Saturday, October 6, 2007
'సూర్య ' ప్రకాశిస్తుందా?..
తెలుగులో మరో దిన పత్రికగా 'సూర్య ' రాబోతోంది. విజయదశమి పర్వదినాన సూర్య ప్ర్రారంభమౌతోంది. మొత్తం 16 ఎడిషన్లతో ప్రారంభమౌతున్న సూర్య సర్వత్రా చర్చనీయ అంశంగా మారింది. తెలుగులో తొలి మూడు స్థానాల్ని ఆక్రమించుకున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త దినపత్రికలకు సూర్య ఏ విధమైన పోటీ ఇవ్వనుందో చూడాలి. ఇప్పటికే ప్రచురితమౌతున్న సూర్య డమ్మీ కాపీని చూసిన వారు ప్రింట్ క్వాలిటీ చాలా ఉన్నత ప్రమాణాలతో (హిందు దినపత్రిక మాదిరి) ఉందంటున్నారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, కాంగ్రెస్ నేత నూకారపు సూర్యప్రకాశ్ రావు తెస్తున్న 'సూర్య ' దిన పత్రిక ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కోరుకున్నట్లుగా 'ఆ' రెండు దినపత్రికలకు పోటీగా, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల్ని సమర్ధించే వాణిగా మారుతుందని భావిస్తున్నారు. నిజానికి సూర్య దినపత్రిక ఉగాది రోజునే ప్రారంభించాలని భావించారు. కానీ ఈలోగా నాదర్ గుల్ భూకుంభకోణం వెలుగు చూడటంతో సూర్య ప్రకాశ్ రావుకు ఆర్ధిక కష్టాలు మొదలై పత్రిక పనులు ఆలస్యం అయ్యాయి. ఈ మధ్య కాలంలోనే 'సూర్య ' ముఖ్యమంత్రి తనయుడు జగన్మోహన్ రెడ్డి తెస్తున్న 'సాక్షి 'లో విలీనం అవుతోందనే పుకార్లు వినిపించాయి. 'సూర్య ' దినపత్రికకు సత్యమూర్తి ఎడిటర్. ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా వై.ఎస్.ఆర్.శర్మ, న్యూస్ ఎడిటర్ గా రమణ, స్టేట్ నెట్ వర్క్ ఇంఛార్జిగా అంకం రవి పని చేస్తున్నారు.