Sunday, December 23, 2007

ప్లాట్ల కోసం జర్నలిస్టుల పాట్లు

రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడం ఖాయమని స్పష్టం కావడంతో మీడియా వర్గాల్లో ఎక్కడలేని హడావుడి మొదలైంది. ఇళ్ళ స్థలాల కోసం జర్నలిస్టులు వర్గాలుగా చీలిపోయి ఎవరికి వారుగా విడివిడిగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రస్థుతం వున్న జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (జూబ్లీహిల్స్), ఎలక్ట్రానిక్ మీడియా హౌసింగ్ సొసైటీ, కెమెరామెన్స్, ఫొటోగ్రాఫర్స్ సొసైటీలకు తోడుగా ' గ్రూప్ ' పేరిట ఇళ్ళ స్థలాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ' గ్రూప్ ' ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? ప్రస్తుతం ఉన్న జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీపై ఎన్నో ఆరోపనలు కేసులు ఉండటం వల్ల, అందులో ఉంటే లేనిపోని చిక్కులు ఉంటాయని, ప్లాట్లు వచ్చే అవకాశం లేదని భావించిన వారు గ్రూప్ పేరిట ఇళ్ళ స్థలాల ప్రయత్నం మొదలు పెట్టారు. అమర్ మద్దతుతో ప్రారంభమైన ఈ గ్రూప్ కి ప్రభుత్వంలోని పెద్దల సహకారం ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ కూడా తీవ్ర కసరత్తు చేస్తోంది. గతంలో జూబ్లీహిల్స్ సొసైటీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు సబ్యత్వం ఇవ్వడానికి నిరాకరించడం వల్లే వారు ప్రత్యేక సొసైటీ పెట్టుకున్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలోని కొందరు జర్నలిస్టులకు జూబ్లీహిల్స్ సొసైటీలో సభ్యత్వం ఉంది. ఈ ద్వంద్వ సభ్యత్వ వివాదం ఏ పరిణామాలకు దారి తీస్తుందోనని వారు భయపడుతున్నారు. జూబ్లీహిల్స్ సొసైటీ అయినా, ఎలక్ట్రానిక్ మీడియా సొసైటీ అయినా అక్రమాలకు అంతు లేకుండా పోయింది. ఎందరో సీనియర్ జర్నలిస్టులకు మొండి చేయి చూపించిన జూబ్లీహిల్స్ సొసైటీలో గతంలొ పత్రికాఫీసుల్లో పని చేసే లిఫ్ట్ బాయ్లు, ఆఫీస్ బాయ్లు, కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేతలకు సభ్యత్వం లభించడమే కాదు ఇళ్ళ స్థలాల కేటాయింపు కూడా జరిగిపోయింది. ఇప్పుడు ఏర్పడ్డ ఎలక్ట్రానిక్ మీడియా హౌసింగ్ సొసైటీలో కూడా నిబంధనలకు విరుద్దంగా ఆంకర్లకు, ప్రొడ్యూసర్లకు, టెక్నికల్ సిబ్బందికి బోగస్ సర్టిఫికెట్ల ద్వారా సభ్యత్వం లభించింది. ఎలక్ట్రానిక్ మీడియాలో, అందునా హైదరాబాద్లో మూడేళ్ళు పనిచేసి ఉండాలనే నిభందన వల్ల చాలా మొంది తప్పుడు డాక్యుమెంట్లు పెట్టి సభ్యత్వానికి అర్హత పొందారు. వీరి కారణంగా నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది.
కొసమెరుపు: రాజశేఖర రెడ్డి ప్రభుత్వం గనక దయతలిచి ఇళ్ళ స్థలాలు ఇస్తే చాలా మంది జర్నలిస్టులు వాటిని అమ్ముకొని కోటీశ్వరులైపోయి, పాత్రికేయ వృత్తికి గుడ్బై చెబుదామనుకుంటున్నారు. గతంలో ఇళ్ళ స్థలాలు పొంది ఖరీదైన జీవితం అనుభవిస్తున్న జర్నలిస్ట్ మిత్రులే వారికి స్పూర్తి. అఫ్ కోర్స్ గతంలో ఇళ్ళ స్థలాలు పొంది వెంటనే అమ్ముకొని, తీరా వాటికి ధర పెరగటం చూసి నష్టపోయాం బాబో అని లబో దిబో అంటున్న జర్నలిస్టులు కూడా ఉన్నారనుకోండి.