Friday, November 23, 2007

ఆర్తి విషయంలో మీడియా అతి

'శుభం పలకరా చిన్నోడా అంటే పెళ్ళి కూతురు.. అన్నాడట' అనే సామెత మన మీడియాకు చక్కగా అతుకుతుంది. ప్రముఖ హీరోయిన్ ఆర్తీ అగర్వాల్ వివాహ విషయంలో మీడియా ప్రతినిధులు చాలా అసహ్యంగా ప్రవర్తించారు. ఒక సెలబ్రిటీ వివాహ వార్తను కవర్ చేయడాన్ని ఎవరికి వారు తమదైన ధోరణిలో సమర్ధించుకోవచ్చుగాక. అయితే ఈ స్వేచ్చ అనేది (పత్రికా స్వేచ్చ అందమా) మన ముక్కు చివర అవతలి వారి ముక్కును తగలనంత వరకే అని గమనించాలి. 'సెలబ్రిటీ' పేరిట అర్తీ అగర్వాల్ వివాహ వరతను కవర్చేయటానికి వెళ్ళిన విలేఖరులు తమ ఫ్లాష్ లు, స్క్రోలింగులతో జనాలను సంఘటనా స్థలానికి రప్పించటమే గాక క్రమశిక్షణ తప్పి తోపులాట సృష్టించారు. అగ్రహించిన ఆర్తి అగర్వాల్ సోదరుడు అందరిపైనా చేయి చేసుకోగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధికి కూడా గాయమైంది. ఇందుకు ఆగ్రహించిన మీడియా సోదరులంతా పెళ్ళి చేసుకొని వెళ్ళుతున్న అర్తి కారుకు అడ్డు పడగా వారు క్షమాపణ చెప్పుకోక తప్పలేదు. ఈ విషయాని మీడియా మిత్రులు ఇంతటితో వదిలేయకుండా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అర్తి అగర్వల్ సోదరున్ని, సోదరిని, తండ్రిని అరెస్ట్ చేయించి పైశాచిక ఆనందాన్ని పొందారు. చివరకు వివాదం సద్గుమనిగిందనుకోండి. ఇంట్లో శుభకార్యం జరిగిన రోజునే పోలీస్ స్టేషన్ గడప తొక్కించిన కీర్తిని మన మీడియా సోదరులు మూట కట్టుకున్నారు. పైగా కొన్ని ఛానెళ్ళ వారు ఆర్తి గత ప్రేమ వ్యవహారం, ఆత్మహత్య ప్రయత్న తాలూకు వార్తల్ని పెళ్ళి భోజనంలా ప్రేక్షకుల కోసం వండి వార్చారు. ప్రియమైన మీడియా ప్రతినిధులారా.. ఆర్తీ అగర్వాల్ లాంటి సెలబ్రిటీల స్థానంలో మీరు లేదా మీ కుటుంబ సభ్యులు ఉంటే ఎలా ఉండేది ఒక్కసారి ఆలోచించుకోండి. .