Tuesday, March 10, 2009
ఎన్నికల తర్వాత కొన్ని ఛానెళ్ళ మూత ఖాయం
ప్రస్తుతం మీడియాలో ఎవరి నోట విన్నా ఇదే మాట వినిపిస్తోంది. తెలుగులో ఇప్పటికే 20కి పైగా వినోద, వార్తా చానెళ్ళు ఉన్నాయి. మరికొన్ని త్వరలో రాబోతున్నాయి. కానీ ప్రస్తుతం కొత్త చానెళ్ళకే కాకుండా, ఇప్పటికే ప్రసారం అవుతున్న చానెళ్ళకు ఇది కష్ట కాలమే. గత ఏడాది కాలంగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంధ్య దుష్పరిణామాలు మన దేశంపై కూడా బలంగా పడుతోంది. మార్కెట్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో పత్రికలకు, చానెళ్ళకు ప్రకటనల ఆదాయం గణనీయంగా తగ్గింది. చానెళ్ళకు ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉండే వ్యాపార సంస్థలపై కూడా ఈ ప్రభావం ఉంది. ఇప్పటికే కొన్ని చానెళ్ళకు సాలరీ బిల్లు భారంగా మారింది. నేషనల్ చానెళ్ళు సైతం ఖర్చు తగ్గించుకునే పనిలో ఉన్నాయి. తెలుగులో కొత్తగా ప్రారంభం కానున్న చానెళ్ళ యజమానులు పునరాలోచనలో ఉన్నట్లు సమాచారం. కేరళకు చెందిన ఏసియానెట్ సంస్థ తెలుగులో ప్రారంభిద్దమనుకున్న న్యూస్ చానెల్ (లైసెన్స్ రాలేదని చెబుతున్నా) పురిటిలోనే పోవడం, అక్కడి జర్నలిస్టులు రోడ్డున పడటం తెలిసిందే. ఈ భయంతో కొత్తగా చానెల్ తెద్దామని ప్రయత్నాలు చేసుతున్న వారు ఆందోళనలో పడ్డారు. ఇటీవలే ప్రారంభమైన కొన్ని చానెళ్ళు ప్రస్తుతం ఇబ్బందుల్లోనే ఉన్నాయి. ఎన్నికలు అయ్యాక ఇవి బోర్డు తిప్పేయడం ఖాయమని జర్నలిస్ట్ మిత్రులంటున్నారు.