Tuesday, March 10, 2009

జెమిని న్యూస్ అమ్మేస్తున్నారా?

జెమిని న్యూస్ విషయంలో సన్ నెట్ వర్క్ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ, ఈ చానెల్ను పూర్తిగా కొనేస్తున్నామని ఆర్.కె.ప్రొడక్షన్స్ ప్రచారం చేసుకుంటోంది. మీడియాలో ప్రతీ చోటా ఇదే చర్చ. వాస్తవమేమిటో జెమిని యాజమాన్యం చెప్పకపోవటంతో అక్కడ పని చేస్తున్న జర్నలిస్టులు అభద్రతా భావంతో పనిచేస్తున్నారు. జెమిని న్యూస్ చానెల్ను నడిపే విషయంలో సన్ వారికి మొదటి నుండీ అంతగా ఆసక్తి లేదు. చాలీ చాలని జీతాలకు పని చేయలేక ఎందరో ఉద్యోగులు సంస్థను విడిచిపెట్టి పోయినా కొత్తగా నియామకాలు జరగడం లేదు. రిపోర్టర్లు, సబ్ ఎడిటర్లు, కెమెరామెన్లు, కెమెరాలు, వాహనాలు.. అన్నీ కొరతే. ఆంధ్రప్రదేశ్ మార్కెట్ నుండి పే చానెల్ రూపంలో కోట్లాది రూపాయలు దండుకుంటున్న ' సన్ ' జెమిని న్యూస్ చానెల్ అభివృద్ది కోసం పైసా ఖర్చు చేయదు. పైగ ఈ చానెల్లో కొన్ని స్లాట్లను ఆర్.కె. ప్రొడక్షన్స్ అనే సంస్థకు వారి గత చరిత్ర ఏమిటో తెలుసుకోకుండానే ఇచ్చేశారు. జెమిని పేరు చెప్పుకొని ఆర్.కె. వారు మార్కెట్లో అడ్డగోలు బ్లాక్ మెయిళ్ళు, వసూళ్ళు చేస్తున్నారనేది బహిరంగ రహస్యం. జిల్లాలలో జెమిని బ్రాండ్ ను ఉపయోగించుమిని ఎన్నో అకృత్యాలకు పాల్పడుతున్నట్లు పిర్యాదులు వస్తున్నా చెవిటోడి ముందు శంఖం ఊదినట్లుగా సన్ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. కొద్ది పాటి బులెటిన్లనే నడపలేని ఆర్.కె. ప్రొడక్షన్స్, ఏప్రిల్ 1 వ తేదీ నుండి ఏక మొత్తంగా కొనేస్తున్నామని చెప్పుకుంటోంది. ఇందు కోసం చెన్నై లో జోరుగా పైరవీలు జరుగుతున్నాయి. ఆర్.కె. కమిషన్లకు ఆశ పడి కొందరు ఉన్నతాధికారులు ఇందుకు సహకారం అందిస్తున్నారని చెన్నై జర్నలిస్ట్ మిత్రులు చెబుతున్నారు. ఇక ఏప్రిల్ 1వ తేదీ నుండి జెమిని న్యూస్ ఉద్యోగుల పరిస్థితి ఏమిటీ? ఏప్రిల్ ఫూల్ అయ్యేది జెమిని న్యూస్ ఉద్యోగులా? సన్ యాజమాన్యమా?

ఎన్నికల్లో జర్నలిస్టుల మనీ టార్గెట్లు

ఎన్నికలు వచ్చాయంటే అందరికీ పండగ. రాజకీయ నాయకులు ఎన్నికల్లో అసలు టికెట్ వస్తుందా? వచ్చినా గెలుస్తామో? లేదో అనే టెన్షన్ పడుతుంటారు. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఎన్నికలు జూదంగా మారాయి. ఎంత డబ్బు ఖర్చు చేసినా గెలుస్తామనే గ్యారంటీ లేదు. కానీ మెజాకిటీ జర్నలిస్టులకు ఎన్నికలంటే ఖచితంగా పండగే. ప్రసుత ఎన్నికల కోసం మనోళ్ళంతా టార్గెట్లు పెట్టుకున్నారు. ఇంట్లో కలర్ టీవీలు, వాషింగ్ మిషన్లు మొదలుకొని బైకులు, కారు కొనడానికి ప్రణాళికలు తయారు చేసుకున్నారు. నిస్సిగ్గుగ చర్చించుకుంటున్నారు కూడా. కానీ గడ్డు మార్కెట్ రోజుల్లో అభ్యర్థులు అంతగా ఖర్చు పెట్టే సూచనలు కనిపించ లేదనే సత్యం మనోళ్ళకు దుర్వార్తే.

ఎన్నికల తర్వాత కొన్ని ఛానెళ్ళ మూత ఖాయం

ప్రస్తుతం మీడియాలో ఎవరి నోట విన్నా ఇదే మాట వినిపిస్తోంది. తెలుగులో ఇప్పటికే 20కి పైగా వినోద, వార్తా చానెళ్ళు ఉన్నాయి. మరికొన్ని త్వరలో రాబోతున్నాయి. కానీ ప్రస్తుతం కొత్త చానెళ్ళకే కాకుండా, ఇప్పటికే ప్రసారం అవుతున్న చానెళ్ళకు ఇది కష్ట కాలమే. గత ఏడాది కాలంగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంధ్య దుష్పరిణామాలు మన దేశంపై కూడా బలంగా పడుతోంది. మార్కెట్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో పత్రికలకు, చానెళ్ళకు ప్రకటనల ఆదాయం గణనీయంగా తగ్గింది. చానెళ్ళకు ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉండే వ్యాపార సంస్థలపై కూడా ఈ ప్రభావం ఉంది. ఇప్పటికే కొన్ని చానెళ్ళకు సాలరీ బిల్లు భారంగా మారింది. నేషనల్ చానెళ్ళు సైతం ఖర్చు తగ్గించుకునే పనిలో ఉన్నాయి. తెలుగులో కొత్తగా ప్రారంభం కానున్న చానెళ్ళ యజమానులు పునరాలోచనలో ఉన్నట్లు సమాచారం. కేరళకు చెందిన ఏసియానెట్ సంస్థ తెలుగులో ప్రారంభిద్దమనుకున్న న్యూస్ చానెల్ (లైసెన్స్ రాలేదని చెబుతున్నా) పురిటిలోనే పోవడం, అక్కడి జర్నలిస్టులు రోడ్డున పడటం తెలిసిందే. ఈ భయంతో కొత్తగా చానెల్ తెద్దామని ప్రయత్నాలు చేసుతున్న వారు ఆందోళనలో పడ్డారు. ఇటీవలే ప్రారంభమైన కొన్ని చానెళ్ళు ప్రస్తుతం ఇబ్బందుల్లోనే ఉన్నాయి. ఎన్నికలు అయ్యాక ఇవి బోర్డు తిప్పేయడం ఖాయమని జర్నలిస్ట్ మిత్రులంటున్నారు.

Wednesday, March 4, 2009

పురుటి లోనే చచ్చిన ఆసియానెట్ తెలుగు

చివరకు అంతా ఊహించినట్లే జరిగింది. ఆసియానెట్ తెలుగు న్యూస్ చానెల్ ప్రారంభం కాకుండానే మూత పడింది. అసలు ఈ చానెల్ ప్రారంభంపై మొదటి నుండీ అనుమానాలు ఉన్నాయి. దాదాపు ఏదు నెలల క్రితం ఆసియానెట్ సితార తెలుగు చానెల్ కోసం న్యూస్ సిబ్బందిని తీసుకున్నారు. ఈలోగా స్టార్ సంస్థ ఆసియానెట్ గ్రూప్ పై కన్నేసింది. స్టార్ వారికి తెలుగు న్యూస్ విభాగంపై అంతగా ఆసక్తి లేకపోవడంతో సితార చానెల్లో వార్తలను పెట్టలేదు. వార్తల కోసం ప్రత్యేకంగా చానెల్ పెడతామని యాజమాన్యం ఇంతకాలంగా నమ్మిస్తూ వచ్చింది. కానీ ఇంతవరకు ఈ చానల్ కు సంబంధించిన లైసెన్స్ రాలేదు. బుధవారం నాడు (04 మార్చి) ఉదయం చానెల్ యాజమాన్యం హఠాత్తుగా బోర్డు తిప్పేస్తున్నట్లు ప్రకటించింది. న్యూస్ సిబ్బందికి తలా రెండు నెలల జీతం ఇచ్చి సాగనంపుతున్నట్లు చెప్పేసింది. ఈ ప్రకటనతో అక్కడి జర్నలిస్టులో చాలా మంది కండెమ్మట నీళ్ళు తెచ్చుకున్నారు. కొత్తగా ప్రారంభం అవుతున్న పలు చానెల్లలో ఇప్పటికే నియామకాలు పూర్తి అయిన నేపధ్యంలో తమ పరిస్థితి ఏమిటో తెల్చుకోలేకపోతున్నారు. మొత్తానికి సతీష్ బాబు లక్కీ ఫెల్లో. ముందుగానే అందరిని గాలికి వదిలేసి ఎన్-టీవీ లో జర్నలిస్ట్ డైరీ పనికి కుదిరాడు. ఆసియానెట్ తెలుగు న్యూస్ సిబ్బందికి మంచి జరగానే ఆశిద్దాం..

నిరాశ పరచిన సాక్షి టీవీ

భారీ ప్రచారం - పట్టుబడులతో, ఎన్నో ఊహాగానాల మధ్య ప్రారంభమైన సాక్షి టీవీ చానెల్ ప్రేక్షకులను ఎంతో నిరాశ పరచింది. దేశంలోనే తొలిసారిగా అధునాతన హెచ్.డి. టెక్నాలజీని ఉపయోగించిన సాక్షి టీవీ, బుల్లి తెరపై నాసిరకంగా కనిపిస్తోంది. లోపం ఎక్కడున్నట్లు? న్యూస్ బులటిన్లు, ఇతర కార్యక్రమాలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. ప్రోమోలు అన్నీ డల్ గా ఉన్నాయి. సాక్షి కి పెట్టిన పెట్టుబడితో ఏకంగా మూడు చానెళ్ళు పెట్టుకోవచ్చు. ఇంత ఖర్చు పెట్టి ఏమి లాభం? అసలు సిబ్బంది ఎంపికలోనే లోపం ఉందని జర్నలిస్ట్ మిత్రులు అంటున్నారు. సాక్షిలో పైరవీల ఆధారంగానే సిబ్బంది ఎంపిక జరిగిందనేది కాదనలేని నిజం. ఇప్పటికైనా సాక్షి జయమాన్యం టీం ను మార్చాల్సిన అవసరం ఉంది.

ఆకట్టుకుంటున్న ఐ-న్యూస్

ఆటలో అరటి పండేనని అందరూ ఊహించిన ఐ-న్యూస్ క్రమంగా దూసుకు పోతోంది. ఆకర్షించే గ్రాఫిక్స్, కనులకు విందైన రంగులు, చక్కని యాంకర్లు, ఆకట్టుకుంట్న్న వార్తలు స్టొరీలు.. ఒక్కటేమిటి అన్నిరకాలుగా ఈ చానెల్ ఇప్పటికే స్థిరపడ్డ చానెళ్ళకు ధీటుగా నిలుస్తోంది. ఫీల్డ్ లో చెప్పుకోదగ్గ రిపోర్టింగ్ సిబ్బంది లేకున్న ఇతర చానెళ్ళకు ఐ-న్యూస్ గట్టి పోటీనే ఇస్తోంది. అయితే ప్రస్తుతం మార్కెట్ ఎదురుకుంటున్న గడ్డు పరిస్థితుల్లో ఈ చానెల్ ఎంత కాలం ఉంటుందో చెప్పలేమని జర్నలిస్ట్ మిత్రులంటున్నారు. ఐ-న్యూస్ ను స్పాన్సర్ చేసిన ఒక అగ్ర విద్యా సంస్థ చేతులెత్తెసిందని వినికిడి. రాజశేఖర్ కొత్త స్పాన్సర్ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది.