Wednesday, September 26, 2007
'కేబుల్' తో సన్ 'డిష్'యూం..
ఏకపక్ష నిర్ణయాలతో తరచూ కేబుల్ ఆపరేటర్లు, ఎం.ఎస్.ఓ.లతో గిల్లి కజ్జాలకు దిగే సన్ టీవీ నెట్ వర్క్ రాష్ట్రంలో మరో యుద్దానికి తెరలేపుతోంది. సన్ వారి ఈ తాజా ఎత్తుగడ కేబుల్ రంగాన్నే దెబ్బ తీయబోతోంది. సన్ డీటీహెచ్ వచ్చే నెలలో ప్రారంభం అవుతోంది. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న టాటా స్కై, డిష్ టీవీ డిటిహెచ్లకన్నా తక్కువ ధరకే సన్ డిటిహెచ్ అందుబాటులోకి రానుంది. బహుషా కేవలం రు.75/-కే అన్ని తెలుగు ఛానెళ్ళు సన్ డీటీహెచ్ ప్యాకేజీలో అభిస్తున్నాయని వినికిడి. సన్ డిటిహెచ్ ఎత్తుగడ కేబుల్ రంగం పునాదులనే కదిలిస్తుందని భావిస్తున్నారు. గతంలో ఫే ఛానెళ్ళ విషయంలో సన్ నెట్ వర్క్ ఏక పక్ష నిర్ణయాల విషయంలో కేబుల్ ఆపరేటర్లు సమ్మెకు దిగిన సంగతి అందరికీ గుర్తుండే వుంటుంది. తాజా 'డీటిహెచ్ వార్ ' ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.
Thursday, September 20, 2007
అక్టోబర్ 2న 'టీవీ-5' ప్రారంభం
తెలుగులో మరో శాటిలైట్ ఛానెల్ 'టీవీ-5' అక్టోబర్ 2న ప్రారంభం అవుతోంది. ఇప్పటి వరకూ తెలుగులో ఏ ఛానెల్ దగ్గరా లేనంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని టీవీ-5 ఉపయోగించ బోతోందని సమాచారం. టెక్నాలజీ + మీడియా పేరిట హైదరాబాద్ లోని పలు కూడళ్ళలో టీవీ-5 ప్రచారం కూడా ప్రారంభమైంది. ఇప్పటికే టీవీ-5 టెస్ట్ సిగ్నల్ ఆరంభమైంది. ఫీల్డ్ పైన్ టీవీ-5 రిపోర్టర్లు గత 5-6 నెలలుగా ఉరుకులు పరుగులు తీస్తున్నారు. టీవీ-5లో ఎందరో హేమాహేమీ జర్నలిస్టులు కనిపిస్తున్నారు. బి.ఆర్. నాయుడు ఛైర్మన్ గా, శివరామ ప్రసాద్ ఎం.డి.గా ఇటీవలే అక్కడ చేరిన కొమ్మినేని శ్రీనివాస్ రావు, కరీం మొదలు బ్రహ్మానంద రెడ్డి, కందుల రమేష్, ఐ.సత్యనారాయణ, భాస్కర్, కన్నెగంటి.. టీవీ-5ను లీడ్ చేయబోతున్నారు. అయితే రిపోర్టర్లలో పేరున్న తలకాయలు అంతగా కనిపించడం లేదన్నది 100 శాతం సత్యం. అందరూ పల్లకి ఎక్కిన వాల్లే (బాస్) కనిపిస్తున్న టీవీ-5 తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో ప్రారంభమైతే కానీ తెలియదు. టీవీ-5 యాజమాన్యం ఇటీవలే చేరిన కరీం ఏదో చేస్తాడని గట్టిగా నమ్ముకుంటోందట. ఈ మాజీ రవిప్రకాశ్ శిష్యున్ని చంద్రబాబు నాయుడు టీవీ-5కు రికమండ్ చేశారని ప్రచారం జరుగుతోంది.. టీవీ-5 కూడా 'ఎన్-టీవీ'లా నిరుత్సాహ పరచదని ఆశిద్దాం.. Best of Luck TV5
Wednesday, September 19, 2007
'జీ తెలుగు 'లో మా 'కర్మ '.. 'రాజ్ 24'కి రమణ..
'జీ తెలుగు ' లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. 'మా టీవీ'కి రాజీనామా చేసిన రాజేశ్వర్ శర్మ 'జీ'లో చేరి పోయాడు. ఇంత కాలం జీ తెలుగులో కో ఆర్డినేటర్ గా పని చేస్తున్న ఎంవి రమణ 'త్వరలో రాబోతున్న 'రాజ్ 24' ఛానెల్ కి ఇన్ పుట్ ఎడిటర్ గా వెళ్ళి పోయాడు. సాలరీ ఏకంగా రూ.40 వేలని వినికిడి. ఇక జెమిని టీవీ క్రైం రిపోర్టర్ గౌసుద్దీన్ 'జీ'లో చేరి పోయాడు. 'జీ'లోనే సీనియర్ రిపోర్టర్ గా పని చేస్తున్న సతీశ్ కమాల్ ను డెస్క్ కు బదిలీ చేశారు. ఇదిలా ఉంచితే మాటీవీలో అందరితో గొడవ పెట్టుకొని వెలివేతకు గురై 'మా కర్మ ' గా పేరొందిన రాజేశ్వర్ శర్మకు 'జీ తెలుగు 'హెడ్ శైలేశ్ రెడ్డి ఎలా అవకాశం ఇచ్చారో? శర్మ అక్కడైనా బుద్దిగా పని చేస్తాడని ఆశిద్దాం...
'జెమిని ' లో రిపోర్టర్ల వలసలు ఆరంభం
ఇప్పటికే కెమరామెన్ల వలసలతో సతమతం అవుతున్న 'జెమిని న్యుస్ 'లో రిపోర్టర్ల రాజీనామాలు ఆరంభమయ్యాయి. సీనియర్ రిపోర్టర్ గౌసుద్దీన్ 'జీ తెలుగు 'లో చేరిపోయాడు. ఈయనను అకారణంగా డెస్క్ కు బదిలీ చేయడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. జెమినిలో ఏకైక లేడీ రిపోర్టర్ అజిత కూడా 'టీవీ 5' చేరిపోయింది. మరో ముగ్గురు రిపోర్టర్లు కూడా ఇతర ఛానెళ్ళలో చేరటానికి అగ్రిమెంట్లు కుదిర్చుకున్నారని వినికిడి. అత్తెసరు జీతాలకు తోడు యాజమాన్య వేధింపులే ఈ రాజీనామాల పర్వానికి కారణమని చెబుతున్నారు. కొత్త ఛానెళ్ళలో మంచి జీతాలతో ఆఫర్లు వచ్చి పడుతుంటే ఇంకా ఫ్యూడల్ మెంటాలిటీ 'జెమిని 'లో పని చేయడం అర్ధం లేని పని అని రాజీనామా చేసిన ఒక రిపోర్టర్ అంటున్నారు. ఈ పరిస్థితికి కారకుడైన కో ఆర్డినేటర్ మునిరాజు సెలవుపై వెల్లిపోయాడు. ఆయనా కొత్త ఉద్యోగం వెతుక్కుంటున్నాడని వినికిడి. ఇంత జరుగుతున్నా సన్-జెమిని యాజమాన్యంలో చలనం లేదు. 'వెల్లే వారు వెల్లిపోనీ ఇంతకన్నా తక్కువ జీతాలకు పని చేయడానికి చాలా మంది వస్తారు ' అని యాజమాన్యం బాహాటంగా చెప్పుకుంటోందిట. 'వినాశ కాలే విపరీత బుద్ది ' అంటే ఇదేనేమో...
Monday, September 17, 2007
Thursday, September 13, 2007
ఎన్-టీవీకి కొమ్మినేని గుడ్ బై.. టీవీ-5లో చేరిక..
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ రావు (కె.ఎస్.ఆర్) బుడ్ బై చెప్పారు. నరేంద్ర చౌదరి, రామానుజంలతో సరిపడక ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. భారీ వ్యయంతో అట్టహాసంగా ప్రారంభమైన ఎన్-టీవీ ఆశించిన రీతిలో క్లిక్ కాకపోయేసరికి కొమ్మినేనిపై నరేంద్ర చౌదరి గుర్రుగా ఉన్నారని ఎన్-టీవీ వర్గాలు తెలిపాయి. ఇందుకు పూర్తిగా కొమ్మినేనినే బాధ్యున్ని చేయటంతో ఆయన మనస్థాపం చెందిని రాజీనామా చేశారని అంటున్నారు. మరో వాదన ప్రకారం కొమ్మినేని తెలుగుదేశం పక్షపాతి అయినందువల్లే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఎన్-టీవీ ఆయన్ని వదిలించుకుందని అంటున్నారు. ఎన్-టీవీలో మంత్రి షబ్బీర్ అలీ కూడా భాగస్వామి అని వస్తున్న వార్తలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. ఏది ఏమైనా కొమ్మినేని విషయంలో ఎన్-టీవీ యాజమాన్యం తొందర పడిందేమో? (లేక కొమ్మినేనే తొందర పడ్డారా?) 'న్యూస్ టైం' పత్రికను నడపడంలో విఫలమైన రామానుజం ఇక ఎన్-టీవీని ఎలా గట్టెక్కిస్తాడో చూడాలి. ఎన్-టీవీ నుండి బయటకు వచ్చిన కొమ్మినేని శ్రీనివాస రావు టీవీ-5లో చేరబోతున్నారు. ఎవరికి వారే బాసులుగా ఫీలయ్యే టీవీ-5లో కొమ్మినేని ఎలా నెట్టుకొస్తారో చూడాల్సిందే. అసలు ప్రింట్ మీడియాలో సుధీర్ఘ అనుభవం ఉన్న కొమ్మినేని ఎలక్ట్రానిక్ మీడియాలోకి వచ్చి తప్పు చేశారేమో?.. జర్నలిజంలో తలపండిన మేధవిగా, రాజకీయ విశ్లేషకునిగా పేరొందిన కొమ్మినేని శ్రీనివాస రావు టీవీ-9, జెమిని న్యూస్ చర్చా వేదికల్లో పాల్గొని తన వాదనలతో అందరినీ మెప్పించారు. ఈ అనుభవంతో ఆయన తొందరపడి ఎలక్ట్రానిక్ మీడియాలో సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించాలని ఆశపడి ఉంటారు. కాని 'గ్లామర్ ' ప్రపంచం ఆయన్ని గుర్తిస్తే కదా?.. చూద్దాం కొమ్మినేని టీవీ-5లో ఏ అద్భుతాలు సృష్టిస్తారో..
Saturday, September 8, 2007
' స్టింగ్ ' పరేషాన్..
రేటింగ్‌లు పెంచుకోవడంలో భాగంగా కొన్ని ఛానెళ్ళు ఆడే డ్రామాలకు అమాయకులు బలవుతున్నారు. ఢిల్లీ లో 'లైవ్ ఇండియా' ఛానెల్ ఒక పాఠశాల ఉపాధ్యాయురాలు అమాయక యువతులను వ్యభిచార ఊబిలోకి దింపుతోదని ప్రసారం చేసిన వార్తకు ఎంత అల్లరి జరిగిందో అందరికీ తెలుసు. ఈ ఛానెల్ రిపోర్టర్ ప్రకాశ్ సింగ్ ఇందుకోసం నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ కు కిరాయి యువతిని ఉపయోగించాడని నిరూపితమైంది. పోలీసులు ఈ రిపోర్టర్‌ను అరెస్ట్ చేశారు. ఇక మన రాష్ట్రంలో కొత్తగా ప్రారంభం అయిన ఎన్-టీవీ ఉస్మానియా యూనివర్సిటీ స్టింగ్ ఆపరేషంపై కూడా ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఈ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన రిపొర్టర్ రెహనా సరైన హోం వర్క్ చేయక పోవడమో లేదా ఉద్దేశ్య పూర్వకంగా సదరు ప్రొఫెసర్ ను ఇరికించే ప్రయత్నమో తెలియదు కానీ, విధ్యార్థులంతా ఏకమై ఎన్-టీవీ ప్రతినిధులు క్యాంపస్ లోకి వస్తే తంతామని, ఓబీ వ్యాన్ తగల బెడతామని హెచ్చరించారట. కొద్ది నెలల క్రితం ఇండియా టీవీ రిపొర్టర్లు సెక్స్ వర్కర్లతో కలిసి కొందరు బిహార్ ప్రజాప్రతినిధులను అల్లరి పెట్టి, ఆ విజువల్స్ రోజంతా ప్రసారం చేసి జిగుస్స కలిగించారు. ఛానెళ్ళ రేటింగ్లను పెంచుకోవడానికి చేసే ఇలాంటి అనైతిక స్టింగ్ ఆపరేషన్లు సమాజానికి పరేషాన్లుగా మారుతున్నాయి. ఈ విషయంలో జర్నలిస్టులంతా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తమ స్టింగ్ ఆపరేషన్ ద్వారా సమాజానికి ఏమైనా మేలు జరిగితే సంతోషమే, కానీ ఛానెల్ పబ్లిసిటీ కోసం దిగజారిపోతే జర్నలిస్టులకు, వ్యభిచారిణులకు తేడా ఏముంటుంది.
జెమినిలో కక్ష సాధింపు బదిలీలు?
జెమిని న్యూస్ లో కొందరు సీనియర్లను బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. సీనియర్ రిపోర్టర్లు బ్రహ్మం, మహ్మద్ గౌస్ లను డెస్కుకు పంపారు. డెస్క్ ఇంచార్జ్ యాజులు, సీనియర్ సబ్ ఎడిటర్ బొల్లం రాజు లను చెన్నైకి బదిలీ చేస్తున్నారు. వీరిని బదిలీ చేయడానికి సరైన కారణాలేవీ యాజమాన్యం చూపించలేదు. త్వరలో మరి కొన్ని బదిలీలు తప్పవని తెలుస్తోంది. బదిలీ అయిన వారిలో ఒకరిద్దరు రాజీనామా చేసే అవకాశం ఉంది. ఈ పరిణామాలతో మిగతా ఉద్యోగులంతా ఆందోళన చెందుతున్నారు. కో ఆర్డినేటర్లు మునిరాజులు, నగేష్, రిపోర్టర్ గమ్మిడి శ్రీనివాస్ యాజమాన్యానికి చెప్పిన తప్పుడు చాడీలే బదిలీలకు కారణం అని తెలుస్తోంది. ఇప్పటికే జెమిని న్యూస్ లో కెమెరామెన్లంతా ఇతర ఛానెళ్ళలో చేరి పోయారు. పని తెలియని పెళ్ళి వీడియోగ్రాఫర్లను చేర్చుకొని నానా తంటాలు పడుతున్న జెమిని న్యూస్ కు త్వరలో వలస పోనున్న రిపోర్టర్లు మరో షాక్ ఇవ్వబోతున్నారు. జెమినిలో ముష్టి జీతాలకు తోడు మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు అకారణ వేధింపులు అక్కడి సిబ్బందికి ఆందోళన కలిగిస్తున్నాయి.
Wednesday, September 5, 2007
కళానిధి మారన్ జీతం రూ. 23,26,00,000/- .. సరే మరి జెమిని ఉద్యోగుల జీతాల మాటేమిటి?..
తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో డజనుదాకా ఛానెళ్ళు నడుపుతున్న సన్ నెట్ వర్క్ సీఎండి కళానిధి మారన్ సంవత్సర జీతం అక్షరాలా ఇరవై మూడు కోట్ల ఇరవై ఆరు లక్షలు (రూ.23,26,00,000/-) మాత్రమేనట. అనగా నెలకు రూ.1,93,83,333 +.. ఇండియాలో అత్యధిక వార్షిక వేతనం తీసుకుంటున్న వారిలో కళానిధి మారన్ రెండో స్థానంలో ఉన్నారు. మూడో స్థానంలో ఇదే సంస్థకు చెందిన జె ఎండి కావేరి మారన్ ఉన్నారు. ఈ విషయం 03/09/2007 నాటి దిన పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. సంతోషం ఒక మీడియా ప్రముఖుడు టాప్ టెన్‌లో రెండో స్థానం పొందాడనుకుందామా? మరి సన్ గ్రూప్ లోని జెమిని, జెమిని న్యూస్, తేజ, ఆదిత్య ఛానెళ్ళ ఉద్యోగుల జీతాల విషయానికి వస్తే.. చెప్పుకుంటే సిగ్గు చేటు. అందరి జీతాల సగటు నెలకు రూ. 4-8 వేలు దాటదు. జెమిని ఛానెల్లన్నింటిని పే ఛానెళ్ళుగా మార్చి కోట్లాది రూపాయల్ని తమిళనాడుకు కొల్లగొట్టుకు పోతున్న మారన్ గారికి ఇక్కడి ఉద్యోగుల అర్ధకలి కేకలు పట్టవా? తాను మాత్రమే కోట్లాది రూపాయలు తీసుకుంటే చాలా? ఇతర తెలుగు ఛానెళ్ళతో పోలిస్తే జెమిని ఉద్యోగుల జీతాలు చాలా దారుణంగా ఉన్నాయి. అసలు ఈ విషయం మారన్ దృష్టికి వచ్చిందా? జీతాలు పెంచుతామంటూ నెలల తరబడి ఊరించిన యాజమాన్యం సముద్రంలో కాకి రెట్టంతే పెంచి చేతులు దులుపుకుంది. మారన్ గారు తన జీతంలో కనీసం ఒక శాతం తగ్గించుకొని జెమిని ఉద్యోగుల ఇచ్చినా వారు సమాజంలో గౌరవంగా బతుకుతారు.
జెమిని నుండి వలసలు
జెమిని నుండి ఇతర ఛానెళ్ళకు వలసలు ఉదృతం అయ్యాయి. జీతాలు చాలక వెళ్ళి పోతున్న వారి విషయంలో లోకల్ మేనేజిమెంట్ చేతులెత్తేసినట్లు తెలిసింది. మరికొద్ది రోజుల్లో ఉద్యోగుల సంఖ్య సగానికి పడిపోనుంది. కొత్త వారిని చేర్చుకునే విషయంలో సన్ యాజమాన్యం మీన మేషాలు లెక్కించడం ఆశ్చర్యకరం. ఇక్కడి దరిద్రపు జీతాలకు ఎవరొస్తారు?
Sunday, September 2, 2007
టీవీ-5లో కరీం
ఎట్టకేలకు టీవీ-9 మాజీ ఫేం కరీం టీవీ-5లో చేరిపోయాడు. కరీంకు ఔట్ పుట్ ఎడిటర్ బాధతలు ఇచ్చారని తెలిసింది. తేజా టీవీ, టీవీ-9లలో రవిప్రకాశ్ నీడలో ఎదిగిన కరీం కొంత కాలంగా వ్యక్తిగ జీవితంలో ఒడిదుడుకులు, చీటింగ్, పోలీస్ కేసులతో సతమతం అవుతూ మీడియాకు దూరంగా ఉన్నాడు. టీవీ-5 జాబ్ తో కరీంకు మళ్ళీ మీడియాలో పునర్జన్మ అభించిందని చెప్పవచ్చు. ఎలక్ట్రానిక్ మీడియాలో అంతగా ఫేస్ వ్యాల్యూలేని వారిని చేర్చుకొని సతమతం అవుతున్న టీవీ-5ను కరీం ఆదుకుంటాడని యాజమాన్యం ఆశ పెట్టుకుంది. చూడాలి మరి కరీం ఏం మాయ చేయబోతున్నడో..
ఆధ్యాత్మిక ఛానెళ్ళ అవసరం ఉందా?
ఆంధ్ర దేశాన భక్తి రసం వరదలై ప్రవహిస్తుందా అన్నట్లు ఆధ్యాత్మిక ఛానెళ్ళు ప్రారంభం అయ్యాయి. టీవీ-9వారి 'సంస్కృతి ' ఎన్-టీవీ వారి 'భక్తి ' ఇప్పటికే ఆరంభం కాగా, తిరుమల తిరుపతి దేవస్థానం త్వరలో 'శ్రీ వేంకటేశ్వర ' ఛానెల్ ను ప్ర్రారంభిస్తోంది. ఈటీవీ, మాటీవీ, జెమిని యాజమాన్యాలు కూడా ఇలాంటి ఆధ్యాత్మిక ఛానెళ్ళు ప్రారంభిస్తాయని వినిపిస్తోంది. సమాజంలో హింస, స్వార్ధం, అవినీతి విచ్చలవిడిగా పెరిగి పోతున్న ప్రస్తుత తరుణంలో ఆధ్యాత్మిక ఛానెళ్ళ ఆగమాన్ని స్వాగతించాల్సిందే.. అయితే ఈ ఛానెళ్ళు ఆయా యాజమాన్యాలకు ఆర్ఠికంగా గిట్టుబాటు అవుతాయా అన్నదే ప్రశ్న. జాతీయ స్థాయిలో (హిందీలో) ఇప్పటికే కొన్ని ఆధ్యాత్మిక ఛానెళ్ళు విజయవంతంగా నడుస్తున్నాయి. పలువురు స్వామీజీలు, యోగా గురువులు తమ ప్రసంగాలు,ఆసనాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇవి దేశ వ్యాప్తంగా చూసే ఛానెళ్ళు కాబట్టి ప్రేక్షకుల ఆధరణకు తగ్గట్టు యాడ్ రెవెన్యూతో నెట్టుకు వస్తున్నాయి. తెలుగులో ఇప్పటికే రెగ్యులర్ ఛానెళ్ళు ఉదయం పూట ఇస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు సీనియర్ సిటిజన్ల వీక్షణానికే పరిమితం అవుతున్నాయి. వీరు కూడా పొద్దున ఆధ్యాత్మిక ప్రసంగాలు వింటున్నా, రోజంతా కుటుంబ నేపధ్య సేరియళ్ళు చూడటానికి ఆసక్తి చూపిస్తారు. ఈ పరిస్థితిలో ఆధ్యాత్మిక ఛానెళ్ళు ఆర్ధికంగా లాభదాయకం కాకున్నా, నిర్వహణ ఖర్చులైనా తిరిగి వస్తాయా?.. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకన్నకు భక్తులు ఇచ్చే కానుకలతో 'శ్రీ వేంకటేశ్వర ' ఛానెల్ ను నడుపుతుంది. మరి మిగతా ఛానెళ్ళ యాజమాన్యాలు ఈ సబ్సిడీని భరించగలవా? క్రైస్తవ మత ప్రచార సంస్థలు ఇచ్చే ప్రకటణలు, స్వామీజీల ప్రసంగాల లైవ్‌ల ఆదాయంపై ఆశతోనే ఆధ్యాత్మిక ఛానెళ్ళు పెడుతున్నారనే ప్రచారం ఉంది.ఇది ఎంత వరకు నిజమో తెలియదు.
ఎన్-టీవీది మూడో స్థానమేనా?..
తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తామంటూ ఆరంభమైన ఎన్-టీవీ సాధారణ ఛానెల్ మాత్రమే అని తేలిపోయింది. ఈ ఛానెల్ చూసిన వారు టీవీ-9కి తక్కువ - జెమినిన్యూస్ కు ఎక్కువ అంటున్నారు. ఎన్-టీవీని గమనిస్తే టీవీ-9ని కాపీ కొడుతున్నట్లు కనిపించినా న్యూస్ బులెటిన్లు నాసిరకంగా కనిపిస్తున్నాయి. గ్రాఫిక్స్ మాత్రం బాగున్నాయి. ఎక్కువగా లైవ్‌లను నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. బులటిన్-బులటిన్ మధ్య తేడా కనిపించడం లేదు. యాంకర్లు తక్కువైనట్లున్నారు. పొద్దంతా అవే ముఖాలు కనిపిస్తున్నాయి. న్యూస్ బేస్డ్ కార్యక్రమాలు పెద్దగా లేవు. ఎన్-టీవీని చూస్తే ఈటీవీ, టీవీ-9లకు ఇప్పట్లో ఢోకా లేనట్లే అనిపిస్తోంది. అయితే ఎన్-టీవీని ఇంత తొందరగా జడ్జ్ చేయడం న్యాయం కాదేమో.. ఇవన్నీ బాలారిష్ట కష్టాలుగా భావించి మరికొద్ది రోజులు వేచి చూద్దాం..
Subscribe to:
Posts (Atom)