Tuesday, November 27, 2007
జెమినిలో ఇక సతీష్ బాబు మార్క్
జెమిని న్యూస్ చీఫ్ ఎడిటర్ బాధ్యతలను చేపట్టిన సతీష్ బాబు ఛానెల్ ప్రక్షాళన ఆరంభించారు. జెమిని న్యూస్ ను సమూలంగా మార్చే దిశగా కొత్త యాంకర్లు, వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు, సబ్ ఎడిటర్లు, రిపోర్టర్లను కొత్తగా తీసుకుంటున్నారు . తనదైన కార్యక్రమాలతో ఛానెల్ కు కొత్త రూపం తేవాలన్నదే ఆయన తాపత్రయం. నాలుగు ఓబీ వ్యాన్లను కూడా తెప్పిస్తున్నారట. అయితే మార్పుల్లో భాగంగా సతీష్ బాబు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. జెమిని న్యూస్ లో తన వర్గానికి ఉపాధి కల్పించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా యాజులును తప్పించి రామకృష్ణ అనే తన పాత కాపును తెచ్చి డెస్క్ ఇంఛార్జ్ గా నియమించారు. ఆయన వింత చేష్టలు డెస్క్ సిబ్బందికి ఇబ్బందికరంగా మారాయట. అలాగే సబ్జెక్ట్ లేకుండానే అపర మేధావిగా చెలామణి అవుతున్న గమిడి శ్రీనివాస్ ను కో ఆర్డినేటర్ గా నియమించారు.
' బ్లాగులున్నాయి జాగ్రత్త.. '
సతీష్ బాబు ఛీఫ్ ఎడిటర్ గా చేరగానే జెమిని న్యూస్ సిబ్బందితో సమావేషమై ' మనం చర్చించుకునే విషయాలు బయటకు చెప్పకండి. బ్లాగుల్లో పెడతారు ' అని హెచ్చరించారట. తాను జెమిని ఎడిటర్ గా వస్తున్న విషయం బ్లాగ్ల ద్వారా ముందుగానే ప్రచారం కావటం పై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ' ఎబౌట్ తెలుగు మీడియా ' అకారణంగా ఎవరిపైనా బురద చల్లదని, సతీష్ బాబుపై అపార గౌరవం ఉందని.. ఆయన చేస్తున్న మంచి పనులకు తోడ్పాటు అందిస్తుందని సవినయంగా మనవి చేసుకుంటున్నాం.
' బ్లాగులున్నాయి జాగ్రత్త.. '
సతీష్ బాబు ఛీఫ్ ఎడిటర్ గా చేరగానే జెమిని న్యూస్ సిబ్బందితో సమావేషమై ' మనం చర్చించుకునే విషయాలు బయటకు చెప్పకండి. బ్లాగుల్లో పెడతారు ' అని హెచ్చరించారట. తాను జెమిని ఎడిటర్ గా వస్తున్న విషయం బ్లాగ్ల ద్వారా ముందుగానే ప్రచారం కావటం పై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ' ఎబౌట్ తెలుగు మీడియా ' అకారణంగా ఎవరిపైనా బురద చల్లదని, సతీష్ బాబుపై అపార గౌరవం ఉందని.. ఆయన చేస్తున్న మంచి పనులకు తోడ్పాటు అందిస్తుందని సవినయంగా మనవి చేసుకుంటున్నాం.
Friday, November 23, 2007
ఈనాడూ.. ఇదేం ధోరణి?
ఇటీవలే 'ఎబౌట్ తెలుగు మీడియా' వార్తా పత్రికలు యాడ్స్ విషయంలో అవలంభిస్తున్న అతి ధోరణులను సమీక్షించటం గమనించే ఉంటారు. ఒక్క ' వార్త ' దిన పత్రికే కాదు అన్ని పత్రికలు ఇదే విధంగా తయారయ్యాయని ఒక కామెంటర్ స్పందించాడు. నిజమే.. చివరకు ' ఈనాడు ' దిన పత్రిక సైతం కట్టుబాట్లను గాలికి వదిలింది అనే సత్యాన్ని 23-11-2007 నాటి సంచిక తొలి పేజీ చూసిన తర్వాత నిర్ధారించుకున్నాం. ఇటీవల వరికి మద్దతు ధర విషయంలో అసెంబ్లీలోనే రాత్రి నిద్ర చేసి వినూత్న నిరసన తెలిపిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మరునాటి ఈనాడు దిన పత్రిక చూసి నివ్వెర పోయాడట. ఈనాడు మొదటి పేజీలో రావల్సిన తన వార్త స్థానంలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చిరునవ్వులు చిందిస్తున్న పొడువాటి ప్రకటన మనస్థాపం కలిగించిందట.
ఆర్తి విషయంలో మీడియా అతి
'శుభం పలకరా చిన్నోడా అంటే పెళ్ళి కూతురు.. అన్నాడట' అనే సామెత మన మీడియాకు చక్కగా అతుకుతుంది. ప్రముఖ హీరోయిన్ ఆర్తీ అగర్వాల్ వివాహ విషయంలో మీడియా ప్రతినిధులు చాలా అసహ్యంగా ప్రవర్తించారు. ఒక సెలబ్రిటీ వివాహ వార్తను కవర్ చేయడాన్ని ఎవరికి వారు తమదైన ధోరణిలో సమర్ధించుకోవచ్చుగాక. అయితే ఈ స్వేచ్చ అనేది (పత్రికా స్వేచ్చ అందమా) మన ముక్కు చివర అవతలి వారి ముక్కును తగలనంత వరకే అని గమనించాలి. 'సెలబ్రిటీ' పేరిట అర్తీ అగర్వాల్ వివాహ వరతను కవర్చేయటానికి వెళ్ళిన విలేఖరులు తమ ఫ్లాష్ లు, స్క్రోలింగులతో జనాలను సంఘటనా స్థలానికి రప్పించటమే గాక క్రమశిక్షణ తప్పి తోపులాట సృష్టించారు. అగ్రహించిన ఆర్తి అగర్వాల్ సోదరుడు అందరిపైనా చేయి చేసుకోగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధికి కూడా గాయమైంది. ఇందుకు ఆగ్రహించిన మీడియా సోదరులంతా పెళ్ళి చేసుకొని వెళ్ళుతున్న అర్తి కారుకు అడ్డు పడగా వారు క్షమాపణ చెప్పుకోక తప్పలేదు. ఈ విషయాని మీడియా మిత్రులు ఇంతటితో వదిలేయకుండా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అర్తి అగర్వల్ సోదరున్ని, సోదరిని, తండ్రిని అరెస్ట్ చేయించి పైశాచిక ఆనందాన్ని పొందారు. చివరకు వివాదం సద్గుమనిగిందనుకోండి. ఇంట్లో శుభకార్యం జరిగిన రోజునే పోలీస్ స్టేషన్ గడప తొక్కించిన కీర్తిని మన మీడియా సోదరులు మూట కట్టుకున్నారు. పైగా కొన్ని ఛానెళ్ళ వారు ఆర్తి గత ప్రేమ వ్యవహారం, ఆత్మహత్య ప్రయత్న తాలూకు వార్తల్ని పెళ్ళి భోజనంలా ప్రేక్షకుల కోసం వండి వార్చారు. ప్రియమైన మీడియా ప్రతినిధులారా.. ఆర్తీ అగర్వాల్ లాంటి సెలబ్రిటీల స్థానంలో మీరు లేదా మీ కుటుంబ సభ్యులు ఉంటే ఎలా ఉండేది ఒక్కసారి ఆలోచించుకోండి. .
Friday, November 16, 2007
' సత్య ' వస్తుందా? రాదా?
' సత్య ' ఛానెల్ అసలు వస్తుందా? అనే టాక్ హైదరాబాద్ మీడియా వర్గాల్లో వినిపిస్తోంది. గత ఐదేళ్ళుగా బహుషా 2004 ఎన్నికలకన్నా ముందు నుండే సత్య ఛానెల్ 'అదిగో.. ఇదిగో.. అప్పుడు వస్తుంది.. ఇప్పుడు వస్తుంది..' అని ప్రచారమైతే జరుగుతోంది. కానీ ఎందుకో జాప్యం జరుగుతోంది. ఛానెల్ కు అనుమతి రావాలని కొన్ని రోజులు, శాటిలైట్ దొరకలేదని కొన్ని రోజులు చెప్పుకొచ్చారు. క్యాలెండర్లో తేదీలు, నెలలు, సంవత్సరాలే దొర్లుతున్నాయి తప్ప ' సత్య ' వస్తున్న జాడ కనిపించటంలేదు. ఫీల్డ్ లో తిరిగే సత్య రిపొర్టర్లు, కెమెరామెన్లను మీచనెల్ ఎప్పుడొస్తుందబ్బా? అని అడిగితే పాపం తెగ ఇబ్బంది పడిపోతున్నారు. అసలు ' సత్య ' ప్రమోటర్ కాసానికి అసలు ఛానెల్ తెచ్చే ఉద్దేశ్యమే లేదని వినిపిస్తోంది. తన రాజకీయ, వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవడానికే కాసాని తరచూ ఛానెల్ తెస్తున్నానని చెప్పుకుంటున్నారని భావించవచ్చు. ఛానెల్ తెచ్చే పనిమీదే ఉన్నట్లు కొందరు జర్నలిస్టులనైతే నియమించుకున్నారు. ఛానెల్ తెచ్చే ఉద్దేశ్యమే ఉంటే నియామకాలు ఎప్పుడో ప్రారంభమయ్యేవి. ' సత్య ' న్యూస్ హెడ్ గా ఈనాడు-ఈ టీవీ ఫేం 'గడ్డం నరసిం హా రావు 'ను నియమించి దాదాపు సంవత్సరన్నర అవుతుందేమో. అయ్యా.. నరసిం హా రావు గారు.. ఎందుకు మీ కెరీర్ ను పణంగా పెట్టి సమయం వృధా చేసుకుంటారు? అసలు వసుందో,రాదో తెలియని ఛానెల్ కోసం ఎంత కాలం పని చేస్తారు? మీకోసం బయట ఎన్నో అవకాశాలు ఎదురు చూస్తున్నాయి ప్రయత్నిస్తే తప్పేమీ లేదు కదా?..
'వార్త 'లా? ప్రకటనలా?
దినపత్రికను నడపడం కత్తి మీద సాము లాంటిదే. ఆర్థికంగా ఎన్నో వనరులు ఉంటే తప్ప దిన పత్రికను నడపలేం. ముఖ్యంగా ఇందుకోసం ప్రకటనలపై ఆధార పదక తప్పదు. ప్రకటన ఇచ్చేవాడు పత్రిక సర్క్యులేషన్ కూడా పరిగనణలోకి తీసుకుంటాడనుకోండి. ఇటీవల కొన్ని పత్రికలను గమనిస్తే ప్రకటనలకోసమే నడుపుతున్నట్లు కనిపిస్తోంది. మనం ఇక్కడ ప్రధానంగా చెప్పుకుంటోంది 'వార్త ' దిన పత్రిక గురించి ఈ పత్రిక మొదటి పేజీలో పరిమితికి మించిన ప్రకటనలు పాఠకులకు విసుగు తెప్పిస్తున్నాయి. అసలు ఇది వార్తా పత్రికా? ప్రకటనల పత్రికా? అర్థం కావడం లేదు. ఉదాహరణకు దీపావళి నాటి వార్త దిన పత్రికను (09-11-2007) గమనించండి. మొదటి పేజీలో ఇయర్ పానెల్స్ మినహాయిస్తే మొత్తం 322 సెం.మీ.ల స్థలంలో 222 సెం.మీ.లు ప్రకటనల కేటాయిస్తే వార్తలు కేవలం 100 సెం.మీలకే పరిమితం అయ్యాయి. వార్త దిన పత్రికలోని వార్తలు ప్రకటనల మద్య ద్వీపంలా కనిపిస్తుంటాయి. పత్రికలకు ప్రకటనలు ఆక్సిజన్ లాంటి కాదనలేం.. కానీ ఆక్సిజన్ను పంపుసెట్ తో ఎక్కిస్తే ఎలా ఉంటుంది ఆలోచించండి. కొద్ది సంవత్సరాల క్రితం దిన పత్రికలు ప్రకటలు స్వీకరించటంలో హద్దులు నిర్ణయించుకునేవి. ఇప్పుడు 'ఈనాడు 'తో సహా అన్ని పరికలు హద్దులు సడలించుకున్నుట్టున్నాయి. గతంలో మొదటి పేజీలో బ్యానర్ వార్త ఇచ్చే స్థలంలో ప్రకటనలు ఇచ్చే సాంప్రదాయం ఉండేది కాదు. కానీ ఇప్పుడు దాదాపు అన్ని దిన పత్రికల్లోనూ బ్యానర్ యాడ్స్ సర్వ సాధారణం అయిపోయింది. కొన్ని సందర్భాల్లో మొదటి పేజీ మొత్తం ప్రకటనతోనే వచ్చిన ఉదంతాలూ ఉన్నాయి. మన దేశంలో బహుషా ఈ సాంప్రదాయానికి 'టైంస్ ఆఫ్ ఇండియా' శ్రీకారం చుట్టిందేమో?
Tuesday, November 13, 2007
జర్నలిస్టుల అనైఖ్యత బట్టబయలు
జర్నలిస్టుల మధ్య ఐఖ్యత అనేది కప్పల తక్కెడ అంటే ఎవరూ కోపగించుకోవాల్సిన అవసరం లేదు. చీలికలు పేలికలుగా ఉన్న జర్నలిస్టు సంఘాల్లో ఒకరు ఎడ్డం అంటే మరొకరు తెడ్డం అంటారు. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల్లో ఇటీవల ఐకమత్యం కనిపించినా, ప్రింట్ మిత్రులు ఎవరికి వారే వేరు దుఖానాలు తెరుచుకున్నారు. ఇళ్ళ స్థలాలు, జర్నలిస్టులపై దాడులు, మరేదైనా సమస్య వచ్చినప్పుడు కలిసికట్టుగా కాకుండా ఎవరికి వారే పోరాడుతున్నారు. ఫలితంగా జర్నలిస్టులు ప్రభుత్వం వద్ద ముఖ్యమంత్రి ఎదుట చులకన అవుతున్నారు. కర్నూలు జిల్లా జర్నలిస్టులు శ్రీరాములు, ఉరుకుందప్పలపై కేసులు, అరెస్టుల విషయంలో ఈ అంశం మరింత స్పష్టమైంది. ఇద్దరు జర్నలిస్టులను అన్యాయంగా అరెస్టు చేసి జైలుకు పంపిన సంఘటనపై జరుగుతున్న ఉద్యమానికి మెజారిటీ జర్నలిస్టులు ఎందుకు దూరం ఉన్నట్లు. ముఖ్యంగా సీయం-కాంగ్రెస్ బీట్ చూసే రిపోర్టర్లలో కొందరు ఇది తమ సమస్య కాదు అన్నట్లు వ్యవహరించటం సప్ష్టంగా కనిపించింది. అలాగే జర్నలిస్టు సంఘాలకు నేతలుగా చెలామని అవుతున్న వారు ప్రభుత్వంపై గట్టిగా వత్తిడి తేలేక పోవటం కూడా అనుమానాలకు తావిస్తోంది. బాధిత విలేఖరులకు సంబందించిన పత్రికలు తప్ప ఇతర దిన పత్రికలు పెద్దగా జర్నలిస్టుల ఉద్యమ వార్తలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు. రేపు తమ దిన పత్రిక జర్నలిస్టుకు కూడా ఇలాంటి కష్టం వస్తే అవతలి పత్రిక ఎలాంటి సహకారం అందిస్తుందనే స్పృహ కూడా వారికి లేదేమో. సోమవారం నాడు అసెంబ్లీ చరిత్రలోనే తొలిసారిగా 'ఎపి ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ ' కర్నూలు రిపోర్టర్ల అరెస్ట్ అంశంపై ముఖ్యమంత్రి ఛాంబర్ సమీపంలో ధర్నా జరిపి సంచలనం సృష్టించింది. అయితే జర్నలిస్టు సంఘాలకు హోల్ అండ్ సోల్ నేతలుగా చెలామని అయ్యే 'ప్రింట్' నాయకులు ఈ ధర్నాపై సన్నాయి నొక్కులు నొక్కారు. టి.ఆర్.ఎస్., సి.పి.ఎం., సి.పి.ఐ., బి.జె.పి. శాసన సభ పక్షాలు మద్దతు పలికిన ఈ మెరుపు ధర్నాకు హోం మంత్రి, సమాచార శాఖ మంత్రి దిగి వచ్చి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇప్పించినట్లు ప్రకటించారు. తీరా ఆ సాయంత్రం క్యాంప్ ఆఫీస్లో రాజశేఖర రెడ్డి అపాయింట్మెంట్ దక్కింది ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ కు కాదు సోకాల్డ్ 'ప్రింట్' నేతాశ్రీలకు. అసెంబ్లీలో ధర్నా చేపట్టి అపాయింట్మెంట్ హామీ పొందిన 'ఎపి ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ ' మిత్రులు సీఎం ను కలవకుండానే అవమానభారంతో తిరిగి వచ్చారు.
Monday, November 5, 2007
అసెంబ్లీ నడవాలంటే ప్రత్యక్ష ప్రసారాలు రద్దు చేయాలి
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు చూసిన వారికి ఎంతో విచారం కలగక మానదు. అధికార, ప్రతిపక్షాలు తమ తమ ప్రతి రోజూ ప్రజా సమస్యలనే సాకు చూపి ఏదో ఒక గలాట సృష్టించడం.. వాయిదాలపై వాయిదాలు.. గంటల తరబడి సభ స్థంబించడం.. వ్యక్తిగత విమర్షలు.. ఎంతకీ తెగని పోటా పోటీ ప్రసంగాలు.. సరైన సమాధానాలు లేని చర్చలు.. వాకౌట్లు.. సస్పెన్షన్లు.. ఇవన్నీ చూస్తే వెగటు కలగుతోంది. టీవీ ఛానెళ్ళలో, పత్రికల్లో పతాక స్థానాన్ని ఎలా ఆక్రమించాలనే అంశం పైనే అన్ని పార్టీలు ప్రధాన దృష్టి పెట్టడం వల్ల అర్ధవంతమనైన చర్చ జరగటం లేదు. ఎదుటి పక్షాన్ని ఎలా దెబ్బ తీయాలన్నదే పార్టీల ఎత్తుగడ. అసెంబ్లీ కవరేజీ చూసే సీనియర్ జర్నలిస్టులు, చాలా కాలంగా కొనసాగుతున్న ఎమ్మెల్యేలు, పాత తరం నేతల్ని కదిలిస్తే చెప్పే సమాధానం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 'ఈ అనర్ధానికి ప్రధాన కారణం టీవీ ఛానెళ్ళలో సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలే..' జాగ్రత్తగా అలోచిస్తే ఇది నిజమే అనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, యనమల రామకృష్ణుడు శాసన సభాపతిగా ఉన్న ఉన్న కాలంలో ఆరంభమైన ప్రత్యక్ష ప్రసారాలు కొత్త ఒరవడిని సృష్టించిన మాట వాస్తవం. అసెంబ్లీలో చర్చలు ఎలా జరుగుతాయి? తాము ఎన్నుకున్న ప్రతినిధులు ఎలా మెలుగుతున్నారు? తమ సమస్యల్ని సభలో ప్రస్థావిస్తున్నారా? ముఖ్యమైన ప్రజా సమస్యలకు ప్రభుత్వ పరిష్కారం ఎలా ఉండబోతుంది?.. అనే అంశాలు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ప్రజలు తెలుసుకునే అవకాశం కలిగింది.కాగా రానురాను ప్రత్యక్ష ప్రసారాల వల్ల అసలు సమస్యలు ఆరంభమైనాయి. ప్రజలు నేరుగా సమావేశాలను చూస్తుండటం వల్ల నేతాశ్రీలు సమస్యలకు పరిష్కారం చూపడం కన్నా తమలోని ఉపన్యాస కేసరులను బయట పెట్టు కోవడం ప్రారంభించారు. గంటల తరబడి, రోజుల తరబడి చర్చలు కొనసాగిస్తూ.. కొత్త కొత్త తిట్లతో పరస్పరం సత్కరించుకుంటూ.. ఆరోపనలు ప్రత్యారోపణలతో, ఎదురు దాడులతో విలువైన సమయాన్ని వృధా చేస్తూ ప్రజలకు వెగటు కలిగిస్తున్నారు. గతంలో అసెంబ్లీలో సభ్యులెవరైనా అన్-పార్లమెంటరీ పదాలు వాడితే స్పీకర్ రికార్డుల్లోంచి తొలగించే వారు. అంటే దాన్ని పత్రికల్లో కూడా ప్రచురించరాదని అర్ధం. కానీ ప్రత్యక్ష ప్రసారాల పుణ్యమా అని నేరుగా ప్రజల్లోకి ఆ పదాలు వెల్లిపోయి 'రికార్డుల్లొంచి తొలగించడం'కి అర్ధం లేకుండా పోయింది. ఒకప్పుడు అసెంబ్లీలో ఎలాంటి చర్చ అయినా కొద్ది నిమిషాల్లో, కొద్ది గంటల్లో ముగిసేది. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారాల పుణ్యమా అని ఉపన్యాస కేసరులు గంటలు, రోజుల తరబడి సాగదీస్తున్నారు. సభలో ఏ ప్రసంగమైనా సభాపతిని, తోటి సభ్యులను ఉద్దేషించి కాకుండా 'రాష్ట్ర ప్రజలను గమనిస్తున్నారు..' అంటూ సాగిస్తున్నారు. మరో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే, ఇటీవలే పునర్ ప్రారంభమైన రాష్ట్ర శాసన మండలిలో ఎలాఒటి చర్చలైనా నిమిషాల్లో ముగుస్తున్నాయి. కారణం వెరీ సింపుల్.. శాసన మండలిలో ప్రత్యక్ష ప్రసారాలు లేక పోవడమే.. 'రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా' ఇప్పుడు చెప్పండి అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలు అవసరమా?..
Saturday, November 3, 2007
జెమిని న్యూస్ ఎడిటర్ గా సతీష్ బాబు..
కష్టాల కడలిలో కొట్టు మిట్టడుతున్న జెమిని న్యూస్ ఎడిటర్ గా సతీష్ బాబు నియమితులయ్యారు. ఇది ఆ సంస్థకు ఆరోగ్యకర పరిణామం, అక్కడి దుష్ట శక్తులకు శరాఘాతం. మా టీవీ న్యూస్ ఎడిటర్ గా, గతంలో జెమినిలోనే న్యూస్ బేస్డ్ ప్రోగ్రాం జర్నలిస్ట్ డైరీ నడిపిన సతీష్ బాబు కు మొచి పాపులారిటీ ఉంది. సతీష్ బాబు పడిపోయిన జెమిని న్యూస్ ఇమేజీని తిరిగి ప్రతిష్టించే ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు. ఎటొచ్చి ఆయన నోటి దురదే అక్కడి ఉద్యోగులకు ఆందోళన కలిగిస్తోంది. సతీష్ బాబు రాకతో జెమిని న్యూస్ ఎడిటర్ కార్య స్థానం చెన్నై నుండి హైదరాబాద్ కు మారుతోంది.
రఘు కుమార్ ఔట్..
అవినీతి పరునిగా అపఖ్యాతి పాలైన రఘు కుమార్ జెమిని న్యూస్ ఎడిటర్ పదవికి రాజీనామా చేశారు(?) తొలగింపబడ్డారని కూడా ప్రచారం జరుగుతోంది. ఒక న్యూస్ చానెల్ కు సహజంగా కార్యస్థానంలో ఎడిటర్ ఉండాలి. కాని రఘుకుమార్ హైదరాబాద్లో కాక చెన్నైలో ఉండి పనిచేసే వారు. నిజానికి హైదరాబాద్ నుండి ఎడిటై వచ్చే వార్తలను పెట్టుకోవడం తప్ప ఆయన చేసిన పనేంటో? రఘుకుమార్ జిల్లా రిపోర్టర్ పోస్టులను అమ్ముకున్నారని, ప్రతి నెలా జిల్లాల నుండి మామూళ్ళు దండుకునేవారని, ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా మునిరాజు నాయకత్వంలో కొందరు రిపోర్టర్లతో కోటరీ ఏర్పాటు చెసుకున్నారనేది ప్రచారంలో ఉంది. రఘుకుమార్ వెళ్ళిపోతాడని ముందే తెలిసిన మునిరాజు మెల్లగా జెమిని నుండి జారుకున్నాడు. రఘుకుమార్ రాజీనామా తర్వాత ఈయన నియమించిన 'కరెప్ట్ నెట్ వర్క్' తమ భవిష్యత్తుపై ఆందోళనగా ఉంది.
వారానికి ఐదు రోజులే..
మంచి జీతం, పనికి గుర్తింపు, స్నేహ పూరిత - స్వేచ్చా వాతావరణం.. ఏ ఉద్యోగైనా ప్రధానంగా కోరుకునేవి ఇవే. ఇవన్నీ దాదాపుగా 'జీ తెలుగు ' ఛానెల్లో ఉన్నాయని చెబితే అతిశయోక్తి లేదు. అందుకే జీ తెలుగు జర్నలిస్టులు ఎలాంటి టెన్షన్ లేకుండా పని చేస్తారు. (ఈ ఛానెల్ కు అంతగా ప్రజాదరణ లేక పోవడం ఇక్కడ అప్రస్తుత అంశం అనుకోండి) ఇక నుంచి జీ తెలుగులో వారానికి ఐదు రోజుల పని విధానం అమలు చేస్తున్నారనేది తాజా వార్త. అంటే అక్కడి జర్నలిస్టులకు వారానికి రెండు సెలవు లభిస్తాయన్న మాట. వారాని ఒక్క వీక్లీ ఆఫ్ ఇవ్వడానికే తెగ ఇబ్బంది పడుతున్న ఛానెళ్ళలో పని చేసే జర్నలిస్టులకు ఒకింత ఈర్ష వస్తే తప్పు పట్ట లేం .. కొత్త న్యూస్ ఛానెళ్ళు 'ఎన్-టీవీ', 'టీవీ-ఐదు ' లలో ఇంకా వీక్లీ ఆఫ్ ఇవ్వడం లేదని అక్కడి జర్నలిస్టులు గగ్గోలు పెడుతున్నారు. జర్నలిస్టుకు తగిన విరామం ఇస్తేనే టెన్షన్ లేకుండా, ఉత్సాహంగా పనిచేస్తాడు.
Subscribe to:
Posts (Atom)