Monday, August 20, 2007

జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇక లేనట్లేనా?..


ఇళ్ళ స్థలాల కోసం ఆశగా చూస్తున్న జర్నలిస్టుల ఆశలపై నీరు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టు కేసు సాకుతో ప్రభుత్వం ఇన్ని రోజులుగా పెండింగ్ పెడుతూ వచ్చిన ఈ సమస్యను ఇక పట్టించుకోక పోవచ్చు. కేంద్రంలోని పరిణామాలను గమనిస్తే ఎప్పుడైనా మధ్యంతర ఎన్నికలు వచ్చేలా ఉన్నాయి. అప్పుడు ఎన్నికల కోడ్ సాకుగా చూపి మరి కొన్ని నెలలు ఇళ్ళ స్థలాల సమస్యను పెండింగ్ పెడతారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ సంస్థాగత విషయాల్లో, ప్రభుత్వం పాలనా విధుల్లో బిజీగా ఉంటుంది. ఆలోగా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చి పడతాయి. ఇక జర్నలిస్టులకు ఇంటి జాగాలు ఇచ్చేదెపుడు? ఏ ప్రభుత్వానికైనా జర్నలిస్టు కరివేపాకు లాంటి వాడే. తెలుగు దేశమైనా, కాంగ్రెసైనా జర్నలిస్టులను అవసరం ఉన్నంత వరకే వాడు కుంటారు. ప్రభుత్వంలో పైరవీలు చేసుకొనే వారికే బినామీగా ఇళ్ళూ, భూములు వచ్చి పడతాయనేది బహిరంగ రహస్యం. వైఎస్ ప్రభుత్వం కొంత నయం కనీసం జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని ఆలోచించింది. కానీ చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వస్తే జర్నలిస్టులు ఇంటి జాగాలపై ఆశలు వదులు కోవలసిందే. టిడిపి ప్రభుత్వం మీడియా యాజమాన్యాలకు తప్ప జర్నలిస్టులకు చేసిందేమి లేదు (కొద్ది మందికి మినహా). పత్రికా స్వాతంత్రం అంటే మీడియా యజమానుల వ్యాపారాలకు ఇబ్బంది కలగ రాదేది వారి ఉద్దేశ్యం. వైఎస్ ప్రభుత్వం ఇంకా జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వక ముందే ఇచ్చేసినట్లు గవర్నర్ కు ఇచ్చిన ఒక ఫిర్యాదులో టిడిపి ప్రచారం చేసింది.
జర్నలిస్టులూ, నేతలు ఇకనైనా తొందర పడకపోతే ఇంటి జాగాలు ఒక జీవిత కాలం లేటనే వాస్థవాన్ని గ్రహించాలి..