కొసమెరుపు: శ్రీజ ఎంతో ఇష్టపడి తండ్రికి చిక్కకుండా పెళ్ళి చేసుకున్న శిరిష్ భరద్వాజ్ పై సంజీవరెడ్డి నగర్ పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు వెలుగు చూడటం దురదృష్టకరం. 2002లో భరద్వాజ్ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసినట్లు కేసు నమోదైంది.
Thursday, October 18, 2007
మూడు ఛానెళ్ళ పెళ్ళి
మెగాస్టార్ చిరంజీవి రెండో కూతురు ప్రేమ వివాహం అభిమానుల్లో, రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠను, సంచలనాన్ని సృష్టంచింది. అయితే ఈ వివాహ దృశ్యాలు టీవీ-9, ఈటీవీ, ఎన్-టీవీలకే పరిమితం ఎందుకయ్యాయి? దీని వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది. బోయిన్ పల్లి ఆర్యసమాజ్ లో రహస్యంగా పెళ్ళి చేసుకున్న శ్రీజ, శిరిష్ భరద్వాజ్ తమని తాము కాపాడు కోవడం కోసం ఒక పథకం ప్రకారం వ్యవహరించారు. సాంప్రదాయబద్దంగా తాము వివాహం చేసుకున్న వార్తను టీవీ ఛానెల్ ద్వారా వెల్లడిస్తే తమకు ఎలాంటి ముప్పు ఉండదని కొత్త దంపతులు భావించారు. ఇందుకోసం వారు ముందుగా ఈటీవీని ఎంచుకున్నారు. అయితే వివాహ దృశ్యాలను తీసుకున్న ఈటీవీ సిబ్బంది రామోజీ రావు అనుమతి కోసం నిరీక్షిస్తూ ప్రసారం చేయకుండా ఆలస్యం చేయటంతో శ్రీజ, భరద్వాజ్ల స్నేహితులు వెంటనే టీవీ-9కు కబురందించారట. టీవీ-9 ఈ వార్తను పదే పదే ప్రసారం చేయటంతో ప్రేక్షకులు క్రికెట్ మ్యాచి సైతం మరచి పోయి ఆ ఛానెల్ కు అతుక్కు పోయారు . పొరపాటును గ్రహించిన ఈటీవీ కూడా ఈ వార్తను ప్రసారం చేయక తప్పలేదు. అయితే శ్రీజ, భరద్వాజ్ లు జెమిని, టీవీ-ఐదు, జీ తెలుగు ఛానెళ్ళకు అందకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఈ ఛానెళ్ళ హెడ్లు చిరంజీవికి సన్నిహితులు కావడమే ఇందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.