Sunday, December 30, 2007
దొంగ జర్నలిస్టులున్నారు జాగ్రత్త..
ఛానెళ్ళు, పత్రికలు పెరిగి పోయాక వార్తా సేకరణ కోసం తిరిగే రిపోర్టరు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నారు. సమావేశాలు, ప్రెస్ మీట్లకు వచ్చే రిపోర్టర్ల సంఖ్య గతంలో కన్నా బాగా పెరిగి పోయింది. ఎవరు ఏ పత్రికలో, ఏ ఛానెళ్ళో పని పని చేస్తున్నారో అర్థం కాని గందరగోళ పరిస్థితి. కార్యక్రమ నిర్వాహకులు 'మీరు ఏ మీడియా? అని అడిగితే ఏం ఇబ్బందో అని అడగని ఇబ్బందికర పరిస్థితి. దీన్ని ఆసరాగా చేసుకొని బోగస్ రిపోర్టర్లు బయలు దేరారు. దర్జాగా వచ్చేస్తున్నారు. ఏదో ఒక పత్రిక పేరో, ఛానెల్ పేరో చెప్పేస్తున్నారు. నిర్వాహకులు పెట్టే టిఫిన్లు, టీ-కాఫీలు, భోజన తాంబూలాదులు లాగించేస్తున్నారు. ఇచ్చే గిఫ్టులు పుచ్చుకొని చెక్కేస్తున్నారు. ముఖ్యంగా మధ్యాన భోజన పథకం అమలులో ఉన్న తెలుగుదేశం పార్టీ బీట్లో ఈ బోగస్ జర్నలిస్టులు ఎక్కువ కనిపిస్తుంటారు. బోగస్ జర్నలిస్టుల తాకిడిని తట్టుకోవడానికి బిజినెస్ ప్రెస్ మీట్లు నిర్వహించే ఈవెంట్ మేనేజర్లు తెలివైన ఎత్తుగడ వేస్తున్నారట. తమకు అవసరమైన రిపోర్టర్లనే గుర్తించి వ్యక్తిగతంగా కలుసుకొని గిఫ్టులు, కవర్లు అందజేస్తున్నారట. ఈ పద్దతేదో బాగుంది కదూ? బోగస్ రిపోర్టర్లను అరికట్టాల్సిన బాధ్యత నిజమైన జర్నలిస్టులందరిది? లేకపోతే మీకూ ఇబ్బందులు తప్పవు.