికేందుకే కొమ్మినేనిని తెచ్చి పెట్టుకున్నారని చెబుతున్నారు. ఇప్పటికే ఆయన కారు తీసేసుకున్నారని ఎన్-టీవీ వర్గాల బోగట్టా. ఇది శాస్త్రికి పొమ్మనలేక పొగ పెట్టే పరిణామమే. గత కొన్ని నెల్లలుగా ఎన్-టీవీ సిబ్బంది శాస్త్రి అరుపులూ కేకలూ భరించలేక పోతున్నారు. తనకు నచ్చని ఎందరో జర్నలిస్టుల ఉద్యోగాలు ఊడగొట్టడం ద్వారా వారి ఉసురు పోసుకున్నారు. ఇప్పటికే కొందరు సీనియర్లు ఎన్-టీవీ నుండి వలస పోయారు.

మీడియా కామాంధులూ కబడ్దార్..

ఇటీవలి కాలంలో మీడియాలో కామంతో కళ్లు మూసుకు పోతున్న జర్నలిస్టులు పెరిగిపోతున్నారు. ముఖ్యమైన బాధ్యతల్లో ఉన్న కొందరు సీనియర్లు కొత్తగా మీడియాలోకి వస్తున్న మహిళా జర్నలిస్టులు, యాంకర్ల పట్ల అగురవంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి కామాంధుల భరతం పట్టాలని 'ఎబౌట్ తెలుగు మీడియా' నిర్ణయించింది. ఇలాంటివారి సమాచారాన్ని abouttelugumedia@gmail.com కి పంపించండి. ఈ మమాచారాన్ని నిర్దారించుకున్నాకే ప్రచురిస్తాం. అయితే మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకోసం వారి పేర్లను మటుకు రహస్యంగానే ఉంచతామని స్పష్టం చేస్తున్నాం..

మీడియా కమిటీపై ముదురుతున్న వివాదం

సూర్య దినపత్రిక (13 ఆగస్ట్, 2009) సౌజన్యంతో..
హైదరాబాద్‌, సూర్య ప్రధాన ప్రతినిధి: ‘మా సొంతగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. మీడియా కమిటీ సూచనల ప్రకారమే చేస్తున్నాం- ముఖ్యమంత్రి వైఎస్‌
‘మీడియా కమిటీ చేసిన సూచనలను అమలు చేస్తు న్నాం. మీడియా అంటే మాకు ఎంతో గౌరవం’- స్పీకర్‌
‘మీడియా కమిటీ సూచనల మేరకే ఆంక్షలు విధిస్తు న్నాం. సెక్యూరిటీ దృష్ట్యా ఈ ఆంక్షలు అమలు చేస్తున్నాం’
-శాసనసభా వ్యవహారాల మంత్రి కె.రోశయ్య
‘మేమెలాంటి ఆంక్షలు విధించలేదు. కమిటీ హాల్‌లో ప్రె స్‌ కాన్ఫరెన్సు పెట్టుకోవాలా? వద్దా అని చెప్పడానికి మాకేం అధికారం ఉంది? మా పాసుల వ్యవహారాలు, సౌకర్యాల వరకే కమిటీ పరిమితం. మిగిలివన్నీ స్పీకర్‌ అధికారాల కిందకే వస్తాయి’- మీడియా కమిటీ సభ్యుడు

గత కొద్దిరోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాం శంగా మారిన ‘అసెంబ్లీలో మీడియాపై ఆంక్షల వ్యవహా రం’లో వినిపిస్తున్న భిన్నాభిప్రాయాలివి. ప్రభుత్వ పెద్దలు తమకేమీ తెలియదని చెబుతుంటే, మీడియా కమిటీ సభ్యు లేమో అంతా తమ మీద నెపం వేస్తున్నారని వాపోతున్నా రు. దీనితో తప్పెవరిదన్న చర్చ తెరపైకొచ్చింది. మీడియాపై ఆంక్షల నేపథ్యంలో ప్రతిపక్షాల నిరసన గళం వినిపిస్తుండటంతో అసెంబ్లీలో అసలేం జరుగుతోం దంటూ అన్ని వర్గాల్లో ఆసక్తి కనిపిస్తోంది. గతంలో స్పీకర్‌ సురేష్‌రెడ్డి అమలుచేసిన విధానాన్ని ప్రస్తుత స్పీకర్‌ కిరణ్‌ కుమార్‌రెడ్డి తొలగించి.. లాబీ, మీడియాపాయింట్‌ పాసు లంటూ ప్రత్యేకంగా జారీ చేశారు. దానికి మీడియా కమిటీ సిఫార్సులే కారణమని, అందులో తన ప్రమేయమేమీ లేద న్నది స్పీకర్‌ వివరణ. అసలు మీడియా కమిటీ అనేది ఏర్పా టుచేసే ముందు అన్ని పత్రికలకు సమాచారం పంపి, జర్నలిస్టులను నియమించడమనేది పాత సంప్రదాయం. అవేమీ లేకుండా ఎవరినడిగి కమిటీ వేశారు? ఎప్పుడు వేశారు? ముందస్తు సమాచారం లేకుండా ఎందుకు ఏర్పా టుచేశారు? అజెండా ఏమిటి? కమిటీలో సభ్యుల నియా మకాలకు ప్రాతిపదిక ఏమిటి? పత్రికల స్థాయేమిటి? అన్నవి మాత్రం ప్రశ్నలుగా నే మిగిలిపోయాయి. ఈ వివాదానికి ఇదీ ఒక కారణమం టున్నారు. ప్రత్యక్ష ప్రసారాల విషయంలో కూడా పక్షపా తం చూపి స్తున్నారని, తమ ఆందోళనను చూపించకుండా సెన్సార్‌ విధిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అ యితే, ప్రభుత్వం మాత్రం ఈ అంశంపై వివాదం తలెత్తిన ప్రతి సారీ మీడియా కమిటీ సిఫార్సుల ప్రకారమే ఆంక్షలు విధిం చామంటూ కమిటీపై నెపం మోపడం మీడియా కమి టీలోని కొందరు సభ్యులకు అసంతృప్తి కలుగుతోంది. తా ము కేవలం పాసుల జారీ, సౌకర్యాలకే పరిమితమే తప్ప, లోపల ఎలా ఉండాలి అని తాము ఎలా నిర్దేశిస్తామని ప్రశ్ని స్తున్నారు. ఈ వైఖరిపై మనస్తాపం చెందుతున్న మెజారిటీ మీడియా కమిటీ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ‘బయట మ మ్మల్ని అనవసరంగా కాంగ్రెస్‌ వర్కర్స్‌ కమిటీ (సిడబ్ల్యుసి) అని మా వాళ్లే నిందిస్తున్నారు. లోపల మాట్లాడే అవకాశం లేకుండా ఒకరిద్దరే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయి తే, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారన్న విమర్శలు ఎ దుర్కొంటున్న మరికొందరు సభ్యులుమాత్రం తమ కమి టీపై జరుగుతున్న దుష్ర్పచారంపై అన్ని పక్షాలకు లేఖలు రాద్దామని అభిప్రాయపడగా, అసలు లేఖలు రాయడానికి కమిటీకి ఏం అధికారం ఉందని మరికొందరు ప్రశ్నించి నట్లు సమాచారం. ఈమేరకు కొందరు సభ్యులు ప్రతిపక్షా లకు చెందిన సీనియర్లతో రాయబారాలు నడుపుతూ, తమ నిర్ణయాలు సరైనవేనని ఒత్తిడి చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇదిలాఉండగా, కొన్ని ప్రైవేట్‌ టివిఛానెళ్ల చర్చల్లో పా ల్గొంటున్న సర్కారీ జర్నలిస్టులు అసెంబ్లీలో మీడియాపై విధించిన ఆంక్షల వల్ల మీడియాకు ఎలాంటి ఇబ్బందులు లేవంటూ వ్యాఖ్యానించడం జర్నలిస్టులకు ఆగ్రహం కలిగి స్తోంది. ‘ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా కొందరు జర్నలిస్టులు జనరలిస్టుల్లా మారా రు. వాళ్లు రోజూ వచ్చి ఇక్కడ కూర్చుని డ్యూటీలు చేస్తే ఆ కష్టమేమిటో తెలుస్తుంది. రాయబారాలే వ్యాపకమయిన వారికి అవన్నీ ఏం తెలుస్తాయి? మీడియాపై విధించిన ఆంక్షలపై ప్రతిపక్షాలన్నీ నిరసిస్తుంటే, జర్నలిస్టు సంఘాల నేతలు మాత్రం సమర్థిస్తున్నారంటే వాళ్లు ఎటువైపు ఉన్నారో అర్ధమవుతోంద’ని ఒక సీనియర్‌ జర్నలిస్టు వ్యాఖ్యానించారు.

ఆంధ్రజ్యోతి సంపాదకీయం, ఆగస్ట్ 13, 2009


Sunday, August 2, 2009

మీడియాపై ఆంక్షలా.. సిగ్గు సిగ్గు..

రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి శాసన సభలో మీడియాపై ఆంక్షలు మొదలయ్యాయి. జర్నలిస్టులను లాబీ, గ్యాలరీ, మీడియా పాయింట్ పాసుల పేరిట విడగొట్టారు. శాసన సభ ఆవరణలో ఎలక్ట్రానిక్ మీడియా కెమరాలను కట్టడి చేయడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. మంచిదే.. ఆంక్షల పేరిట వారికి తాగు నీరు, ఆహారం, టాయిలెట్లు తదితర మౌలిక సదుపాయాలకు దూరం చేయడం మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. గ్యాలరీ, మీడియా పాయింట్ పాసులున్న జర్నలిస్టులను, కెమెరామెన్లను, పోటోగ్రాఫర్లను క్యాంటీన్ల దగ్గరకు వెళ్ళనీయకుండా దుర్మార్గం. తమ కష్టాలు చెప్పుకోవడానికి స్పీకర్ వద్దకు పోదామనుకున్న జర్నలిస్టులపై పోలేసులు తమ దమన నీతిని ప్రదర్శించబోయారు. ఫలితంగా జూలై 31న జర్నలిస్టులంతా అసెంబ్లీ మీడియా పాయింట్లో కవరేజీలను బహిష్కరించారు.
నపుంసక మీడియా కమిటీ..

తోటి జర్నలిస్టులపై దుర్భర ఆంక్షలకు అసెంబ్లీ మీడియా కమిటీ చేతగాని తనమే కారణం అనేది సుస్పష్టం. మీడియా కమిటీ సలహా ప్రకారమే పాసులు కుదించి ఆంక్షలు విధించామని అసెంబ్లీ అధికారులు చెబుతున్నారు. ఆంక్షలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన జర్నలిస్టు ముందుకు రాలేక మీడియా కమిటీ ముఖం చాటేసింది. అసలు అసెంబ్లీ మీడియా కమిటీలో ఉన్నదెవరు? వారికి జర్నలిస్టుల సాదక బాధకాలు తెలుసా? అసెంబ్లీ కవరేజీకి వచ్చే సీనియర్ జర్నలిస్టులు చాలా మందిని దూరం పెట్టి ' తమ ' వారికే కమిటీలో చోటు ఇచ్చారని అంతా చెబుకుంటున్నారు. కొదరు జర్నలిస్టులైతే ' ఇది మీడియా కమిటీ కాదు.. సీ.ఎల్.పి. కమిటీ.. అని బాహటంగా నోరు పారేసుకుంటున్నారు.

రెండు పడవల ప్రయాణం

జర్నలిస్టుగా కొనసాగాలా, రాజకీయాల్లోనే ఉండాలా తేల్చుకోలేక సతమతం అవుతున్న క్రాంతి కిరణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘాన్ని కూడా ఇబ్బందుల్లోకి నెట్టాడు. ఇన్ కేబుల్, టీవీ9, టీవీ5 ఛానెళ్ళలో పని చేసిన క్రాంతి కి అత్యాశ ఎక్కువ అన్ని పదవులు తనకే కావాలంటాడు. రెండు పడవల పయనం అంటే ఇతడికి ఎంతో ఇష్టం.. నోటి తీట ఎక్కువే కానీ వ్యక్తిగతంగా చాలా మంచివాడు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో క్రాంతి కిరణ్ ఆంధోల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి డిపాజిట్ కూడా దక్కించుకోనంత ఘోరంగా ఓడిపోవడం అందరికీ తెలుసు. టీవీ9లో పని చేస్తున్న సమయంలో మెదక్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవిపై కన్నేసి రామచంద్రాపురం నుండి కాంగ్రెస్ జడ్పీటీసెగా గెలిచాడు. కానీ ఆశించిన పదవి దక్కలేదు. ఆ తర్వాత జడ్పీటీసీ పదవికి రాజీనామా ఇచ్చానంటూ మళ్ళీ మీడియాలోకి వచ్చి టీవీ5లో చేరాడు. నిజంగా రాజీనామా చేసి ఉంటే రామచంద్రాపురం స్థానానికి ఉప ఎన్నిక ఎందుకు జరగ లేదు అనే ప్రశ్న ఎవరూ వేయలేక పోయారు. అనంతరం టీఆరెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే టికెట్ కు ప్రయత్నించి భంగపడ్డాదు. ఇండిపెండెంట్ గా పోటీచేస్తే ఫలితం ఏమయిందో అందరికీ తెలిసిందే. ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి పదవిలో శాశ్వతంగా కొనసాగుతున్న ఇతగాడి చర్యల కారణంగా ఆ సంఘం గుర్తింపు ప్రమాదంలో పడింది. సక్రమంగా ఎన్నికలు, సమావేశాలు ఏనాడు జరగని ఈ సంఘం అసలు ఉందా లేదా కూడా తెలియడం లేదు. సంఘం రికార్డులన్నీ క్రాంతి కిరణ్ దాచిపెట్టాడట. మళ్ళీ జర్నలిస్టుగా వచ్చేందుకు ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

Wednesday, June 17, 2009

మా న్యూస్ మూత.. అదే దారిలో లోకల్..

న్యూస్ చానెళ్లకు కష్ట కాలం వచ్చిందని భావిస్తున్న తరుణంలో ఎంటర్టైన్మెంట్ ఛానెళ్ళు కూడా న్యూస్ ను వదిలించుకోవడం జర్నలిస్టులకు ఇబ్బందికరంగా మారింది. ఏసియానెట్ సితార ఛానెల్ న్యూస్ ప్రారంభించకుండానే నమ్మి చేరిన జర్నలిస్టులను సాగనంపిన ఉదంతం మరువకముందే మా టీవీ ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 తేదీ నుండి మాటీవీ న్యూస్ బులిటిన్లను నిలిపేస్తోంది. తమ జర్నలిస్టులందరికీ రెండు నెలల అడ్వాన్స్ జీతాలిచ్చి వదిలించుకుంది. ఫలితంగా మా టీవీ జర్నలిస్టులంతా రోడ్డు పాలయ్యారు. మా టీవీ యజమానులైన చిరంజీవి, నాగార్జున, మురళీకృష్ణం రాజు భిన్న రాజకీయ వైఖరులతో పరస్పరం ఘర్షణ పడుతూ, చివరకు ' న్యూస్ ' కు మంగళం పాడారని తెలుస్తోంది. ఇకపై మా టీవీ కేవలం వినోద ప్రధనమైన చానెల్ గానే కొన సాగుతుంది. న్యూస్ సిబ్బందిని పంపడం ఇష్టం లేక విధిలేని వరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్న మురళీకృష్ణం రాజు కంట తడి పెట్టారని ' మా ' సిబ్బంది చెబుతున్నారు. మరో వైపు లోకల్ టీవీ కూడా వార్తా ప్రసారాలను నిలిపి వేయాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఫలితంగా అక్కడి జర్నలిస్ట్ మిత్రులుకూడా రోడ్డు పాలయ్యే దుస్థితి ఏర్పడింది. స్టూడియో-ఎన్ చానెల్లో జర్నలిస్టుల జీతాలు తగ్గించడం మరో షాక్..

తగ్గిన ఈనాడు,ఆంధ్రజ్యోతి

రోజులు మనవికానప్పుడు అనుకువగా ఒదిగి ఉండడమే మేలని మన పెద్దలు చెబుతుంటారు. ప్రస్తుతం ఈనాడు, ఆంధ్రజ్యోతి దీన్ని చక్కగా ఆచరిస్తున్నట్లు కనిపిస్తోంది. మహాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని, చంద్రబాబు ముఖ్యమంత్రికావదం తధ్యమని గంపెడాశలు పెట్టుకున్న ఈ రెండు పత్రికలకి ప్రస్తుతం రోజులు బాగా లేవు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై గతంలో మాదిరి దూకుడుగా బ్యానర్లు పెట్టి రాయకుండా సమ్యమణం పాటించడమే మేలని ఈనాడు, ఆంధ్రజ్యోతి భావిస్తున్నాయట. వీలైతే ప్రభుత్వాన్ని అవసరైనప్పుడల్లా పొగడ్తలతో ముంచెత్తడానికైనా వెనుకాడరాదని నిర్ణయించాయట. తెలుగుదేశంతో ఉన్న సంబంధ బాంధవ్యాల కారణంగా ఇప్పడికే ఉండవల్లి భారిన పడి మూడు చెరువుల నీరు తాగిన రామోజీరావు ఇక పోరాడే స్థితిలో లేరట?.. ఇక తన వంతేమోనని రాధాకృష్ణ హడలిపోతున్నారట?..

' సాక్షి ' అధికార దర్పం

ముఖ్యమంత్రిగా రెండోసారి రాజశేఖర రెడ్డి అధికారం చేపట్టాక ఆయన కుటుంబానికి చెందిన సక్షి టీవీ, దిన పత్రికలకు ప్రభుత్వంలో రాచ మర్యాదలు లభిస్తున్నాయి. ఇతర మీడియా ప్రతినిధులకు ఇది కంటగింపుగా మారిది. అధికారులు సాక్షి సిబ్బందికి ప్రాధాన్యత ఇస్తూఅ మిగతా మీడియా సిబ్బందిని చిన్న చూపు చూస్తున్నారు. సచివాలయంలోని ముఖ్యమంత్రి చాంబర్లోకి సాక్షికి తప్ప ఇతర మీడియాకు ప్రవేశం లేదు. అలాగే ముఖ్యమంత్రి కాన్వాయిలో నిబంధనలకు సాక్షి కెమెరామెన్ ను ప్రత్యేకంగా తీసుకెళ్ళుతున్నారు. ఇటీవల అసెంబ్లీలోని సమావేశమందిరంలోకి స్పీకర్ ఎన్నిక సందర్భంగా సాక్షి కెమెరామెన్ ను తప్ప ఇతరులను అనుమతించ లేదు. ఏమిటీ వివక్ష అని ఇతర మీడియా సిబ్బంది గొంతు చించుకుంటున్నా ఫలితం కనిపించడంలేదు.

అసెంబ్లీలో టీవీ ఛానెళ్ళపై ఆంక్షలు

రాష్ట్రంలో తిరిగి అధికారానికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెట్టించిన ఉత్సాహంతో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంతోంది. అసెంబ్లీలో మీడియాకి ముక్కుతాడు వేయాలన్నది ఇందులో ఒక నిర్ణయం. ముఖ్యంగా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన టీవీ చానెళ్ళ హడావుడి అసెంబ్లీకి ఇబ్బంది కరంగా మారింది. ఉలక్ట్రానిక్ మీడియా వారు స్వీయ క్రమ శిక్షణ పాటించకుండా ఎక్కడ పడితే అక్కడ మైకులు పెట్టి, గుంపుగా కెమరాలతో మీద పడుతూ చిరాకు కలిగిస్తున్నారట. మీడియాలు నియంత్రించడమే ఇందుకు ఏకైక పరిష్కారమని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా మీడియా పాసులకు కోత పెట్టడంతో పాటు, వీరందరినీ పబ్లిక్ గార్డెన్ కు పరిమితం చేయాలని నిర్ణయించారని ప్రచారం జరుగుతోంది. ఈ నిర్ణయం జర్నలిస్టులకే కాకుండా నేతాజీలకు కూడా ఇబ్బందికరమే.. గొట్టాల ముందు వాగందే వారికి పూఅట గడవదు కదా?..

పాపం రజనీ

ఎలక్ట్రానిక్ మీడియాలో 'సాలరీ బూం' రివర్స్ కావడతో జర్నలిస్టులకు తిరికి కష్టకాలం మొదలైంది. పెద్ద జీతగాళ్ళకు యాజమాన్యాలు కోత పెడుతున్నాయి. చిన్నజీతగాళ్ళని తరిమేస్తున్నాయి. సాలరీ ఎక్కువ ఇస్తున్నారనే ఆశతో 'మహా టీవీ'లో చేరిన రజనీ కాంత్ మున్నాళ్ళ మురిపెం పూర్తి చేసుకొని సొంత గూటికి రాక తప్ప లేదు. మహా టీవీ వారు జీతం తగ్గించటంతో చిన్నబుచ్చుకున్న రజని ఆ చానెల్ కి గుడ్ బై చెప్పేశారు. టీవీ9లో తిరిగి చేరిపోయారు. బుల్లి తెరపై రవిప్రకాష్ తర్వాత అంతటివాడిగా రజనీకాంత్ పేరు తెచ్చుకున్నాడు కాబట్టి టీవీ9కైనా మరెక్కడికైనా పోగలడు. కానీ మురళీ కృష్ణ, జకీర్ లకు టీవీ9 తప్ప వేరే గత్యంతరం లేదు. రజనీ తిరిగి రాక వీరికి రుచించడం లేదట. పాపం

Monday, June 1, 2009

ఉద్యోగాలు ఊడుతున్నా పట్టని ఎలక్ట్రానిక్ మీడియా సంఘం

మార్కెట్లో నెలకొన్న సంక్షోభం సాకుతో ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యాలు తమ సిబ్బందిలో కోత పెడుతున్నాయి. ఫలితంగా ఇప్పటికే చాలా మంది జర్నలిస్టులు రోడ్డు పాలయ్యాయి. జర్నలిస్టుల ఉద్యోగాలు ఊడుతున్నా తనకేమి పట్టనట్లు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం వ్యవహరిస్తోంది. ఈ సంఘం నేతాశ్రీలు ఎవరైనా జర్నలిస్టును కొట్టినప్పుడు నామమాత్రపు ఆందోళనలు జరిపి మీడియాలో తమ ముఖాలు, పేర్లు చూసుకోవడం తప్ప మిగతా సమయంలో కుంభకర్ణ నిద్ర నటిస్తున్నారు. వీరి దృష్టిలో జర్నలిస్టుల సంక్షేమం అంటే ఇంత వరకే. అన్యాయంగా ఉద్యోగాలు ఊడగొడుతున్న యాజమాన్యాలను ప్రశ్నించే ధైర్యం ఈ జర్నలిస్ట్ నేతలకు లేదు. పైరవీలకు మాత్రం ముందుంటారు. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘానికి ఏళ్ళ తరబడి ఎన్నికలు జరగనే లేదు. ఇంత వరకూ సభ్యత్వమే పూర్తికాలేదు. సభ్యులు లేకున్న కొనసాగుతున్న ఈ సంఘం కొద్ది మంది జర్నలిస్ట్ ప్రముఖుల కనుసన్నల్లో మెలుగుతోంది. ఇప్పటికైనా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘాన్ని క్రియాశీలకం చేయాల్సిన అవసరం ఉంది. తక్షణం సంఘానికి ఎన్నికలు జరపాలి

జెమినిని అడ్డు పెట్టుకొని ఎన్నికల్లో దండుకున్న ఆర్కె

జెమిని న్యూస్ కు పట్టిన ఆర్.జె.ప్రొడక్షన్స్ చీడ ఇప్పట్లో తొలిగేలా లేదు. ప్రతి నెల ' ఆర్కె ' కాంట్రాక్ట్ కాల పరిమితి పెంచుతూ పోవడం జెమిని ఉద్యోగులకు అసంతృప్తిని కలిగిస్తోంది. ఆర్.కె. ప్రొడక్షన్స్ వారు ' జెమిని న్యూస్ 'లో కొన్ని బులిటన్లు స్లాట్ల రూపంలో తీసుకున్నాక ఆ చానెల్ ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయింది. ఆలస్యంగా వచ్చే నాసిరకం వార్తలు, మొరటు యాంకర్లతో వచ్చే ఆర్కె బులటిన్ల కారణంగా జెమిని న్యూస్ ను చూసే వీక్షకులు మరింతగా తగ్గిపోయారు. ఇటీవలి ఎన్నికల్లో జెమిని పేరు చెప్పుకొని ' ఆర్కే ప్రొడక్షన్స్ ' చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. వార్తల సంగతి దేవుడెరుగు ఒక్కో అభ్యర్థి దగ్గర లక్షలాది రూపాయలను వసూలు చేశారట. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే తరహా పిర్యాదులు. ' సూర్యుడి గుర్తు ' లోగో మైకులు పట్టుకొని జెమిని పేరు చెప్పుకొని తిరిగే ' ఆర్కె ' సిబ్బంది అడ్డగోలు వసూల్లతో రాజకీయ నాయకులు, వ్యాపారులు హడలిపోతున్నారు. ఇంత జరుగుతున్నా ' సన్ నెట్ వర్క్ ' యాజమాన్యం తమకేమీ పట్టనట్లు కుంభకర్ణుడి నిద్ర నటిస్తోంది. ఆర్కె ప్రొడక్షన్స్ వారు వారు ఇచ్చే ముడుపులు లెక్కించుకోవడంలో బిజీగా ఉన్న చెన్నై లోని సన్ గ్రూప్ ఉన్నతాధికారులకు హైదరాబాద్ లో ఏమి జరుగుతోందో తెలుసుకునే తీరిక దొరకడంలేదు. జెమిని ప్రతిష్ట ఏమైతె వారికేం.. తమ జేబులు నిండితే చాలు.. ఈ విషయాలేవీ ' సన్ గ్రూప్ ' అధిపతులైన మారన్ సోదరులకు తెలుస్తున్నట్లు లేదు..

'ఎ టీవీ'.. ఇదేం టీవీ..

టీవీ తెరలపై ఎక్కడా కనిపించకున్నా ఫీల్డులో 'ఎ టీవీ' పేరిట లోగో మైకులు కనిపిస్తున్నాయి. సాప్ట్ వేర్, పార్మా, రియాలిటీ, గ్రానైట్, సినీ వ్యాపారాలు చేసే అడ్వాన్సాఫ్ట్ అనే అమెరికన్ కంపెనీ 'ఎ టీవీ' పేరిట ఈ చానెల్ పెట్టిందట. ఈ చనెల్ వార్తల విభాగానికి చందు జనార్ధన్ (ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉందా.. మన పాత ధనార్జనుడే లెండి) బాస్ అట. ఆయనకు తగట్టే ఇక్కడ మిడిమిడి నాలెడ్జ్ జర్నలిస్టులు ఇక్కడ చేరారు. తెలివైన వారిని చేర్చుకుంటే తన పదవికి ఎసరు పెడతారని జనార్ధన్ భయమట. 'ఎ టీవీ' జర్నలిస్టుల జీతా సైతం అత్తెసరుగా ఉన్నాయి. ఇక జిల్లా రిపోర్టర్లకు జీతాలు ఇవ్వరట వారే యాడ్స్ తెచ్చి కంపనీకి డబ్బు జమ చేయాలట. మీడియాలో ఎక్కడా నిలకడ ఉండని అసమర్ధ ధనార్జన్ని ఎ టీవీ ఎలా నమ్మి తీసుకుందో మరి. పిండి కొద్దీ రొట్టె అన్నట్లు, 'ఎ టీవీ' వార్తల్లో క్వాలిటీ ఆశించడం హాస్యాస్పదమే కదా..

సాక్షి జర్నలిస్టుల పంట పండింది

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు తమ చైర్మన్ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కడప పార్లమెంట్ సభుడిగా భారీ మెజారిటీతో గెలవడం సాక్షి పత్రిక, సాక్షి టీవీ జర్నలిస్టులకు నూతనోత్సాహాన్ని ఇచ్చింది. తెలుగుదేశం గెలిస్తే తమ మీడియాకు ఇబ్బందులు తప్పవని భయపడ్డ సాక్షి జర్నలిస్టులంతా త భవిష్యత్తుపై ఇప్పుడు ధీమాతో ఉన్నారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆనందంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి సాక్షి సిబ్బందికి జీతాలు పెంచే ఉద్దేశ్యంతో ఉన్నారని చెబుతున్నారు. అలాగే సీనియర్లందరికీ కార్లు, టూ వీలర్లు ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎన్నిక తర్వాత సిబ్బందిని తగ్గించే ప్రణాళిక తయారు చేసిన సాక్షి యాజమాన్యం ఆ ప్రతిపాదనను అటకెక్కించిందట. పాపం ఇతర పత్రికలు, టీవీల జర్నలిస్టులు. వీరెవరికి ఈసారి జీతాలు పెరగక పోగా, కొందరికి కోత పడిందట. ఎంతైనా సాక్షి జర్నలిస్టులది పూర్వజన్మ సుకృతం..

ఎన్నికల ఫలితాలపై మీడియా హాపీ

ఈమధ్యే ముగిసిన ఎన్నికల ఫలితాలు మీడియా సోదరులకు ఆనందాన్ని కలిగించాయి. మేనేజిమెంట్ల వైఖరి ఎలా ఉన్నా కాంగ్రెస్ గెలుపుపై జర్నలిస్టులంతా దాదాపుగా ఆనందంగానే ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, సెక్రెటేరియట్ బీట రిపోర్టర్లకు ఇంకా హాపీ. గత ఎన్నికల్లో అధికారం చేపట్టిన వెంటనే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జర్నలిస్టులకు హెల్త్ ఇన్స్యూరెన్స్, ఆరోగ్య శ్రీ ఫథకాలు అమలు చేయటమే కాకుండా ఇండ్ల స్థలాలను ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మరోసారి అధికారం చేపట్టిన వైఎస్ మరిన్ని మేళ్ళు చేస్తాడని జర్నలిస్టులు భావిస్తున్నారు. చంద్రబాబు మీడియా మేనేజిమెంట్లకు మాత్రమే లబ్ది చేకూరిస్తే, వైఎస్ జర్నలిస్టుల పక్షపాతి అని అంటారు. విచిత్రంగా తెలుగుదేశం బీట్ జర్నలిస్టులు సైతం మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ గెలవడం పై ఆనందంగా ఉన్నారు. తాను అధికారానికి వస్తే ఇళ్ళస్థలాలు ఇస్తానని ఆయన చెప్పిన మాటల్ని వెవరూ నమ్మలేదు. టిడిపి ఓటమి మీడియాలో ఒక వర్గానికి మాత్రమే విచారాన్ని కలిగించింది.

Monday, May 11, 2009

కమ్ముకుంటున్న సంక్షోభ ఛాయలు

అంతా అనుకున్నట్లే ఎలక్ట్రానిక్ మీడియాలో సంక్షోభంప్రారంభం అయింది. ఎన్నికలు ముగిసి ఫలితాలైనా రాకమునుపే యాజమాన్యాలు ఉద్యొగాలకు కోత పెట్టడం ప్రారంభించాయి. ఎన్-టీవీలో పలువురు జర్నలిస్టులకు ఉద్వాసన పలికారు. అదే బాటలో లోకల్ టీవీ సిబ్బందిని తగ్గించుకుంది. టీవీ-9లో కుడా సిబ్బందిని తగ్గించే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. జీ 24 గంటలు చానెల్ లోని జర్నలిస్టులకు జీతంలో 15 శాతం కోత విధించారు. జెమిని సిబ్బంది ఇంక్రిమెంట్ ముష్టి 5 శాతం మాత్రమే పెరిగింది. కొత్తగా వచ్చిన ఐ-న్యూస్ సిబ్బందికి జీతాల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. ఎన్నికల తర్వాత ఈ చానెల్ పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. అదే బాటలో హెచ్.ఎం.టీవీ పరిస్థితి కూడా. టీవీ5 చానెల్ పై కూడా అనుమానపు మేఘాలు కమ్ముకున్నాయి. తెలుగు చానెల్లన్నీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నయి. ఎన్నికల పుణ్యమా అని ఇంత కాలం నెట్టు కొచ్చిన యాజమాన్యాలు ఇక నిర్వహణా భారాన్ని తగ్గించుకోవడం పై ద్రుష్టి పెట్టాయి. ఇందులో భాగం గానే ఉద్యోగుల కుదింపు, జీతాల తగ్గింపు.

టికెట్ల కేటాయింపులో జర్నలిస్టులకు మొండి చేయి

అసెంబ్లీలో మైక్ పట్టుకొని 'అధ్యక్షా..' అని మాట్లాడదామని కలలు కన్న పలువురు జర్నలిస్టులకు రాజకీయ పార్టీలు మొండి చేయి ఇచ్చాయి. ఇంత కాలం తాము ఆ పార్టీలను నమ్ముకొని చేసిన చాకిరీకి ఇదా ప్రతిఫలం అంటూ వాపోతున్నారు పాపం. ముఖ్యంగా ముగ్గురు జర్నలిస్టులకు టికెట్లు ఇస్తామని ప్రచారం చేసుకున్న టి.ఆర్.ఎస్. రామలింగారెడ్డికి తిరిగి టికెట్ ఇవాడం తప్ప కొత్తగా ఎవరికి ఇవ్వలేదు. ఆంధోల్ నుండి టికెట్ ఆశించి భంగపడ్డ టీవీ జర్నలిస్ట్ క్రాంతి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాడు. టికెట్ కోసం ప్రయత్నించిన సీనియర్ జర్నలిస్ట్ అయోధ్య రెడ్డికి సైతం మొండిచేయి ఇచ్చారు. తెలంగాణా వాదినంటూ డబ్బా కొట్టుకునే మాజీ కమ్యూనిస్టు పల్లె రవికి అటు కె.సి.ఆర్. ఇటు దేవేందర్ గౌడ్ చేయి ఇచ్చారట. తెలుగు దేశం కొత్తగా ఏ జర్నలిస్టుకు టికెట్ ఇవ్వలేదు. టీవీ5 రిపోర్టర్ కప్పర ప్రసాద్ కొద్దిలో బి.జె.పి. టికెట్ మిస్సయాడు. ఇతగాడు టికెట్ వస్తుందనే ఆశతో టీడీపీ, కాంగ్రేస్ అభ్యర్థులతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాడట. ప్రజారాజ్యం పార్టీ ఒక్కటే నమ్ముకున్న కన్న బాబుకు టికెట్ ఇచ్చి రుణం తీర్చుకుంది.

కంట్రిబ్యూటర్ల పొట్టగొట్టిన 'స్పేస్ సెల్లింగ్'

ఎన్నికల్లో అంతో ఇంతో వెనుకేసుకుందామని ఆశ పడ్డ తెలుగు దిన పత్రికల కంట్రిబ్యూటర్లు, స్ట్రింగర్లకు చుక్కెదురైంది. ఎన్నికల్లో అభ్యర్థులు ప్రకటనలు ఇవ్వడానికి వ్యయపరిమితి అడ్డు రావడంతో దిన పత్రికల యాజమాన్యాలు 'స్పేస్ సెల్లింగ్' పేరిట వార్తలను అమ్మకానికి పెట్టాయి. ఫలితంగా ఎన్నికల్లో పోటీ చేసతున్న అభ్యర్థులంతా భారీగా చెల్లించి ధర్జాగా వార్తలు రాయించుకున్నారు. ' దూసుకెల్ల్తున్న మల్లాయ్య..' 'ఎదురులేని పుల్లాయ్య..' 'ఎల్లయ్య విజయం ఖయం..' లాంటి వార్తలు ఈకోవలోనివే. ఏకంగా పత్రికల యాజమాన్యాలే స్పేస్ సెల్లింగ్ పేరిట డబ్బులు తీసుకొని వార్తలు ఇవ్వడంతో కంట్రిబ్యూటర్లు, స్ట్రింగర్లకు అభ్యర్థుల నుండి మొండి చేయి ఎదురైంది. అయితే టీవీ చానెల్ల రిపొర్టర్లు, స్ట్రింగర్లు బాగానే వెనుకేసుకున్నారట.

Tuesday, March 10, 2009

జెమిని న్యూస్ అమ్మేస్తున్నారా?

జెమిని న్యూస్ విషయంలో సన్ నెట్ వర్క్ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ, ఈ చానెల్ను పూర్తిగా కొనేస్తున్నామని ఆర్.కె.ప్రొడక్షన్స్ ప్రచారం చేసుకుంటోంది. మీడియాలో ప్రతీ చోటా ఇదే చర్చ. వాస్తవమేమిటో జెమిని యాజమాన్యం చెప్పకపోవటంతో అక్కడ పని చేస్తున్న జర్నలిస్టులు అభద్రతా భావంతో పనిచేస్తున్నారు. జెమిని న్యూస్ చానెల్ను నడిపే విషయంలో సన్ వారికి మొదటి నుండీ అంతగా ఆసక్తి లేదు. చాలీ చాలని జీతాలకు పని చేయలేక ఎందరో ఉద్యోగులు సంస్థను విడిచిపెట్టి పోయినా కొత్తగా నియామకాలు జరగడం లేదు. రిపోర్టర్లు, సబ్ ఎడిటర్లు, కెమెరామెన్లు, కెమెరాలు, వాహనాలు.. అన్నీ కొరతే. ఆంధ్రప్రదేశ్ మార్కెట్ నుండి పే చానెల్ రూపంలో కోట్లాది రూపాయలు దండుకుంటున్న ' సన్ ' జెమిని న్యూస్ చానెల్ అభివృద్ది కోసం పైసా ఖర్చు చేయదు. పైగ ఈ చానెల్లో కొన్ని స్లాట్లను ఆర్.కె. ప్రొడక్షన్స్ అనే సంస్థకు వారి గత చరిత్ర ఏమిటో తెలుసుకోకుండానే ఇచ్చేశారు. జెమిని పేరు చెప్పుకొని ఆర్.కె. వారు మార్కెట్లో అడ్డగోలు బ్లాక్ మెయిళ్ళు, వసూళ్ళు చేస్తున్నారనేది బహిరంగ రహస్యం. జిల్లాలలో జెమిని బ్రాండ్ ను ఉపయోగించుమిని ఎన్నో అకృత్యాలకు పాల్పడుతున్నట్లు పిర్యాదులు వస్తున్నా చెవిటోడి ముందు శంఖం ఊదినట్లుగా సన్ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. కొద్ది పాటి బులెటిన్లనే నడపలేని ఆర్.కె. ప్రొడక్షన్స్, ఏప్రిల్ 1 వ తేదీ నుండి ఏక మొత్తంగా కొనేస్తున్నామని చెప్పుకుంటోంది. ఇందు కోసం చెన్నై లో జోరుగా పైరవీలు జరుగుతున్నాయి. ఆర్.కె. కమిషన్లకు ఆశ పడి కొందరు ఉన్నతాధికారులు ఇందుకు సహకారం అందిస్తున్నారని చెన్నై జర్నలిస్ట్ మిత్రులు చెబుతున్నారు. ఇక ఏప్రిల్ 1వ తేదీ నుండి జెమిని న్యూస్ ఉద్యోగుల పరిస్థితి ఏమిటీ? ఏప్రిల్ ఫూల్ అయ్యేది జెమిని న్యూస్ ఉద్యోగులా? సన్ యాజమాన్యమా?

ఎన్నికల్లో జర్నలిస్టుల మనీ టార్గెట్లు

ఎన్నికలు వచ్చాయంటే అందరికీ పండగ. రాజకీయ నాయకులు ఎన్నికల్లో అసలు టికెట్ వస్తుందా? వచ్చినా గెలుస్తామో? లేదో అనే టెన్షన్ పడుతుంటారు. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఎన్నికలు జూదంగా మారాయి. ఎంత డబ్బు ఖర్చు చేసినా గెలుస్తామనే గ్యారంటీ లేదు. కానీ మెజాకిటీ జర్నలిస్టులకు ఎన్నికలంటే ఖచితంగా పండగే. ప్రసుత ఎన్నికల కోసం మనోళ్ళంతా టార్గెట్లు పెట్టుకున్నారు. ఇంట్లో కలర్ టీవీలు, వాషింగ్ మిషన్లు మొదలుకొని బైకులు, కారు కొనడానికి ప్రణాళికలు తయారు చేసుకున్నారు. నిస్సిగ్గుగ చర్చించుకుంటున్నారు కూడా. కానీ గడ్డు మార్కెట్ రోజుల్లో అభ్యర్థులు అంతగా ఖర్చు పెట్టే సూచనలు కనిపించ లేదనే సత్యం మనోళ్ళకు దుర్వార్తే.

ఎన్నికల తర్వాత కొన్ని ఛానెళ్ళ మూత ఖాయం

ప్రస్తుతం మీడియాలో ఎవరి నోట విన్నా ఇదే మాట వినిపిస్తోంది. తెలుగులో ఇప్పటికే 20కి పైగా వినోద, వార్తా చానెళ్ళు ఉన్నాయి. మరికొన్ని త్వరలో రాబోతున్నాయి. కానీ ప్రస్తుతం కొత్త చానెళ్ళకే కాకుండా, ఇప్పటికే ప్రసారం అవుతున్న చానెళ్ళకు ఇది కష్ట కాలమే. గత ఏడాది కాలంగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంధ్య దుష్పరిణామాలు మన దేశంపై కూడా బలంగా పడుతోంది. మార్కెట్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో పత్రికలకు, చానెళ్ళకు ప్రకటనల ఆదాయం గణనీయంగా తగ్గింది. చానెళ్ళకు ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉండే వ్యాపార సంస్థలపై కూడా ఈ ప్రభావం ఉంది. ఇప్పటికే కొన్ని చానెళ్ళకు సాలరీ బిల్లు భారంగా మారింది. నేషనల్ చానెళ్ళు సైతం ఖర్చు తగ్గించుకునే పనిలో ఉన్నాయి. తెలుగులో కొత్తగా ప్రారంభం కానున్న చానెళ్ళ యజమానులు పునరాలోచనలో ఉన్నట్లు సమాచారం. కేరళకు చెందిన ఏసియానెట్ సంస్థ తెలుగులో ప్రారంభిద్దమనుకున్న న్యూస్ చానెల్ (లైసెన్స్ రాలేదని చెబుతున్నా) పురిటిలోనే పోవడం, అక్కడి జర్నలిస్టులు రోడ్డున పడటం తెలిసిందే. ఈ భయంతో కొత్తగా చానెల్ తెద్దామని ప్రయత్నాలు చేసుతున్న వారు ఆందోళనలో పడ్డారు. ఇటీవలే ప్రారంభమైన కొన్ని చానెళ్ళు ప్రస్తుతం ఇబ్బందుల్లోనే ఉన్నాయి. ఎన్నికలు అయ్యాక ఇవి బోర్డు తిప్పేయడం ఖాయమని జర్నలిస్ట్ మిత్రులంటున్నారు.

Wednesday, March 4, 2009

పురుటి లోనే చచ్చిన ఆసియానెట్ తెలుగు

చివరకు అంతా ఊహించినట్లే జరిగింది. ఆసియానెట్ తెలుగు న్యూస్ చానెల్ ప్రారంభం కాకుండానే మూత పడింది. అసలు ఈ చానెల్ ప్రారంభంపై మొదటి నుండీ అనుమానాలు ఉన్నాయి. దాదాపు ఏదు నెలల క్రితం ఆసియానెట్ సితార తెలుగు చానెల్ కోసం న్యూస్ సిబ్బందిని తీసుకున్నారు. ఈలోగా స్టార్ సంస్థ ఆసియానెట్ గ్రూప్ పై కన్నేసింది. స్టార్ వారికి తెలుగు న్యూస్ విభాగంపై అంతగా ఆసక్తి లేకపోవడంతో సితార చానెల్లో వార్తలను పెట్టలేదు. వార్తల కోసం ప్రత్యేకంగా చానెల్ పెడతామని యాజమాన్యం ఇంతకాలంగా నమ్మిస్తూ వచ్చింది. కానీ ఇంతవరకు ఈ చానల్ కు సంబంధించిన లైసెన్స్ రాలేదు. బుధవారం నాడు (04 మార్చి) ఉదయం చానెల్ యాజమాన్యం హఠాత్తుగా బోర్డు తిప్పేస్తున్నట్లు ప్రకటించింది. న్యూస్ సిబ్బందికి తలా రెండు నెలల జీతం ఇచ్చి సాగనంపుతున్నట్లు చెప్పేసింది. ఈ ప్రకటనతో అక్కడి జర్నలిస్టులో చాలా మంది కండెమ్మట నీళ్ళు తెచ్చుకున్నారు. కొత్తగా ప్రారంభం అవుతున్న పలు చానెల్లలో ఇప్పటికే నియామకాలు పూర్తి అయిన నేపధ్యంలో తమ పరిస్థితి ఏమిటో తెల్చుకోలేకపోతున్నారు. మొత్తానికి సతీష్ బాబు లక్కీ ఫెల్లో. ముందుగానే అందరిని గాలికి వదిలేసి ఎన్-టీవీ లో జర్నలిస్ట్ డైరీ పనికి కుదిరాడు. ఆసియానెట్ తెలుగు న్యూస్ సిబ్బందికి మంచి జరగానే ఆశిద్దాం..

నిరాశ పరచిన సాక్షి టీవీ

భారీ ప్రచారం - పట్టుబడులతో, ఎన్నో ఊహాగానాల మధ్య ప్రారంభమైన సాక్షి టీవీ చానెల్ ప్రేక్షకులను ఎంతో నిరాశ పరచింది. దేశంలోనే తొలిసారిగా అధునాతన హెచ్.డి. టెక్నాలజీని ఉపయోగించిన సాక్షి టీవీ, బుల్లి తెరపై నాసిరకంగా కనిపిస్తోంది. లోపం ఎక్కడున్నట్లు? న్యూస్ బులటిన్లు, ఇతర కార్యక్రమాలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. ప్రోమోలు అన్నీ డల్ గా ఉన్నాయి. సాక్షి కి పెట్టిన పెట్టుబడితో ఏకంగా మూడు చానెళ్ళు పెట్టుకోవచ్చు. ఇంత ఖర్చు పెట్టి ఏమి లాభం? అసలు సిబ్బంది ఎంపికలోనే లోపం ఉందని జర్నలిస్ట్ మిత్రులు అంటున్నారు. సాక్షిలో పైరవీల ఆధారంగానే సిబ్బంది ఎంపిక జరిగిందనేది కాదనలేని నిజం. ఇప్పటికైనా సాక్షి జయమాన్యం టీం ను మార్చాల్సిన అవసరం ఉంది.

ఆకట్టుకుంటున్న ఐ-న్యూస్

ఆటలో అరటి పండేనని అందరూ ఊహించిన ఐ-న్యూస్ క్రమంగా దూసుకు పోతోంది. ఆకర్షించే గ్రాఫిక్స్, కనులకు విందైన రంగులు, చక్కని యాంకర్లు, ఆకట్టుకుంట్న్న వార్తలు స్టొరీలు.. ఒక్కటేమిటి అన్నిరకాలుగా ఈ చానెల్ ఇప్పటికే స్థిరపడ్డ చానెళ్ళకు ధీటుగా నిలుస్తోంది. ఫీల్డ్ లో చెప్పుకోదగ్గ రిపోర్టింగ్ సిబ్బంది లేకున్న ఇతర చానెళ్ళకు ఐ-న్యూస్ గట్టి పోటీనే ఇస్తోంది. అయితే ప్రస్తుతం మార్కెట్ ఎదురుకుంటున్న గడ్డు పరిస్థితుల్లో ఈ చానెల్ ఎంత కాలం ఉంటుందో చెప్పలేమని జర్నలిస్ట్ మిత్రులంటున్నారు. ఐ-న్యూస్ ను స్పాన్సర్ చేసిన ఒక అగ్ర విద్యా సంస్థ చేతులెత్తెసిందని వినికిడి. రాజశేఖర్ కొత్త స్పాన్సర్ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది.

Friday, January 23, 2009

అక్రిడిటేషన్ కార్డులు లాక్కున్న జెమిని

అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు.. ఇలా ఉందండీ జెమిని టీవీ యాజమాన్యం వైఖరి. 2009 సంవత్సరానికి గాను తమ రిపోర్టర్లకు, కెమెరామెన్లకు జారీ అయిన అక్రిడిటేషన్ కార్డుల్ని యాజమాన్యం లాగేసుకుంది. తమ సిబ్బంది అక్రిడిటేషన్లు తీసుకొని చానెల్ వదిలిపోతారని భయమట.. ( అవునులెండి చెత్త జీతాలకు అక్కడ ఎవరు పని చేస్తారు?) యాజమాన్య షాడిస్ట్ వైఖరి కెమెరామెన్లకు ఇబ్బందిగా మారింది. జెమినిలో పని చేసే కెమెరామెన్లకు వచ్చే జీతంలో సగానికి పైగా బస్ చార్జీలకే సరిపోతుంది. తక్కువ జీతాలకు సిటీలో ఇళ్ళు దొరకక దూర గ్రామాలనుండి వచ్చే వారికి బస్ చార్జీలకు మరీ ఇబ్బందిగా ఉంది. అక్రిడిటేషన్లు మేనేజిమెంట్ లాగేసుకోవడంతో ఆర్టీసీ జారీ ఉచిత బస్ పాస్ సౌకర్యానికి నోచుకోలేక పోతున్నారు. సమాచార శాఖ మీడియా సిబ్బందికి జారీ చేసే అక్రిడిటేషన్లు యాజమాన్యం లాగేసుకోవడమేమిటి? పోనీ కనీసం బస్ ఛార్జీలైనా వారికి ఇప్పించండి. ఈ పరిస్థితికి నగేష్ అనే ప్రొడ్యూసర్ కారణమట. ప్రస్తుతం మన ATM జెమినిలో నగేష్ గారు చేస్తున్న ఘన కార్యాల్ని వెలికి తీసే పనిలో ఉంది. చూస్తూనే ఉండండి ఎబౌట్ తెలుగు మీడియా..

Sunday, January 11, 2009

' స్టూడియో-ఎన్ ' లో దళారీలు (updated)

భారీ ఎత్తున దూసుకు వస్తున్నట్లుగా ప్రచారం జరుగుతున్న ' స్టూడియో-ఎన్ ' న్యూస్ చానెల్లో అసలేం జరుగుతోందని మీడియా సోదరులందరూ ప్రశ్నించుకుంటున్నారు. ఈ ఛానెల్ న్యూస్ హెడ్ శివరామ ప్రసాద్ అధికారాలకు యాజమాన్యం కత్తెర పెట్టినట్లు తెలుస్తోంది. బహుషా ఆయన బయటకు వెళ్ళ వచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. సీటీవీకి చెందిన అంజయ్య, జయప్రసాద్ ల బ్యాచ్ స్టూడియో-ఎన్ లో చేరారని తెలియగానే ఇక ఈ చానెల్ పని అయిపోయిన్నట్లే అనే వ్యాఖ్యానాలు మీడియాలో వినిపిస్తున్నాయి. దళారీ పనుల్లో నిష్ణాతులైన సీటీవీ బ్యాచ్ ను నార్నె యాజమాన్యం ఎలా నమ్మినట్లు? అసలు వీరి గురించి సరిగ్గా విచారించే తీసుకున్నారా? అంజయ్య దళం స్టూడియో-ఎన్లో చేరటంతో ఇప్పటి వరకూ ఈ చానెల్లో చేరదామని ప్రయత్నించిన సీనియర్ జర్నలిస్టులు తమ ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పెట్టుకున్నారు. నగరానికి దూరంగా మనికొండలో ఉన్న ఈ చానెల్లో చేరితే ప్రయాణానికే రోజంతా పడితుంది. పైగా జీతాలు కూడా అతి తక్కువగా ఆఫర్ చేస్తునారు. ఈ గొడ్డు చాకిరి ఎవరు పడతారని సీనియర్లు స్టూడియో-ఎన్ కు దూరంగా ఉంటున్నారు. అంజయ్య దళం సీటీవీలోని ఉన్న సాబేర్ తదితర అనుయాయుల్ని, ఎలక్టానిక్ మీడియా ఓనమాలు తెలియని ప్రింట్ మిత్రుల్ని స్టూడియో-ఎన్ లో దింపే ప్రయత్నాల్లో ఉంది.

సాక్షి రావడం ఖాయం!

సాక్షి చానెల్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, జరుగుతున్న ప్రచారం చూసిన వారు అసలు ఈ ఛానెల్ ఇప్పట్లో వస్తుందా అని అనుమానం వ్యక్తం చేశారు. ఛానెల్ పెద్ద తలలైన శాస్త్రి, శ్రీనివాస్ రెడ్డి ల రాజీనామాలు పెద్ద దుమారాన్నే రేపాయి. తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి రెండో వారంలో సాక్షి చానెల్ ప్రసారాలకు ముహూర్తం ఖరారైంది. దిన పత్రిక తరహాలోనే ప్రస్తుత పెద్ద చానెళ్ళకు సాక్షి టీవీ గట్టి సవాలే విసరటం ఖాయం. అయితే సాక్షిలో పైరవీలతో చేరిన జర్నలిస్టులకే పెద్ద పీట వేశారన్నది కాదనలేని నిజం. దీని వల్ల ప్రతిభ ఉన్న జర్నలిస్టులకు చాలా అన్యాయం జరిగిపోయింది. ఈ లోపాన్ని సాక్షి యాజమాన్యం సవరించుకుంటుందా?.. చూద్దాం..

'ఆర్కె 'తో మరింత దెబ్బతిన్న జెమిని న్యూస్

జెమిని న్యూస్ లో కొన్ని బులిటిన్లు లీజుకు తీసుకున్న ఆర్.కె. ప్రొడక్షన్స్ దారుణంగా చతికిల పడింది. వీరు ప్రసారం చేస్తున్న నాసిరకం బులిటిన్లు చూసి జెమిని-సన్ మేనేజిమెంట్ తల పట్టుకుంతోంది. లీజు వల్ల సంస్థకు ఆదాయం సంగతేంటో కానే జెమిని న్యూస్ మరింత అద్వాన్నంగా తయారైంది. లేజుకు తీసుకున్న బులిటిన్లు కూడా సక్రమంగా ప్రసారం చేయడంలో ఆర్.కె. ప్రొడక్షన్స్ విఫలమైందని జెమిని వర్గాలు చెబుతున్నాయి. ఆర్.కె.వారు రోజుకి 16 బులిటిన్లు ఇవాల్సి ఉండగా 6,7కి మించి ఇవ్వడం లేదు( అవీ కూడా చాలా లేటుగా. మరో వైపు జెమిని న్యూస్ మొత్తాన్ని తాము కొనేసినట్లు ఆర్.కె.ప్రొడక్షన్స్ తప్పుడు ప్రచారం చేసుకుంటోంది. ఆర్.కె.తో జెమిని యాజమాన్యానికి కుదిరిన ఒప్పందం గడువు 3 నెలలకే. ఎన్నికల్లోపు అందినంత దండుకొని ఆర్.కె. ప్రొడక్షన్స్ బయట పడొచ్చేమో కానీ పోయిన ప్రతిష్టను జెమిని ఎవరు తెచ్చివ్వగలరూ?. ఇప్పటికే ఆర్.కె.వారు చేస్తున్న అరాచకాలు కథలు కథలుగా వినిపిస్తున్నాయి.

ఆర్-టీవీ ఎక్కడ?

సైలెంట్ గా ప్రారంభమైన ఆర్-టీవీ ఎక్కడా కనిపించడం లేదు. బస్సులపై ఆర్-టీవీ ప్రకటనలు చూసిన ప్రేక్షకులు తమ టీవీల రిమోట్లకు ఎంత పని చెప్పినా ఈ చానెల్ దొరకడం లేదు. మార్కెటిం ప్రమోషన్లో ఆర్-టీవీ విఫలమైంది. ఎం.ఎస్.ఓ.లు అడిగిన క్యారింగ్ చార్జీలు కట్టలేక పోవడంతో వారు ఈ చానెల్ను ప్రసారం చేయడం లేదు. ఆర్-టీవీ వర్గాల కథనం ప్రకారం ఈ చానెల్లో సరైన ప్రొఫెష్నల్స్ లేరు. తక్కువ జీతాలు, ఎక్కువ పని వేళల కారణంగా నైపుణ్యం ఉన్న సిబ్బంది ఎవరూ ఇందులో చేరటానికి రాలేదు. తక్కువ ఖర్చు, సిబ్బందితో బండి లాగించాలన్న రాయుడిగారి ఫిలాసఫీ దెబ్బతిన్నది. ఈ చానెల్లో ప్రసారం అవుతున్న ప్రోగ్రాంస్ కూడా నాసిరకంగా ఉన్నాయట.

నిరాశ పరచిన హెచ్.ఎం.టి.వి., ఐ-న్యూస్

చిరకాలంగా ఇప్పుడూ.. అప్పుడూ.. అంటూ ఊరిస్తూ వచ్చిన హెచ్.ఎం.టి.వి., ఐ-న్యూస్ చానెళ్ళు జనవరి ఒకటో తేదీన ప్రారంభం అయ్యాయి. ( టెస్ట్ సిగ్నల్ పేరిట) ఎక్కడా ప్రకటన కూడా ఇవ్వనందున ప్రేక్షకులకు తెలియలేదు. ఈ రెండు చానెళ్ళూ బహుషా జెమిని న్యూస్ కి పోటీ ఇవ్వ వచ్చేమో కానీ ఈటీవీ2, టీవీ9, టీవీ5, ఎన్-టీవీ న్యూస్ చానెళ్ళకు ఏ మాత్రం పోటీ కాదని తేలిపోయింది. హెచ్.ఎం.టి.వి. గ్రాఫిక్స్ అయితే మరీ పేలవంగా ఉన్నాయి. డాక్యుమెంటరీ చిత్రాన్ని చూస్తున్నట్లుగా ఉంది. ఐ-న్యూస్ ప్రోమో బాగుంది. మరికొంత కృషి పెడితే ఈ చానెల్ ప్రధాన చానెళ్ళకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.