
దినపత్రికను నడపడం కత్తి మీద సాము లాంటిదే. ఆర్థికంగా ఎన్నో వనరులు ఉంటే తప్ప దిన పత్రికను నడపలేం. ముఖ్యంగా ఇందుకోసం ప్రకటనలపై ఆధార పదక తప్పదు. ప్రకటన ఇచ్చేవాడు పత్రిక సర్క్యులేషన్ కూడా పరిగనణలోకి తీసుకుంటాడనుకోండి. ఇటీవల కొన్ని పత్రికలను గమనిస్తే ప్రకటనలకోసమే నడుపుతున్నట్లు కనిపిస్తోంది. మనం ఇక్కడ ప్రధానంగా చెప్పుకుంటోంది 'వార్త ' దిన పత్రిక గురించి ఈ పత్రిక మొదటి పేజీలో పరిమితికి మించిన ప్రకటనలు పాఠకులకు విసుగు తెప్పిస్తున్నాయి. అసలు ఇది వార్తా పత్రికా? ప్రకటనల పత్రికా? అర్థం కావడం లేదు. ఉదాహరణకు దీపావళి నాటి వార్త దిన పత్రికను (09-11-2007) గమనించండి. మొదటి పేజీలో ఇయర్ పానెల్స్ మినహాయిస్తే మొత్తం 322 సెం.మీ.ల స్థలంలో 222 సెం.మీ.లు ప్రకటనల కేటాయిస్తే వార్తలు కేవలం 100 సెం.మీలకే పరిమితం అయ్యాయి. వార్త దిన పత్రికలోని వార్తలు ప్రకటనల మద్య ద్వీపంలా కనిపిస్తుంటాయి. పత్రికలకు ప్రకటనలు ఆక్సిజన్ లాంటి కాదనలేం.. కానీ ఆక్సిజన్ను పంపుసెట్ తో ఎక్కిస్తే ఎలా ఉంటుంది ఆలోచించండి. కొద్ది సంవత్సరాల క్రితం దిన పత్రికలు ప్రకటలు స్వీకరించటంలో హద్దులు నిర్ణయించుకునేవి. ఇప్పుడు 'ఈనాడు 'తో సహా అన్ని పరికలు హద్దులు సడలించుకున్నుట్టున్నాయి. గతంలో మొదటి పేజీలో బ్యానర్ వార్త ఇచ్చే స్థలంలో ప్రకటనలు ఇచ్చే సాంప్రదాయం ఉండేది కాదు. కానీ ఇప్పుడు దాదాపు అన్ని దిన పత్రికల్లోనూ బ్యానర్ యాడ్స్ సర్వ సాధారణం అయిపోయింది. కొన్ని సందర్భాల్లో మొదటి పేజీ మొత్తం ప్రకటనతోనే వచ్చిన ఉదంతాలూ ఉన్నాయి. మన దేశంలో బహుషా ఈ సాంప్రదాయానికి 'టైంస్ ఆఫ్ ఇండియా' శ్రీకారం చుట్టిందేమో?