Tuesday, October 9, 2007
'కల నెరవేరెనులే.. ఇంటి జాగా దొరుకునులే..'
ఇళ్ళ స్థలాలకు సంభందించి హైకోర్ట్ ఇచ్చిన తీర్పుపై ప్రింట్-ఎలక్ట్రానిక్ మీడియాల జర్నలిస్టులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సొసైటీల ద్వారా ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని హైకోర్ట్ స్పష్టంగా ఆదేశించటంతో I&PR పాత్ర తగ్గి జర్నలిస్టు సంఘాల హవా నడిచే అవకాశం ఉంది. అయితే ఇళ్ళ స్థలాలు ఆశిస్తున్న వారిలో సహజంగా ఎలక్ట్రానిక్ కన్నా ప్రింట్ మీడియా జర్నలిస్టులే అధికంగా ఉన్నారు. ప్రభుత్వం గతంలో ప్రింట్ వారికి పలుమార్లు ఇళ్ళ స్థలాలు ఇచ్చినందున ఈసారి తమకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు సమాచారం. 'ప్రింట్ ' ఆధిపత్యం లోని జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ గతంలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు సభ్యత్వం ఇవ్వక పోవటంతో వారు ప్రత్యేకంగా హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేసుకున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులంతా తమ వర్గ పోరాటాలను పక్కన పెట్టి ఇళ్ళ స్థలాల విషయంలో ఏకం కావటం శుభ పరిణామం. తాము కట్టుకోబోయే కలల సౌధాలని ఊహించుకుంటూ తన్మయత్మంలో మునిగి తేలుతున్న జర్నలిస్టు మిత్రులు ఔటర్ రింగ్ రోడ్డు లోపలే ఇళ్ళ స్థలాలు కావాలని కోరుకుంటున్నారు. చాలా సంవత్సరాల తర్వాత ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇస్తున్న నేపధ్యంలో ప్రింట్-ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులంతా తమ పట్టింపులను సడలించుకొని సామరస్యంగా వ్యవహరించాలని 'ఎబౌట్ తెలుగు మీడియా' కోరుకుంటోంది.