Thursday, October 11, 2007

ఎవరిని ఎవరు ఎందుకు అనుకరిస్తున్నారు?

ఎన్నికలు ముంచుకొస్తున్నాయనే తొందరలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వ పథకంగా పాపులరైన రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని పునరుద్దరిస్తామని ప్రకటిస్తే, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా తామూ తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తు ఇస్తామని ప్రకటించటం గమనించాం. ఆ తర్వాత టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పోటా పోటీగా ఒకరి పథకాలను మరొకరు కాపీ కొడుతూ వాగ్దానాలు చేస్తున్నాయి. ఇంచుమించు ఇదే పరిస్థితి మన తెలుగు టీవీ ఛానెళ్ళలో ఇదే తరహా అనుకరణ కనిపిస్తోంది. ఇటీవలే ఆరంభమైన 'టీవీ-ఐదు ','ఎన్-టీవీ ' ఛానెళ్ళు 'టీవీ-9 'ను అనుకరిస్తున్నాయనేది సుస్పష్టం. లోగోలు లేకుండా చూస్తే టీవీ-ఐదు, ఎన్-టీవీ యాంకర్ల డ్రెస్, కట్టూ బొట్టు, గ్రాఫిక్స్, ప్రోమో, క్రొమోలను గమనిస్తే టీవీ-9కు ఈ ఛానెళ్ళకు పెద్దగా తేడా కనిపించదు. అయితే కొద్ది రోజులుగా విచిత్రంగా 'టీవీ-9' రివర్స్ గేర్లో 'టీవీ-ఐదు ','ఎన్-టీవీ'లకు చెక్ పెట్టేందుకా అన్నట్లు ఆ ఛానెళ్ళను అనుకరిస్తున్నట్లు కనిపిస్తోంది. మంచి ఎక్కడున్నా స్వీకరించడంలో తప్పు లేదు. అయితే అదే సమయంలో ప్రతి ఛానెల్ తన సొంత ముద్రను అర్పాటు చేసుకోవడం మంచిది. ప్రస్తుతం తెలుగు 24 గంటల ఛానెళ్ళలో 'ఈటీవీ-2', 'జెమిని న్యూస్ 'లు తప్పిస్తే 'టీవీ-9','టీవీ-ఐదు ','ఎన్-టీవీ'లను చూస్తే తెలుగుదనం మచ్చుకైనా కనిపించదు. ఎవరైనా కొత్తవారు సౌండ్ తగ్గించి చూస్తే ఏదో విదేశీ ఛానెళ్ళు చూస్తున్నట్లే ఉంటుంది తప్ప తెలుగు ఛానెళ్ళలా అనిపించవు.