Wednesday, August 29, 2007
అనైతికం అనవచ్చా?..
ప్రజా జీవితంలో ఉన్నవారి వార్తలపై ఎవరికైనా ప్రత్యేక ఆసక్తి ఉండటం సహజం. వారు తుమ్మినా, దగ్గినా వార్తే అంటే అతిశయోక్తి కాదేమో.. ప్రస్తుత చర్చంతా తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు లొకేశ్, సినీనటుడు బాలకృష్ణ కూతురు బ్రాహ్మణి వివాహం గురించే. ఈ వివాహానికి మీడియాను పిలవలేదు. అయినా అత్యుత్సాహంతో ఈ వివాహ కవరేజీ కోసం మీడియా అంతా హైటెక్స్ ప్రాంగణానికి వెళ్ళింది. ఆహుతులంతా పెళ్ళి మంటపంలోకి వెళ్ళి, వధూవరుల్ని ఆశీర్వదించి భోజన తాంబూలాలు ఆరగించారు. కాని పిలవని పేరంటానికి వెళ్ళిన మీడియా వారిని పలకరించే నాధుడు లేడు. రోజంతా ఆకలితో మాడారట. ఇక్కడ ఈ విషయం అప్రస్తుతమే అనుకోండి. వివాహ దృశ్యాలను చిత్రీకరించేందుకు మీడియాను అనుమతించలేదు. కానీ టీవీ-9 వాళ్ళు 'తాళి కట్టు శుభవేళ ' అంటూ ఎలాగో పెళ్ళి వీడియో వారిని లోబరచుకొని పెళ్ళి దృశ్యాలను సంపాదించారు. వీటిని 'మాకే ఎక్స్ క్లూజివ్' అంటూ రోజంతా ప్రసారం చేశారు. పనిలో పనిగా రెండు రోజుల ముందు చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి వేసిన స్టెప్పులను ప్రముఖంగా చూపించారు. దీనిపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. టీవీ-9ది అనైతిక ధోరణి అని తప్పు పట్టారు. హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్ విషాద సమయంలో ఇలాంటి ప్రసారానికి అర్థం ఏమిటని ప్రశ్నించారు. నిజానికి చంద్రబాబు వివాహ కార్యక్రమం ముగియకుండానే బాంబు పేలుడు బాధితులను పరామర్శించడానికి బయలు దేరారు. కాబట్టి ఆయన ఆ మాత్రం బాధను వ్యక్తం చేయటం సహజం. నిజానికి టీవీ-9 చేసిన పని తప్పా అని ప్రశ్నిస్తే అవునని చెప్పలేం.. కాదనీ అనలేం.. విలువల సంగతి పక్కన పెట్టి జర్నలిస్ట్ దృష్టితో ఆలోచించి ఈ విషయాన్ని సమర్ధించుకో వచ్చేమో.. ఎవరి దృష్టి కోణం వారికి ఉంటుంది. అయితే అన్ని విషయాల్లో అతి పనికి రాదు. ఇదే ధోరణి కొనసాగితే.. డయానా విషయంలో బ్రిటన్ టాబ్లాయిడ్లు, పాపరాజీలను జనం ఈసడించుకోవడాన్ని గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది.