Friday, October 5, 2007

టీవీ-5.. 'టీవీ-ఐదు ' గా ఎందుకు మారింది?..

అక్టోబర్ 2న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ప్రముఖ నటుడు చిరంజీవిల సమక్షంలో అట్టహాసంగా ప్రారంభమైన టీవీ-5 ప్రసారాలు కొద్ది నిమిషాలకే ఆగిపోవటం మిస్టరీగా మారింది. శాటిలైట్ సంబందిత సాంకేతిక అంశాలను టీవీ-5 యాజమాన్యం, సిబ్బంది కారణాలుగా చెబుతున్నా వాస్తవాలు వేరుగా ఉన్నాయి. అసలు సమస్య 'టీవీ-5' పేరులోనే ఉందని తెలుస్తోంది. సమాజానికి అన్నం, బట్టలు, గృహవసతి, వైద్యం, విద్య సక్రమంగా అందించటమే తమ లక్ష్యంగా ప్రకటించుకుంటూ టీవీ-5 ఆరంభమైంది. అయితే టీవీ-5 పేరిట ఇతర దేశాల్లో (అమెరికా, ఫ్రాన్స్, కెనడా, మంగోలియా, కాంబోడియా, థాయిలాండ్, ఇరాన్, ఆస్ట్రేలియా) పలు ఛానెళ్ళు ఇప్పటికే నడుస్తున్నాయి. టీవీ-5గా ప్రఖ్యాతి పొందిన ఫ్రెంచ్ సంస్థ ఒకటి తెలుగులో స్నేహా బ్రాడ్ కాస్టింగ్ సంస్థ 'టీవీ-5' టైటిల్ తో ఛానెల్ ప్రారంభించటంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఫలితంగా ప్రారంభమైన కొద్ది నిమిషాలకే తెలుగు 'టీవీ-5' సిగ్నల్ స్థంబించిపోయింది. ఈ భాగోతం వెనుక ఇద్దరు తెలుగు టీవీ ఛానళ్ళ యజమానుల హస్తం కూడా ఉందని ఊహాగానాలు ఉన్నాయి. టీవీ-5 పేరిట ఇతర దేశాల్లో కూడా ఛానెళ్ళు ఉన్నాయనే విషయాన్ని 'ఎబౌట్ తెలుగు మీడియా' గతంలోనే ప్రస్థావించింది. 'తెలుగు టీవీ-5' ఇప్పుడు 'టీవీ-ఐదు ' గా పేరు మార్చుకుంది.. తెలుగు మీడియాలో ఇప్పటి వరకూ ఎవరి వద్దా లేనటువంటి అత్యాధునిక టెక్నాలజీతో టీవీ-5 వస్తోందని కొద్ది రోజుగా వస్తున్న టెస్ట్ సిగ్నల్ ప్రసారాలు చెప్పకనే చెప్పాయి. టీవీ-9, ఈటీవీ-2లకు 'టీవీ-ఐదు ' గట్టి పోటీ ఇవ్వగలదని ఆశిద్దాం... ఈ వార్తా కథనంలో ఉపయోగించిన చిత్రంలో ఇతర దేశాల టీవీ-5 లోగోలు (ఎడమ) తెలుగు టీవీ-5 (కుడి) చూడవచ్చు.