Tuesday, January 8, 2008
ఎలక్ట్రానిక్ మీడియా హౌసింగ్ సొసైటీ గూడు పుఠాని
ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీలో జరుగుతున్నదేమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ సభ్యత్వం ఇవ్వడానికి నిరాకరించడంతో ఏర్పాటైన ఈ సొసైటీ తన ప్రాథమిక లక్ష్యాలకే వ్యతిరేకంగా పని చేస్తోంది. పేరుకు ఎలక్ట్రానిక్ మీడియా హౌసింగ్ సొసైటీ అయినా ఇందులో ప్రింట్ మీడియా నుండి ఎలక్ట్రానిక్ మీడియాలోకి కొత్తగా వచ్చిన వారి పెత్తనమే కొనసాగుతోంది. ఇళ్ళ స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులలో అర్హులను గుర్తించేందుకు ఈ సొసైటీ ఇటీవల భారీ కసరత్తే చేసింది. హౌసింగ్ సొసైటీ సభ్యత్వం కోసం కనీసం మూడేళ్ళు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసి ఉండాలనే నిబంధన పెట్టారు. ఇళ్ళ స్థలాల కోసం సీనియారిటీని నిర్ణయించే జాబితాను తయారు చేసే క్రమంలో ప్రింట్ మీడియా నుండి కొత్తగా వచ్చిన వారు అధికంగా లబ్ది పొందే అవకాశం కనిపించడంతో ఎలక్ట్రానిక్ మీడియాలో చాలా కాలంగా పని చేస్తున్నవారి ప్రయోజనాలను కాపాడేందుకు ' పాయింట్ల ' విధానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ పద్దతిలోనే స్క్రూటినీ జరిగింది. కానీ ఇళ్ళ స్థలాల అర్హుల జాబితాను ఇప్పటి వరకూ విడుదల చేయలేదు. హౌసింగ్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు పాయింట్ల పద్దతిని పక్కన పెట్టి, ప్రింట్ మీడియా సీనియారిటీ ప్రకారం జాబితా తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించారని తెలుస్తోంది. ఎవరు జాబితా అడిగినా సొసైటీ నోరు మెదపక పోవడం పలు అనుమానాలకు ఆస్కారం ఇస్తోంది. హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ల సమావేశం కూడా ఇప్పటివరకూ జరపక పోవటంలోని మతలబు ఏమిటి? అసలు స్క్రూటినీ జరిగిన తీరే గందరగోళంగా ఉంది. నిబంధనలకు భిన్నంగా కొందరు యాంకర్లకు సభ్యత్వం ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. కొందరు జర్నలిస్టులు సీనియారిటీ కోసం బోగస్ సర్టిఫికెట్లు దాఖలు చేసినా పట్టించు కోలేదు. కొన్ని ఛానెళ్ళ సీఈవోలు,ఎడిటర్లు,బ్యూరోచీఫ్ లు తమకు బాగా కావాల్సిన వారికి ఉదారంగా సర్టిఫికెట్లు ఇచ్చినా వాటిపై దర్యాప్తు జరగలేదు. జాబితా విడుదల చేస్తే ఈ లొసుగులన్నీ బయట పడతాయని ఎలక్ట్రానిక్ మీడియా హౌసింగ్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు భయపడుతున్నారా?