Wednesday, October 24, 2007

జెమిని నుండి ఎన్-టీవీలో చేరిన ' హింసించే బూతురాజు '

'జెమిని న్యూస్ ' కో-ఆర్డినేటర్ గా పని చేస్తున్న మునిరాజు ఈరోజు ఉదయమే ఎన్-టీవీలో చేరిపోయి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చెన్నై రఘుకుమార్ ప్రియ శిష్యుడైన మునిరాజు కొద్ది రోజులుగా అభద్రతాభావంతో జెమినిలో కొనసాగాడని అక్కడి వారు చెబుతున్నారు. అంతకు ముందు కో-ఆర్డినేటర్ గా ఉన్న మాధవ్ ని సాగనంపి మునిరాజ్ ను నియమించున్న జెమిని చెన్నై-హైదరాబాద్ యాజమాన్యాలు తాజా పరిణామానికి బిత్తరబోయాయి. రఘుకుమార్ ఏజంట్ గా హైదరాబాద్ కో-ఆర్డినేటర్ గా వచ్చిన మునిరాజు వచ్చిన రోజు నుండి తనకు గిట్టని వారిని వేదించటమే పనిగా పెట్టుకున్నాడు. తనకు పడని జిల్లా రిపోర్టర్ల వార్తల్ని తొక్కిపెట్టే వాడని ఆరోపణలు ఉన్నాయి. మునిరాజు ప్రవర్తనకు విసిపోయిన పలువురు జిల్లా, హైదరాబాద్ బ్యూరో రిపోర్టర్లు జెమినికి గుడ్ బై చెప్పేశారు. మునిరాజు గయ్యాలితనానికి ఎందరో రిపోర్టర్లు, డెస్క్ సిబ్బంది హడలిపోయేవారు . (ఎంతైనా రఘుకుమార్ మనిషి కదా) నోరు తెరిస్తే అలవోకగా బూతులు మాట్లాడే మునిరాజుకు 'పులకేశి ', 'హింసించే బూతురాజు ' అనే ముద్దు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. జిల్లా రిపోర్టర్, స్ట్రింగర్ పోస్టులను అమ్ముకునే వాడనేది బహిరంగ రహస్యం. రంగారెడ్డి జిల్లా కీసర స్ట్రింగర్ పైన ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నా మునిరాజు నిర్లజ్జాగా డబ్బు తీసుకొని కొనసాగించాడని అంటారు. హైదరాబాద్ ఎల్లలైనా తెలియని మునిరాజును చెన్నై రఘుకుమార్ కో-ఆర్డినేటర్ గా పంపడమే ఒక వింత. మియాపూర్-బాలాపూర్ పక్కపక్కనే ఉంటాయనే అమాయకత్వంతో ఈ రెండు చోట్ల ఒకే రిపోర్టర్ని స్వల్ప వ్యవధితొ అసైన్మెంట్లు ఇచ్చి పంపే ఘనత ఆయనది. తన లీలలు బయటపడుతున్న కొద్దీ ఆందోళన పడ్డ మునిరాజు, కొద్ది రోజులుగా చెన్నై-హైదరాబాద్ మేనేజిమెంట్ల మద్య పోక చెక్కగా నలిగిపోయాడట. (మునిరాజు పై చాలా రోజులుగా 'ఎబౌట్ తెలుగు మీడియా'కు పిర్యాదులు వచ్చినా నిర్ధా రించుకోవడానికే ప్రచురించ లేకపోయాము. ఈ విషయంలో కొందరు మమ్మల్ని అపార్ధం చేసుకున్నారు, మేము ఎవరికి లొంగమని మరొకసారి వారికి తెలియజేస్తున్నాం)

నిరాశ పరచిన ' సూర్య '

తెలుగులో ఇప్పటికే ఉన్న దిన పత్రికలకు గట్టి పోటీ ఇస్తునందనుకున్నవారికి 'సూర్య ' నిరాశను మిగిల్చింది. సూర్య పత్రిక తొలి మూడు సంచికలు చూసిన వారు ఈ పత్రిక 'ఈనాడు 'కు కాదు కదా ఆంధ్రజ్యోతి, వార్త దిన పత్రికలకు కూడా పోటీ ఇవ్వలేదు అని అంటున్నారు. 'సూర్య ' మాస్ట్ హెడ్ మూసేసి చూస్తే అచ్చం 'ఆంధ్రజ్యోతి ' లానే కనిపిస్తుంది అని మరి కొందరంటున్నారు. సూర్య పేజీలన్నీ జ్యోతిలాగే కనిస్తున్నయి. నిజానికి ముద్రణలో జ్యోతే అందంగా కనిపిస్తోంది. తనదైన పాంట్స్ రూపొందించుకోవటంలో 'సూర్య ' విఫలమైందనే చెప్పవచ్చు. విజయదశమి తర్వాతి రోజున మార్కెట్ లోకి వచ్చిన 'సూర్య ' పట్ల ఏజంట్లు, హాకర్లు కూడా ఆగ్రహంగా ఉన్నారు. పత్రికను ఆలస్యంగా ఇచ్చారని కొందరు, అడిగినన్ని కాపీలు ఇవ్వలేదని మరి కొందరు ఆరోపిస్తున్నారు. తొలి రోజున తమకు గిప్ట్స్ ఇస్తామని చెప్పిన సూర్య మార్కెటింగ్ సిబ్బంది పత్తా లేకుండా పోయారని వారు విమర్శిస్తున్నారు. అన్నింటికన్నా పెద్ద జోక్ ఏమిటంటే 'సూర్య ' వెబ్ సైట్ అడ్రస్ పని చేయక పోవడం. http://www.suryatelugudaily.com/ లాగిన్ అయి చూస్తే ASTER WE INTEGRATED COMMUNICATIONS అనే సైట్ కనెక్ట్ అవుతోంది.

Saturday, October 20, 2007

జర్నలిస్టు మిత్రులకు, శ్రేయోభిలాషులకు
విజయదశమి శుభాకాంక్షలు
-ఎబౌట్ తెలుగు మీడియా

ఆంధ్రభూమి దినపత్రిక, 20-10-2007న ప్రచురితం


Thursday, October 18, 2007

మూడు ఛానెళ్ళ పెళ్ళి

మెగాస్టార్ చిరంజీవి రెండో కూతురు ప్రేమ వివాహం అభిమానుల్లో, రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠను, సంచలనాన్ని సృష్టంచింది. అయితే ఈ వివాహ దృశ్యాలు టీవీ-9, ఈటీవీ, ఎన్-టీవీలకే పరిమితం ఎందుకయ్యాయి? దీని వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది. బోయిన్ పల్లి ఆర్యసమాజ్ లో రహస్యంగా పెళ్ళి చేసుకున్న శ్రీజ, శిరిష్ భరద్వాజ్ తమని తాము కాపాడు కోవడం కోసం ఒక పథకం ప్రకారం వ్యవహరించారు. సాంప్రదాయబద్దంగా తాము వివాహం చేసుకున్న వార్తను టీవీ ఛానెల్ ద్వారా వెల్లడిస్తే తమకు ఎలాంటి ముప్పు ఉండదని కొత్త దంపతులు భావించారు. ఇందుకోసం వారు ముందుగా ఈటీవీని ఎంచుకున్నారు. అయితే వివాహ దృశ్యాలను తీసుకున్న ఈటీవీ సిబ్బంది రామోజీ రావు అనుమతి కోసం నిరీక్షిస్తూ ప్రసారం చేయకుండా ఆలస్యం చేయటంతో శ్రీజ, భరద్వాజ్ల స్నేహితులు వెంటనే టీవీ-9కు కబురందించారట. టీవీ-9 ఈ వార్తను పదే పదే ప్రసారం చేయటంతో ప్రేక్షకులు క్రికెట్ మ్యాచి సైతం మరచి పోయి ఆ ఛానెల్ కు అతుక్కు పోయారు . పొరపాటును గ్రహించిన ఈటీవీ కూడా ఈ వార్తను ప్రసారం చేయక తప్పలేదు. అయితే శ్రీజ, భరద్వాజ్ లు జెమిని, టీవీ-ఐదు, జీ తెలుగు ఛానెళ్ళకు అందకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఈ ఛానెళ్ళ హెడ్లు చిరంజీవికి సన్నిహితులు కావడమే ఇందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
కొసమెరుపు: శ్రీజ ఎంతో ఇష్టపడి తండ్రికి చిక్కకుండా పెళ్ళి చేసుకున్న శిరిష్ భరద్వాజ్ పై సంజీవరెడ్డి నగర్ పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు వెలుగు చూడటం దురదృష్టకరం. 2002లో భరద్వాజ్ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసినట్లు కేసు నమోదైంది.

మాటీవీ న్యూస్ ఎడిటర్ గా హరిప్రసాద్

మాటీవీ న్యూస్ ఎడిటర్ గా హరిప్రసాద్ బుధవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. భావనారాయణ రాజీనామా తర్వాత చాలా కాలం మాటీవీ న్యూస్ ఎడిటర్ పోస్ట్ ఖాళీగా ఉంది. కొత్తగా ఎడిటర్ గా వచ్చిన హరిప్రసాద్ గతంలో ఈనాడు, ఈటీవీ, మన తెలుగు టీవీల్లో పని చేశారు. ప్రింట్ - ఎలక్ట్రానిక్ మీడియాల్లో హరిప్రసాద్ కు అపార అనుభవం ఉంది.

'సత్య 'లో కరీం

టీవీ-9 ఫేం రిపొర్టర్ కం యాంకర్ కరీం 'టీవీ-ఐదూకు గుడ్ బై చెప్పి 'సత్య ' టీవీలో చేరినట్లు సమాచారం. టీవీ-ఐదులో తనకు నిర్దుష్టంగా ఎలాంటి బాధ్యత అప్పగొచకపోవటంపై కరీం అసంత్రుప్తితో ఉన్నట్లు చెబుకుంటున్నారు. ఓవరాక్షంకు మారుపేరైన కరీంపై ఇప్పటికే టీవీ-ఐదు సీనియర్లు గుర్రుగా ఉన్నారు. ఎన్నో అవినీతి ఆరోపణలు, పోలీస్ కేసులు ఎదుర్కొంటున్న కరీంకు చంద్రబాబు నాయుడు ఆశీస్సుల కారణంగానే టీవీ-ఐదులో ఉద్యోగం వచ్చిందంటారు. అసలు ఆరంభం అవుతుందో లేదో తెలియని 'సత్య 'కు కరీం ఎలా ఉపయోగపడతాడో చూడాలి.
కేబుల్ ఇండస్ట్రీకి 'డిటిహెచ్ ' నుండి ఎదురు కానున్న ముప్పుపై కొద్దిరోజుల క్రితం మేము 'కేబుల్ 'తో సన్ 'డిష్ 'యూం.. అనే వార్తను అందించడం తెలిసిందే. ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం (14-10-2007)లో 'కేబుల్ తో డిష్షుం.. డిష్షుం!' పేరిట ఇదే అంశంపై సీనియర్ పాత్రికేయులు తోట భావనారాయణ కవర్ స్టోరీ ఇచ్చారు. డిటిహెచ్ గురించి సమగ్రంగా తెలుసుకునేందుకు ఈ కథనం ఉపయోగపడుతుంది.

Thursday, October 11, 2007

మళ్ళీ మీడియా వ్యాపారంలోకి దాసరి

శతాధిక చిత్ర దర్శకుడు, విలక్షణ నటుడిగా తెలుగు ప్రజలకు సుపరిచితుడైన కేంద్ర మంత్రి దాసరి నారాయణ రావు ముచ్చటగా మూడోసారి మీడియా వ్యాపారంలోకి వస్తున్నట్లు వినికిడి. 'ఉదయం' దినపత్రికను తిరిగి అరంభించటంతో పాటు 'డి ' పేరిట టీవీ ఛానెల్ తేవడానికి దాసరి సన్నాహాలు చేస్తున్నారు. విజయదశమి నుండి పనులు ఆరంభమవుతున్నాయి. పలువురు సీనియర్ జర్నలిస్టులు, ప్రొడ్యూసర్లతో దాసరి నారాయణ రావు చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. దాసరి వద్ద ఇప్పటికే 150 చిత్రాల రైట్స్ వున్నాయని వినికిడి. గతంలో ఈనాడుకి ధీటుగా ఉదయం దినపత్రికను తెచ్చి తెలుగు జర్నలిజంలో నూతన వరవడులకు శ్రీకారం చుట్టిన దాసరి పలు కారణాల వల్ల తన పత్రికను మాగుంట సుబ్బరామిరెడ్డికి అప్పగించాల్సి వచ్చింది. అయితే మాగుంట కుటుంబం 'ఉదయం 'ను సక్రమంగా నడపలేక పోవటంతో లాకౌట్ కు గురైంది. దాసరి ప్రారంభించిన 'శివరంజని 'సినీ పత్రిక అత్యధిక సర్క్యులేషన్ సాధించినా అది కూడా మూత పడింది. ఆ తర్వాత దాసరి 'బొబ్బిలిపులి ' పేరిట రాజకీయ వార పత్రికను, 'మేఘసందేశం' సినీ పత్రికను తెచ్చినా అవీ సరిగ్గా నడవక మూత పడ్డాయి. ఈ పత్రిక స్థాపన తరువాత సొంతంగా రాజకీయ పార్టీ పెట్టాలనుకున్నా దాసరి నారాయణ రావు ఎందుకో తన ప్రయత్నాలను విరమించుకొని కాంగ్రెస్లో చేరారు. రాజ్యసభ సభ్యుడిగా, ఆ తర్వాత కేంద్ర మంత్రిగా రాజకీయాల్లో బిజీ అయిన దాసరి మీడియా వ్యాపారంలోకి తిరిగి రావడం శుభ పరిణామమే. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృత్తం కాకుండా జాగ్రత్త పడుతున్న దాసరి తన పత్రిక, ఛానెల్ కోసం పలువురు పారిశ్రామికవేత్తల సహకారం తీసుకుంటున్నట్లు వినికిడి.

ఎవరిని ఎవరు ఎందుకు అనుకరిస్తున్నారు?

ఎన్నికలు ముంచుకొస్తున్నాయనే తొందరలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వ పథకంగా పాపులరైన రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని పునరుద్దరిస్తామని ప్రకటిస్తే, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా తామూ తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తు ఇస్తామని ప్రకటించటం గమనించాం. ఆ తర్వాత టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పోటా పోటీగా ఒకరి పథకాలను మరొకరు కాపీ కొడుతూ వాగ్దానాలు చేస్తున్నాయి. ఇంచుమించు ఇదే పరిస్థితి మన తెలుగు టీవీ ఛానెళ్ళలో ఇదే తరహా అనుకరణ కనిపిస్తోంది. ఇటీవలే ఆరంభమైన 'టీవీ-ఐదు ','ఎన్-టీవీ ' ఛానెళ్ళు 'టీవీ-9 'ను అనుకరిస్తున్నాయనేది సుస్పష్టం. లోగోలు లేకుండా చూస్తే టీవీ-ఐదు, ఎన్-టీవీ యాంకర్ల డ్రెస్, కట్టూ బొట్టు, గ్రాఫిక్స్, ప్రోమో, క్రొమోలను గమనిస్తే టీవీ-9కు ఈ ఛానెళ్ళకు పెద్దగా తేడా కనిపించదు. అయితే కొద్ది రోజులుగా విచిత్రంగా 'టీవీ-9' రివర్స్ గేర్లో 'టీవీ-ఐదు ','ఎన్-టీవీ'లకు చెక్ పెట్టేందుకా అన్నట్లు ఆ ఛానెళ్ళను అనుకరిస్తున్నట్లు కనిపిస్తోంది. మంచి ఎక్కడున్నా స్వీకరించడంలో తప్పు లేదు. అయితే అదే సమయంలో ప్రతి ఛానెల్ తన సొంత ముద్రను అర్పాటు చేసుకోవడం మంచిది. ప్రస్తుతం తెలుగు 24 గంటల ఛానెళ్ళలో 'ఈటీవీ-2', 'జెమిని న్యూస్ 'లు తప్పిస్తే 'టీవీ-9','టీవీ-ఐదు ','ఎన్-టీవీ'లను చూస్తే తెలుగుదనం మచ్చుకైనా కనిపించదు. ఎవరైనా కొత్తవారు సౌండ్ తగ్గించి చూస్తే ఏదో విదేశీ ఛానెళ్ళు చూస్తున్నట్లే ఉంటుంది తప్ప తెలుగు ఛానెళ్ళలా అనిపించవు.

Tuesday, October 9, 2007

'కల నెరవేరెనులే.. ఇంటి జాగా దొరుకునులే..'

ఇళ్ళ స్థలాలకు సంభందించి హైకోర్ట్ ఇచ్చిన తీర్పుపై ప్రింట్-ఎలక్ట్రానిక్ మీడియాల జర్నలిస్టులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సొసైటీల ద్వారా ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని హైకోర్ట్ స్పష్టంగా ఆదేశించటంతో I&PR పాత్ర తగ్గి జర్నలిస్టు సంఘాల హవా నడిచే అవకాశం ఉంది. అయితే ఇళ్ళ స్థలాలు ఆశిస్తున్న వారిలో సహజంగా ఎలక్ట్రానిక్ కన్నా ప్రింట్ మీడియా జర్నలిస్టులే అధికంగా ఉన్నారు. ప్రభుత్వం గతంలో ప్రింట్ వారికి పలుమార్లు ఇళ్ళ స్థలాలు ఇచ్చినందున ఈసారి తమకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు సమాచారం. 'ప్రింట్ ' ఆధిపత్యం లోని జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ గతంలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు సభ్యత్వం ఇవ్వక పోవటంతో వారు ప్రత్యేకంగా హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేసుకున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులంతా తమ వర్గ పోరాటాలను పక్కన పెట్టి ఇళ్ళ స్థలాల విషయంలో ఏకం కావటం శుభ పరిణామం. తాము కట్టుకోబోయే కలల సౌధాలని ఊహించుకుంటూ తన్మయత్మంలో మునిగి తేలుతున్న జర్నలిస్టు మిత్రులు ఔటర్ రింగ్ రోడ్డు లోపలే ఇళ్ళ స్థలాలు కావాలని కోరుకుంటున్నారు. చాలా సంవత్సరాల తర్వాత ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇస్తున్న నేపధ్యంలో ప్రింట్-ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులంతా తమ పట్టింపులను సడలించుకొని సామరస్యంగా వ్యవహరించాలని 'ఎబౌట్ తెలుగు మీడియా' కోరుకుంటోంది.

రామానుజం రాజీనామా.. ఎన్-టీవీలో మరో సంక్షోభం..

కొమ్మినేని రాజీనామాతో విలవిలలాడుతున్న ఎన్-టీవీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఎన్-టీవీ న్యూస్ చీఫ్ ఎస్.రామానుజం రాజీనామా చేశారు. ఎన్నో ఆశలతో ప్రారంభించిన ఛానెల్ ఫ్లాప్ షోగా మిగలటంపై ఎంతో అసంతృప్తితో ఉన్న ఎన్-టీవీ యజమాని నరేంద్ర చౌదరి తన ఆగ్రహాన్ని నేరుగా తెలియజేయడాన్ని తట్టుకోలేక రామానుజం రాజీనామా ఇచ్చారని ఎన్-టీవీ వర్గాలు చెబుతున్నాయి. కేవలం లైవ్ లనే నమ్ముకొన్న ఎన్-టీవీ నాసిరకం కార్యక్రమాలతో ప్రేక్షకుల ఆధరణ పొందలేక పోతోంది. ఎన్-టీవీ కన్నా టీవీ-ఐదు చాలా బాగుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఎన్-టీవీ ప్రారంభం కాకముందు నుండే సీనియర్ల మధ్య ఆధిపత్య పోరు ఆరంభమైంది. ఛానెల్ వచ్చిన కొద్ది రోజులకే సహాయ నిరాకరణకు కినుక వహించిన కొమ్మినేని శ్రీనివాస రావు రాజీనామా చేసిన విషయం అందరికీ తెలుసు. రామానుజం రాజీనామాతో ఖాళీ అయిన సీఈవో పోస్ట్ కోసం పలువురు సీనియర్ జర్నలిస్టులు పోటీ పడుతున్నట్లు సమాచారం.

Saturday, October 6, 2007

'సూర్య ' ప్రకాశిస్తుందా?..

తెలుగులో మరో దిన పత్రికగా 'సూర్య ' రాబోతోంది. విజయదశమి పర్వదినాన సూర్య ప్ర్రారంభమౌతోంది. మొత్తం 16 ఎడిషన్లతో ప్రారంభమౌతున్న సూర్య సర్వత్రా చర్చనీయ అంశంగా మారింది. తెలుగులో తొలి మూడు స్థానాల్ని ఆక్రమించుకున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త దినపత్రికలకు సూర్య ఏ విధమైన పోటీ ఇవ్వనుందో చూడాలి. ఇప్పటికే ప్రచురితమౌతున్న సూర్య డమ్మీ కాపీని చూసిన వారు ప్రింట్ క్వాలిటీ చాలా ఉన్నత ప్రమాణాలతో (హిందు దినపత్రిక మాదిరి) ఉందంటున్నారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, కాంగ్రెస్ నేత నూకారపు సూర్యప్రకాశ్ రావు తెస్తున్న 'సూర్య ' దిన పత్రిక ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కోరుకున్నట్లుగా 'ఆ' రెండు దినపత్రికలకు పోటీగా, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల్ని సమర్ధించే వాణిగా మారుతుందని భావిస్తున్నారు. నిజానికి సూర్య దినపత్రిక ఉగాది రోజునే ప్రారంభించాలని భావించారు. కానీ ఈలోగా నాదర్ గుల్ భూకుంభకోణం వెలుగు చూడటంతో సూర్య ప్రకాశ్ రావుకు ఆర్ధిక కష్టాలు మొదలై పత్రిక పనులు ఆలస్యం అయ్యాయి. ఈ మధ్య కాలంలోనే 'సూర్య ' ముఖ్యమంత్రి తనయుడు జగన్మోహన్ రెడ్డి తెస్తున్న 'సాక్షి 'లో విలీనం అవుతోందనే పుకార్లు వినిపించాయి. 'సూర్య ' దినపత్రికకు సత్యమూర్తి ఎడిటర్. ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా వై.ఎస్.ఆర్.శర్మ, న్యూస్ ఎడిటర్ గా రమణ, స్టేట్ నెట్ వర్క్ ఇంఛార్జిగా అంకం రవి పని చేస్తున్నారు.

Friday, October 5, 2007

టీవీ-5.. 'టీవీ-ఐదు ' గా ఎందుకు మారింది?..

అక్టోబర్ 2న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ప్రముఖ నటుడు చిరంజీవిల సమక్షంలో అట్టహాసంగా ప్రారంభమైన టీవీ-5 ప్రసారాలు కొద్ది నిమిషాలకే ఆగిపోవటం మిస్టరీగా మారింది. శాటిలైట్ సంబందిత సాంకేతిక అంశాలను టీవీ-5 యాజమాన్యం, సిబ్బంది కారణాలుగా చెబుతున్నా వాస్తవాలు వేరుగా ఉన్నాయి. అసలు సమస్య 'టీవీ-5' పేరులోనే ఉందని తెలుస్తోంది. సమాజానికి అన్నం, బట్టలు, గృహవసతి, వైద్యం, విద్య సక్రమంగా అందించటమే తమ లక్ష్యంగా ప్రకటించుకుంటూ టీవీ-5 ఆరంభమైంది. అయితే టీవీ-5 పేరిట ఇతర దేశాల్లో (అమెరికా, ఫ్రాన్స్, కెనడా, మంగోలియా, కాంబోడియా, థాయిలాండ్, ఇరాన్, ఆస్ట్రేలియా) పలు ఛానెళ్ళు ఇప్పటికే నడుస్తున్నాయి. టీవీ-5గా ప్రఖ్యాతి పొందిన ఫ్రెంచ్ సంస్థ ఒకటి తెలుగులో స్నేహా బ్రాడ్ కాస్టింగ్ సంస్థ 'టీవీ-5' టైటిల్ తో ఛానెల్ ప్రారంభించటంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఫలితంగా ప్రారంభమైన కొద్ది నిమిషాలకే తెలుగు 'టీవీ-5' సిగ్నల్ స్థంబించిపోయింది. ఈ భాగోతం వెనుక ఇద్దరు తెలుగు టీవీ ఛానళ్ళ యజమానుల హస్తం కూడా ఉందని ఊహాగానాలు ఉన్నాయి. టీవీ-5 పేరిట ఇతర దేశాల్లో కూడా ఛానెళ్ళు ఉన్నాయనే విషయాన్ని 'ఎబౌట్ తెలుగు మీడియా' గతంలోనే ప్రస్థావించింది. 'తెలుగు టీవీ-5' ఇప్పుడు 'టీవీ-ఐదు ' గా పేరు మార్చుకుంది.. తెలుగు మీడియాలో ఇప్పటి వరకూ ఎవరి వద్దా లేనటువంటి అత్యాధునిక టెక్నాలజీతో టీవీ-5 వస్తోందని కొద్ది రోజుగా వస్తున్న టెస్ట్ సిగ్నల్ ప్రసారాలు చెప్పకనే చెప్పాయి. టీవీ-9, ఈటీవీ-2లకు 'టీవీ-ఐదు ' గట్టి పోటీ ఇవ్వగలదని ఆశిద్దాం... ఈ వార్తా కథనంలో ఉపయోగించిన చిత్రంలో ఇతర దేశాల టీవీ-5 లోగోలు (ఎడమ) తెలుగు టీవీ-5 (కుడి) చూడవచ్చు.