Tuesday, March 10, 2009

జెమిని న్యూస్ అమ్మేస్తున్నారా?

జెమిని న్యూస్ విషయంలో సన్ నెట్ వర్క్ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ, ఈ చానెల్ను పూర్తిగా కొనేస్తున్నామని ఆర్.కె.ప్రొడక్షన్స్ ప్రచారం చేసుకుంటోంది. మీడియాలో ప్రతీ చోటా ఇదే చర్చ. వాస్తవమేమిటో జెమిని యాజమాన్యం చెప్పకపోవటంతో అక్కడ పని చేస్తున్న జర్నలిస్టులు అభద్రతా భావంతో పనిచేస్తున్నారు. జెమిని న్యూస్ చానెల్ను నడిపే విషయంలో సన్ వారికి మొదటి నుండీ అంతగా ఆసక్తి లేదు. చాలీ చాలని జీతాలకు పని చేయలేక ఎందరో ఉద్యోగులు సంస్థను విడిచిపెట్టి పోయినా కొత్తగా నియామకాలు జరగడం లేదు. రిపోర్టర్లు, సబ్ ఎడిటర్లు, కెమెరామెన్లు, కెమెరాలు, వాహనాలు.. అన్నీ కొరతే. ఆంధ్రప్రదేశ్ మార్కెట్ నుండి పే చానెల్ రూపంలో కోట్లాది రూపాయలు దండుకుంటున్న ' సన్ ' జెమిని న్యూస్ చానెల్ అభివృద్ది కోసం పైసా ఖర్చు చేయదు. పైగ ఈ చానెల్లో కొన్ని స్లాట్లను ఆర్.కె. ప్రొడక్షన్స్ అనే సంస్థకు వారి గత చరిత్ర ఏమిటో తెలుసుకోకుండానే ఇచ్చేశారు. జెమిని పేరు చెప్పుకొని ఆర్.కె. వారు మార్కెట్లో అడ్డగోలు బ్లాక్ మెయిళ్ళు, వసూళ్ళు చేస్తున్నారనేది బహిరంగ రహస్యం. జిల్లాలలో జెమిని బ్రాండ్ ను ఉపయోగించుమిని ఎన్నో అకృత్యాలకు పాల్పడుతున్నట్లు పిర్యాదులు వస్తున్నా చెవిటోడి ముందు శంఖం ఊదినట్లుగా సన్ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. కొద్ది పాటి బులెటిన్లనే నడపలేని ఆర్.కె. ప్రొడక్షన్స్, ఏప్రిల్ 1 వ తేదీ నుండి ఏక మొత్తంగా కొనేస్తున్నామని చెప్పుకుంటోంది. ఇందు కోసం చెన్నై లో జోరుగా పైరవీలు జరుగుతున్నాయి. ఆర్.కె. కమిషన్లకు ఆశ పడి కొందరు ఉన్నతాధికారులు ఇందుకు సహకారం అందిస్తున్నారని చెన్నై జర్నలిస్ట్ మిత్రులు చెబుతున్నారు. ఇక ఏప్రిల్ 1వ తేదీ నుండి జెమిని న్యూస్ ఉద్యోగుల పరిస్థితి ఏమిటీ? ఏప్రిల్ ఫూల్ అయ్యేది జెమిని న్యూస్ ఉద్యోగులా? సన్ యాజమాన్యమా?