Monday, November 5, 2007
అసెంబ్లీ నడవాలంటే ప్రత్యక్ష ప్రసారాలు రద్దు చేయాలి
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు చూసిన వారికి ఎంతో విచారం కలగక మానదు. అధికార, ప్రతిపక్షాలు తమ తమ ప్రతి రోజూ ప్రజా సమస్యలనే సాకు చూపి ఏదో ఒక గలాట సృష్టించడం.. వాయిదాలపై వాయిదాలు.. గంటల తరబడి సభ స్థంబించడం.. వ్యక్తిగత విమర్షలు.. ఎంతకీ తెగని పోటా పోటీ ప్రసంగాలు.. సరైన సమాధానాలు లేని చర్చలు.. వాకౌట్లు.. సస్పెన్షన్లు.. ఇవన్నీ చూస్తే వెగటు కలగుతోంది. టీవీ ఛానెళ్ళలో, పత్రికల్లో పతాక స్థానాన్ని ఎలా ఆక్రమించాలనే అంశం పైనే అన్ని పార్టీలు ప్రధాన దృష్టి పెట్టడం వల్ల అర్ధవంతమనైన చర్చ జరగటం లేదు. ఎదుటి పక్షాన్ని ఎలా దెబ్బ తీయాలన్నదే పార్టీల ఎత్తుగడ. అసెంబ్లీ కవరేజీ చూసే సీనియర్ జర్నలిస్టులు, చాలా కాలంగా కొనసాగుతున్న ఎమ్మెల్యేలు, పాత తరం నేతల్ని కదిలిస్తే చెప్పే సమాధానం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 'ఈ అనర్ధానికి ప్రధాన కారణం టీవీ ఛానెళ్ళలో సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలే..' జాగ్రత్తగా అలోచిస్తే ఇది నిజమే అనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, యనమల రామకృష్ణుడు శాసన సభాపతిగా ఉన్న ఉన్న కాలంలో ఆరంభమైన ప్రత్యక్ష ప్రసారాలు కొత్త ఒరవడిని సృష్టించిన మాట వాస్తవం. అసెంబ్లీలో చర్చలు ఎలా జరుగుతాయి? తాము ఎన్నుకున్న ప్రతినిధులు ఎలా మెలుగుతున్నారు? తమ సమస్యల్ని సభలో ప్రస్థావిస్తున్నారా? ముఖ్యమైన ప్రజా సమస్యలకు ప్రభుత్వ పరిష్కారం ఎలా ఉండబోతుంది?.. అనే అంశాలు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ప్రజలు తెలుసుకునే అవకాశం కలిగింది.కాగా రానురాను ప్రత్యక్ష ప్రసారాల వల్ల అసలు సమస్యలు ఆరంభమైనాయి. ప్రజలు నేరుగా సమావేశాలను చూస్తుండటం వల్ల నేతాశ్రీలు సమస్యలకు పరిష్కారం చూపడం కన్నా తమలోని ఉపన్యాస కేసరులను బయట పెట్టు కోవడం ప్రారంభించారు. గంటల తరబడి, రోజుల తరబడి చర్చలు కొనసాగిస్తూ.. కొత్త కొత్త తిట్లతో పరస్పరం సత్కరించుకుంటూ.. ఆరోపనలు ప్రత్యారోపణలతో, ఎదురు దాడులతో విలువైన సమయాన్ని వృధా చేస్తూ ప్రజలకు వెగటు కలిగిస్తున్నారు. గతంలో అసెంబ్లీలో సభ్యులెవరైనా అన్-పార్లమెంటరీ పదాలు వాడితే స్పీకర్ రికార్డుల్లోంచి తొలగించే వారు. అంటే దాన్ని పత్రికల్లో కూడా ప్రచురించరాదని అర్ధం. కానీ ప్రత్యక్ష ప్రసారాల పుణ్యమా అని నేరుగా ప్రజల్లోకి ఆ పదాలు వెల్లిపోయి 'రికార్డుల్లొంచి తొలగించడం'కి అర్ధం లేకుండా పోయింది. ఒకప్పుడు అసెంబ్లీలో ఎలాంటి చర్చ అయినా కొద్ది నిమిషాల్లో, కొద్ది గంటల్లో ముగిసేది. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారాల పుణ్యమా అని ఉపన్యాస కేసరులు గంటలు, రోజుల తరబడి సాగదీస్తున్నారు. సభలో ఏ ప్రసంగమైనా సభాపతిని, తోటి సభ్యులను ఉద్దేషించి కాకుండా 'రాష్ట్ర ప్రజలను గమనిస్తున్నారు..' అంటూ సాగిస్తున్నారు. మరో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే, ఇటీవలే పునర్ ప్రారంభమైన రాష్ట్ర శాసన మండలిలో ఎలాఒటి చర్చలైనా నిమిషాల్లో ముగుస్తున్నాయి. కారణం వెరీ సింపుల్.. శాసన మండలిలో ప్రత్యక్ష ప్రసారాలు లేక పోవడమే.. 'రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా' ఇప్పుడు చెప్పండి అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలు అవసరమా?..