Monday, June 1, 2009

'ఎ టీవీ'.. ఇదేం టీవీ..

టీవీ తెరలపై ఎక్కడా కనిపించకున్నా ఫీల్డులో 'ఎ టీవీ' పేరిట లోగో మైకులు కనిపిస్తున్నాయి. సాప్ట్ వేర్, పార్మా, రియాలిటీ, గ్రానైట్, సినీ వ్యాపారాలు చేసే అడ్వాన్సాఫ్ట్ అనే అమెరికన్ కంపెనీ 'ఎ టీవీ' పేరిట ఈ చానెల్ పెట్టిందట. ఈ చనెల్ వార్తల విభాగానికి చందు జనార్ధన్ (ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉందా.. మన పాత ధనార్జనుడే లెండి) బాస్ అట. ఆయనకు తగట్టే ఇక్కడ మిడిమిడి నాలెడ్జ్ జర్నలిస్టులు ఇక్కడ చేరారు. తెలివైన వారిని చేర్చుకుంటే తన పదవికి ఎసరు పెడతారని జనార్ధన్ భయమట. 'ఎ టీవీ' జర్నలిస్టుల జీతా సైతం అత్తెసరుగా ఉన్నాయి. ఇక జిల్లా రిపోర్టర్లకు జీతాలు ఇవ్వరట వారే యాడ్స్ తెచ్చి కంపనీకి డబ్బు జమ చేయాలట. మీడియాలో ఎక్కడా నిలకడ ఉండని అసమర్ధ ధనార్జన్ని ఎ టీవీ ఎలా నమ్మి తీసుకుందో మరి. పిండి కొద్దీ రొట్టె అన్నట్లు, 'ఎ టీవీ' వార్తల్లో క్వాలిటీ ఆశించడం హాస్యాస్పదమే కదా..

సాక్షి జర్నలిస్టుల పంట పండింది

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు తమ చైర్మన్ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కడప పార్లమెంట్ సభుడిగా భారీ మెజారిటీతో గెలవడం సాక్షి పత్రిక, సాక్షి టీవీ జర్నలిస్టులకు నూతనోత్సాహాన్ని ఇచ్చింది. తెలుగుదేశం గెలిస్తే తమ మీడియాకు ఇబ్బందులు తప్పవని భయపడ్డ సాక్షి జర్నలిస్టులంతా త భవిష్యత్తుపై ఇప్పుడు ధీమాతో ఉన్నారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆనందంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి సాక్షి సిబ్బందికి జీతాలు పెంచే ఉద్దేశ్యంతో ఉన్నారని చెబుతున్నారు. అలాగే సీనియర్లందరికీ కార్లు, టూ వీలర్లు ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎన్నిక తర్వాత సిబ్బందిని తగ్గించే ప్రణాళిక తయారు చేసిన సాక్షి యాజమాన్యం ఆ ప్రతిపాదనను అటకెక్కించిందట. పాపం ఇతర పత్రికలు, టీవీల జర్నలిస్టులు. వీరెవరికి ఈసారి జీతాలు పెరగక పోగా, కొందరికి కోత పడిందట. ఎంతైనా సాక్షి జర్నలిస్టులది పూర్వజన్మ సుకృతం..

ఎన్నికల ఫలితాలపై మీడియా హాపీ

ఈమధ్యే ముగిసిన ఎన్నికల ఫలితాలు మీడియా సోదరులకు ఆనందాన్ని కలిగించాయి. మేనేజిమెంట్ల వైఖరి ఎలా ఉన్నా కాంగ్రెస్ గెలుపుపై జర్నలిస్టులంతా దాదాపుగా ఆనందంగానే ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, సెక్రెటేరియట్ బీట రిపోర్టర్లకు ఇంకా హాపీ. గత ఎన్నికల్లో అధికారం చేపట్టిన వెంటనే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జర్నలిస్టులకు హెల్త్ ఇన్స్యూరెన్స్, ఆరోగ్య శ్రీ ఫథకాలు అమలు చేయటమే కాకుండా ఇండ్ల స్థలాలను ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మరోసారి అధికారం చేపట్టిన వైఎస్ మరిన్ని మేళ్ళు చేస్తాడని జర్నలిస్టులు భావిస్తున్నారు. చంద్రబాబు మీడియా మేనేజిమెంట్లకు మాత్రమే లబ్ది చేకూరిస్తే, వైఎస్ జర్నలిస్టుల పక్షపాతి అని అంటారు. విచిత్రంగా తెలుగుదేశం బీట్ జర్నలిస్టులు సైతం మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ గెలవడం పై ఆనందంగా ఉన్నారు. తాను అధికారానికి వస్తే ఇళ్ళస్థలాలు ఇస్తానని ఆయన చెప్పిన మాటల్ని వెవరూ నమ్మలేదు. టిడిపి ఓటమి మీడియాలో ఒక వర్గానికి మాత్రమే విచారాన్ని కలిగించింది.

Monday, May 11, 2009

కమ్ముకుంటున్న సంక్షోభ ఛాయలు

అంతా అనుకున్నట్లే ఎలక్ట్రానిక్ మీడియాలో సంక్షోభంప్రారంభం అయింది. ఎన్నికలు ముగిసి ఫలితాలైనా రాకమునుపే యాజమాన్యాలు ఉద్యొగాలకు కోత పెట్టడం ప్రారంభించాయి. ఎన్-టీవీలో పలువురు జర్నలిస్టులకు ఉద్వాసన పలికారు. అదే బాటలో లోకల్ టీవీ సిబ్బందిని తగ్గించుకుంది. టీవీ-9లో కుడా సిబ్బందిని తగ్గించే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. జీ 24 గంటలు చానెల్ లోని జర్నలిస్టులకు జీతంలో 15 శాతం కోత విధించారు. జెమిని సిబ్బంది ఇంక్రిమెంట్ ముష్టి 5 శాతం మాత్రమే పెరిగింది. కొత్తగా వచ్చిన ఐ-న్యూస్ సిబ్బందికి జీతాల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. ఎన్నికల తర్వాత ఈ చానెల్ పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. అదే బాటలో హెచ్.ఎం.టీవీ పరిస్థితి కూడా. టీవీ5 చానెల్ పై కూడా అనుమానపు మేఘాలు కమ్ముకున్నాయి. తెలుగు చానెల్లన్నీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నయి. ఎన్నికల పుణ్యమా అని ఇంత కాలం నెట్టు కొచ్చిన యాజమాన్యాలు ఇక నిర్వహణా భారాన్ని తగ్గించుకోవడం పై ద్రుష్టి పెట్టాయి. ఇందులో భాగం గానే ఉద్యోగుల కుదింపు, జీతాల తగ్గింపు.

టికెట్ల కేటాయింపులో జర్నలిస్టులకు మొండి చేయి

అసెంబ్లీలో మైక్ పట్టుకొని 'అధ్యక్షా..' అని మాట్లాడదామని కలలు కన్న పలువురు జర్నలిస్టులకు రాజకీయ పార్టీలు మొండి చేయి ఇచ్చాయి. ఇంత కాలం తాము ఆ పార్టీలను నమ్ముకొని చేసిన చాకిరీకి ఇదా ప్రతిఫలం అంటూ వాపోతున్నారు పాపం. ముఖ్యంగా ముగ్గురు జర్నలిస్టులకు టికెట్లు ఇస్తామని ప్రచారం చేసుకున్న టి.ఆర్.ఎస్. రామలింగారెడ్డికి తిరిగి టికెట్ ఇవాడం తప్ప కొత్తగా ఎవరికి ఇవ్వలేదు. ఆంధోల్ నుండి టికెట్ ఆశించి భంగపడ్డ టీవీ జర్నలిస్ట్ క్రాంతి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాడు. టికెట్ కోసం ప్రయత్నించిన సీనియర్ జర్నలిస్ట్ అయోధ్య రెడ్డికి సైతం మొండిచేయి ఇచ్చారు. తెలంగాణా వాదినంటూ డబ్బా కొట్టుకునే మాజీ కమ్యూనిస్టు పల్లె రవికి అటు కె.సి.ఆర్. ఇటు దేవేందర్ గౌడ్ చేయి ఇచ్చారట. తెలుగు దేశం కొత్తగా ఏ జర్నలిస్టుకు టికెట్ ఇవ్వలేదు. టీవీ5 రిపోర్టర్ కప్పర ప్రసాద్ కొద్దిలో బి.జె.పి. టికెట్ మిస్సయాడు. ఇతగాడు టికెట్ వస్తుందనే ఆశతో టీడీపీ, కాంగ్రేస్ అభ్యర్థులతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాడట. ప్రజారాజ్యం పార్టీ ఒక్కటే నమ్ముకున్న కన్న బాబుకు టికెట్ ఇచ్చి రుణం తీర్చుకుంది.

కంట్రిబ్యూటర్ల పొట్టగొట్టిన 'స్పేస్ సెల్లింగ్'

ఎన్నికల్లో అంతో ఇంతో వెనుకేసుకుందామని ఆశ పడ్డ తెలుగు దిన పత్రికల కంట్రిబ్యూటర్లు, స్ట్రింగర్లకు చుక్కెదురైంది. ఎన్నికల్లో అభ్యర్థులు ప్రకటనలు ఇవ్వడానికి వ్యయపరిమితి అడ్డు రావడంతో దిన పత్రికల యాజమాన్యాలు 'స్పేస్ సెల్లింగ్' పేరిట వార్తలను అమ్మకానికి పెట్టాయి. ఫలితంగా ఎన్నికల్లో పోటీ చేసతున్న అభ్యర్థులంతా భారీగా చెల్లించి ధర్జాగా వార్తలు రాయించుకున్నారు. ' దూసుకెల్ల్తున్న మల్లాయ్య..' 'ఎదురులేని పుల్లాయ్య..' 'ఎల్లయ్య విజయం ఖయం..' లాంటి వార్తలు ఈకోవలోనివే. ఏకంగా పత్రికల యాజమాన్యాలే స్పేస్ సెల్లింగ్ పేరిట డబ్బులు తీసుకొని వార్తలు ఇవ్వడంతో కంట్రిబ్యూటర్లు, స్ట్రింగర్లకు అభ్యర్థుల నుండి మొండి చేయి ఎదురైంది. అయితే టీవీ చానెల్ల రిపొర్టర్లు, స్ట్రింగర్లు బాగానే వెనుకేసుకున్నారట.