Friday, February 22, 2008

పారిపోయిన డెస్క్ ఇన్ ఛార్జ్

కనబడుటలేదు
పేరు: జె.రామక్రిష్ణ
వయసు: 55+
ఉద్యోగం: ఇటీవలి దాకా జెమినిలో డెస్క్ ఇన్ ఛార్జ్
ఆనవాలు: జుట్టుకి, మీసాలకి నల్ల రంగు, సోడాబుడ్డి కళ్ళద్దాలు. + లిక్కర్ కంపు
సదరు వ్యక్తి జీతం, అక్రిడేషన్ వచ్చినప్పటి నుండీ గత రెండు నెలలుగా కనబడుట లేదు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తచ్చాడుతుంటాడు. ఆచూకీ తెలిపిన వారికి తగిన బహుమతి ఇవ్వబడును.
అయ్యా రామక్రిష్ణా! మీరు కనబడక మీ ఆప్త మిత్రుడు సతీష్ బాబు బెంగ పెట్టుకున్నా, మేము మాత్రం సంతోషంగా ఉన్నాము. ఇక్కడి పని వత్తిడి, ఛీవాట్లు తట్టుకోలేక ఉద్యోగం వదిలేసి పారిపోయావని మాకు తెలుసు. మీరు ఎక్కడ ఉన్నా తిరిగి రానక్కరలేదు. కానీ మా దగ్గర తీసుకున్న అప్పులు తిప్పి పంపితే అదే పది వేలు. 24 గంటలు మత్తులో ఉండే నీవు 24 గంటల టీవీ ఛానెళ్ళో పని చేయలేవని మాకు తెలుసు. నీవు ఎలాగూ తాగుడు అలవాటు మానలేవని మాకు తెలుసు. ఎక్కడైనా ఉద్యోగం వస్తే ఇకనైనా బుద్దిగా పని చేయి. తోటి ఉద్యోగుల పైన పితూరీలు చెప్పే అలవాటు వదులుకో.
ఇట్లు..
జెమిని జర్నలిస్టులు

Sunday, February 3, 2008

ఇ-మీడియా హౌసింగ్ సొసైటీలో బయటపడుతున్న అక్రమాలు

అందరు ఊహించినట్లే ఎలక్ట్రానిక్ మీడియా హౌసింగ్ సొసైటీలో అక్రమాలు బయటపడ్డాయి. కమిటీ సభ్యులందరి సమక్షంలో పకడ్బందీంగా స్క్రూటినీ జరిపిన తర్వాత జాబితా బయట పెట్టాక పోవడంపై వ్యక్తమైన అనుమానాలను ఎబౌట్ తెలుగు మీడియా గతంలోనే వెలుగులోకి తెచ్చింది. సొసైటీ డైరెక్టర్లు గట్టిగా నిలదీసి తిరుగుబాటు చేసేసరికి విధిలేక శ్రీనివాస్ రెడ్డి, సాబేర్ సమావేశం పెట్టాల్సి వచ్చింది. వీరిద్దరూ ఏకపక్షంగా ముఖ్యమంత్రికి సమర్పించిన జాబితాలో అధనంగా స్క్రూటినీ జరగని కొన్ని పేర్లు ఉండటం గమనించి సభ్యులంతా ఆశ్చర్యపోయారు. స్క్రూటినీలో కేటాయించిన పాయింట్లు, సీనియారిటీని పక్కనపెట్టి జాబితా తయారు చేయటంతో చాలా మంది జర్నలిస్టులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. సభ్యులకు చెప్పకుండా ముఖ్యమంత్రికి జాబితా ఎలా ఇచ్చారు? కో ఆర్డినేషన్ కమిటీతో ఏకపక్షంగా ఎలా ఒప్పందాలను కుదుర్చుకున్నారని అడిగితే శ్రీనివాస్ రెడ్డి, సాబేర్ కుంటిసాకులు చెప్పారట. జరిగిందేదో జరిగిపోయింది, కొత్త జాబితా తయారు చేద్దామని చెప్పిన వీరిద్దరు పెద్దమనుషులు ఇప్పటిదాకా ఆ పని చేయకపోవటంతో అనుమానాలు మరింత తీవ్రమైనాయి. ముఖ్యమంత్రికి ఇచ్చిన జాబితాలో జరిగిన అక్రమాలపై నిలదీసే సభ్యులను బెదిరిస్తున్నారని సమాచారం. సొసైటీలో జరుగుతున్న పరిణామాలను సభ్యులెవరికీ చెప్పకపోవటానికి కారణం ఏమిటి? ఇంతకీ జరిగిన అక్రమాలకు భాధ్యత ఎవరిది? శ్రీనివాస్ రెడ్డిదా? సాబేర్ దా?
జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాల సాధన కోసం వివిధ హౌసింగ్ సొసైటీలతో ఏర్పాటైన కో ఆర్డినేషన్ కమిటీ అసలు ఏ దిశగా పోతోంది. ఇన్ని సంఘాలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడం కష్టం, అందరూ ఒకే సొసైటీగా ఏర్పడి రండి అని ముఖ్యమంత్రి చెప్పగానే గుడ్డిగా తల ఊపి వచ్చారట. ఇప్పటికే ఉన్న సొసైటీలను కాదని కొత్తగా ఏర్పడే సొసైటీకి ఇళ్ళ స్థలాలు ఇవ్వడం ఏలా సాధ్యం? ప్లాటు రాని వాడెవరైనా కోర్టుకెళ్ళితే ఏమవుతుంది ఆలోచించారా?

Sunday, January 27, 2008

ఏమిటీ రాతలు?..

ఇటీవల 'ఎబౌట్ తెలుగు మీడియా' లోని కామెంట్ బాక్సుల్లో వస్తున్న రాతలు ఆశ్చర్యాన్నీ, ఇబ్బందినీ కలిగిస్తున్నాయి. మేమేదో ఎవరికో వత్తాసు పలుకుతున్నట్లు, వారు అందించే సమాచారాన్ని ప్రచురించటం లేదని రాస్తున్నారు? మాకు వస్తున్న సమాచారాన్ని నిర్ధారించుకోకుండా ఎలా ప్రచురించగలం? 'ఎబౌట్ తెలుగు మీడియా' ఎవరికీ వత్తాసు పలకదు. మేం అనవసరంగా ఎవరిపైనా బురద చల్లబోం, అవినీతిపరుల్ని, తోటి జర్నలిటులకు ఇబ్బంది కలిగించే వారిని మాత్రమే ఉతికి ఆరేస్తాం అని గతంలోనే స్పష్టంగా ప్రకటించిన విషయాన్ని ఒకసారి గుర్తుతెచ్చుకోండి. మా వైఖరి అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ మారబోదు. మరో విషయం.. 'ఎబౌట్ తెలుగు మీడియా' కామెంట్ బాక్సుల్లో స్వేచ్చా భావ ప్రకటన ఉండాలని మేం కోరుకుంటున్నాం. అందుకే సాధ్యమైనంత వరకు మేం వాటిని ఎడిట్ చేయటం లేదు. ఈ సదుపాయాన్ని ఆసరాగా తీసుకొని కొందరు అశ్లీల రాతలు, మహిళలను కించపరిచే రాతలు చొప్పిస్తున్నారు. ఈ రాతలకు మేం ఎంతమాత్రం బాధ్యులం కాదు, కామెంట్ బాక్సుల్లో వచ్చేవి వారి వ్యక్తిగతం. 'ఎబౌట్ తెలుగు మీడియా' వాటితో ఏకీభవించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నాం.

దూసుకొస్తున్న ' సాక్షి '

తెలుగు నాట మరో సంచలన దిన పత్రికగా ఆవిర్భవిస్తున్న ' సాక్షి ' పై సర్వత్రా చర్చ జరుగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి కుమారుడైన జగన్ మోహన్ రెడ్డి దిన పత్రికను ప్రారంభించడమే ఈ చర్చకు కారణం. జగన్ సారధ్యంలో, పతంజలి ప్రధాన సంపాదకుడుగా 19 ఎడిషన్లతో వస్తున్న ' సాక్షి ' ఫిబ్రవరి నెలాఖరులో ప్రధానమంత్రి చేతుల మీదుగా విడుదలవుతున్నట్లు సమాచారం. జర్నలిస్టులకు భారీ జీతాలు ఆఫర్ చేసిన సాక్షి, ప్రధాన దిన పత్రికలను వణుకు పుట్టిస్తోంది. తమ జర్నలిస్టులు చేజారకుండా కాపాడుకోవడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఇప్పటికే రెండు మూడు సార్లు జీతాలు పెంచక తప్పలేదు. ఎలక్ట్రానిక్ మీడియాలో టీవీ-9 లాగే ప్రింట్ మీడియాలో సాక్షి జర్నలిస్టుల విలువ పెంచింది. కొత్త ఛానెళ్ళు, దినపత్రికల రాకతో తెలుగు మీడియా సిబ్బంది సైతం ఐటి ఉద్యోగుల్లా మంచి జీతాలు పొందే రోజులొచ్చాయి. అన్ని పేజీలు రంగుల్లో రానున్న ' సాక్షి ' బాటలోనే ఇతర దినపత్రికలు వెళ్ళక తప్పదు. సాక్షి గురి ప్రధానంగా ఈనాడు, ఆంధ్రజ్యోతిల పైనే అని ప్రతేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ' ఆ ' రెండు పత్రికలపై గుర్రుగా ఉన్న ముఖ్యమంత్రికి సొంత దినపత్రిక ' సాక్షి ' రావడం అన్నివిధాలా సరికొత్త బలాన్ని తెచ్చి పెడుతుంది.

Sunday, January 20, 2008

కేబుల్ ఆపరేటర్లను భయపెడుతున్న ' సన్ డైరెక్ట్ '

వినియోగదారులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న సన్ నెట్ వర్క్ వారి డిటిహెచ్ సర్వీస్ 'సన్ డైరెక్ట్' చాలా సైలెంట్ గా రాష్ట్రంలోకి ప్రవేశించింది. తమిళ నాడులో ఏకచత్రాధి పత్యంగా నడుస్తున్న తమ సుమంగళి కేబుల్ విజన్ కు ఎనాటికైనా ముప్పుతప్పదని భావించిన మారన్ బ్రదర్స్ డిటిహెచ్ సర్వీసులు ప్రారంభించాలని మూడేళ్ళ క్రితమే ప్రణాళికలు తయారు చేసుకున్నారు. ఈలోగా దినకరన్ వివాదంతో కరుణానిధికి మారన్ సొదరులు దూరమయ్యారు. ఇదే అదనుగా కరుణానిధి కేబుల్ సర్వీసులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా జయలలిత ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ ను చట్టబద్దం చేసేశారు. మారన్ సోదరులు యుద్ద ప్రాతిపదికన 'సన్ డైరెక్ట్' డిటిహెచ్ సర్వీసులను నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రారంభించారు.
డిష్ రూ.1999/- + నెల అద్దె రూ 75/- ( ఏడాది పాటు ఫ్రీ)

'సన్ డైరెక్ట్' కేవలం 1999 రూ.లకే వినియోగదారులకు అందిస్తున్నారు. నేలు 75 రూ.లకే 75 టీవీ ఛానెళ్ళు, 15 రేడియో చానెళ్ళు ఇవ్వడం సన్ డైరెక్త్ ప్రత్యేకత. పైగా ఏడాది పాటు నెలవారి బిల్స్ ఉండవు. రాష్ట్ర మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న టాటా స్కై, డిష్ టీవీ, డిడి డైరెక్ట్ డిటిహెచ్ సర్వీసులకన్నా 'సన్ డిరెక్ట్' చాలా చౌక.

ఆందోళనలో కేబుల్ ఆపరేటర్లు

తమ ఉపాధికి ముప్పుగా మారిన సన్ డైరెక్ట్ సర్వీసులపై కేబుల్ ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఒకసారి హైదరాబాద్ లోని జెమిని టీవీ ఆఫీస్ ముందు ఒక రోజంతా ధర్నా జరిపారు. జెమిని, జెమిని న్యూస్, జెమిని మ్యూజిక్, తేజ ఛానెళ్ళను పే ఛానెళ్ళుగా మార్చి తమ నుండి కోట్లాది రూపాయలు ముక్కు పిండి వసూలు చేస్తున్న సన్ గ్రూప్, సొంతంగా ప్రారంభించిన డిటిహెచ్ సర్వీస్ ను చౌకగా ఇవ్వడంలోని ఆంతర్యాన్ని వారు ప్రశ్నిస్తున్నారు.

మరో ఈస్టిండియా కంపనీ 'సన్ గ్రూప్'

ఆంగ్లేయులు మన దేశంలోకి ఈస్టిండియా కంపనీ ముసుగులో వచ్చి ఇక్కడి వ్యాపారాలన్నింటినీ దివాళా తీయించి సంపదను తమ దేశానికి తరలించుకు పోయిన వైనాన్ని మనం చరిత్రలో చదువుకున్నాం. టీవీ ఛానెళ్ళు, కేబుల్ - డిటిహెచ్ వ్యాపారాల విషయంలో సన్ గ్రూప్ మన రాష్ట్రంలో ఇదే విధానాన్ని అవలంభిస్తోందనే విమర్శలున్నాయి. తమిళనాడులో తమ ఛానెళ్ళను ఉచితంగా అందిస్తున్న సన్ నెట్ వర్క్, ఆంధ్ర ప్రదెశ్ లో మాత్రం పే ఛానెళ్ళ పేరిట ఆపరేటర్ల వద్ద కోట్లాది రూపాయల్ని జబర్దస్తీగా వసూలు చేస్తోంది. ఇప్పుడు 'సన్ డైరెక్ట్' పేరిట ఏకంగా కేబుల్ ఆపరేటల ఉపాధినే దెబ్బ తీస్తోంది. తమ తమిళ ఛానెళ్ళ సిబ్బందికి భారీగా జీతాలు ఇచ్చే సన్ గ్రూప్ తెలుగు ఛానెళ్ళ ఉద్యోగులకు మాత్రం ముష్టి జీతాలు విదులుస్తోంది. ఇతర తెలుగు ఛానెళ్ళతో పోలిస్తే ' జెమిని ' ఉద్యోగుల వేతనాలు నీచాతి నీచం. ఇదేమి వివక్షత? ఆంధ్రా మార్కెట్ నుండి కొల్లగొట్టుకు పోతున్న సంపదతో మారన్ సోదరులు విమానయాణ, హోటల్ వ్యాపారాలను పెద్దగా విస్తరిస్తున్నారు. కాని జెమిని ఉద్యోగుల జీతాలను మాత్రం పెంచటక పోవడం ఏం న్యాయం?