Sunday, January 27, 2008
దూసుకొస్తున్న ' సాక్షి '
తెలుగు నాట మరో సంచలన దిన పత్రికగా ఆవిర్భవిస్తున్న ' సాక్షి ' పై సర్వత్రా చర్చ జరుగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి కుమారుడైన జగన్ మోహన్ రెడ్డి దిన పత్రికను ప్రారంభించడమే ఈ చర్చకు కారణం. జగన్ సారధ్యంలో, పతంజలి ప్రధాన సంపాదకుడుగా 19 ఎడిషన్లతో వస్తున్న ' సాక్షి ' ఫిబ్రవరి నెలాఖరులో ప్రధానమంత్రి చేతుల మీదుగా విడుదలవుతున్నట్లు సమాచారం. జర్నలిస్టులకు భారీ జీతాలు ఆఫర్ చేసిన సాక్షి, ప్రధాన దిన పత్రికలను వణుకు పుట్టిస్తోంది. తమ జర్నలిస్టులు చేజారకుండా కాపాడుకోవడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఇప్పటికే రెండు మూడు సార్లు జీతాలు పెంచక తప్పలేదు. ఎలక్ట్రానిక్ మీడియాలో టీవీ-9 లాగే ప్రింట్ మీడియాలో సాక్షి జర్నలిస్టుల విలువ పెంచింది. కొత్త ఛానెళ్ళు, దినపత్రికల రాకతో తెలుగు మీడియా సిబ్బంది సైతం ఐటి ఉద్యోగుల్లా మంచి జీతాలు పొందే రోజులొచ్చాయి. అన్ని పేజీలు రంగుల్లో రానున్న ' సాక్షి ' బాటలోనే ఇతర దినపత్రికలు వెళ్ళక తప్పదు. సాక్షి గురి ప్రధానంగా ఈనాడు, ఆంధ్రజ్యోతిల పైనే అని ప్రతేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ' ఆ ' రెండు పత్రికలపై గుర్రుగా ఉన్న ముఖ్యమంత్రికి సొంత దినపత్రిక ' సాక్షి ' రావడం అన్నివిధాలా సరికొత్త బలాన్ని తెచ్చి పెడుతుంది.