Sunday, September 2, 2007

ఆధ్యాత్మిక ఛానెళ్ళ అవసరం ఉందా?

ఆంధ్ర దేశాన భక్తి రసం వరదలై ప్రవహిస్తుందా అన్నట్లు ఆధ్యాత్మిక ఛానెళ్ళు ప్రారంభం అయ్యాయి. టీవీ-9వారి 'సంస్కృతి ' ఎన్-టీవీ వారి 'భక్తి ' ఇప్పటికే ఆరంభం కాగా, తిరుమల తిరుపతి దేవస్థానం త్వరలో 'శ్రీ వేంకటేశ్వర ' ఛానెల్ ను ప్ర్రారంభిస్తోంది. ఈటీవీ, మాటీవీ, జెమిని యాజమాన్యాలు కూడా ఇలాంటి ఆధ్యాత్మిక ఛానెళ్ళు ప్రారంభిస్తాయని వినిపిస్తోంది. సమాజంలో హింస, స్వార్ధం, అవినీతి విచ్చలవిడిగా పెరిగి పోతున్న ప్రస్తుత తరుణంలో ఆధ్యాత్మిక ఛానెళ్ళ ఆగమాన్ని స్వాగతించాల్సిందే.. అయితే ఈ ఛానెళ్ళు ఆయా యాజమాన్యాలకు ఆర్ఠికంగా గిట్టుబాటు అవుతాయా అన్నదే ప్రశ్న. జాతీయ స్థాయిలో (హిందీలో) ఇప్పటికే కొన్ని ఆధ్యాత్మిక ఛానెళ్ళు విజయవంతంగా నడుస్తున్నాయి. పలువురు స్వామీజీలు, యోగా గురువులు తమ ప్రసంగాలు,ఆసనాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇవి దేశ వ్యాప్తంగా చూసే ఛానెళ్ళు కాబట్టి ప్రేక్షకుల ఆధరణకు తగ్గట్టు యాడ్ రెవెన్యూతో నెట్టుకు వస్తున్నాయి. తెలుగులో ఇప్పటికే రెగ్యులర్ ఛానెళ్ళు ఉదయం పూట ఇస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు సీనియర్ సిటిజన్ల వీక్షణానికే పరిమితం అవుతున్నాయి. వీరు కూడా పొద్దున ఆధ్యాత్మిక ప్రసంగాలు వింటున్నా, రోజంతా కుటుంబ నేపధ్య సేరియళ్ళు చూడటానికి ఆసక్తి చూపిస్తారు. ఈ పరిస్థితిలో ఆధ్యాత్మిక ఛానెళ్ళు ఆర్ధికంగా లాభదాయకం కాకున్నా, నిర్వహణ ఖర్చులైనా తిరిగి వస్తాయా?.. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకన్నకు భక్తులు ఇచ్చే కానుకలతో 'శ్రీ వేంకటేశ్వర ' ఛానెల్ ను నడుపుతుంది. మరి మిగతా ఛానెళ్ళ యాజమాన్యాలు ఈ సబ్సిడీని భరించగలవా? క్రైస్తవ మత ప్రచార సంస్థలు ఇచ్చే ప్రకటణలు, స్వామీజీల ప్రసంగాల లైవ్ల ఆదాయంపై ఆశతోనే ఆధ్యాత్మిక ఛానెళ్ళు పెడుతున్నారనే ప్రచారం ఉంది.ఇది ఎంత వరకు నిజమో తెలియదు.