ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని కర్నూలు, మహబూబ్ నగర్, క్రిష్ణా, గుంటూరు జిల్లాలు వరదల్లో మునగడం మన టీవీ చానళ్ళ దాహాన్ని తీర్చింది. అందరికన్నా తామే ముందు వరద వార్తలు ఇచ్చామని ప్రతీ చానల్ గొప్పలు చెబుకుంది. కొన్ని చానళ్ళయితే శ్రీశైలం డాం కొట్టుకు పోతోందంటూ తప్పుడు వార్తలు ప్రసారం చేసి, తర్వాత నాళిక కర్చుకొని తమ వార్తలకు స్పందించే అధికారులు తక్షణ సహాయక చర్యలకు దిగారని సమర్ధించుకున్నాయి. కొందరు రిపోర్టలైతే పలానా ప్రాంతానికి అధికారుల కన్నా తామే ముందెళ్ళి ప్రజల్ని రక్షించామని వగలు పోయారు. మరికొందరైతే చేతుల్లో గొట్టాలు పట్టుకొని ప్రజల్ని రక్షించారట. రక్షించేటప్పుడు మధ్యలో ఈ గొట్టం ఎందుకని ఎవరూ అడగలేదేమో? కొన్ని టీవీ చానళ్ళు వరద బాధితులకోసం విరాళాలు, వస్తువులు, బట్టలు సేకరించాయి. భేష్.. మంచిదే. కాని అవన్నీ సక్రమంగా బాధితులకు చేరాల్సిన అవసరం ఉంది. మరికొన్ని చానళ్ళు వరద బాధితుల సహాయం కోసం నిధులు సేకరించి తమ కరువు.. అదేనండి అప్పులు తీర్చుకునే ప్రయత్నంలో ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జెమిని సంగతేంటి?..
రాష్ట్రంలో అన్ని మీడియా యాజమాన్యాలు తమకు తోచిన రీతిలో వరద బాధితులను ఆదుకునే ప్రయత్నాలు చేస్తుంటే జెమిని టీవీ యజమానులు ఇది తమకు సంబంధించిన విషయం కాదని మిన్నకున్నారు. తమిళనాడులో సునామి వస్తే గ్రూప్ లోని అన్ని చానళ్ళ ఉద్యోగుల ఒకరోజు వేతనాలు కోసి విరాళం ఇచ్చిన సన్ యాజమాన్యం ఆంధ్రప్రదేశ్ వరధ బాధితులను పట్టించుకోదా? భేష్.. జయహో..సారీ తమిళహో..