Sunday, April 27, 2008

పత్రికల అంతర్యుద్దం


సాక్షి రంగప్రవేశంతో తెలుగు దిన పత్రికల మధ్య పోరాటం ప్రారంభమైంది. అది సర్క్యులేషన్లోనో, వార్తల కవరేజీలోనో కాదు. పరస్పరం దుమ్మెత్తిపోసుకోవడంలోనే ఈ పోరాటం.. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు పోటీగా అత్యాధునిక టెక్నాలజీ, అన్ని పేజీలు రంగుల్లో, ఒకేసారి 23 ఎడిషన్లతో వచ్చిన సాక్షి సరికొత్త చరిత్ర సృష్టించిందనడంలో అనుమానం లేదు. అయితే ఈనాడులో వచ్చిన స్టోరీ(జడ్చర్ల ఎస్.ఇ.జడ్)ని సాక్షి సమీక్షించడం, సాక్షిపై ఈనాడు ఎదురు తిరగడం పాఠకులను ఆశ్చర్యపరిచింది. ఈనాడులో వచ్చిన స్టోరీ అసత్యమైతే వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ సాక్షి ఎందుకు జోక్యం చేసుకున్నట్లు? అలాగే తాను అమ్ముతున్నట్లుగానే ఇతర తెలుగు దిన పత్రికలు కూడా రూ.2/-కే అమ్మాలని సాక్షి డిమాండ్ చేయడం ఎంతవరకూ సబబు. ఎవరి సరుకుకు వారు ధర నిర్ణయించుకునే హక్కు కలిగి ఉంటారు. తాను అమ్మే ధరకే ఇతరులూ అమ్మాలని ఏ వ్యాపారి కూడా శాసించజాలడు. ఏ ధరకు ఏ సరుకు కొనాలో నిర్ణయించుకునేది వినియోగదారుడే. ఈ సూత్రం పత్రికలకూ, పాఠకులకూ వర్తిస్తుంది. అంతర్జాతీయ టెక్నాలజీతో, అన్ని పేజీలు రంగుల్లో కేవల రూ.2/- కే ఇస్తున్న సాక్షితో ఈనాడు, ఆంధ్రజ్యోతి పోటీపడలేవని అర్థమైపోయింది. ఈ విషయాన్ని ఆ రెండు దిన పత్రికలే అంగీకరించాయి. ఎలాగు సాక్షి సర్క్యులేషన్ 13 లక్షలు దాటింది. యుద్దమొలో గెలిసిన తర్వాత కూడా శత్రువుని హింసించాలా?.. క్షమించి వదిలేయవచ్చుకదా?..

Tuesday, April 22, 2008

కొంప ముంచిన మురళీకృష్ణ

ఇళ్ళ స్థలాల కేటాయింపుపై హైకోర్టు ఇచ్చిన స్టే జర్నలిస్టులందరినీ నిరాశ పరచింది. ఈ స్టే కు ప్రధాన కారకుడైన రావు చెలికాని ప్రధానంగా జర్నలిస్టులనే ఎందుకు టార్గెట్ చేసుకున్నట్లు? పరిశోధిస్తే ఆశ్చర్యకర విషయాలు బయట పడ్డాయి. చెలికాని రావును ఉసి గొలిపి కేస్ పెట్టించింది ఈనాడు పత్రిక స్టాఫ్ రిపోర్టర్ మురళీకృష్ణ. నిబంధనల ప్రకారం ఐదేళ్ళ సర్వీస్ కూడా లేని మురళీకృష్ణ రాజమండ్రికి చెందిన కొన్ని చిన్న పత్రికల నుండి బోగస్ సర్వీస్ సర్టిఫికెట్లు దాఖలు చేసి దొరికి పోయాడు. అతని అప్లికేషన్ తిరస్కరణకు గురికావడం జీర్ణించుకోలేక మొత్తం ఇళ్ళ స్థలాల కేటాయింపు ప్రక్రియకే విఘాతం కలిగించాలని నిర్ణయించుకున్నాడు. బ్లాగుల్లో 'పెద్దలా? గద్దలా?' కరపత్రం అతడు రాసిందేనట(?) మురళీకృష్ణ కొద్ది నెల క్రితం ఇదే బ్యానర్ తో ఈనాడులో భూ కుంభకోణం వార్తలు రాశాడట(?) చెలికాని రావు కోర్టుకు ఇచ్చిన పిర్యాదులో కొందరు జర్నలిస్టులకు సొంత ఇళ్ళు ఉన్నా, ప్రభుత్వం ఇచ్చే ఇళ్ళ స్థలాల కొసం దరఖాస్తు చేశారని పేర్కొన్నారు. ఇందులోఅ చాలా వరకు ఈనాడు, ఈటీవీ ఉద్యోగులవి. ఈ ఫ్లాట్ల ఫోటోలన్నీ చెలికాని రావుకు మురళీకృష్ణ ఇచ్చాడట. అది సరే మరి చెలికాని రావు జర్నలిస్టులపై ఎందుకు పగబట్టాడు? మున్ముందు ఈ విషయాలన్నీ బయట పడతాయి..

ఎలక్ట్రానిక్ మీడియా పుట్టి నాలుగేళ్లే అయిందా?

ఇళ్ళ స్థలాల కోసం ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన కొoదరు ప్రింట్ సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా పుట్టి నాలుగేళ్ళే అవుతోంది కదా.. అప్పుడే మీకు ఇళ్ళ స్థలాలు కావాలా అని ప్రశ్నించారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన అజ్ణానం. నిజానికి తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా 1995-96లో ప్రారంభమైంది(దూరదర్శన్ తెలుగు వార్తల్ని మినహాయిస్తే. దూరదర్శన్ ను కలుపుకుంటే మూడు దశాబ్దాల చరిత్ర అవుతుంది). 1995-96లో సిటీకేబుల్ వార్తలు ప్రారంభమయ్యాయి. దీని క్రెడిట్ ఆనాటి సిటీకేబుల్ న్యూస్ డైరెక్టర్, ప్రస్తుత టీవీ-9 సి.ఇ.వో. రవిప్రకాశ్ కు దక్కుతుంది. ఆ తర్వాత జెమిని, ఈటీవీలు శాటిలైట్ ఛానెళ్ళుగా వచ్చాయి. జెమిని, ఈటీవీల్లో వార్తలు ప్రారంభం కాని రోజుల్లో సిటీకేబుల్ వార్తలకు ఎంతో ప్రాముఖ్యం ఉండేది. సిటీకేబుల్ టీం వచ్చే వరకు ప్రెస్ మీట్లు ప్రారంభమయ్యేవి కాదు. ఈ చరిత్ర టీవీ-9, ఈటీవీ-2 చానెళ్ళలో పనిచేసే పిల్ల కాకులకు తెలిసినట్లు లేదు. తమ ఛానెళ్ళ పుట్టుకతోనే తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా పుట్టిందని వారు వాదిస్తారు. నూతిలోని కప్పలారా వాస్తవాలు తెలుసుకోండి.

bv 9

సి.పి.ఎం. రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు సాదా సీదా భోళా మనిషి. రాష్ట్ర రాజకీయాల్లో ఇంత నిరాడంబరంగా ఉండే నాయకుడు ఏ పార్టీలోనూ కనిపించడు. ఏ విషయంలో అయినా తనదైన రీతిలో స్పందించే రాఘవులు బైట్స్ కోసం టీవీ జర్నలిస్టులు ఉవ్విళ్ళూరుతుంటారు. అడిగిన ప్రతివారికీ కాదన లేక ఉదారంగా బైట్స్ ఇచ్చేస్తుంటారు ఆయన. రాఘవులు అధికార పక్షాన్ని తనదైన శైలిలో చెండాడుతుంటారు. ఇందుకు మండిపడ్డ కాంగ్రెస్ నేతలు బి.వి.రాఘవులును టి.వి.రాఘవులుగా అభివర్ణిస్తుంటున్నారు. టీవీ చానెళ్ళలో రాజశేఖర రెడ్డి తర్వాత ఎక్కువగా కనిపించేది రాఘవులేనట. ముఖ్యంగా టీవీ-9లో.. బి.వి.రాఘవులును టి.వి.రాఘవులు అనాలా? బివి-9 అనాలా? మీరే చెప్పండి.

Tuesday, April 15, 2008

'ఏసియానెట్'లో చేరిన సతీష్ బాబు

జెమిని న్యూస్ చీఫ్ ఎడిటర్ పదవికి సతీష్ బాబు రాజీనామా ఇచ్చేశారు. ఇప్పుడాయన కొత్తగా రాబోయే ఏసియానెట్ వారి తెలుగు ఛానెల్ ' సితార ' లో చేరిపోయారు. సతీష్ బాబు జెమినిలో చేరెప్పుడే అక్కడ ఎక్కువ కాలం ఉండే అవకాశం లేదని మీడియా మిత్రులంతా ఊహించారు. అనుకున్నట్లే ఆయన పట్టుమని 6 నెలలు కూడా జెమినిలో ఇమడలేక పోయారు. ఇందుకు సతీష్ బాబును తప్పు పట్టలేం. జెమిని యాజమాన్యం విపరీత ధోరణులను ఆయన తట్టుకోలేక పోయారు. చాలీ చాలని జీతాలతో జెమిని నుండి వలస పోతున్న సిబ్బంది స్థానంలో కొత్తవారిని నియమించడంలో యాజమాన్య నిర్లక్ష్యం సతీష్ బాబును ఇబ్బందికి గురిచేసిందని చెప్పుకుంటున్నారు. సిబ్బందిని, పరికరాలను ఇవ్వకుండా టార్గెట్లు పెట్టడం జెమినివారి ప్రత్యేకత. గత కొంత కాలంగా జెమిని యాజమాన్యానికి, సతీష్ బాబుకు మధ్య దూరం పెరిగింది. ఇందుకు సతీష్ బాబు వ్యవహారశైలి కూడా కారణం. ప్రతి విషయానికి తొందరపడి సిబ్బందిపై అరవడం, నచ్చనివారిని శంకరగిరి మాన్యాలను పంపడం సతీష్ బాబుకు అలవాటైన విద్య. బెస్టాప్ లక్ సతీష్ బాబు గారు.. ఏసియానెట్ లో అయినా కుదురుగా ఉండే వాతావరణం ఉండాలని కోరుకుంటున్నాం..
కొత్త ఎడిటర్ ఎవరు?
సతీష్ బాబు తర్వాత ఎవరొస్తారన్నది జెమిని ముందున్న ప్రశ్న. జెమిని టీవీ ఎడిటర్, బ్యూరో చీఫ్, కోఆర్డినేటర్ పోస్టుల్లో పని చేయాలంటే జర్నలిస్టులకు భయం. ఈ పదవుల్లో ఉన్నవారందరినీ వేధించి సాగనంపడం జెమిని యాజమాన్యానికి వెన్నతో పెట్టిన విద్య. సాక్షాలు కావాలంటే రవిప్రకాష్, కందుల రమేష్, భావనారాయణ, మధు, మాధవ్, మునిరాజు లను అడిగి చూడండి.

పాపం 'ఈవారం'

రాజమండ్రి ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ గారి 'ఈవారం' పత్రిక ఈ మధ్య బుక్ స్టాళ్ళలో కనబడుటలేదు. కారణం.. కమిషన్ చెల్లింపు విషయంలో కక్కుర్తి. ఫలితం.. ఈవారం పత్రిక అమ్మొద్దని బుక్ స్టాళ్ళ నిర్ణయం. కేవలం కాంగ్రెస్ అనుకూల వార్తలు, అందునా పార్టీలో ప్రత్యర్థులపై వ్యతిరేక వార్తలు.. ఇదీ ఈవారం ధోరణి. పి.జె.ఆర్. మరణించాక ఆయనకు నివాళిగా వ్యాసాన్ని కూడా ప్రచురించలేదు. చాలీ చాలని జీతాలు.. ఎవరికి అనుకూలంగా రాయాలో, ఎవరికి వ్యతిరేకంగా రాయాలో అర్థంకాక ఈవారంలో మొదటి నుండి ఉన్న జర్నలిస్టుల్లో దాదాపుగా అంతా మానేశారు. పత్రిక అడ్రస్సూ మారింది. పాపం ఈవారం .. వచ్చే వారానికైనా కోలుకుంటుందో లేదో?..

ఇళ్ళ స్థలాల కోసం ఇంత రచ్చా?

ఊహించినట్లుగానే జర్నలిస్టు సోదరులు ఇళ్ళ స్థలాలకోసం వీధిన పడ్డారు. కొట్టుకోవడం ఒకటే తక్కువ. జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచివల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ లో సభ్యత్వం రాని జర్నలిస్ట్ లు ప్రెస్ క్లబ్ ముందు ధర్నా చేశారు, అరెస్ట్ అయ్యారు. ఎందుకీ రచ్చ.. కొత్తగా ఏర్పడ్డ జవహర్లాల్ సొసైటీ సరైన మార్గంలోనే పోతున్నప్పుడు సభ్యత్వానికి ఎంపికైన సభ్యుల పేర్ల జాబితా రహస్యంగా దాయటం ఎందుకు? రహస్యంగా రెండువేల రూపాయల సభ్యత్వ రుసుము, లక్ష రూపాయల డీడీ కట్టించుకొవటంలోని ఆంతర్యం ఏమిటి? ఎవరైనా కోర్టుకు వెళ్ళతారనే భయమా? మరి కోర్టు ఫీజుల డబ్బు కూడా వసూలు చేశారు కదా? ఐదేళ్ళ పైబడి సర్వీస్ ఉన్న వారందరికీ సభ్యత్వం ఇచ్చినా.. పైగా సర్వీస్ ఉన్న వారి దగ్గరే లక్ష రూపాయల డీడీ హడావిడిగా ఎందుకు కట్టించు కుంటున్నారు? ప్రభుత్వం సొసైటీకి భూమి బదిలీ చేయడాని కట్టాల్సిన డబ్బు కొసమే ఈ డబ్బు తతంగం అనేది బహిరంగ రహస్యమే అనుకోండి. ఇన్ని దాగుడు మూతలు అవతలి వారిలో లేని పోని అనుమానాలు రేకెత్తించవా? కోర్తుకు పోతామన్న ప్రతివాడికే భయపడాల్సిన అవసరం ఏమిటి?
జూనియర్లూ.. ఎందుకీ తొందర?

ఇళ్ళ స్థలాలు రాకపోతే జీవితమే వృధా అన్నంతగా హడావిడి పడుతూ ఆందోళనకు దిగారు జూనియర్లు (ఐదేళ్ళ లోపు సర్వీసు గలవారు) ఇళ్ళ స్థలాల కేటాయింపు ప్రక్రియలో కొన్ని నియమ నిబంధనలు ఉండటం సహజం. ఇందులో భాగంగానే చిన్న పత్రికలు, నాన్ స్టార్టర్ ఛానెళ్ళలొ పనిచేసిన అనుభవాన్ని, కంట్రిబ్యూటర్ సర్వీసును లెక్కలోకి తీసుకోలేదు (ఇప్పుడు సభ్యత్వం దొరికిన వారంతా పతివ్రతలే అని మేము అనటం లేదు.. దొరకని వరకే దొరలు). ఏళ్ళ తరబడి జర్నలిస్టులుగా బతుకులు వెళ్ళ దీస్తున్న సీనియర్లకు ముందుగా ప్లాట్లు దక్కాలని కొరుకుందాం. జూనియర్లు వయసు రీత్యా ఈ వృత్తి కాకపోతే మరో ఉద్యోగం చూసుకోవచ్చు. కాని సీనియర్లకు అలాంటి అవకాశాలు దొరకవు. భవిష్యత్తులో ప్రభుత్వం ఇక ఇళ్ళ స్థలాలు ఇవ్వదన్నదే జూనియర్ల ఆవేదన. ఇదే నిజమని ఎందుకనుకోవాలి? పోరాడే శక్తి కొరవడిందా? ముందు మన పోరాటం అనర్హులకు ప్లాట్లు దక్కకుండా చూడటమే..

కొసమెరుపు: ఈ బ్లాగ్ రచయిత కూడా జూనియరే.. ప్లాట్ రావడం లేదు అని తెలిసినా బాధ లేదు..

పెద్దలా?.. గద్దలా?...



జూనియర్ల ఆగ్రహానికి అద్దం పట్టే బ్లాగ్ కరపత్రం ఇది. జూనియర్లది కొంత వరకూ ధర్మాగ్రహమే. కాని పరిస్థితిని వాస్తవ కోణంలోంచి కూడా చూడాలని మనవి.