Saturday, September 8, 2007

' స్టింగ్ ' పరేషాన్..

రేటింగ్లు పెంచుకోవడంలో భాగంగా కొన్ని ఛానెళ్ళు ఆడే డ్రామాలకు అమాయకులు బలవుతున్నారు. ఢిల్లీ లో 'లైవ్ ఇండియా' ఛానెల్ ఒక పాఠశాల ఉపాధ్యాయురాలు అమాయక యువతులను వ్యభిచార ఊబిలోకి దింపుతోదని ప్రసారం చేసిన వార్తకు ఎంత అల్లరి జరిగిందో అందరికీ తెలుసు. ఈ ఛానెల్ రిపోర్టర్ ప్రకాశ్ సింగ్ ఇందుకోసం నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ కు కిరాయి యువతిని ఉపయోగించాడని నిరూపితమైంది. పోలీసులు ఈ రిపోర్టర్ను అరెస్ట్ చేశారు. ఇక మన రాష్ట్రంలో కొత్తగా ప్రారంభం అయిన ఎన్-టీవీ ఉస్మానియా యూనివర్సిటీ స్టింగ్ ఆపరేషంపై కూడా ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఈ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన రిపొర్టర్ రెహనా సరైన హోం వర్క్ చేయక పోవడమో లేదా ఉద్దేశ్య పూర్వకంగా సదరు ప్రొఫెసర్ ను ఇరికించే ప్రయత్నమో తెలియదు కానీ, విధ్యార్థులంతా ఏకమై ఎన్-టీవీ ప్రతినిధులు క్యాంపస్ లోకి వస్తే తంతామని, ఓబీ వ్యాన్ తగల బెడతామని హెచ్చరించారట. కొద్ది నెలల క్రితం ఇండియా టీవీ రిపొర్టర్లు సెక్స్ వర్కర్లతో కలిసి కొందరు బిహార్ ప్రజాప్రతినిధులను అల్లరి పెట్టి, ఆ విజువల్స్ రోజంతా ప్రసారం చేసి జిగుస్స కలిగించారు. ఛానెళ్ళ రేటింగ్లను పెంచుకోవడానికి చేసే ఇలాంటి అనైతిక స్టింగ్ ఆపరేషన్లు సమాజానికి పరేషాన్లుగా మారుతున్నాయి. ఈ విషయంలో జర్నలిస్టులంతా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తమ స్టింగ్ ఆపరేషన్ ద్వారా సమాజానికి ఏమైనా మేలు జరిగితే సంతోషమే, కానీ ఛానెల్ పబ్లిసిటీ కోసం దిగజారిపోతే జర్నలిస్టులకు, వ్యభిచారిణులకు తేడా ఏముంటుంది.