Tuesday, November 13, 2007
జర్నలిస్టుల అనైఖ్యత బట్టబయలు
జర్నలిస్టుల మధ్య ఐఖ్యత అనేది కప్పల తక్కెడ అంటే ఎవరూ కోపగించుకోవాల్సిన అవసరం లేదు. చీలికలు పేలికలుగా ఉన్న జర్నలిస్టు సంఘాల్లో ఒకరు ఎడ్డం అంటే మరొకరు తెడ్డం అంటారు. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల్లో ఇటీవల ఐకమత్యం కనిపించినా, ప్రింట్ మిత్రులు ఎవరికి వారే వేరు దుఖానాలు తెరుచుకున్నారు. ఇళ్ళ స్థలాలు, జర్నలిస్టులపై దాడులు, మరేదైనా సమస్య వచ్చినప్పుడు కలిసికట్టుగా కాకుండా ఎవరికి వారే పోరాడుతున్నారు. ఫలితంగా జర్నలిస్టులు ప్రభుత్వం వద్ద ముఖ్యమంత్రి ఎదుట చులకన అవుతున్నారు. కర్నూలు జిల్లా జర్నలిస్టులు శ్రీరాములు, ఉరుకుందప్పలపై కేసులు, అరెస్టుల విషయంలో ఈ అంశం మరింత స్పష్టమైంది. ఇద్దరు జర్నలిస్టులను అన్యాయంగా అరెస్టు చేసి జైలుకు పంపిన సంఘటనపై జరుగుతున్న ఉద్యమానికి మెజారిటీ జర్నలిస్టులు ఎందుకు దూరం ఉన్నట్లు. ముఖ్యంగా సీయం-కాంగ్రెస్ బీట్ చూసే రిపోర్టర్లలో కొందరు ఇది తమ సమస్య కాదు అన్నట్లు వ్యవహరించటం సప్ష్టంగా కనిపించింది. అలాగే జర్నలిస్టు సంఘాలకు నేతలుగా చెలామని అవుతున్న వారు ప్రభుత్వంపై గట్టిగా వత్తిడి తేలేక పోవటం కూడా అనుమానాలకు తావిస్తోంది. బాధిత విలేఖరులకు సంబందించిన పత్రికలు తప్ప ఇతర దిన పత్రికలు పెద్దగా జర్నలిస్టుల ఉద్యమ వార్తలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు. రేపు తమ దిన పత్రిక జర్నలిస్టుకు కూడా ఇలాంటి కష్టం వస్తే అవతలి పత్రిక ఎలాంటి సహకారం అందిస్తుందనే స్పృహ కూడా వారికి లేదేమో. సోమవారం నాడు అసెంబ్లీ చరిత్రలోనే తొలిసారిగా 'ఎపి ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ ' కర్నూలు రిపోర్టర్ల అరెస్ట్ అంశంపై ముఖ్యమంత్రి ఛాంబర్ సమీపంలో ధర్నా జరిపి సంచలనం సృష్టించింది. అయితే జర్నలిస్టు సంఘాలకు హోల్ అండ్ సోల్ నేతలుగా చెలామని అయ్యే 'ప్రింట్' నాయకులు ఈ ధర్నాపై సన్నాయి నొక్కులు నొక్కారు. టి.ఆర్.ఎస్., సి.పి.ఎం., సి.పి.ఐ., బి.జె.పి. శాసన సభ పక్షాలు మద్దతు పలికిన ఈ మెరుపు ధర్నాకు హోం మంత్రి, సమాచార శాఖ మంత్రి దిగి వచ్చి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇప్పించినట్లు ప్రకటించారు. తీరా ఆ సాయంత్రం క్యాంప్ ఆఫీస్లో రాజశేఖర రెడ్డి అపాయింట్మెంట్ దక్కింది ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ కు కాదు సోకాల్డ్ 'ప్రింట్' నేతాశ్రీలకు. అసెంబ్లీలో ధర్నా చేపట్టి అపాయింట్మెంట్ హామీ పొందిన 'ఎపి ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ ' మిత్రులు సీఎం ను కలవకుండానే అవమానభారంతో తిరిగి వచ్చారు.