Wednesday, September 5, 2007

కళానిధి మారన్ జీతం రూ. 23,26,00,000/- .. సరే మరి జెమిని ఉద్యోగుల జీతాల మాటేమిటి?..

తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో డజనుదాకా ఛానెళ్ళు నడుపుతున్న సన్ నెట్ వర్క్ సీఎండి కళానిధి మారన్ సంవత్సర జీతం అక్షరాలా ఇరవై మూడు కోట్ల ఇరవై ఆరు లక్షలు (రూ.23,26,00,000/-) మాత్రమేనట. అనగా నెలకు రూ.1,93,83,333 +.. ఇండియాలో అత్యధిక వార్షిక వేతనం తీసుకుంటున్న వారిలో కళానిధి మారన్ రెండో స్థానంలో ఉన్నారు. మూడో స్థానంలో ఇదే సంస్థకు చెందిన జె ఎండి కావేరి మారన్ ఉన్నారు. ఈ విషయం 03/09/2007 నాటి దిన పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. సంతోషం ఒక మీడియా ప్రముఖుడు టాప్ టెన్లో రెండో స్థానం పొందాడనుకుందామా? మరి సన్ గ్రూప్ లోని జెమిని, జెమిని న్యూస్, తేజ, ఆదిత్య ఛానెళ్ళ ఉద్యోగుల జీతాల విషయానికి వస్తే.. చెప్పుకుంటే సిగ్గు చేటు. అందరి జీతాల సగటు నెలకు రూ. 4-8 వేలు దాటదు. జెమిని ఛానెల్లన్నింటిని పే ఛానెళ్ళుగా మార్చి కోట్లాది రూపాయల్ని తమిళనాడుకు కొల్లగొట్టుకు పోతున్న మారన్ గారికి ఇక్కడి ఉద్యోగుల అర్ధకలి కేకలు పట్టవా? తాను మాత్రమే కోట్లాది రూపాయలు తీసుకుంటే చాలా? ఇతర తెలుగు ఛానెళ్ళతో పోలిస్తే జెమిని ఉద్యోగుల జీతాలు చాలా దారుణంగా ఉన్నాయి. అసలు ఈ విషయం మారన్ దృష్టికి వచ్చిందా? జీతాలు పెంచుతామంటూ నెలల తరబడి ఊరించిన యాజమాన్యం సముద్రంలో కాకి రెట్టంతే పెంచి చేతులు దులుపుకుంది. మారన్ గారు తన జీతంలో కనీసం ఒక శాతం తగ్గించుకొని జెమిని ఉద్యోగుల ఇచ్చినా వారు సమాజంలో గౌరవంగా బతుకుతారు.
జెమిని నుండి వలసలు
జెమిని నుండి ఇతర ఛానెళ్ళకు వలసలు ఉదృతం అయ్యాయి. జీతాలు చాలక వెళ్ళి పోతున్న వారి విషయంలో లోకల్ మేనేజిమెంట్ చేతులెత్తేసినట్లు తెలిసింది. మరికొద్ది రోజుల్లో ఉద్యోగుల సంఖ్య సగానికి పడిపోనుంది. కొత్త వారిని చేర్చుకునే విషయంలో సన్ యాజమాన్యం మీన మేషాలు లెక్కించడం ఆశ్చర్యకరం. ఇక్కడి దరిద్రపు జీతాలకు ఎవరొస్తారు?